మందుల కొరతకు చెక్‌ 

AP Govt has paid dues of Rs 140 crore to pharma companies - Sakshi

మందుల సరఫరా కంపెనీలకు రూ.140 కోట్ల బకాయిలు చెల్లించిన ప్రభుత్వం 

ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులోకి 530 రకాలమందులు 

సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత తీరింది. మొన్నటివరకు అత్యవసర మందులతో పాటు కాటన్‌ కూడా ఆస్పత్రుల్లో అందుబాటులో లేని పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన మందులకు సంబంధించిన బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఈ కారణంగా చాలా కంపెనీలు మందుల సరఫరాను నిలిపివేశాయి. చాలా కంపెనీలు ఏపీ ఆస్పత్రులకు మందులను ఇవ్వలేమని చేతులెత్తేశాయి.

ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో ఏడాదిన్నరకు పైగా పేరుకుపోయిన బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.140 కోట్లు చెల్లించింది. దీంతోపాటు శస్త్ర చికిత్సలకు సంబంధించిన పరికరాలు, కాటన్, బ్యాండేజీ, వైద్య ఉపకరణాలకు సైతం ప్రాధాన్యతా క్రమంలో బకాయిలు చెల్లించారు. దీంతో మందుల సరఫరాను కంపెనీలు తిరిగి ప్రారంభించాయి. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో 510 రకాల మందులను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వగా.. ప్రస్తుతం 530 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు.  

అప్పట్లో అల్లుడు గిల్లుడుతో.. 
గత ప్రభుత్వ హయాంలో  రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు గోపీనాథ్‌ ఉండేవారు. ఆయన హయాంలో ఏపీఎంఎస్‌ఐడీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. 500 రకాలకు పైగా మందులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలనే నిబంధన ఉండగా కనీసం 200 రకాల మందులు కూడా ఉండేవి కాదు. ఆయన ఏ టెండర్‌నూ సకాలంలో పూర్తి చేయనివ్వలేదని, సర్జికల్‌ టెండర్‌ను ట్యాంపరింగ్‌ చేసి తనకు నచ్చిన కంపెనీలకు కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి.

కనీసం జీఎస్టీ కూడా చెల్లించకపోవడంతో ఏపీఎంఎస్‌ఐడీసీకి గల జీఎస్టీ నంబర్‌ రద్దయ్యింది. దీంతో మందుల కొనుగోళ్ల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రతి ఫైల్‌ మీద ఏదో ఒక కొర్రీ వేసి నిధులు చెల్లించకపోవడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన మందుల కంపెనీలన్నీ వెనక్కు వెళ్లిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ పరిస్థితులను చక్కదిద్ది, బకాయిలను సైతం చెల్లించడంతో మందుల కొరతకు చెక్‌ పడింది. ఒక్క యాంటీ రేబిస్‌ వేక్సిన్‌ (కుక్క కాటు మందు) మినహా అన్ని రకాల మందులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఈ వేక్సిన్‌ను ఉత్పత్తి సంస్థలు దేశవ్యాప్తంగా మూడు మాత్రమే ఉండటం, డిమాండ్‌ అధికంగా ఉండటంతో కుక్కకాటు మందు ఇప్పటికీ కొరతగానే ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top