కొరవడిన ఆదరణ

Aadharana Scheme Delayed in Vizianagaram - Sakshi

బీసీ కులాలకు అందని ఆధునిక పరికరాలు

ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా... దక్కని ఫలితం

చేసేది గోరంత... ప్రచారం చూస్తే కొండంత

జిల్లాలో పంపిణీ లక్ష్యం 30,172 యూనిట్లు

ఇప్పటి వరకు అందించినది కేవలం 10,322 మందికే

బీసీ కులవృత్తులవారికి... చేతి పనివారికి ఆధునిక పరికరాలు అందిస్తున్నామంటూ తెగ ప్రచారం చేశారు. ఏ బస్సు వెనుక చూసినా... చంద్రబాబు ఫొటోతో ఫ్లెక్సీలు కొన్ని పరికరాల చిత్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి దరఖాస్తు చేసిన ఎంతోమందికి ఇప్పటికీ పరికరాలు అందడం లేదన్నది క్షేత్రస్థాయి పరిశీలనలో స్పష్టమవుతోంది. నిర్దేశించిన లక్ష్యాన్ని కనీసం 30శాతం కూడా చేరుకోకపోవడం విశేషం.

విజయనగరం పూల్‌బాగ్‌:  వెనుకబడిన తరగతులకు చెందిన చేతివృత్తులవారికి ఆధునిక పరికరాలకోసం చేపట్టిన ఆదరణ–2 పథకం కేవలం ప్రచారానికే పరిమితం అన్న విషయం స్పష్టమవుతోంది. తొలుత ఈ పథకం కింద బీసీ కులాలకు చెం దిన చేతివృత్తులు చేసుకునేవారికి సబ్సిడీపై ఆధునిక పరికరాలుఅందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అదనుగా బీసీ కులాలకు చెందిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, లబ్ధిదారుని వాటా కూడా డీడీ రూపంలో చెల్లించారు. ఆరునెలలు గడిచినా... సగం మందికి కూడా పరికరాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా స్పందన కరువైంది.

లెక్కకు మిక్కిలిగా దరఖాస్తులు
ఆదరణ–2 పథకం కింద బీసీ కులాలకు చెందిన చేతివృత్తులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఆధునిక పరికరాలను 70 శాతం సబ్సిడీపై అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ పోను మిగతా 30 శాతంలో 20 శాతం ఎన్‌బీసీఎఫ్‌డీసీ రుణం ఇప్పిస్తామని, 10 శాతం లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. జిల్లాలోని రజక, చేనేత, మత్స్యకార, వడ్డెర, కుమ్మర, నాయీ బ్రాహ్మణ, వడ్రంగి, కమ్మర, మేదర, శిల్పి తదితర కులాలకు చెందిన వారితో పాటు కుల వృత్తులు లేని పలు కులాలకు కూడా ఆధునిక పరికరాలు, కుట్టు, ఎంబ్రాయిడరీ మెషీన్లు అందిస్తామని భారీగా ప్రచారం చేశారు. ఈ మేరకు జిల్లాలో 30,172 మందికి వివిధ రకాల(లబ్ధిదారులు కోరుకున్న) ఆధునిక పరికరాలను అందించాలని లక్ష్యాన్ని నిర్ణయించింది. 2018 జూన్‌ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభం కాగా, లక్ష్యానికి మించి 52,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 44,120 మంది తమకు అవసరమైన యూనిట్లను ఎంపిక చేసుకోగా, 31,542 మంది కోరిన ధ్రువీకరణ పత్రాలతో పాటు 10శాతం లబ్ధిదారుని వాటాను డీడీలు తీసి సంబంధిత మండల పరిషత్, మున్సిపల్‌ కార్యాలయాల్లో సమర్పించారు.

నాలుగు విడతలుగా మేళాలు....
ఈ పథకంకోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆధునిక పరికరాలు అందించేందుకు అధికారులు డివిజన్లు, నియోజకవర్గ స్థాయిలో ఇప్పటి వరకు నాలుగు సార్లు మేళాలు నిర్వహించారు. గతేడాది నవంబర్‌ 12, డిసెంబర్‌ 5, 28, 2019 జనవరి 29వ తేదీన మేళాలు చేపట్టారు. అయితే పరికరాలు మాత్రం పూర్తి స్థాయిలో అందించలేదు. జిల్లాలో అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో యూనిట్లు పొందేందుకు అర్హత సాధించిన 31,542 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 10,322కి మాత్రమే  అందించారు. ఇంకా 21,220 మందికి అందించాల్సి ఉంది. కానీ ఇందులోనూ రాజకీయాలు రాజ్యమేలాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top