సమైక్యాంధ్ర కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమంతో కేంద్రం దిగిరావాల్సిందేనని వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. రాజకీయ కుట్రతోనే రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా గురువారం ఆళ్లగడ్డ పట్టణంలో వైఎస్సార్సీపీ మహిళా సర్పంచులు, కార్యకర్తలు చేపట్టిన దీక్షలకు భూమా సంఘ
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమంతో కేంద్రం దిగిరావాల్సిందేనని వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. రాజకీయ కుట్రతోనే రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా గురువారం ఆళ్లగడ్డ పట్టణంలో వైఎస్సార్సీపీ మహిళా సర్పంచులు, కార్యకర్తలు చేపట్టిన దీక్షలకు భూమా సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఇందుకు అడ్డుచెప్పకుండా అధికార పార్టీతో కుమ్మక్కైందని విమర్శించారు.
రాష్ట్రంపై అవగాహనలేని చిదంబరం, ఆంటోని, దిగ్విజయ్‌సింగ్‌లు విభజన ప్రకటన చేయడం ఏమిటని ప్రశ్నించారు. విభజనకు కట్టుబడే ఉన్నామని కాంగ్రెస్, టీడీపీ అధ్యక్షులు చెపుతుంటే..ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు ఇక్కడ దొంగ నిరసనలు, దీక్షలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీల ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే..సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు ఇళ్లవద్ద దీక్షలు చేయాలన్నారు. లేదంటే పార్టీలకు, పదవులకు రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలన్నారు. అలా చేయనివారిని సీమాంధ్రలో ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. దీక్షల్లో కొల్లం లక్ష్మీదేవి. నాగలక్షమ్మ, రత్నమ్మ, సుభద్రమ్మ, అన్నపూర్ణమ్మ, మాలాన్‌బీ, లక్ష్మీనరసమ్మ, హసీన, షాహిన్నిసా, రజియాసుల్తానా, ఆశీర్వాదమ్మ, బాలలింగమ్మలు కూర్చున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి, అనంత రామసుబ్బారెడ్డి, గంగాధర్‌రెడ్డి పాల్గొన్నారు.