నెల్లూరు వైపు నుంచి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరు గ్రామానికి వెళుతున్న కారు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన సంఘటన మంగళవారం గౌరవరం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
- త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
కావలి, న్యూస్‌లైన్ : నెల్లూరు వైపు నుంచి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరు గ్రామానికి వెళుతున్న కారు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన సంఘటన మంగళవారం గౌరవరం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న కారు యజమాని సుధాకర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కొవ్వూరు మండలం నందమూరుకు చెందిన సుధాకర్ కారుకు ఇంధనంగా వంటగ్యాస్‌ను బిగించి ఉన్నారు.
మండలంలోని గౌరవరం జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి కారు నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వెంటనే గమనించిన సుధాకర్ కారు దిగి బయటకొచ్చాడు. ఈ లోపు మంటలు కారు చుట్టూ వ్యాపించాయి. అందులో గ్యాస్ సిలిండర్ కూడా ఒక్కసారిగా పేలింది. దీంతో జాతీయ రహదారి డివైడర్ పైనున్న చెట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.