
14–10–2018, ఆదివారం
ఎస్.బూర్జవలస, విజయనగరం జిల్లా
టీచర్ పోస్టుల్లో కోత.. నిరుద్యోగులకు ద్రోహం కాదా బాబూ?
‘అభిమానం చాటుకోవడానికి మాటలే రానక్కర్లేదు. మనసుంటే చాలు’ అని డొంకాడ శ్రీనివాసరావు చూపించిన ఆల్బమ్ చూస్తే అర్థమవుతోంది. ఆ సోదరుడు పుట్టుకతోనే మూగ, చెవుడు. ఉద్యోగులకు వేతనాల్లా ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్ ఇచ్చి తనలాంటి లక్షలాది మంది నిస్సహాయులకు ఆశ్రయంగా నిలిచిన నాన్నగారంటే అతనికి వల్లమాలిన అభిమానం. ఆ మహానేత మరణించినప్పటి నుంచి నేటి దాకా అన్ని పత్రికల్లో వచ్చిన నాన్న గారి ఫొటోలను భద్రంగా ఆల్బమ్‌లో దాచుకున్నాడు. నాడు ఇదే దారిలో సోదరి షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఈ ఆల్బమ్ చూపించాడట. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ల ద్వారా ఎందరో చిన్నారులకు నాన్నగారు పునర్జన్మనిచ్చారు. ఆ వార్తల క్లిప్పింగ్‌లను సైతం పదిలపరుచుకున్నాడు. కుటుంబసమేతంగా నా వద్దకు వచ్చి ఆనందం పంచుకున్న ఆ సోదరుడిని చూసి సంతోషమేసింది. ఇటువంటి స్వచ్ఛమైన ప్రేమను పొందడం కన్నా అదృష్టమేముంటుంది?
ఈరోజు తాడెందొరవలస, కుంటినవలస, మర్రివలస, కొత్తవలస, బూర్జవలస తదితర గ్రామాల ప్రజలు నన్ను కలిశారు. ఆ ఊళ్లన్నిటికీ ‘వలస’ అనేది ఎలా వచ్చిందో గానీ.. ఆ పేరు మాత్రం సార్థకమవుతోంది. ఈ గ్రామాల్లో అత్యధికులు నిరుపేదలే. వారికి ఇళ్లులేవు, భూముల్లేవు. పొలం పనులు దొరకవు. కరువు పనులూ కరువే. ఒకవేళ కరువు పనులు చేసినా శ్రమ దోపిడీ తప్ప.. ఏడాది గడిచినా కూలి డబ్బులివ్వరు. మరెలా బతకాలి? వలసలు తప్ప మరో మార్గమేముంది? పుట్టి పెరిగిన ఊళ్లపై మమకారం చంపుకొని.. తప్పనిసరి పరిస్థితుల్లో దూర రాష్ట్రాలకు వలసెళ్లిపోయి దుర్భరంగా బతుకున్న వారెందరెందరో. నాలుగేళ్ల క్రితం ఇక్కడి కె.కృష్ణాపురానికి చెందిన వలస కూలీలు ఏడుగురు చెన్నైలో భవనం కూలి మరణించారు. అప్పుడు నేను ఈ గ్రామానికి వచ్చి బాధితుల తరఫున గళం వినిపించాను. ఆ గ్రామస్తులు నేడు నన్ను కలిశారు. నేటికీ ఈ ఊళ్ల పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదన్నారు. బతకడానికి చిన్నపాటి కూలిపనులు కూడా దొరకకపోవడం చాలా బాధనిపించింది. ఈ పరిస్థితి మారాలి. వలసలు నివారించాలన్న నా సంకల్పం మరింత దృఢపడింది.
మెంటాడ, దత్తిరాజేరు మండలాల రైతులు నన్ను కలిశారు. పిల్లకాలువలను పూర్తి చేయకపోగా.. ఉన్న వాటికి చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఈ పాలకుల వైఖరితో సాగునీరు అందక భూములు బీళ్లుగా మారాయని వాపోయారు. ఈ పరిస్థితుల్లో ఎందరో కౌలు రైతులు కూలీలుగా మారారని చెప్పారు. ఇలా అనేక మంది సొంత ఊళ్లలో బతకలేక వలసబాట పట్టడం బాధాకరం.
మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువకులు కలిశారు. డీఎస్సీ నిర్వహణ కూడా నిరుద్యోగ భృతిలా మరో బూటకమేనని వాపోయారు. డీఎస్సీ అంటూ ఊరించి ఊరించి.. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లుజల్లుతోందన్నారు. కోచింగ్ సెంటర్లకు లబ్ధి చేకూర్చడం తప్ప నిరుద్యోగులకు మంచి చేయాలన్న తపన ఏమాత్రం కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. టెట్‌ల మీద టెట్‌లు నిర్వహించడం, డీఎస్సీ అంటూ పలుమార్లు ప్రకటనలు చేసి వాయిదా వేయడం.. కోచింగ్ సెంటర్లకు లబ్ధి చేకూర్చడానికి కాదా? రాష్ట్రంలో 30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా.. ఒకసారి 22,000 పోస్టులకు డీఎస్సీ నిర్వహిస్తామని.. తర్వాత 14,300 అని.. ఆ తర్వాత 12,370.. మరోసారి 10,351 అని.. చివరకు 6,100 మాత్రమే అంటూ క్రమంగా పోస్టుల్లో కోత విధించడం వంచన కాదా? ఇది కూడా ‘యువనేస్తం’లా నిరుద్యోగులకు మీరు చేస్తున్న మరో ద్రోహం కాదా?
-వైఎస్ జగన్