టీడీపీ గుప్పెట్లో రెరా  | APRERA In The Hands Of TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ గుప్పెట్లో రెరా 

Jun 6 2019 4:26 AM | Updated on Jun 6 2019 4:26 AM

APRERA In The Hands Of TDP - Sakshi

సాక్షి, అమరావతి: పూర్తి స్వయం ప్రతిపత్తిగా వ్యవహరించాల్సిన రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)ని గత ప్రభుత్వం పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసింది. రాజకీయాలతో సంబంధం లేని రిటైర్డ్‌ ఐఏఎస్‌ స్థాయి అధికారిని చైర్మన్‌గా నియమించాలని, అలాగే రియల్‌ ఎస్టేట్‌ రంగంపై పూర్తి అవగాహన ఉన్న వారిని మెంబర్లుగా నియమించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వాటిని బేఖాతర్‌ చేస్తూ రెరాను టీడీపీ సంస్థగా మార్చేశారంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేష్‌ తివారిని రెరా చైర్మన్‌గా నియమిస్తే.. కర్నాటకలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించింది. కానీ దీనికి భిన్నంగా మన రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ నియామకం చేయడం గమనార్హం.
 
అంతా ఆ సామాజికవర్గం వారే.. 
రాష్ట్రంలో ఏదైనా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు మొదలు పెట్టాలన్నా, క్రయవిక్రయాలు చేయాలన్నా రెరా అనుమతి తప్పనిసరి. ఇలాంటి కీలకమైన రెరాలో చైర్మన్‌ దగ్గర్నుంచి.. కింద స్థాయి అటెండర్‌ వరకు టీడీపీ కార్యకర్తలు.. అందులోనూ అత్యధికంగా అప్పటి అధికార పార్టీకి చెందిన సామాజికవర్గం వారితో నింపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో రెరా మే ఒకటి, 2017 నుంచి అమల్లోకి వచ్చినా పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వం కాలయాపన చేసింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆగస్టు 10, 2018న చైర్మన్, మెంబర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న రామనాథ్‌ వెలమటిని చైర్మన్‌గా నియమించడమే కాకుండా.. పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్న ముళ్లపూడి రేణుక, చందు సాంబశివరావుతో పాటు.. టౌన్‌ప్లానింగ్‌లో పనిచేసి పదవీ విరమణ చేసిన విశ్వనాథ్‌ శిష్టాలను మెంబర్లుగా, చెరుకూరి సాంబశివరావును డైరెక్టర్‌గా నియమించింది.

రామనాథ్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలొచ్చాయి. టీడీపీ, అప్పటి సీఎం కార్యాలయం సూచించిన వారిని ఉద్యోగులుగా నియమించుకున్నారు. మొత్తం 30 మంది ఉద్యోగులుంటే అందులో గత ప్రభుత్వ సామాజిక వర్గానికి చెందిన వారే 12 మంది ఉన్నారు. అంతేకాదు చైర్మన్‌గా పదవి చేపట్టినప్పటి నుంచి వివిధ రాష్ట్రాల పర్యటన కోసం ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేశారంటే ఏ స్థాయిలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారో అర్థం చేసుకోవచ్చు. రామనాథ్‌ అద్దె కింద రూ.35,000 చెల్లిస్తూ రెరా నుంచి మాత్రం ప్రతి నెలా రూ.70,000 తీసుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో కూడా పక్షపాత ధోరణి చూపిస్తున్నారని, నిర్ణయాల్లో ఎక్కడా పారదర్శకత కనిపించడం లేదన్న విమర్శలు ఉద్యోగుల నుంచే వినిపిస్తున్నాయి. 

టీడీపీ ఆఫీసులో రెరా ల్యాప్‌టాప్‌లు! 
‘రెరా’ డబ్బులతో కొన్న ల్యాప్‌టాప్‌లను టీడీపీ కార్యాలయానికి తరలించారంటే రెరాను ఒక పార్టీ కార్యాలయంగా ఏ విధంగా వినియోగించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అవసరాల కోసం రెరాకు చెందిన 5 ల్యాప్‌టాప్‌ను టీడీపీ కార్యాలయానికి చైర్మన్‌ సంతకం చేసి మరీ తీసుకెళ్లడం ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇలా ఒక పార్టీకి కొమ్ముకాస్తున్న రెరా కార్యవర్గాన్ని తక్షణం రద్దుచేసి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పూర్తి స్వయంప్రతిపత్తి ఉండేలా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రియల్టర్లు కోరుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement