
వ్యవసాయ భూముల పరిమితి కుదింపునకు నో!
రైతుల వద్ద వ్యవసాయ భూమిని మరింత తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉంది. అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర సాగుపై ఈ ప్రతిపాదనలు పిడుగుపాటేనని భావిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: రైతుల వద్ద వ్యవసాయ భూమిని మరింత తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉంది. అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర సాగుపై ఈ ప్రతిపాదనలు పిడుగుపాటేనని భావిస్తోంది. చాలావరకు రాష్ట్రంలో వర్షాలు, బోర్లపైనే ఆధారపడి రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వ్యవసాయ భూమి సీలింగ్‌ను మరింత కుదించాలని ప్రతిపాదించడం ఇక్కడి రైంతాగానికి గొడ్డలిపెట్టని రాష్ట్ర ప్రభుత్వం తలపోస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ భూమి సీలింగ్ చట్టం ప్రకారం.. సాగునీటి వసతి కలిగి రెండు పంటలు పండే భూమి అయితే ఒక్కో రైతు కుటుంబానికి 18 ఎకరాలు ఉండవచ్చు. సాగునీటి వసతి కలిగి ఒకే పంట పండే భూమి అయితే ఒక్కో రైతు కుటుంబానికి 27 ఎకరాలు, మెట్ట భూమి రెండు పంటలు పండితే 54 ఎకరాల వరకు ఉండవచ్చు. అయితే దీన్ని మరింత కుదించాలంటూ కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. సాగువసతి ఉంటే ఒక్కో కుటుంబానికి ఐదు నుంచి పది ఎకరాలకు, సాగువసతి లేకుంటే 10 నుంచి 15 ఎకరాలకు సీలింగ్ విధించాలని కేంద్రం ప్రతిపాదించింది. వీటిపై ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో పలు సమావేశాలను ఏర్పాటు చేసి సమీక్షించారు. వచ్చే నెల 2న ఇదే అంశంపై మరో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను వచ్చే నెలాఖరులోగా కేంద్రానికి తెలియజేయాలని అధికారులు నిర్ణయించారు. భూ సంస్కరణలకు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో కోనేరు రంగారావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఆ కమిటీ సిఫార్సులను చాలా వరకు అమలు చేస్తున్నందున కొత్తగా కేంద్ర ప్రతిపాదనలను పాటించాల్సిన అవసరం లేదనేది రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయంగా ఉంది. భూమి రాష్ట్ర ప్రభుత్వ అంశమైనప్పటికీ జాతీయ భూసంస్కరణల విధానం పేరుతో కేంద్రం రాష్ట్రాలపై రుద్దాలని చూస్తోందని, వాటిని అంగీకరించరాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.