breaking news
-
పెన్షన్‌దారులు దొంగలతో సమానం.. అయ్యన్న సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో పెన్షన్లను తొలగించే కుట్ర జరుగుతోంది. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్‌దారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్‌దారులను దొంగలతో పోల్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర లేపింది. పెన్షన్లను తొలగించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అయ్యన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పెన్షన్‌దారులను దొంగలతో పోల్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 20 వేల మంది తప్పుడు ధ్రువపత్రాలు చూపించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు. వారంతా దొంగలతోనే సమానం అని కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో పెన్షన్‌దారుల కారణంగానే ప్రభుత్వానికి నష్టం వస్తోందన్నారు. పెన్షన్ల వలన నెలకు రూ.120 కోట్ల నష్టం వస్తోంది. సంవత్సరానికి రూ.1440 కోట్ల నిధులు పక్కదారి పడుతున్నాయి. ఎవరు.. ఏం అనుకున్నా నాకు అనవసరం. ఈ పెన్షన్లను తొలగించాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో అయ్యన్నపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబుది 420 విజన్: వైఎస్ జగన్
ఇవాళ ఆరు నెలలు గడవక ముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయి. ఆ రోజు నేను ఎన్నికలప్పుడు చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అని. ఇవాళ 6 నెలలు తిరక్క ముందే అది కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటే మాట వినిపిస్తోంది. జగన్ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. పలావు, బిర్యానీ రెండూ పోయాయి. ఏమీ లేకుండా బాబు రోడ్డు మీద నిలబెట్టాడు అన్న చర్చ నడుస్తోంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిచంద్రబాబు విజన్ 2047 అంటున్నాడు. ఏడు నెలల క్రితం చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి మేనిఫెస్టో పేరుతో ప్రచారం చేసి ఊదరగొట్టారు. రూ.15 వేలు నుంచి రూ.48 వేల వరకు హామీలిచ్చుకుంటూ వెళ్లారు. ఇక్కడ ఏడు నెలల క్రితం మేనిఫెస్టో అని చెప్పిన హామీలకే దిక్కులేదు... కానీ, విజన్ 2047 అంటున్నాడు. రంగు రంగుల కథల పుస్తకమైన వారి విజన్ డాక్యుమెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. ఇంకోవైపు బాదుడే బాదుడు మొదలైంది. ముట్టుకుంటే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఆరు నెలలు తిరక్క మునుపే రూ.15 వేల కోట్లు కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన దుర్మార్గుడు చంద్రబాబు మాత్రమే. హామీలపై చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే... ఆ ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం గ్రామ స్థాయి నుంచి అమలవుతోంది. స్కామ్‌ల మీద స్కామ్‌లు.. లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి డబ్బులివ్వాల్సిందే. ప్రతి విషయంలో నాకింత.. నీకింత.. అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు కళ్లెదుట కనిపిస్తున్నాయి.ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన సాగు నీటి సంఘాల ఎన్నికలను అపహాస్యం చేశారు. ఎన్నికలను ఏకపక్షం చేశారు. గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూస్ సర్టిఫికెట్లు, ప్రతిపక్షానికి, సాధారణ రైతులకు ఇవ్వకుండా వాళ్ల పార్టీ వారికే ఇచ్చుకుని పోలీసుల సాయంతో ఏకపక్షంగా బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపించుకున్నారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు? బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపి... రైతులు సంతోషంగా ఉన్నారని ఎలా చెబుతారు? రైతులు సంతోషంగా ఉన్నారని మీకు అనిపిస్తే రాజీనామా చేసి బయటకు రండి. అప్పుడు పెట్టుబడి సాయం, ఉచిత బీమా ఎక్కడ అని అడుగుతున్న రైతులు మీకు కనిపిస్తారు. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే సీఎం చంద్రబాబు రంగు రంగుల కథలు చెబుతూ.. దానికి విజన్ 2047 అని పేరు పెడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అందుకే దాన్ని 420 విజన్ అంటారని మండిపడ్డారు. ‘మనిషిని అభివృద్ధి బాటలోకి తీసుకుని పోవాలంటే.. ఆ అభివృద్ధి బాట ఏమిటని చెప్పేదే విజన్ డాక్యుమెంట్. ఇవాళ చిన్న పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడు? అప్పుడు అతడి భవిష్యత్ ఏంటి? ఆ భవిష్యత్ కోసం ఇవాళ సరైన అడుగులు వేస్తున్నామా? లేదా? అన్నదే విజన్. అందులో భాగంగా ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాలా వాటిని చేసి చూపింది’ అని గుర్తు చేశారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని, పులినోట్లో తలపెట్టడమే అని.. నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఇవాళ ఆరు నెలలు తిరక్క ముందే అదే కనిపిస్తోంది’ అని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం దగా చేయడంతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా గొంతు విప్పాలని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని మార్గ నిర్దేశం చేశారు. ‘పగలు తర్వాత రాత్రి వస్తుంది. మళ్లీ మన టైం వస్తుంది. దేనికైనా మనం సిద్ధమే. ఎవ్వరూ, ఎక్కడా భయపడొద్దు. దేన్నైనా ఢీకొందాం. మీ అందరికీ జగన్మోహన్రెడ్డితోపాటు పార్టీ అండగా ఉంటుంది’ అంటూ నేతలకు భరోసా ఇచ్చారు. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...జనవరి నుంచి జిల్లాల పర్యటనజనవరి చివరి వారం నుంచి నేను పార్లమెంటు జిల్లాల్లో పర్యటిస్తాను. వారంలో ప్రతి బుధ, గురువారం రాత్రి అక్కడే బస చేసి కార్యకర్తలతో మమేకమవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈ కార్యక్రమం మొదలయ్యే లోగా మండల స్థాయి నుంచి మొదలై నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలి. పార్టీ నిర్మాణం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇదంతా ఆర్గనైజ్డ్గా తీసుకు రావాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మీరు, నేను కలిసి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తీసుకుని పోదాం. విలేజ్ కమిటీలు, బూత్ కమిటీల నియామకం పూర్తి చేస్తాం.సోషల్ మీడియాలో మరింత చురుగ్గా ఉందాంఇవాళ మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు.. చంద్రబాబు వేసుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ముసుగుతో యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి వాళ్లను ఎదుర్కోవాలంటే మనం సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండాలి. జనరేషన్ మారింది. ప్రతి కార్యకర్తకు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉండాలి. గ్రామ స్థాయిలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించాలి. ఎవరికైనా పెన్షన్ రాకపోయినా, బిల్లుల బాదుడు పైనా ప్రశ్నిస్తూ ప్రతి గ్రామం నుంచి విప్లవ ధోరణిలో ప్రశ్నించాలి. గ్రామ స్థాయి నుంచే ప్రశ్నించే స్వరం ఉండాలి. అప్పుడే చైతన్యం వస్తుంది. ఈసారి మన టార్గెట్.. చంద్రబాబుకు సింగిల్ డిజిట్ దాటకూడదు. అది కచ్చితంగా జరుగుతుంది.మనకూ కచ్చితంగా గుడ్ టైమ్ వస్తుందిప్రతిపక్షంలో కష్టాలు, కేసులు సహజం. జైల్లో కూడా పెడతారు. నేను మీ అందరికీ చెబుతున్నాను. కష్టాలు ఎల్లకాలం ఉండవు. కష్టం తర్వాత సుఖం ఉంటుంది. ఏ కష్టం ఎవరికి వచ్చినా నా వైపు చూడండి. ప్రతిపక్షం ఉండదు.. అడిగే వాడు ఉండడని నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి నామీద కేసులు పెట్టాయి. ఏమైంది? ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అయ్యాను. పగలు తర్వాత రాత్రి వస్తుంది. మళ్లీ మన టైం వస్తుంది. జమిలి వస్తుందంటున్నారు. దేనికైనా మనం సిద్ధంగా ఉందాం. మనకూ తప్పనిసరిగా గుడ్ టైమ్ వస్తుంది.ఆరు నెలల్లో 3.14 లక్షల పెన్షన్లు కట్మార్చి, ఏప్రిల్ నెలల్లో.. మన ప్రభుత్వ హయాంలో 66,34,742 పెన్షన్లు ఉండేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. డిసెంబర్లో పంపిణీ చేసిన పెన్షన్ల సంఖ్య 63,20,222. అంటే 3.14 లక్షల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా పెన్షన్ ఒక్కరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు. రెండు, మూడు నెలల్లో ఇంకా, 3 లక్షల నుంచి 4 లక్షల మంది పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి. ఈ పోరుబాటలో ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ జెండాను రెపరెపలాడించేలా ఎగుర వేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అభ్యర్థిస్తున్నాను. ఆరు నెలలకే ఇంత వ్యతిరేకత ఎప్పుడూ లేదు⇒ ఆరు నెలలకే చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ఎన్నికల్లో మనం ప్రచారం చేసినప్పుడు, మన పార్టీ తరఫున మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు నేను చెప్పిన మాటలు అందరికీ తెలుసు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీలు, మోసాల గురించి నా దగ్గరకు వచ్చిన పార్టీ నాయకులు చాలా మంది చెప్పారు. మనం కుటుంబానికి అంతటికీ మంచి చేశాం. కానీ చంద్రబాబు మోసాలు, అబద్ధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఇంటికి మనం మంచి చేస్తే.. ఆయన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి చేస్తానని హామీ ఇచ్చాడు.⇒ మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని మన పార్టీ నేతలు నాతో అన్నారు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ధర్మం కాదనేది నా అభిమతం. ఆ రోజు మనం మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఇవి మనం చేస్తున్న పథకాలు.. ఐదేళ్ల మన పాలనలో ఎప్పుడూ జరగని మార్పులు చేశాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయకుండా భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి అమలు చేశాం. చివరకు కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయాలు తగ్గినా, మనం సాకులు వెతుక్కోలేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి... బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశాం. ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసి చూపింది. అంత గొప్పగా ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాం.⇒ మనమంతా ఎమ్మెల్యేల తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు మనల్ని ఆప్యాయతతో ప్రజలు ఆదరించారు. మన మీద వ్యతిరేకత లేదు. కానీ పది శాతం మంది చంద్రబాబు మాటలను నమ్మారు. దానికి కారణం కూడా మనమే... అంత గొప్ప పాలన మనం అందించగలిగాం కాబట్టే.. చంద్రబాబు మభ్యపెట్టగలిగాడు. ప్రజలను ఆశ పెట్టగలిగాడు. జగన్ చేసి చూపించాడు కాబట్టి.. చంద్రబాబు కూడా చేసి చూపిస్తాడేమో అని ప్రజలు ఆశపడ్డారు.⇒ చంద్రబాబు, ఆయన పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఏ ఇంటికి వెళ్లినా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. ఒక మనిషి ఈ స్థాయిలో మోసం చేయగలుగుతాడా.. అన్నంతగా మోసం చేశారు. చిన్నపిల్లలతో నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. వారి తల్లులకు నీకు రూ.18 వేలు అని, ఆ అమ్మల తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. ఇంట్లో ఎవరినీ వదిలిపెట్టకుండా ఆశ పెట్టారు.ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ పాలన⇒ ఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. రూ.15 వేల కోట్ల మేర కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం గ్రామస్థాయి నుంచి అమలవుతోంది. మరోవైపు లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, స్కామ్‌లు. ప్రతి పనికీ డబ్బులివ్వాల్సిందే. నాకింత.. నీకింత అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు.⇒ ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టడానికి మనం ఇవాళ కలిసి అడుగులు వేస్తున్నాం. ఏ నాయకుడైనా ప్రజల తరఫున స్పందించ గలగాలి. వారి సమస్యలపై పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని చైతన్యం చేస్తున్నాం. అప్పుడే ప్రజల్లో అధికార పార్టీ మీద పెరుగుతున్న వ్యతిరేకత మనకు సానుకూలంగా మారుతుంది.⇒ ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది. ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్న విషయం మన కళ్లెదుటే కనిపిస్తోంది. రైతులకు గతంలో పెట్టుబడి సహాయంగా రైతు భరోసా కింద ఇచ్చిన రూ.13,500 గాలికెగిరిపోయింది. రూ.20 వేలు ఇస్తానన్న పెట్టుబడి సాయం మోసమని తేలిపోయిన పరిస్థితుల్లో రైతు సాగు చేస్తున్నాడు. రైతులకు ఉచిత పంటల బీమా దక్కే పరిస్థితి పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ–క్రాపింగ్ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో మనం ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి రైతుకు కనీస మద్దతు ధర వచ్చేటట్టుగా ధాన్యం కొనుగోలు చేసి.. వెంటనే పైకం చెల్లించేలా అక్కడే ‘ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్’ (ఎఫ్టీఓ) కూడా ఇచ్చి, మనం తోడుగా నిలిచాం. ఇవాళ అదే రైతులకు కనీస మద్దతు ధర రాకపోగా, అంత కంటే రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. అందుకే వారికి మద్దతుగా ఆందోళన కార్యక్రమం చేశాం.షాక్ కొడుతున్న కరెంటు బిల్లులపై 27న ఆందోళనపట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్న విద్యుత్ బిల్లుల మీద ఈ నెల 27న ఆందోళనకు పిలుపునిచ్చాం. ఇప్పటి వరకు అంటే... 6 నెలల వరకు రూ.6 వేల కోట్ల బాడుదు మాత్రమే. రేపటి నెలలో మరో రూ.9 వేల కోట్ల బాదుడు ఉండబోతుంది. ఇలాంటి పరిస్థితులలో మహిళలు నిరసన తెలుపుతూ బిల్లులు కాల్చుతున్న పరిస్థితి. ఈ దఫా కరెంటు బిల్లుల పెరుగుదలకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో చేయబోతున్నాం.ఫీజులు రాని పిల్లలకు అండగా నిలుద్దాంమన ప్రభుత్వ హయాంలో ప్రతి 3 నెలలకొకసారి, త్రైమాసికం అయిన వెంటనే పిల్లల తల్లులకు డబ్బులిచ్చి వారి చదువులకు తోడుగా ఉండేవాళ్లం. ఈ రోజు పిల్లలు విద్యా దీవెన, వసతి దీవెన రాక ఇబ్బంది పడుతున్నారు. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఏప్రిల్‌లో వెరిఫై చేసి మే నెలలో ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు త్రైమాసికాలు గడిచిపోయాయి. ఏప్రిల్‌లో వసతి దీవెన కింద డబ్బులిచ్చే వాళ్లం. ఇప్పుడు అది కూడా ఎగిరిపోయింది. మొత్తంగా ఫీజులకు సంబంధించి నాలుగు దఫాలు విద్యా దీవెన రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూ.1,100 కోట్లు మొత్తం రూ.3,900 కోట్లు పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల.. పిల్లలు డబ్బులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. పనులకు వెళ్తున్నారు. ఈ పిల్లలకు అండగా, వారికి తోడుగా ఉండే కార్యక్రమం జిల్లా యూనిట్‌గా జనవరి 3వ తేదీన చేయబోతున్నాం.అసలైన విజన్ అంటే ఇదీచంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్‌తో మరో డ్రామాకు తెర తీశారు. అసలైన విజన్ అంటే ఏమిటో మనం చూపించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ బడులతో ప్రైవేటు బడులు పోటీ పడే పరిస్థితి కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే వచ్చింది. నాడు–నేడు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)తో డిజిటల్ బోధన ప్రారంభించాం. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లిష్ మీడియం చేయడంతో పాటు, సీబీఎస్ఈతో ఆపకుండా.. ఏకంగా ఐబీ వరకు ప్రయాణానికి కూడా మన ప్రభుత్వంలోనే అడుగులు పడ్డాయి. రోజుకొక మెనూతో గోరుముద్ద మన ప్రభుత్వంలోనే అమలు చేశాం. తొలిసారిగా మనం చేసిన ఈ మార్పులతో పదో తరగతికి వచ్చే సరికి పిల్లలు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే పరిస్థితి తెచ్చాం. అదీ మన విజన్.ఉన్నత విద్యలో ఊహకందని మార్పుఉన్నత విద్యలో మన డిగ్రీతో ఉద్యోగాలు రాని పరిస్థితి నుంచి వాటిని మరింత మెరుగ్గా చేయడానికి ఎడెక్స్ అనే సంస్థ సహాయంతో ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చాం. ఇందులో మన డిగ్రీ విద్యార్థి తనకు నచ్చిన కోర్సులు తీసుకునే విధంగా.. స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ వంటి పెద్ద, పెద్ద విదేశీ యూనివర్సిటీలు కోర్సులు ఆఫర్ చేసేలా చేశాం. ఆ కోర్సులు ఇక్కడ తీసుకుని పరీక్షలు రాస్తే.. వాటికి ఆ యూనివర్సిటీలు సర్టిఫికెట్స్ ఇస్తాయి. ఆయా యూనివర్సిటీల నుంచి డేటా అనలైటిక్స్, అసెట్స్ మేనేజిమెంట్ వంటి కోర్సుల్లో సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి కోర్సుల కోసం ఆలోచన చేసి వారికి విద్యాదీవెన, వసతి దీవెనతో సహా ఏర్పాటు చేయడమే విజన్.గ్రామ స్థాయిలో ప్రివెంటివ్ కేర్చదువులు, వైద్యం మనిషిని ఎప్పుడైనా అప్పుల్లోకి నెట్టేస్తాయి. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్య శ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్స్‌కు తీసుకుని పోయి రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందేట్టు చేశాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నాడు–నేడు పనులతో రూపురేఖలు మార్చాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకుని వచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత దేశ వ్యాప్తంగా 67 శాతం ఉంటే... మన రాష్ట్రంలో మాత్రం దాన్ని కేవలం 4 శాతానికి పరిమితం చేశాం. ప్రతి ఆసుపత్రిలో జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో కూడిన మందులు ఉండేలా చేశాం. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ అంటే వివిధ రోగాలు తొలి దశలో ఉన్నప్పుడే గుర్తించి, వాటిని నివారించడానికి గొప్ప అడుగులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పడ్డాయి. ఇదీ విజన్.పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో ప్రగతి..ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి రూ.13వేల కోట్లకుపైగా వ్యయంతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల నిర్మాణాన్ని, రూ. 3,500 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టాం. ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. తద్వారా రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయి. ఇదీ విజన్. రైతును చేయి పట్టుకుని నడిపించాంరైతుకు ఇబ్బంది రాకుండా, వారిని చేయి పట్టుకుని నడిపించేందుకు ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌ను ఆర్బీకే కేంద్రంగా కూర్చోబెట్టడం విజన్. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేయడమే కాకుండా.. రైతుకు తోడుగా ఉంటూ ఇన్సూ్యరెన్స్ చేసుకున్నా, లేకున్నా.. విపత్తు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్సూ్యరెన్స్ వచ్చేట్టు ఉచిత పంటల బీమా తీసుకు రావడం విజన్. రైతుకు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకేల దగ్గరే కొనుగోలు చేసి.. పూర్తి గిట్టుబాటు ధర ఇచ్చేట్టు చేయడం ఒక విజన్. ఈ రకంగా వ్యవసాయ రంగంలో మార్పులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగాయి.ఇంటి వద్దకే సేవలుమన ప్రభుత్వం రాకమనుపు ఒక రూపాయి ప్రభుత్వం ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉంటుందని ఎవరైనా అనుకున్నారా? అలాంటి విజన్‌ను తీసుకొచ్చిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ.. అందులో 540 రకాల సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం.. 60–70 ఇళ్లకు ఒక వలంటీర్... కులం, మతం, ప్రాంతం చూడకుండా.. లంచాలు లేకుండా ప్రతి ఇంటికి ప్రతి పథకం చేర్చగలిగే పరిస్థితి వైఎస్సార్‌సీపీప్రభుత్వంలోనే వచ్చింది. ఇదీ విజన్ అంటే. -
ఇది ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం
తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం...ఈ విషయంలో తక్షణమే పెంచిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజల తరుపున వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంరాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా ఏఈ లేదా డీఈ కార్యాలయంకు వెళ్ళి, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలని సూచించారు.‘ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడయింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ రెండో కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.ఇందుకు సంబంధించి వైఎస్సార్ సిపి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. ఈ కార్యక్రమాన్ని ముందు జిల్లా స్ధాయిలో నిర్వహించాలని భావించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నియోజకవర్గ స్ధాయిలో చేయాలని మన అధినేత జగన్ అందుబాటులో ఉన్న నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్ధాయిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు అందరూ తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. నియోజకవర్గ ఇంఛార్జ్‌లంతా కూడా తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ దోపిడినీ ఎండగట్టాలని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి..ఈ నెల 21 న మన అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, జగన్‌గారిపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి, పార్టీ క్యాడర్ అంతా ఉత్సాహంగా పాల్గొని జగన్‌గారిపై ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలి, ఈ వేడుకలను అందరం విజయవంతం చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు.సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉందాంసోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్దంగా ఉంది, ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి. ఇటీవల సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులకు తెలియజేసి, దానిని అతిక్రమిస్తే వచ్చే ఇబ్బందులను పోలీసులకు తెలియజేయాలి. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు అవసరమైన సహాయం చేసేందుకు పార్టీ నాయకులు కూడా వెంటనే అందుబాటులో ఉండాలి’ అని సజ్జల హితవు పలికారు. -
చంద్రబాబు దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు: గడికోట
సాక్షి,తాడేపల్లి:ప్రపంచంలో ఏ నియంత చేయని దుర్మార్గాలను చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.గురువారం(డిసెంబర్19) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘చంద్రబాబు తనపై ఉన్న కేసులన్నిటిలో తనకుతానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం హాస్యాస్పదంగా ఉంది.జడ్జిల మీద నిఘా పెట్టటం ఎంతవరకు సమంజసం? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? నలుగురు ఐపీఎస్‌లను కూడా సస్పెండ్ చేశారంటే ఇది నియంత పోకడ కాదా? ఈ తప్పులను ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు.అరెస్టు చేయడానికి వచ్చే పోలీసులు కనీసం ఐడీ కార్డులు కూడా చూపడం లేదు.రాష్ట్ర అప్పుల విషయంలో చంద్రబాబు విష ప్రచారం చేశారు.పార్లమెంటు చెప్పిన మాటలను కూడా తప్పుదారి పట్టించారు.అప్పులేకాదు ప్రతి విషయంలోనూ దుష్ప్రచారం చేశారు.వైఎస్ జగన్ తన హయాంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు.చేసిన మంచిని కూడా వైఎస్ జగన్ చెప్పుకోలేకపోయారు.ఇప్పుడు ఈ విషయాన్ని జనం గుర్తించి సొంతంగా ప్లెక్సీలు పెడుతున్నారు.చంద్రబాబు చేసిందంతా విధ్వంస పాలన.రూ.50 వేల కోట్లు రాజధానికి ఖర్చు చేస్తున్న చంద్రబాబు మిగతా ప్రాంతాల సంగతేంటో చెప్పాలి.రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు భాగం కాదా? వైఎస్ జగన్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తే చంద్రబాబు ఆ రికార్డులు చూపించాలి.చంద్రబాబు ష్యూరిటీ,వీరబాదుడు గ్యారెంటీ అన్నట్టుగా పరిస్థితి మారింది’అని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
చంద్రబాబును మించిపోయేలా పవన్!
పవన్ కళ్యాణ్ తన నటనా కౌశలాన్ని వెండితెరపై నుంచి రాజకీయాలకు కూడా విస్తరించినట్లుంది. రాజకీయాల్లో నటన, వంచనా చాతుర్యం వంటివి జనాలకు పరిచయం చేసిన ఘనత చంద్రబాబుదైతే.. పవన్ ఆయన అడుగుజాడల్లో.. అతని కంటే ఘనుడు అనిపించుకునేలా నడుస్తున్నాడు. ‘స్వర్ణాంధ్ర2047’ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగాన్ని గమనిస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. గతంలో ఆయన ఉపన్యాసాలకు, ఇప్పుడు చెబుతున్న సుద్దులకు ఎంత తేడా ఉందో అర్థమవుతుంది. పదవి వస్తే అంతా సుభిక్షంగా ఉందని నేతలు ఫీల్ అవుతారట. పవన్ ప్రస్తుతం ఆ దశలో ఉన్నారు. పాతికేళ్లపాటు ఏపీలో రాజకీయ స్థిరత్వం ఉండాలని చంద్రబాబు నేతృత్వంలో పని చేస్తానని ఆయన చెప్పుకున్నారు. బాబును ఆకాశానికి ఎత్తేశారు. రాజకీయ అవసరాల కోసం పొగిడితే తప్పులేదు కానీ.. అతిగా చేస్తేనే వెగటు పుడుతుంది. 2019లో చంద్రబాబును ఉద్దేశించి పవన్ మాట్లాడిందేమిటో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ’2020 విజన్ అంట.. రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు..అవి ఇచ్చారా? ఆ ఉద్యోగాలు లేవు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం సాగుతోంది. చంద్రబాబు దృతరాష్ట్రుడి మాదిరిగా కొడుకు లోకేష్ కోసమే పనిచేస్తున్నారు.‘ అని ఆయన అప్పట్లో ధ్వజమెత్తారు ఇప్పుడు మాత్రం.. ’2020 విజన్ అంటే ఆనాడు అర్థం చేసుకోలేక పోయారు..వెటకారం చేశారు. ఇప్పుడు వారికి అదే భిక్ష పెడుతోంది. చంద్రబాబు గారి అనుభవం, అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీస్ అమోఘం...‘ అంటున్నారు. చంద్రబాబు తనకు రాజకీయ భిక్ష పెట్టారని పవన్ అనుకుంటూ ఉండవచ్చు కానీ.. ‘విజన్2020’తో ఒరిగిందేమిటో చెప్పకుండా ఒట్టిగా పొగిడితే చెవిలో పూలు పెడుతున్నారని జనం అనుకోరా? పవన్ కళ్యాణ్ విజన్2020 డాక్యుమెంట్‌ను అసలు చూశారా? 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఈ డాక్యుమెంట్‌తో ప్రచారం నిర్వహించారు. అందులోని అంశాలు పరిశీలించిన వారు ఇదేదో కాలక్షేపం వ్యవహారమని, హైప్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని విమర్శించారు. ప్రజలు ఈ డాక్యుమెంట్‌ను అస్సలు పట్టించుకోలేదు అనేందుకు ఆ తరువాతి రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడమే నిదర్శనం. ఈ సమయంలో కానీ.. రాష్ట్ర విభజన తరువాత 201419 మధ్యకాలంలో కానీ చంద్రబాబు ఈ విజన్ పేరెత్తితే ఒట్టు! ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ పేరుతో 2047 విజన్ అన్నారో.. బాబుగారికి ఠక్కున గుర్తొచ్చింది. తాను వెనుకబడకూడదన్నట్టు ‘స్వర్ణాంధ్ర2047’ను వదిలారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.. ’కులాలు, మతాలు, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు పోయాయి. 21వ శతాబ్దంలో కూడా కులాలేమిటి..మతాలేమిటి ప్రాంతాలేమిటి?‘ అని ప్రశ్నించారు. ఆయన నిజంగానే ఇలా అనుకుంటూంటే... జనసేన తరపున తీసుకున్న మూడు మంత్రి పదవులలో ఇద్దరు కాపులు ఎందుకు ఉన్నారో చెప్పాలి కదా? మరో మంత్రి పదవిని కూడా కాపు వర్గానికి చెందిన తన సోదరుడు నాగబాబుకే ఎందుకు కట్టబెడుతున్నారు? కమ్మ వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌కు ఒక మంత్రి పదవి ఇచ్చారు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఇతర వర్గాల వారికి పదవి ఇప్పించ లేకపోయారే అన్న ప్రశ్న వస్తే ఏం జవాబు ఇస్తారు? కొద్ది నెలల క్రితం వరకు కులం కావాలని, అందులోను కాపులు, బలిజలు అంతా ముందుకు రాకపోతే రాష్ట్రంలో మార్పు రాదని రెచ్చగొట్టే రీతిలో ఉపన్యాసాలు ఈయనే చేయడం విశేషం. కాపులు తనకు ఓటు వేసి ఉంటే భీమవరం, గాజువాకల్లో ఎందుకు ఓడిపోతానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కుల భావన అన్నా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని కూడా అప్పట్లో సెలవిచ్చారు. పవన్ తమ కులం వాడని నమ్మి మద్దతిచ్చిన కాపులు, బలిజలు ఇప్పుడు కుల భావాన్ని వదులుకోవాలా? అందుకు వారు సిద్దం అవుతారా? లేక పవన్ కళ్యాణ్ అవకాశవాద రాజకీయాలు చేయడంలో నైపుణ్యం సాధించారని సరిపెట్టుకుంటారా? ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు ఏది అవసరమైతే అది చెప్పి ప్రజలను మభ్య పెట్టడంలో ఆరితేరుతున్నారు. కొద్ది నెలల క్రితమే కదా! ‘‘ఐయామ్ సనాతన్ హిందూ’’ అంటూ పెద్ద గొంతు పెట్టుకుని పవన్ అరిచింది? ఆ సందర్భంలో ముస్లింలతో పోల్చి హిందువులను రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ సడన్‌గా ఇంకా మత భావన ఏమిటని అంటే ఏపీ జనం నోట్లో వేలేసుకుని వినాలన్నమాట. పవన్ అసలు మతం గురించి ఎప్పుడు ఏమి మాట్లాడారో వివరించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవి వింటే ఇన్ని రకాలుగా మాటలు మార్చవచ్చా? అన్న భావన కలుగుతుంది. వాటి గురించి వివరణ ఇవ్వకుండా ఎప్పటికి ఏది అవసరమైతే అది మాట్లాడితే సరిపోతుందా?మరో వ్యాఖ్య చూద్దాం. పార్టీ పెట్టి నలిగిన తర్వాత చంద్రబాబుపై గౌరవం అపారంగా పెరిగిందని పవన్ అన్నారు. చంద్రబాబు తనకు చాలా గౌరవం ఇస్తున్నారని, కలిసే పని చేస్తామని కూడా పవన్ అన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా అలాగే కలిసి ఉండాలని, చిన్ని, చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చని అన్నారు. తను కోరిన విధంగా సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించినందుకు కృతజ్ఞతగా పవన్ ఈ మాట చెప్పినట్లుగా ఉంది. చంద్రబాబుపై నిజంగానే అంత నమ్మకం ఉంటే నాగబాబు పదవి గురించి ఎందుకు లిఖిత పూర్వక హామీ తీసుకున్నారో కూడా చెప్పగలగాలి. విభజన నాటి నుంచి చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకున్నారట పవన్. మరి 2018లో చంద్రబాబుతో విడిపోయి, వేరే కూటమి ఎందుకు పెట్టుకున్నారు? అప్పట్లో చంద్రబాబు, లోకేష్ లు అత్యంత అవినీతిపరులని గుంటూరులో సభ పెట్టి మరీ గొంతు అరిగేలా చెప్పింది పవన్ కళ్యాణే కదా? ఈ విషయంలో ఈయన కచ్చితంగా చంద్రబాబునే ఫాలో అవుతున్నారు.చంద్రబాబు కూడా ఎవరినైనా పొగడగలరు.. తేడా వస్తే అంతకన్నా తీవ్రంగా తిట్టగలరు. పరిస్థితి బాగోలేదనుకుంటే తగ్గిపోయి ఎంతకైనా పొగడుతారు. ప్రధాని నరేంద్ర మోడీని గతంలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా విమర్శించింది.. దూషణలు చేసింది.. గుర్తు చేసుకోండి. దేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. టీడీపీ ఓటమి తర్వాత పూర్తిగా రివర్స్ లో మోడి అంత గొప్పవాడు లేడని మెచ్చుకున్నది కూడా ఆయనే. పవన్ ఇప్పుడు అదే దారిలో ఉన్నారు. లోకేష్ సీఎం కావడం ఇష్టం లేకే చంద్రబాబు మరో పాతికేళ్లు అధికారంలో ఉండాలని పవన్ అభిలషిస్తున్నట్లు ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.ఇంతకుముందు మరో సదేళ్లు సీఎంగా ఉండాలని చెప్పిన ఈయన ఈసారి పాతికేళ్లు అని అంటున్నారు. అప్పటికి చంద్రబాబుకు 99 ఏళ్లు వస్తాయి. అంటే పవన్ తాను సి.ఎమ్. కావాలన్న ఆశను వదలుకున్నట్లేనా? ఇది వ్యూహాత్మక వ్యాఖ్యా? లేక టీడీపీతో లేకపోతే తనకు రాజకీయ భవితవ్యం ఉండదని భయపడుతున్నారా? ఇది అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పూర్తిగా చంద్రముఖిలా మారిన చంద్రబాబు.. వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు.. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా.. ఇలా మాఫియాలు చేస్తున్నారన్నారని వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశమని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ మాట్లాడుతూ.. ‘ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ప్రతి కుటుంబానికి మనం మంచి చేశాం. కానీ, చంద్రబాబు అంతకంటే ఎక్కడు చేస్తానంటూ, ప్రతీ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఒక హామీ ఇచ్చాడు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలామంది నాతో అన్నారు. గడచిన ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు మనం తీసుకువచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకువచ్చాం, ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేశాం.చరిత్రలో వైఎస్సార్సీపీ ఒక్కటే..కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వ ఆదాయాలు తగ్గినా, ఖర్చు పెరిగినా, సాకులు చూపకుండా, కారణాలు చెప్పకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశాం. బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించాం. క్యాలెండర్ ప్రకారం ప్రతీ పథకాన్ని అమలు చేశాం. దేశ చరిత్రలో అమలు చేసిన పార్టీ ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. చంద్రబాబు మాటలను పదిశాతం ప్రజలు నమ్మారు, నమ్మించగలిగారు. అందుకనే పరాజయం పాలయ్యాం. జగన్ చేశాడు కదా.. చంద్రబాబు కూడా చేస్తాడేమోనని కొంతమంది అనుకున్నారు. ఆరు నెలలు కూడా గడవకముందే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు మన అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబు నిజం చేస్తున్నారు. జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావు పోయిందీ, బిర్యానీ పోయిందీ. ఉన్న పథకాలు పోయాయి.. ఇస్తానన్న పథకాలు రావడంలేదు. ఇప్పుడు ప్రజలపై బాదుడే బాదుడు మొదలైంది. ఆరు నెలల్లోనే ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో భారం వేశాడు.అంతా మాఫియానే.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. స్కామ్‌ల మీద స్కాంలు నడుస్తున్నాయి. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా.. ఇలా మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్ జరగాలన్నా, ఏ కాంట్రాక్టు చేయాలన్నా ప్రతీ ఎమ్మెల్యే నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ నాకింత.. నీకింత అనే కార్యక్రమం నడుస్తోంది. మనం అంతా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దిశగా పార్టీ అడుగులు వేయాలి. ప్రభుత్వం మీద వ్యతిరేకత పార్టీకి సానుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని అంతా చైతన్యం చేస్తున్నాం. ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది.రైతులు ఆగం..రైతులకు మనం ఏడాదికి ఇచ్చే రూ.13,500 ఎగిరిపోయింది.. చంద్రబాబు ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఉచిత పంటల బీమాను ఎత్తివేశారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పంటలకు ఎక్కడా గిట్టుబాటు ధరలు దొరకడం లేదు. ధాన్యం కొనుగోలు సమయంలోనే రైతులకు ఎఫ్‌టీవో ఇచ్చే వాళ్లం. రూ.300-400 తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనిపై ఇది వరకే మనం కార్యక్రమం చేశాం. ఈనెల 27న కరెంటు ఛార్జీల మీద నిరసన వ్యక్తం చేస్తూ మరో కార్యక్రమం చేస్తున్నాం. పెరిగిన బిల్లులు చూపిస్తూ వాటిని కాల్చివేస్తున్న పరిస్థితులు చేస్తున్నాం. కరెంటు ఛార్జీల పెంపు మీద నిరసన కార్యక్రమాన్ని నియోజకవర్గాల స్థాయిలో చేపడుతున్నాం. మళ్లీ జనవరి 2న ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెనమీద నిరసనలకు ప్లాన్ చేశాం.మన ప్రభుత్వ హయాంలో ప్రతీ త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పంపాం. జనవరి ఒకటో తేదీ నాటికి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులు చెల్లించడం లేదు. అలాగే వసతి దీవెన బిల్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చదువులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. డబ్బులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. వీరికి అండగా జనవరి 3న జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమం చేస్తుంది:కష్టం ఎల్ల కాలం ఉండదు..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి. కేసులు కూడా పెడతారు, జైల్లో కూడా పెడతారు. ప్రతీ కష్టానికి ఫలితం ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది. ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. నావైపు చూడండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. నా భార్య బెయిల్ పిటిషన్ కనీసంగా 20 సార్లు పెట్టి ఉంటుంది. కింద కాంగ్రెస్, పైన కాంగ్రెస్. ఎన్ని కష్టాలు పెట్టినా.. నేను ముఖ్యమంత్రిని కాలేదా?. ఇది ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఢీకొనేలా ఉందాం. మీ అందరికీ జగనన్న, పార్టీ తోడుగా ఉంటుంది.సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేశారు. వీఆర్వోలను మండల కేంద్రాలకు రప్పించి, పోలీసులను కాపలాగా పెట్టించి ఎన్నికలు జరిపారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు. రాజీనామాలు చేసి బయటకు వస్తే, రైతులు సంతోషంగా ఉన్నారా? లేదా? తెలుస్తుంది.విజన్ పేరిట మరో డ్రామా..విజన్ 2047 పేరిట మరో డ్రామా జరుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఎల్లో మీడియా వారి మేనిఫెస్టోపై ఊదరగొట్టారు. ఈ మేనిఫెస్టోకు దిక్కులేదు, ఇప్పుడు 2047కు అర్థం ఏముంటుంది?. ఇప్పుడు చంద్రబాబు వయస్సు దాదాపు 80 ఏళ్లు. ఒక మనిషిని అభివృద్ధి బాటలో పట్టించడమే విజన్ అని నేను నమ్ముతాను. ఇప్పటి పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలన్నదానిపై మనం ఆలోచనలు చేస్తే అది విజన్ అవుతుంది. అలాంటి ఆలోచనలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసింది. ప్రైవేటు స్కూల్స్.. గవర్నమెంటు స్కూల్స్‌తో పోటీపడే పరిస్థితిని తీసుకు వచ్చాం. ఉన్నత విద్యలో విద్యార్థులు అత్యాధునిక కోర్సులు చదువుకునేలా ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం కల్పించాం.విజన్ మనది.. ఆరోగ్య రంగంలో కూడా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ వ్యవస్థను తీసుకువచ్చాం. ప్రివెంటివ్ కేర్ విషయంలో అనేక చర్యలు తీసుకున్నాం. ఆర్బీకే వ్యవస్థ ఒక విజన్. ప్రతీ ఎకరాకు ఈ-క్రాప్ చేయడం విజన్. ప్రతీ ఎకరాకు ఉచిత పంటల బీమా తీసుకురావడం ఒక విజన్.రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చేయడం ఒక విజన్. ఈ మార్పులన్నీ వచ్చింది వైయస్సార్సీపీ హయాంలోనే..మన ప్రభుత్వం రాక ముందు ఒక రూపాయి ప్రజలకు ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉండేదా?. హయంలో ఎక్కడా దళారీ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చగలిగాం. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకే సేవలు అందించి గొప్ప విజన్‌ను తీసకురాగలిగాం. కానీ, రంగ రంగుల కథలు చెప్తున్నారు. దానికి విజన్ అని పేరుపెడుతున్నారు. దాన్ని విజన్ చేయడం అనరు.. దగా చేయడం అంటారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెన్షన్లు కట్ చేశారు. కొత్త పెన్షన్లు ఒకరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి అని సూచనలు చేశారు. -
దందాలో వాటా ఇవ్వాల్సిందే.. టీడీపీ ఎంపీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీలోని ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా పార్లమెంట్ ప్రజాప్రతినిధికి, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఎంపీ ఎన్నికల ముందు అతి వినయం ప్రదర్శించి, నాయకులను, కార్యకర్తలను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేశారని.. ఎన్నికల్లో గెలుపొందాక ఆయన నిజస్వరూపం బయట పడుతోందని.. సొంత పార్టీ నాయకులకే చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో జరిగే అక్రమ దందాలో తనకు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య అంతరం పెరుగుతోందని వినికిడి. ఎన్నికల సమయంలో తనతో సన్నిహితంగా మెలిగిన నాయకులను సైతం పార్టీ ఆఫీసుకు వెళ్తే ఎందుకు వస్తున్నారని అక్కడి సిబ్బంది ముఖం మీదే అడుగుతుండటంతో.. ఇంతలోనే ఎంత తేడా అని వారు నిట్టూరుస్తున్నారు. ⇒ మైలవరం నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీ నేతలకు కాసులు కురిపించే కల్ప వృక్షం. ఎన్నికల ముందు వరకు ఎంపీ, ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే చాలా సఖ్యతగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. తీరా ఎన్నికలయ్యాక వాటాల విషయంలో తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీ తనకు అన్నింటిలోనూ వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం. వీటీపీఎస్‌లో బూడిదపై ఇద్దరి మధ్య షేర్ కుదిరినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ‘ఎన్నికల సమయంలో ఖర్చంతా నేనే పెట్టుకున్నానని. నీకేం సంబంధం. మిగతా వాటిలో మీకు వాటా ఇవ్వలేను. నా నియోజకవర్గ సరిహద్దులోకి రావద్దు’ అని ఎమ్మెల్యే కరాఖండిగా చెప్పడంతో వారి మధ్య అంతరం పెరిగినట్లు తెలుస్తోంది. ⇒ నందిగామ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఇరువురు నేతలు పైకి బాగా ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ రోజురోజుకు అంతరం పెరుగుతోందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని రెండు ఇసుక రీచ్‌లను ఎంపీ తన కంట్రోల్లో ఉంచుకొని, పెద్ద ఎత్తున ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు చివరకు రైతుబజార్లలో కూరగాయల సరఫరా కాంట్రాక్టుకు సంబంధించి వచ్చే మామూళ్లలో సైతం ఇద్దరికీ తేడాలు వచ్చినట్లు ఆ నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ⇒ తిరువూరులో నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ ఉప్పు, నిప్పు మాదిరి ఉన్నారు. అక్కడ అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక, మద్యం, పేకాట వంటి మామూళ్లకు సంబంధించిన విషయాల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే తనను కేర్ చేయకపోవడంతో, ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎంపీనే ఓ వర్గాన్ని రెచ్చగొట్టి, నియోజకవర్గ పెద్దలకు స్థానిక నేతలతో ఫిర్యాదులు చేయిస్తున్నట్లు, అక్కడ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ⇒ జగ్గయ్యపేటలో పాగా వేసేందుకు ఎంపీ ప్రయత్నించారు. అయితే అక్కడ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటాన్ని స్థానిక ఎమ్మెల్యే వ్యతిరేకించారు. అయినప్పటికీ ఇసుక క్వారీల విషయంలో కొన్నింటిని తన వాటాగా తీసుకున్నారు. అక్కడ పరిశ్రమలు ఉండటంతో, ఆ నియోజకవర్గంపై పట్టు పెంచుకొనేందుకు ఎంపీ ప్రయతి్నస్తుండటంతో వారి మధ్య వివాదం చెలరేగుతోంది. ⇒ విజయవాడలోని ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, ఎంపీకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాము సీనియర్లం అనే భావనలో ఎమ్మెల్యేలు ఉంటే, తన పెత్తనం సాగాల్సిందేనని రీతిలో ఎంపీ వ్యవహరిస్తున్నారు. చినబాబు అండతోనేనా? ఎన్నికల ముందు వరకు ఎంపీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలందరికీ ఆయన చుక్కలు చూపిస్తుండటంతో లోలోన వారి మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ప్రతి చిన్న విషయంలో ఎంపీ జోక్యాన్ని వారు సహించలేకపోతున్నారు. కొంత మంది టీడీపీ నేతలైతే చినబాబు అండతోనే ఎంపీ తన ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారనే భావన వ్యక్తం అవుతోంది. -
‘తిరుపతి పవిత్రత మంటగలుస్తుంటే.. పవన్ ఎక్కడ?’
తిరుపతి, సాక్షి: కూటమి ప్రభుత్వ ఏలుబడిలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రత మంటగలిసిపోతోందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలో పబ్ ను తలపించేలా నిర్వహించిన ఈవెంట్ చర్చనీయాంశమైన వేళ.. భూమన మీడియాతో మాట్లాడారు. మద్యంతో పాటు మాదకద్రవ్యాల వినియోగించారనే వార్తలు కలిచివేస్తున్నాయని అన్నారాయన. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో బుధవారం భూమన మీడియాతో మాట్లాడుతూ.. దేవదేవుడు కొలువైన తిరుపతిలో కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఇటువంటి దుష్టసంస్కృతికి బీజం పడింది. అధికార పార్టీ అండతోనే పబ్ తరహా ఈవెంట్ జరిగింది. గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న తిరుమల తిరుపతిలో పబ్ తరహా ఈవెంట్ల నిర్వహణ వెనుక అధికారపార్టీ అండదండలు ఉండటం ఆందోళనకరం.సనాతన ధర్మంను కాపాడేందుకు అవతరించిన పీఠాధిపతి పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందించాలి. డిప్యూటి సీఎం హోదాలో తిరుపతిలో ధర్మానికి జరుగుతున్న విఘాతంపై ఆయన తన దండంను బయటకు తీసి, కారకులపై చర్యలు తీసుకుంటాని ఆశిస్తున్నామని భూమన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నగరంలో మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. మద్యం దుకాణాలను ఉదయం ఏడుగంటలకు తెరుస్తూ, రాత్రి పది గంటలు దాటిన తరువాత కూడా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయాలను కూడా పాటించకుండా మద్యం దుకాణాలు, రెస్టారెంట్లను నిర్వహిస్తున్నా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చివరికి తిరుపతిలో మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిలతో నృత్యాలు, డీజే పేరుతో పాశ్చాత్యసంగీతాలతో తిరుపతి ఔచిత్యాన్నే ప్రశ్నించేలా ఘటనలు ప్రారంభమయ్యాయి అంటే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.ధర్మాన్ని కాపాడేందుకు ఉద్యమంతిరుపతి పవిత్రత కోసం ప్రజలతో కలిసి వైయస్ఆర్ సిపి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్దంగా ఉందని భూమన ప్రకటించారు. గతంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా నూతన సంవత్సరం అర్థరాత్రి జరిపే హంగామాను కూడా తిరుపతిలో జరగకుండా చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తరువాత ఆయన ఆదేశాలతోనే తిరుపతి పవిత్రతకు భంగం వాటిల్లే కార్యక్రమాలు జరుగుతుంటే, ఈ నగరాన్ని ఇక ఆ భగవంతుడే కాపాడాలి అని భూమన అన్నారు. -
కూటమి ఎమ్మెల్యే.. అక్రమ డబ్బు లెక్కలకు మిషన్లు కొన్నారట: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అనే పోటీ పెడితే ఆదిరెడ్డి వాసునే మొదటి స్థానంలో ఉంటాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాగే, ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక ఆదిరెడ్డి మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట అని వ్యాఖ్యలు చేశారు.రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యహంకార ధోరణి చూపించింది. రాజమండ్రిలో దళిత యువకుడుపై జరిగిన ఘటనపై ఢిల్లీలో ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. జనవరి మూడో వారంలో కమిషన్ ఏపీకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు.సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన బీసీ మంత్రులు మూడుసార్లు క్షమాపణ చెప్పాల్సి రావడం దారుణం. సామాజిక కార్యక్రమాలకు అన్ని పార్టీల నాయకులు హాజరుకావడం పరిపాటి. బీసీ నాయకులపై జాతి దురహంకారం చూపిస్తున్నారా?. కమ్మ గ్లోబల్ సమిట్‌లో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదు?. బీసీల పట్ల కూటమి ప్రభుత్వం అణుగదొక్కే వైఖరి అవలంబిస్తోంది.కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలో ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దందాల లిస్ట్ లెక్కలేనంత ఉంది. కోటిలింగాల ఘాట్ నుండి ఫోర్త్ బ్రిడ్జి వరకు ఉన్న 15 ర్యాంపుల్లో డ్రెడ్జింగ్ చేసి 800 లారీలు ప్రతిరోజు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మామూలు వసూలు అవుతోంది. లారీకి రూ.8500 తీసుకుంటున్నారు. స్థానిక ఈవీఎం ఎమ్మెల్యేకు రోజుకు ఈ ర్యాంపుల ద్వారా 24 లక్షలు రూపాయలు ఆదాయం వస్తోంది. ఆనంద నగర్ క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బుల కూడా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో భూకబ్జాలు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఎమ్మెల్యే వెనకాలే తిరిగే వ్యక్తులు అనేక చోట్ల భూకబ్జాలకు పాల్పడ్డారు.ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక స్థానిక ఎమ్మెల్యే మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే అతిపెద్ద స్లాటర్ హౌస్ ఉంది. రోజుకు రెండు మూడు వందల గోవులు అక్కడ హతమైపోతున్నాయి. వాటి నిర్వాహకుడు రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే. దమ్ముంటే ఇప్పుడున్న పదవులకు రాజీనామా చేసి పేపర్ బ్యాలెట్‌తో పోటీకి రండి. నేను సవాల్ విసురుతున్నాను. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద కూడా ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి అని కామెంట్స్ చేశారు. -
ధిక్కార స్వరాల అణచివేతే.. బాబు లక్ష్యమా?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది ఎప్పుడూ ద్వంద్వ వైఖరే. ప్రతిపక్షంలో ఉంటే.. పూర్తి స్వేచ్ఛ కావాలంటారు. స్వయంగా కార్యకర్తలను రెచ్చగొడతారు. కళ్లేదుటే పార్టీ కార్యకర్తలు పోలీసులపై దాడులు చేసినా కిమ్మనరు. కానీ.. అధికారంలో ఉంటే మాత్రం సీన్ రివర్స్ అయిపోతుంది. ముఖ్యమంత్రిగా తనను ఎవరూ కించిత్ మాట అనకూడదు. సోషల్ మీడియా కూడా ఏ రకమైన విమర్శ చేయకూడదు. వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారు. తండ్రి ఇలా ఉంటే.. కుమారుడు ఇంకోలా ఉండేందుకు అవకాశం లేదన్నట్లు లోకేష్ కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఐదురోజుల క్రితం వైస్సార్సీపీ రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని సంకల్పించింది. కానీ.. ఈ కార్యక్రమం కోసం సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులు, నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించేశారు. పలుచోట్ల నేతలను గృహ నిర్భంధంలో పెట్టారు. వీటిని ఎదుర్కొంటూ కొందరు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళన చేశారు. రైతులూ వీరికి మద్దతుగా నిలిచారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు పడుతున్న ఇక్కట్లు ఇన్ని,అన్నీ కావు. వరికి గిట్టుబాటు ధరలు లేవు సరికదా.. ధాన్యం కొనుగోళ్లలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా ధాన్యం వర్షానికి తడిచి మొలకెత్తి పోతూండటంతో రైతులు నిస్సహాయ స్థితిలో పడిపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం దాచుకునేందుకు కనీసం గోనె సంచులను కూడా సమకూర్చ లేకపోతోందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు తేమశాతం నెపం చెప్పి బస్తాకు రూ.200 నుంచి రూ.400లు తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.సమస్య ఎక్కడ ఉంటే అక్కడకు తాను వెళతానని బీరాలు పలికిన చంద్రబాబు రైతుల కళ్లాల వద్దకు మాత్రం వెళ్లడం లేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని చోట్ల పర్యటిస్తే రైతులు ఆయనను నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమస్యలు పెద్దగా లేవని, రైతు భరోసా కేంద్రాలు బాగా పని చేశాయని రైతులు వివరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం జగన్ తీసుకువచ్చిన వ్యవస్థలను విధ్వంసం చేసే క్రమంలో రైతు భరోసా కేంద్రాలను నీరుకారుస్తోంది. అలాగని ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో రైతులిప్పుడు మిల్లర్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ టైమ్ లో పెట్టుబడి సాయం రైతు భరోసా కింద రైతులకు రూ.13,500ల చొప్పున నిర్దిష్ట విడతలలో అందించేవారు. తాము అధికారంలోకి వస్తే రూ.20 వేలు ఇస్తామని కూటమి నేతలు ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా బాబు, పవన్ కళ్యాణ్‌లు ఎవ్వరూ దీని ఊసే ఎత్తడం లేదు. గతంలో ఉన్న ఉచిత బీమా సదుపాయం కూడా ఇప్పుడు రైతులకు లేకుండా పోయింది. తుపానుకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అంతంతమాత్రంగానే అందుతోందని చెబుతున్నారు. టమోట రైతులు కూడా రూపాయికి కిలో చొప్పున అమ్ముకోవాల్సి వస్తోంది. జగన్ పాలనలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా ధరలు గణనీయంగా పడిపోకుండా అడ్డుకోగలిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలాంటి అనేక సమస్యలపై వైసీపీ నేతలు వినతిపత్రాలు ఇవ్వబోతే వాటిని స్వీకరించడానికి ఏమి ఇబ్బంది వచ్చిందో అర్థం కాదు. పార్టీ నేతలు వైఎస్ అవినాశ్ రెడ్డి, సతీష్ రెడ్డి మల్లాది విష్ణు తదితరులను గృహ నిర్భంధం చేసినట్లు వార్తలు వచ్చాయి. అనేక పోలీస్ స్టేషన్లలో వైసీపీ కార్యకర్తలు, నేతలను నిర్భంధించారు. పలు కలెక్టరేట్ల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనినే ప్రజాస్వామ్యం అనుకోండని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. దీనినే స్వేచ్చ అని భావించాలని చెబుతున్నారు. ఈ పాటి చిన్న నిరసననే అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటే ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులలో ఉన్న అసంతృప్తి బయటపడుతోందని భయపడుతోందని అర్థం. హామీల అమలుపై నిలదీస్తారన్న ఆందోళన కావచ్చు. ఏపీలో పోలీసులు ఈ రకంగా అనేక సందర్భాలలో వైసీపీ వారిని అణచివేయాలని చూస్తున్నారు. పులివెందుల సమీపంలోని వేముల ఎమ్.ఆర్.ఓ. ఆఫీస్ వద్ద నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి టీడీపీ వారి అరాచకాలను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ వారు దాడి చేశారు. కెమెరాను ధ్వంసం చేశారు. రిపోర్టర్లపై దౌర్జన్యం చేశారు. ఇంతకాలం పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై జులుం ప్రదర్శించారు. ఇష్టారీతిన కేసులు పెట్టారు. వారిని ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు తిప్పుతున్నారు. ఇప్పుడు జర్నలిస్టులను కూడా వేధించడం ఆరంభించినట్లుగా ఉంది. చంద్రబాబు లక్షణం ఏమిటంటే తాను జర్నలిస్టులతో బాగున్నట్లు కనిపించడానికి యత్నిస్తారు. అదే టైమ్ లో తన వైఫల్యాలను రాసే జర్నలిస్టులను మాత్రం రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటారు. జగన్ టైమ్ లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పచ్చి అబద్దాలు రాసినా, అదే మీడియా స్వేచ్ఛ అని ప్రచారం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తన సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను, జర్నలిస్టులను వేధిస్తున్నారు. ఈ సందర్భంలో పలువురిపై వ్యవస్థీకృత నేరాల సెక్షన్ లను కూడా ప్రయోగించడానికి వెనుకాడడం లేదు. నిజానికి సోషల్ మీడియాకు చట్టంలోని ఆ నిబంధనలు వర్తించవు. ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. గత పదేళ్లలో ఒకటికి మించి ఛార్జిషీట్లు ఎవరిపైన అయినా ఉంటే, వాటిని మెజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకుంటే, అప్పుడు ఈ సెక్షన్లు వర్తిస్తాయని తెలిపింది. అయినా చంద్రబాబు ప్రభుత్వంలోని పోలీసులు మాత్రం చట్టంతో తమకు నిమిత్తం లేనట్లు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. కొన్నిసార్లు పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకుపోతున్నారని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరులో ప్రేమ్ కుమార్ అనే కార్యకర్తను తెల్లవారుజామున నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి భయపెట్టి తీసుకుపోయారట. దీని గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అణగదొక్కాలని చూసినా, వైసీపీ కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి పోలీసులను ఎదుర్కున్నారు. రైతులకు ఇచ్చిన హామీల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాట మాత్రంగా ప్రస్తావించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కుంటున్నది చంద్రబాబు ,పవన్ కళ్యాణ్‌ల ప్రభుత్వమేనేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘చంద్రబాబు అక్రమాలపై విచారణ జరగాలి’
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు అక్రమాలపై విచారణ చేపట్టాలని మాజీ మంత్రి కాకాని గోవర్థనరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకాని గోవర్థనరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘అక్రమాలు చేసి అడ్డంగా దొరికిన దొంగలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారు. రాజధాని భూముల నుండి స్కిల్ స్కామ్ వరకు అక్రమాలు చేశారు. సీఐడీ అధికారులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించారని వారిపై కక్ష కట్టారు. సీనియర్ ఆఫీసర్లను చంద్రబాబు వేధిస్తున్నారు. ఆయనపై కేసులు ఉన్న శాఖల్లో తన గుప్పిట్లో ఉండే ఆఫీసర్లను నియమించుకున్నారు. అప్పటి కేసులను నిర్వీర్యం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. కేసుల నుండి తప్పించుకోవటానికి ప్లాన్ వేశారుఅందుకోసమే ఢిల్లీ నుండి న్యాయవాదులను రప్పించి అధికారులకు సూచనలు ఇప్పటిస్తున్నారు. చంద్రబాబు జైలు నుండి విడుదల అయ్యే సమయంలో కోర్టుకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులపై ఛార్జిషీట్లను కూడా వేయటం లేదు. సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించినా కూడా ప్రభుత్వ న్యాయవాది వాయిదాలు కోరుతున్నారు.చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బెయిల్ షరతులను కూడా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. చంద్రబాబుకు డబ్బులు సరఫరా చేసిన పెండ్యాల శ్రీనివాసరావు అప్పట్లో అమెరికా పారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ను పిలిపించి కీలక బాధ్యతలు అప్పగించారు.స్కిల్ కేసులో పూణే, ముంబాయి, ఢిల్లీలో ఈడీ సోదాలు చేసి ఆధారాలు సేకరించింది.షెల్ కంపెనీల ద్వారా రూ.332 కోట్లు చంద్రబాబుకు చేరాయి. అధికారులు అనేక రకాలుగా అభ్యంతరాలు చెప్పినా చంద్రబాబు ఒత్తిడి చేశారు. తనకు చెందిన షెల్ కంపెనీలకు ఆ నిధులు వచ్చేలా చూసుకున్నారు.ఫైబర్ నెట్ ఫ్రాడ్‌ను కూడా అలాగే కుట్ర పూరితంగా చేశారు. వేమూరి హరికృష్ణకు కాంట్రాక్టు ఇవ్వాలని ముందుగానే నిర్ణయించారుఅమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో భారీగా భూదోపిడీ చేశారు.చంద్రబాబు, నారాయణ ఇందులో కీలక నిందితులు. కానీ ఆ కేసును మూయించటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులపై ఏపీలో విచారణ జరిగితే న్యాయం జరగదు. రాష్ట్రం బయటే ఈ కేసుల విచారణ జరగాలి’అని డిమాండ్ చేశారు. -
‘సీజ్ ద షిప్’ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్!
కాకినాడ, సాక్షి: సీజ్ ద షిప్ ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పరోక్షంగా తేల్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైప్ నేపథ్యంలో .. ఈ ఎపిసోడ్లో నెక్ట్స్ ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ‘‘ స్టెల్లా ఎల్ పనామా షిప్ లో12 శాంపిల్స్ సేకరించాం. షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకుంటే ..పరీక్షలు చేసిన తర్వాత 1,320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. ఆ బియ్యాన్ని మొదట ఆన్ లోడ్ చేస్తాం. అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలి. .. ప్రస్తుతానికి ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్సపర్టర్స్ కి చెందినది గా గుర్తించాం. వాళ్లు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. కాకినాడ పోర్టులో ఇంకా లోడ్ చేయాల్సిన బియ్యం 12వేల టన్నులు ఉన్నాయి. వాటిలో ఎక్కడా పీడీఎస్ బియ్యం లేవని నిర్ధరించుకున్న తర్వాతే లోడింగ్‌కు అనుమతిస్తాం. .. కాకినాడ యాంకేజ్ పోర్టు, డీప్సీ వాటర్ పోర్టులో కూడా మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం. ఒక్క గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకుంటాం. షిప్‌ను ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. షిప్‌ను సీజ్ చేయడం అంత సులువుగా జరిగే పని కాదు’’ అని కలెక్టర్ మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. గత నెల 29న అప్పటికే అధికారులు పట్టుకున్న రేషన్ బియ్యపు అక్రమ రవాణా షిప్ వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆ టైంలో.. తనను ఎవరూ పట్టించుకోలేదని అధికార యంత్రాంగంపైనా ఆయన చిర్రుబుర్రులాడారు కూడా.ఇదీ చదవండి: అందులో భాగంగానే తెరపైకి సీజ్ ద షిప్! -
‘లోకేష్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారా?’
గుంటూరు, సాక్షి: ఏపీలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్న పోలీసుల తీరును వైఎస్సార్సీపీ ఎండగడుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ అరెస్టులు చేస్తున్న ఖాకీలు.. వైఎస్సార్సీపీ ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి నిరసన చేపట్టారు. ‘‘మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోరా?..’’ అంటూ ఫ్లెక్సీలు చేతిలో పట్టుకుని నేతలతో కలిసి పీఎస్ మెట్ల మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయన. తమ ఫిర్యాదులపై ఎప్పుటిలోగా కేసులు నమోదు చేస్తారో? చెప్పాలంటూ పోలీసులను కోరుతూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ నేతల డిమాండ్లతో దిగొచ్చిన పోలీసులు.. ఈ నెల 21లోగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో.. వైఎస్సార్సీపీ నేతలు తమ నిరసన విరమించుకున్నారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు.. ‘‘పట్టాభిపురం పీఎస్ ఎదుట నిరసన తెలియజేశాను. జగన్ తో పాటు నా కుటుంబంపై కూడా సోషల్ మీడియాలో ద్రుష్ప్రాచారం చేయడంపై ఫిర్యాదు చేశాం. మా ఫిర్యాదులపై కూడా ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదు. పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. లోకేష్ నుండి ఆదేశాలు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. మా కార్యకర్త ప్రేమ్ కుమార్ ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మాపై కక్ష తీర్చుకోవడానికే లోకేష్ చట్టాలను ఉపయోగించుకుంటున్నారు. కానీ, చట్టం ప్రకారం పోలీసులు నడుచుకోవాలి. మా ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకపోతే మరోసారి మా నిరసన తెలియజేస్తాం. మేము చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నాం. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాపై సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకునేంత వరకూ మా పోరాటం ఆగదు. తిరిగి ఎప్పుడైనా నిరసన తెలియజేస్తాం అని హెచ్చరించారాయన. -
పింఛన్లపై ‘కూటమి’ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ హయాంలో పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఐదేళ్ల పాటు ఏ సమస్యా లేకుండా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించారన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వృద్దులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు వాలంటీర్లు అండగా నిలిచారన్నారు.‘‘చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను బ్రేక్ చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాలంటీర్లను పక్కకు తప్పించారు. ఇది పెన్షన్‌దారులకు శరాఘాతంగా మారింది. చంద్రబాబు నిర్వాకంతో 44 మంది వృద్దులు పెన్షన్ల కోసం వెళ్లి మృతిచెందారు. ఎన్నికలకు ముందు పింఛన్లను వెయ్యి పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు. ఒక చెత్తో ఇస్తున్నట్టు నటిస్తూ రెండో చేత్తో పెన్షన్లు తొలగిస్తున్నారు. 66 లక్షలకు పైగా పెన్షన్లు జగన్ హయాంలో అందించారు. ఇప్పుడు 3 లక్షలమంది పెన్షన్లను చంద్రబాబు తొలగించారు’’ అని విష్ణు మండిపడ్డారు.‘‘అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వృద్ధులు, వికలాంగుల ఆత్మగౌరవం దెబ్బ తీశారు. ఇంకా 2 లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇవ్వకపోగా అదనంగా మరో మూడు లక్షల పెన్షన్లు తొలగించటం అన్యాయం. పెన్షన్‌దారుల మీద కూడా ఇలా కుట్రలు చేయటం అవసరమా?. పార్టీలు మారితేనే పెన్షన్ ఇస్తామని టీడీపీ వారు అంటున్నారు. ఇలాంటి ధోరణి మంచిది కాదు’’ అని మల్లాది విష్ణు హితవు పలికారు‘‘వైఎస్ జగన్ హయాంలో అర్హులందరికీ పెన్షన్ అందించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో పార్టీ మారితేనే పెన్షన్లు ఇస్తామనటం సరికాదు. అలా కాదంటే పక్క జిల్లాలకు పెన్షన్‌ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయటం సబబు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలమంది పెన్షన్లు తొలగించటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
క్షమాపణలు చెప్పించిన లోకేష్.. బీసీ నేతలకు ఘోర అవమానం
సాక్షి, విజయవాడ: టీడీపీలో బీసీ నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ చేసినందుకు మంత్రి, ఎమ్మెల్యే ఘోర అవమానానికి గురయ్యారు. బీసీ మంత్రి, ఎమ్మెల్యేతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పించారు. గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పార్థసారథి, గౌతు శిరీష పాల్గొనగా, అన్ని పార్టీల నేతలతో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నుంచి మాజీమంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. విగ్రహావిష్కరణకు జోగి రమేష్ హాజరు కావడంపై పార్థసారథి, గౌతు శిరీషపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. బీసీ మంత్రి పార్థసారథి, గౌతు లచ్చన్న మనవరాలు శిరీషతో మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పించారు. లోకేష్ ఆదేశంతో పార్థసారథి, గౌతు శిరీష బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పించడంపై టీడీపీ బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడిని టార్గెట్ చేసి అవమానించిన టీడీపీ.. తాజాగా పార్థసారథి, గౌతు శిరీషలను అవమానించడంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: విజన్-2020 పోయే... స్వర్ణాంధ్ర-2047 వచ్చే ఢాం.. ఢాం.. ఢాం! -
విజన్-2020 పోయే... స్వర్ణాంధ్ర-2047 వచ్చే ఢాం.. ఢాం.. ఢాం!
ఆరు నెలల పాటు రకరకాల డైవర్షన్లతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇంకో నాలుగున్నరేళ్లు కాలం గడిపేందుకు కొత్త ఆయుధం చేతికి చిక్కింది! సూపర్‌సిక్స్ వాగ్ధానాల గురించి కాకుండా... తన ‘స్వర్ణాంధ్ర 2047’వైపునకు ప్రజల దృష్టి మరల్చేందుకు ప్లాన్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది! దీన్ని తయారు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపునకే అమలు పర్యవేక్షణ బాధ్యతలూ అప్పగిస్తారట. ఇదే బోస్టన్ గ్రూప్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అధికార వికేంద్రీకరణపై ఒక దార్శనిక పత్రం తయారు చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. అందులో భాగంగా ఏపీకి మూడు రాజధానులతో మేలని ఈ కంపెనీ తేలిస్తే అప్పట్లో తెలుగుదేశం, ఇతర రాజకీయ పక్షాలు తీవ్రంగా విమర్శించాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అంకెలంటే మహా మోజు. ఏ విషయంలోనైనా పెద్ద పెద్ద అంకెలు చెప్పి చెప్పడం ఆయనకు రివాజు. తాజా డాక్యుమెంట్లోనూ ఈ అంకెల గారడీ కనిపిస్తుంది. ‘ఈనాడు’ వంటి అనుకూల మీడియానైతే.. స్వర్ణాంధ్ర-2047తో ఆంధ్రప్రదేశ్ సమూలంగా మారిపోతోందన్న కలరింగ్ ఇచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లయిన సందర్భంగా ప్రధాని మోడీ వికసిత్ భారత్ పేరుతో నిర్దిష్ట లక్ష్యాలను నిర్ధేశించుకున్నట్లు చంద్రబాబు కూడా చేస్తే తప్పేమీ కాకపోవచ్చు కానీ.. కేవలం ప్రచారం యావతోనే, ప్రజల దృష్టిని ఏమార్చడమే ధ్యేయంగా పనిచేస్తే ఎన్ని విజన్లు రూపొందించినా ప్రయోజనం ఉండదు. 1995-2004 మధ్యకాలంలో చంద్రబాబు విజన్-202 డాక్యుమెంటే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అప్పట్లో ఆయన దక్షిణ కొరియాలో అమలు అవుతున్న ఒక డాక్యుమెంట్ తీసుకు వచ్చి, ఏపీలో కూడా అలాంటి పద్ధతులు అమలు చేస్తామని అనేవారు. ఆ తర్వాత విజన్ అన్నారు. జన్మభూమి పేరుతో ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి కొన్ని చిన్ని, చిన్న పనులు చేయించే వారు. ‘ఈనాడు’ మద్దతుతో ఆయన ఏమి చేసినా సాగిపోయింది. విజన్-2020లోనూ వివిధ శాఖలకు సంబంధించిన లక్ష్యాలు రాసుకున్నారు. కానీ అవి వాస్తవానికి, దూరంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. ఉన్న అంచనాలు కొని రెట్లు ఎక్కువ చేసి లక్ష్యాలను నిర్దేశించేలా చంద్రబాబే ఆదేశించేవారని అధికారులు చెప్పేవారు.ఇలా వాస్తవికతకు దూరంగా ఉండటంతో ఆ విజన్ డాక్యుమెంట్ ఉత్తుత్తి కార్యక్రమంగా మిగిలిపోయింది. విజన్ 2020 డాక్యుమెంట్ విడుదల చేసిన నాలుగేళ్లకు ఉమ్మడి టీడీపీ ఓటమితో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ రెండు దఫాలు అధికారంలో కొనసాగింది. 2014 నాటికి ఉమ్మడి ఏపీ కాస్తా రెండు రాష్ట్రాలుగా చీలిపోయింది. తదుపరి ఆయన విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పదేళ్లు బాబు చెప్పిన విజన్ 2020ని ఎవరూ ప్రస్తావించే వారు కారు. చంద్రబాబును ఎద్దేవ చేయాలనుకుంటే మాత్రమే దీని గురించి మాట్లాడేవారు. 2014 టరమ్‌లో 2029 నాటికి ఏపీ దేశంలోనే నంబర్ ఒన్ అవుతుందని పబ్లిసిటీ చేసేవారు. అందుకోసం ఏవేవో చేస్తున్నట్లు అనేవారు. అవేవి జరగలేదు. 2019లో టీడీపీ ఓటమి పాలైంది. ఇప్పుడు 2047 నాటికి స్వర్ణాంధ్ర అంటున్నారు. ఏ ప్రభుత్వమైనా తమ ఎజెండాల ప్రకారం పాలన చేస్తాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకుడు గుంతలు, చెరువుల బాగు చేత తదితర చిన్న ,చిన్న కార్యక్రమాలకు పరిమితమైతే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భారీ నీటిపారుదల స్కీములకు ప్రాధాన్యమిచ్చింది. ఫలితమే పులిచింతల, మల్యాల లిఫ్ట్, గుండికోట ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టులు. వై.ఎస్. చాలా దూరదృష్టితో పోలవరం ప్రాజెక్టు కింద కాల్వలు తవ్వించారు. విజన్ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో కాల్వల తవ్వకాన్ని వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కుడి కాల్వ, పట్టిసీమ లిఫ్్టల ద్వారా కృష్ణానదిలోకి నీటిని తీసుకువెళ్లి, నదుల అనుసంధానించినట్లు చెప్పుకున్నారు. తెలుగుదేశంకు చిత్తశుద్ది, ఆ డాక్యుమెంట్ లోని అంశాలపై నమ్మకం లేదూ అనేందుకు వీటిపై ఏరోజూ కనీస సమీక్షలు జరపకపోవడమే నిదర్శనం. ప్రచారం కోసం మాత్రం తన విజన్-2020 వల్లే హైదరాబాద్ అభివృద్ది అయినట్లు చెప్పుకుంటూంటారు. స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్‌లోని దశ సూత్రాలను చదివితే వాటిల్లో కొత్తేమిటి? అన్న సందేహం రాకమానదు. ‘అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం’ కాదనేది ఎవరు? కానీ ఇవన్నీ ఎలా వస్తాయి? పేదరిక నిర్మూలన వీటిల్లో ఒకటిగా చెప్పుకున్నారు. బాగానే ఉంది. కానీ ఇందుకు సంపన్నులు ముందుకు రావాలని పిలుపివ్వడం ఏమిటి? ఎంతమంది సంపన్నులు ఎందరు పేదలను ఉద్ధరిస్తారు? ఇంకో సంగతి. పూర్తిస్థాయి అక్షరాస్యతకు కూడా 2047నే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఇంకో పాతికేళ్లు ఏపీలో నిరక్షరాస్యులు ఉంటారని చెప్పడమే కదా!ఇప్పుడు విజన్ 2047 అంటున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారం చేసిన సూపర్ సిక్స్ మాటేమిటి? వాటివల్ల వెల్త్, హెల్త్, హాపీనెస్ సమకూరవని తీర్మానించేసుకున్నారా? వాటిపై శాసనసభలో ఎలాంటి వివరణ ఇవ్వకుండా కొత్తగా ఈ నినాదాలు ఇవ్వడాన్ని జనం నమ్ముతారా? సూపర్ సిక్స్ లో ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని ఇచ్చిన హామీ దశ సూత్రాలలో ఎందుకు భాగం కాలేదు? రెండో పాయింట్ ఉద్యోగ, ఉపాధి కల్పన. సూపర్ సిక్స్‌లో కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అంతవరకు నిరుద్యోగ భృతిగా నెలకు రూ.మూడు వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. కాని బడ్జెట్లో ఆ ఊసే లేదు. పైగా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారు.నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ది మూడో అంశంగా ఉన్న దశ సూత్రాల్లో స్కిల్ స్కామ్ వంటివి జరక్కుండా జాగ్రత్త పడితే బాబుకే మేలు. నీటి భద్రత, రైతులకు వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ , ఇంధన వనరులు, నాణ్యమైన ఉత్పత్తులతో అంతర్జాతీయ బ్రాండింగ్, స్వచ్ఛ ఆంధ్ర మొదలైన వాటిని ప్రస్తావించారు. వీటి ద్వారానే ఏపీ అభివృద్ది చెందితే, తలసరి ఆదాయం 3200 పౌండ్ల నుంచి 42 వేల పౌండ్లకు పెరిగితే అంతకంటే కావల్సింది ఏమి ఉంటుంది? కాని వచ్చే ఇరవై ఏళ్లలో ప్రజల ఆదాయం 14 రెట్లు, అది కూడా పౌండ్లలో పెరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అంబానీ, అదాని తదితర భారీ పెట్టుబడిదారుల ఆదాయం పెరగవచ్చు. వారికి ఏపీకి సంబంధం ఉండదు. పేదవాడి ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగుపడుతుదన్నది కీలకం.ఇదీ చదవండి: నాటి మంచికి కీడు చేయకుంటే అదే పదివేలు!ఒకవైపు జగన్ టైమ్ లో నిర్మాణం ఆరంభించిన పోర్టులను ప్రైవేటు పరం చేయాలని ఆలోచిస్తూ, ఇంకో వైపు కొత్తగా మెగా పోర్టులు ప్లాన్ చేస్తామని చంద్రబాబు అంటున్నారు. ఇలాంటి అతిశయోక్తులు చాలానే ఉన్నాయి. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని, ఇది రాసి పెట్టుకోండని చంద్రబాబు చెబుతున్నారు.అప్పటికి ఈయనకు 99 ఏళ్లు వస్తాయి. గత ముఖ్యమంత్రి జగన్ పేదలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపడితే అదంతా విధ్వంసం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఆ తర్వాత జగన్ స్కీములకు మూడు రెట్లు అదనంగా సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు.తీరా అధికారంలోకి వచ్చాక వాటికి మంగళం పాడే విధంగా ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా దాట వేస్తున్నారు.వాటికి బదులు స్వర్ణాంధ్ర 2047 అంటూ కొత్త రాగం తీస్తున్నారు.అంతేకాదు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలని చెబుతున్నారు. అవి ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియదు. ఈ నేపథ్యంలోనే ఈ స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్ ఒక డొల్ల అని జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి డాక్యుమెంట్ల పేరుతో అబద్దాలాడితే తమ దేశంలో జైలుకో, ఆస్పత్రికో పంపుతారని ఏపీకి గతంలో వచ్చిన స్విస్ మంత్రి పాస్కల్ వ్యాఖ్యలను జగన్ గుర్తు చేశారు. ఒకవైపు అప్పులు అని ప్రచారం చేస్తూ, ఇంకో వైపు కొత్త, కొత్త వాగ్దానాలు, భారీ అంచనాలతో ప్రణాళికలు, విజన్ లు తయారు చేస్తే వినడానికి బాగానే ఉంటుంది కాని, సామాన్యుడికి ఏమి ఒరుగుతుంది?ఏది ఏమైనా స్వర్ణాంధ్ర 2047 పేరుతో వస్తున్న కొత్త సినిమాతో ఇక జనం తమకు సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని సుమారు 200 వాగ్దానాలు అమలు చేయనవసరం లేదని చంద్రబాబు చెబుతారా! ఎందుకంటే ప్రజల అభిప్రాయాలను తీసుకుని దీనిని రూపొందిచామని అంటున్నారు కనుక. వారెవరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాగ్దానాల గురించి ప్రశ్నించలేదా? మొత్తం మీద సూపర్ సిక్స్ పోయే ఢాం... ఢాం.. ఢాం! కొత్త విజన్ 2047 వచ్చే ఢాం... ఢాం.. ఢాం! అన్నమాట!!- కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
శ్రీకాళహస్తిలో రెస్టారెంట్ కూల్చివేత కక్షసాధింపే
తిరుపతి మంగళం : శ్రీకాళహస్తిలో రివర్ వ్యూ రెస్టారెంట్ కూల్చివేత కూటమి ప్రభుత్వ కక్షసాధింపే అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రివర్ వ్యూ రెస్టారెంట్ కూల్చివేతను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని, అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా శ్రీకాళహస్తిని మధుసూదన్‌రెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. ఆయనపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.చంద్రబాబు బెదిరింపులకు, కేసులకు భయపడే తత్వం వైఎస్సార్సీపీ నేతలకు లేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచి్చన హామీలను పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం, వారిని జైలుకు పంపడమే పనిగా పెట్టుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన ప్రజలు గ్రహిస్తున్నారని, చంద్రబాబుకు త్వరలోనే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
కేసులపై కుతంత్రం!
చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం..! విపక్ష ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం!! ఇదీ కూటమి సర్కారు కుట్రల కుతంత్రం! ఒకపక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ మరోవైపు స్పష్టమైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నీరుగార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏకంగా పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో సమావేశమై స్కిల్‌స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడంపై మార్గనిర్దేశం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి..? ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి..? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది కూలంకషంగా ఉద్బోధించినట్లు తెలుస్తోంది.చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఓ ప్రైవేట్ న్యాయవాది ఈ సమావేశాన్ని నిర్వహించడం.. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలను సిద్ధం చేయడంపై పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. నేడు కూడా ఈ సమావేశాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకవైపు తమపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న ప్రభుత్వ పెద్దలు మరో వైపు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించే వ్యూహాన్ని రచించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నారు. ‘ముఖ్య’ నేత ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారి ఒకరు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ ఇద్దరినీ అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది!! – సాక్షి, అమరావతి -
చంద్రబాబు అవగాహనాలేమి వల్లే పోలవరం ఆలస్యం: అంబటి రాంబాబు
సాక్షి,తాడేపల్లి:చంద్రబాబు అవగాహనారాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని వైఎస్సార్సీపీ సీనియర్‌నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం(డిసెంబర్16) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నాడు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి అసలు కారణం ఎవరు. కాఫర్‌డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్‌వాల్ కడతారా? చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని ప్రధాని మోదీ అనలేదా. టీడీపీ అవినీతి చేసిందని సాక్షాత్తూ ప్రధాని మోదీ పార్లమెంట్లో అనలేదా. 2018లోనే చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తామన్నారు..అప్పుడెందుకు పూర్తి చేయలేకపోయారు?కేంద్రం రూ.12,157 కోట్లు విడుదల చేయడానికి వైఎస్సార్సీపీయే కారణం లోయర్కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేసింది మేమే. పోలవరం కీలక పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి’అని అంబటి చెప్పారు. -
నాటి మంచికి కీడు చేయకుంటే అదే పదివేలు!
