సీమాంధ్రకు కేంద్ర బలగాలు | Central forces to be sent to seemandhra | Sakshi
Sakshi News home page

సీమాంధ్రకు కేంద్ర బలగాలు

Dec 1 2013 2:07 AM | Updated on Aug 20 2018 9:16 PM

సీమాంధ్రకు కేంద్ర బలగాలు - Sakshi

సీమాంధ్రకు కేంద్ర బలగాలు

విభజన బిల్లు నేపథ్యంలో పారా మిలటరీ, రాష్ట్ర ప్రత్యేక పోలీస్(ఏపీఎస్పీ), ఆర్ముడ్ రిజర్వు (ఏఆర్) బలగాలను తరలిస్తున్నారు.

తొలి దశలో 24కంపెనీల్ని పంపనున్న కేంద్రం
ఉత్తరాంధ్ర, తిరుపతి, అనంతలకు తరలింపు
కీలక ప్రాంతాలు, నేతల ఇళ్ల వద్ద భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు బిల్లు శాసనసభకు రానుండటంతో పాటు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నారనే సమాచారం నేపథ్యంలో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. పారా మిలటరీ, రాష్ట్ర ప్రత్యేక పోలీస్(ఏపీఎస్పీ), ఆర్ముడ్ రిజర్వు (ఏఆర్) బలగాలను తరలిస్తున్నారు. 24 కేంద్ర పారామిలటరీ కంపెనీలను రాష్ట్రానికి పంపేందుకు కేంద్రం శనివారం ఆమోదం తెలిపింది. ఈ బలగాలు రెండు రోజుల్లో సీమాంధ్ర కు చేరుకోనున్నట్లు సమాచారం. వాటికి అదనంగా తాజాగా మహిళా కమాండోలతో కూడిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రప్పిస్తున్నారు. పారామిటరీ బలగాలు మరో 20 వరకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ అంశంపై ఢిల్లీలో వేగంగా నిర్ణయాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా సీమాంధ్రలోని అన్ని జిల్లాల ఎస్పీలకూ ఇప్పటికే ఆదేశాలు జారీఅయ్యాయి. తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ రాష్ర్ట పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటోంది. మూడు ప్రాంతాలలో పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచాలని పోలీసు అధికారులకు కేంద్రహోంశాఖ వర్గాలు స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా సీమాంధ్ర లోని అన్ని విశ్వవిద్యాలయాల వద్ద భద్రత పెంచుతున్నారు.
 గత దాడుల నేపథ్యంలో: సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్రలో జరిగిన ఆందోళనల సందర్భంగా అనంతపురంలో బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువైన కేబుళ్లను ఉద్యమకారులు గతంలో తగులబెట్టారు. విజయనగరం జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఉద్యమకారులు దాడులకు తెగబడ్డారు. దీంతో కర్ఫ్యూ కూడా విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని జిల్లాలలో ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు, తిరుపతి, వైఎస్సార్ జిల్లాలలో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, సచివాలయం వద్ద భద్రతను మరింత పెంచారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో భద్రత కట్టుదిట్టం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement