బతుకు గ్యారేజ్‌..!

Center To The Livelihood Is The Industrial Estate - Sakshi

జీవనోపాధికి కేంద్రం ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ 

స్వయం కృషితో ఎదుగుతున్న కార్మికులు

శ్రమజీవనంలో వేలాది మంది 

ప్రతి పనికి ఎస్టేట్‌ను ఆశ్రయిస్తున్న వాహనదారులు 

కష్టజీవులకు ఉపాధి కల్పించే బస్తీ.. ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌. చిత్తూరు నగరానికి చివర్లో ఉన్న ఈ ఎస్టేట్‌.. కార్మికుల జీవనోపాధికి కేంద్రంగా ఉంది. శ్రమనే నమ్ముకున్న ప్రతి శ్రామికుడికి ఈ ఎస్టేట్‌లో ఉపాధి దొరుకుతోంది. ఆటో నుంచి లారీ, జేసీబీల వరకు నూతన బాడీ కట్టించుకోవడం, రిపేర్లు చేయించుకోవాలంటే.. వాహన యజమానులందరూ ఈ ఎస్టేట్‌నే ఆశ్రయిస్తారు. దీంతో నిత్యం వేలాది మంది కార్మికులు ఇక్కడ వివిధ రకాల పనులు చేసుకుంటూ ఉపాధిని పొందుతున్నారు. 

సాక్షి, చిత్తూరు రూరల్‌ : చిత్తూరు నగరంలో ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ ఉంది. ఇక్కడ వివిధ రకాలైన మెకానికల్‌ షాపులు 170 దాకా ఉన్నాయి. ఈ షాపుల్లో 3వేలకు పైగా శ్రామికులు పనిచేస్తున్నారు. ఎక్కువగా ఆటోలు, కార్లు, టిప్పర్లు, లారీలు, బస్సుల రిపేర్‌ పనులు అధికంగా ఉంటాయి. అలాగే లేత్, గ్లాస్‌ వర్క్, లైనర్, వెల్డర్, డ్రిల్లర్, పెయింటర్, బాడీ బిల్డర్‌ (బస్సులు, లారీలకు బాడీ కట్టేవారు), బ్యాటరీ తయారీ.. ఇలా వాహనాలకు సంబంధించిన పలు పనులు ఇక్కడ జోరుగా సాగుతుంటాయి. వాహనాలు రిపేర్‌ వస్తే.. చిత్తూరు వాసులే కాకుండా మదనపల్లి, పలమనేరు, పీలేరు, పుత్తూరు, తిరుపతి, తమిళనాడులోని పళ్లిపట్టు, పొన్నై వాసులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మంచి నైపుణ్యం కలిగిన మెకానిక్‌లు ఎస్టేట్‌లో ఉండడంతో ఈ సంఖ్య ఇటీవల మరింత పెరిగింది.  

స్వయం కృషితో... 
మెకానిక్‌లుగా ఎస్టేట్‌లో చాలా మంది బతుకు బండి లాగుతున్నారు.  వీరిలో చాలా మంది మెకానిక్‌ షెడ్లు ఏర్పాటు చేసుకుని పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో వేలాది మంది శ్రామికులు ఇక్కడ జీవిస్తున్నారు. ఏళ్ల తరబడి ఇదే వృత్తిని నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఏ పనీ లేకున్నా ఎస్టేట్‌ను ఆశ్రయించిన వారికి ఏదో రకంగా ఉపాధి దొరుకుతోంది. పని నేర్చుకోవాలి.. సంపాదించాలనే తపన ఉన్న వ్యక్తులకు ఈ ఎస్టేట్‌ కొండంత అండగా నిలుస్తోంది.

ఇక్కడ హెల్పర్, దినసరి కూలీగా పనిలో చేరి.. సొంత షాపు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగినవారు పదుల సంఖ్యలో ఉన్నారు. వారంతా తాము స్వయం కృషితోనే పైకి వచ్చామని, ఈ ఎస్టేట్‌ తమకు ఉపాధి కల్పిస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని అంటున్నారు. చిత్తూరుకు పరిశ్రమలు వస్తే తమలాంటి వాళ్లకు మరింత మేలు చేకూరుందని పలువురు భావిస్తున్నారు. 

పరిశ్రమలు రావాలి..
చిత్తూరుకు పరిశ్రమలు రావాలి. అప్పుడే మాలాంటి వాళ్లకు పనులు పుష్కలంగా ఉంటాయి.  నేను లారీ, బస్సు ఇంజిన్‌ రిపేర్‌ చేస్తాను. సొంతంగా షాపు ఉంది. రోజూ  కూలి గిట్టుబాటు అవుతోంది. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. 
– పటేల్, చిత్తూరు 

30 ఏళ్లుగా పనిచేస్తున్నా
ఎస్టేట్‌లో మెకానిక్‌గా 30 ఏళ్లుగా పనిచేస్తున్నా. నెలకు నాకు రూ.10 వేలు వస్తోంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంది. చేతినిండా పని ఉంది. చిన్నతనంలోనే లారీ, బస్సు రిపేర్లు నేర్చుకున్నాను. ఎక్కడికెళ్లినా పని చేయగలను. 
– పురుషోత్తం, చిత్తూరు 

శ్రమకు తగ్గ వేతనం..
నేను చిన్నతనంలోనే ఇక్కడ పనికి వచ్చా. మూడేళ్లలో పని నేర్చుకున్నా. మెకానిక్‌ పనులతో పాటు బ్యాటరీ తయారీ, రిపేర్లు చేస్తా. కూలి గిట్టుబాటు అవుతోంది.  నేను ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నా. 
– మోహన్, చిత్తూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top