నాడు ఎన్టీఆర్‌.. నేడు జగన్‌

AP Legislative Council was abolished by Former CM NTR And Now CM YS Jagan - Sakshi

మండలి రద్దు చేసిన ముఖ్యమంత్రులు

సాక్షి, అమరావతి: శాసన మండలి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొంటూ 1985లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం ఎన్టీ రామారావు కౌన్సిల్‌ను రద్దు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రపద్రేశ్‌లో నేడు మరోసారి మండలి రద్దుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థిక భారంతోపాటు రాష్ట్ర ప్రజలకు మేలు చేయకపోగా అన్యాయం చేసేలా ప్రతిపక్ష తెలుగుదేశం ఎమ్మెల్సీలు వ్యవహరించడంతో మండలి రద్దుకు వైఎస్‌ జగన్‌ తాజాగా నిర్ణయం తీసుకుని ఆ మేరకు అసెంబ్లీలో సోమవారం తీర్మానం ఆమోదింపజేశారు.

ఎన్టీఆర్‌ హయాంలో మూడు నెలల్లో రద్దు..
1958 జూలై 1న ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిని 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ రద్దు చేశారు. అప్పట్లో మండలి రద్దు ప్రక్రియ కేవలం మూడు నెలల వ్యవధిలో పూర్తయింది. 1985 మార్చిలో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన ఎన్టీఆర్‌ వెంటనే మండలిని రద్దు చేయాల్సిందిగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపగా.. అదే ఏడాది మే 31న మండలిని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో 1–06–1985న మండలి రద్దయిపోయింది. 

నేడు జగన్‌ నేతృత్వంలో మండలి రద్దు తీర్మానం.. 
రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే బిల్లులను అడ్డుకునేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం ప్రస్తుతం శాసనమండలిని వేదికగా చేసుకుంది. ఇదే క్రమంలో తాజాగా మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీయే రద్దు బిల్లుకు సైతం మోకాలడ్డింది. ప్రజాశ్రేయస్సుకు ఏమాత్రం ఉపయోగపడకపోగా, ప్రజలకు మేలు చేసే బిల్లులను సైతం అప్రజాస్వామిక రీతిలో అడ్డుకుంటుండడంతో తాజాగా వైఎస్‌ జగన్‌ శాసన మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయకోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మండలి పనిచేస్తోందని, కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం తప్ప ఎలాంటి మంచి జరిగే అవకాశం కనిపించట్లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి మండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు.

మండలి రద్దు ప్రక్రియ ఇలా..
- రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద శాసన మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.
మండలిని రద్దు చేయాలంటే.. రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద రద్దు ప్రతిపాదనను తొలుత రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించాలి. అనంతరం మండలిని రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత సభలో చర్చ అనంతరం 2/3వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాలి. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలి.
రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలించి స్వల్ప రాజ్యాంగ సవరణకు లోక్‌సభ, రాజ్యసభ ముందుకు తీసుకువెళ్లాలి. ప్రస్తుతం రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి ఉన్నాయి. ఇప్పుడు శాసనసభ మాత్రమే ఉంటుందని అతిసాధారణమైన రాజ్యాంగ సవరణలకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది.
లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించాక రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగానే మండలిని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వమే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ చాలా సాధారణమైన అంశమని, రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా కేంద్రం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top