కొందరు మోసపూరిత ధోరణి అనవచ్చు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మాత్రం ఇది నేర్పరితనమే. చేసిన వాగ్ధానాలతో నిమిత్తం లేకుండా ఆయన ప్రభుత్వ స్కూళ్లకే వెళ్లి విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు సుద్దులు చెప్పి తిరిగి వచ్చారు. మెగా పేరెంట్స్, టీచర్స్ కమిటీల సమావేశాలతో రికార్డు సృష్టించామని ప్రకటించుకున్నారు కూడా. సహజంగానే ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఈ గొప్పలకు గొంతు కలిపారు. తామేం చేయబోతున్నామో చెప్పి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తే బాగుంటుంది కానీ.. ప్రచారం కోసం ఉత్తుత్తి మీటింగ్‌లు పెడితే ఏం లాభం? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే కొన్ని రోజుల క్రితం ఒక్కరోజు గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించినట్లు గొప్పలు చెప్పుకున్నారు. బహుశా వీటికి పోటీగానే లోకేష్ పేరెంట్స్ మీటింగ్స్ పెట్టినట్లుంది. ఒకరికొకరు పోటాపోటీ సమావేశాలు నిర్వహించారన్నమాట!! పవన్ ,లోకేష్‌కు మధ్య సాగుతున్న ఈ అంతర్గత పోరు రాజకీయంలో చంద్రబాబు కూడా తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలోనే చెప్పుకున్న చంద్రబాబు ఈ సారి మాత్రం ప్రభుత్వ స్కూళ్ల ఉద్ధరణకు సంకల్పం చెప్పుకున్నారు. కానీ ఎన్నికల హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఊరకే సమావేశాలు పెట్టామని చెబితే వచ్చే ప్రయోజనం ఏమిటి? పైగా ఇవే సమావేశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని తప్పుడు ఆరోపణలు సైతం గుప్పించారు. బాపట్లలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్, పేరెంట్స్‌తో భేటీ అయిన చంద్రబాబు, లోకేష్‌లకు అక్కడి పరిస్థితులను చూసిన వెంటనే జగన్ ప్రభుత్వం చేసిన మంచి కనిపించి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌బోర్డులు, మంచి బల్లలు, ఫ్యాన్లు, మంచినీటి వసతి, శుభ్రమైన మరుగుదొడ్లను చూసే ఉంటారు. స్కూల్ భవనాలు బాగుపడ్డ సంగతీ అర్థమై ఉంటుంది. అప్పటికే పవన్‌కళ్యాణ్ కూడా కొన్ని స్కూళ్లలో వచ్చిన మార్పులను ప్రత్యక్షంగా గమనించి ఆశ్చర్యపోయిన విషయం సోషల్‌మీడియాలోనూ విస్తృతంగా వ్యాప్తి చెందింది. అధికారం చేపట్టిన తరువాత ఈ ఆరునెలల్లో స్కూళ్లను ఉద్ధరించేందుకు చేసిందేమీ లేకపోయినా తామూ ఏదో చేస్తున్నామని అనిపించుకునేందుకు మాత్రమే ఈ సమావేశాలను నిర్హించినట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. కర్నూలులో మంత్రి టీజీ భరత్ ఎదుట ఒక విద్యార్ధి తల్లి స్కూళ్లలో సమస్యలను వివరించిన ఉదంతమే అందుకు ఉదాహరణ అని చెప్పాలి. పారిశుద్ద్యం ఎలా కొరవడిందో, పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆమె చెబుతుంటే మంత్రి ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తమ ప్రచారం కోసం స్కూళ్లకు వెళ్లినా, వారు ఏమి తప్పు చేస్తున్నది వారికి తెలియకుండా ఉంటుందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్య, వైద్య రంగంలో చేపట్టిన సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాడునేడు పేరుతో అనేక కార్యక్రమాలు ప్లాన్ చేశారు. స్కూళ్ల రూపురేఖలను మార్చేశారు. ఇలా విద్యార్థులు, తల్లిదండ్రుల మనసుల్లో జగన్ వేసిన ముద్రను చెరిపేసేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం లేదు. జగన్ కంటే ఎక్కువ మంచి చేస్తే బాగుండేది కానీ.. ఒకపక్క ప్రభుత్వ స్కూళ్ల గురించి మాట్లాడుతూ, ఇంకోపక్క ప్రైవేటు స్కూళ్లకు ఉపయోగపడేలా వ్యవహరించడంతోనే వస్తుంది సమస్య. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో స్కూల్ తెరిచే జూన్ నెలలోనే తల్లుల ఖాతాలో రూ.15 వేల చొప్పున వేసేది. పిల్లలు స్కూళ్లు మానివేయకుండా ఉండడానికి చేసిన ఈ ప్రయత్నం జగన్‌కు పేరు తేవడంతో చంద్రబాబు అండ్ కో తాము అంతకంటే ఎక్కువ ఇస్తామని, ప్రతి విద్యార్దికి రూ.15 వేల చొప్పున వేస్తామని నమ్మబలికారు. ‘‘ఓపిక ఉంటే ఎంతమంది పిల్లలనైనా కనండి’’ అని వారి బాధ్యత తనదని బొంకిన నేత ఇప్పుడు అసలు తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇచ్చేది చెప్పడం లేదు. అమ్మ ఒడి వల్ల జగన్ విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించి ఉంటే, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు తల్లికి వందనం పేరుతో పిల్లలందరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎందుకు చెప్పారో వివరించాలి కదా? రానున్న రోజుల్లో విద్యావ్యవస్థలో పెనుమార్పులు తెస్తామని చంద్రబాబు అన్నారు. అవేమిటో చెప్పాలి కదా? జగన్ ప్రభుత్వం పిల్లలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో ఏపీ ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే వరకు వెళ్లారు. విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడమంటే ఇదే అని చంద్రబాబు చెబుతున్నారా? జగన్ టైమ్ లో పిల్లలు ఆంగ్ల మీడియంలో చదువుకుంటూ చక్కగా ఇంగ్లీష్‌లో మాట్లాడేలా ఎదిగారు. అందువల్ల విద్యా వ్యవస్థ భ్రస్టు పట్టిందని చంద్రబాబు అంటారా? అప్పట్లో ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకంగా కూటమి నేతలంతా ప్రచారం చేశారు. వారి ప్రభుత్వం రాగానే ఆంగ్ల మీడియం ను నిరుత్సాహపరచే చర్యలు చేపట్టారు. తద్వారా ప్రైవేటు స్కూళ్లకు మేలు చేయడానికి చంద్రబాబు తనదైన శైలిలో ప్రయత్నించారని అంటారు. ఇది కదా ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడం అంటే! అలాగే సీబీఎస్ఈ, ఐబి కోర్స్, టోఫెల్ వంటి విన్నూత్నమైన, ఖరీదైన కోర్సులను పేదలకు ఉచితంగా అందేలా జగన్ చేశారు. చంద్రబాబు భావనలో ఇది విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడమేమో చెప్పాలి. ప్రతి ఏటా పిల్లలకు టాబ్ లు అందచేయడం తప్పని అనుకుంటున్నారా? ఈనాడు మీడియా అప్పట్లో నీచంగా పిల్లల ట్యాబ్ లపై ప్రచారం చేసి తన ఫ్యూడల్ ధోరణిని బయటపెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం దానికి వత్తాసు పలుకుతోందేమో తెలియదు. స్కూళ్లలో పారిశుద్ద్యం, పిల్లకు భోజనం వంటి వాటిపై జగన్ ప్రభుత్వం అత్యంత శ్రద్ద వహించిందన్నది వాస్తవం.ఫైవ్ స్టార్ హెటల్ స్థాయిలో టాయిలెట్లను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించింది. ఇప్పుడు అవేమి అయిపోయాయో తెలియదు కాని, కర్నూలులో ఒక విద్యార్ధి తల్లి టాయిలెట్ల అధ్వాన్న పరిస్థితిపై వివరించడం వింటే ఎవరికైనా ఆవేదన కలుగుతుంది. జగన్ ఎన్ని సంస్కరణలు తీసుకు వచ్చినా వ్యతిరేకిస్తూ వికృతమైన కధనాలు రాసిన ఎల్లో మీడియా ఇప్పుడు విద్యా శాఖ నాలుగైదు రకాల బడులను ఏర్పాటు చేయబోతోందని చెబుతోంది. అంటే గత ప్రభుత్వ వ్యవస్థను దెబ్బ తీయడమే లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వ తీరుతో రెండు లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లిపోయారని కొన్ని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ విషయాలన్నిటిని జగన్ ప్రస్తావించి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ఆయనకు ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు.పైగా బుకాయిస్తున్నారు. ఈ జనవరి నాటికి డీఎస్సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వచ్చే జూన్ నాటికి కొత్త టీచర్లు వస్తారని చెబుతున్నారు. మంత్రి లోకేష్ ఒక మాట అన్నారు. పిల్లలంతా తన కుమారుడు దేవాన్ష్ లానే అనిపిస్తారని చెప్పారు. మంచి మాటే. కానీ దేవాన్ష్‌కు వస్తున్న చదువు స్టాండర్ట్ తను మంత్రిగా బాధ్యత వహిస్తున్న ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు తీసుకు రావడం లేదు. జగన్ పై ఉన్న ద్వేషంతో ఉన్న కోర్సులను ఎందుకు తీసివేశారు.? ప్చ్... ఏంటో బాబు గారి మాటల అర్థం?విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నాం అని చెబుతున్న లోకేష్ ఎన్నికలకు ముందు టీచర్లను ఎలా రెచ్చగొట్టింది తెలియదా? ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో పిల్లలకు నైతిక విలువల గురించి బోధిస్తామని చంద్రబాబు చెబుతున్నారు.మంచిదే! కానీ ముందుగా ప్రభుత్వానికి నైతిక విలువలు ఉండేలా ఏమి చర్యలు తీసుకుంటున్నారో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. నైతిక విలువలు నేర్పడం వరకు బాగానే ఉంటుంది. అదే సమయంలో మూఢ విశ్వాసాలు పెరిగేలా ఉపన్యాసాలు చెప్పకుండా ఉండడం కూడా అవసరమే. చాగంటి నియామకాన్ని జనవిజ్ఞాన వేదికకు చెందిన పలువురు మేధావులు తప్పు పట్టారు. ఏది ఏమైనా జగన్ తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పులను ఒక వైపు ధ్వంసం చేస్తూ, మరో వైపు మెగా సమావేశాలు అంటూ కోటి ఇరవై లక్షల మందితో జరిగాయని చెబితే పిల్లలకు వచ్చే లాభం ఏమిటి? మీటింగ్ లతో తల్లికి వందనం చేసినట్లు అయిపోతుందా? అదేదో సామెత ఉంది. ఉత్తుత్తిగానే అన్నం పెట్టాం, కూర వేశాం.. మజ్జిగ వేశాం.. అంటూ పిల్లల ఆట మాదిరిగా విద్యావ్యవస్థను మేడిపండు చందంగా మార్చకుండా ఉంటే అదే పదివేలు!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతోంది: విజయసాయిరెడ్డి
సాక్షి,ఢిల్లీ: ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతోందని, కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అసలు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం(డిసెంబర్ 16) రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆదేశసూత్రాలను ఉల్లంఘిస్తున్న టీడీపీ ప్రభుత్వం రూ.86 వేల కోట్లు దారి మళ్లించిందని ఆరోపించారు. తామెప్పుడూ నిధులను మళ్లించలేదన్నారు. అనేక స్కీమ్‌ల ద్వారా పేద ప్రజలకు నిధులు చేరవేశామని గుర్తు చేశారు.రాజ్యసభలో విజయసాయిరెడ్డి పూర్తి స్పీచ్..టీడీపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది86 వేల కోట్ల రూపాయలు దారి మళ్ళించారని తప్పుడు ఆరోపణలు చేశారుటీడీపీ లోక్‌సభ తప్పుడు ప్రచారం చేసిందిమేము ఎప్పుడు ఎక్కడ నిధులు మళ్లించలేదువిద్యా దీవెన, వసతి దీవెన, కళ్యాణమస్తు, పెన్షన్ కానుక, అమ్మ ఒడి, చేయూత, జగనన్న తోడు ద్వారా కోట్లాదిమంది ఎస్సీ ఎస్టీలు , బీసీలు ప్రయోజనం పొందారువిజయవంతంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లు అమలు చేసిందిటీడీపీ రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలను ఉల్లంఘిస్తోందిమేము ఎక్కడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదుచట్టబద్ధంగా పోలీసులు చంద్రబాబునాయుడును అరెస్టు చేశారుకోర్టు చంద్రబాబు నాయుడును రిమాండ్ చేసిందిప్రభుత్వం కేవలం కేసు ఫైల్ చేసిందికేసు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందిరాజ్యాంగ విరుద్ధం అయితే కోర్టు ఆయనను రిమాండ్ ఎందుకు పంపుతారుస్టిల్స్ స్కాంలో 370 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారుషెల్ కంపెనీల ద్వారా ఈ డబ్బును స్వాహా చేశారుప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం రైతు భరోసాను అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధంఇంగ్లీష్ మీడియంను నిషేధించారుప్రజలకు కాకుండా కేవలం బంధువుల కోసమే దీన్ని అమలు చేస్తున్నారుఎన్టీఆర్ను వెన్నుపోటుపోవడమే రాజ్యాంగ విరుద్ధంఆర్టికల్ 46 ప్రకారం అణగారిన వర్గాలకు విద్యను ప్రోత్సహించాలని ఉందిమేము అమలు చేసిన పథకాలను టీడీపీ ఆపివేసిందికులం మతం ఆధారంగా ప్రజలను తీయడమే రాజ్యాంగ విరుద్ధంఇది టీడీపీ కొనసాగిస్తుందినాటి కేసులను ఉపసంహరించుకుంటున్నారు..ఇది రాజ్యాంగ విరుద్దమేముఖ్యమంత్రి తనపై కేసులను విత్ డ్రా చేసుకుంటున్నారుఅధికారం ఉంది కదా అని కేసులను విత్ డ్రా చేసుకుంటున్నారుమహిళలపై నేరాలు పెరిగిపోతున్న పట్టించుకోవడం లేదంటే అది రాజ్యాంగ విరుద్ధమేవిజయవాడలో వరద నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది24 గంటల సమయం ఉందని వరదలు వదిలేయడంతో అనేకమంది చనిపోయారుప్రజలను కాపాడకుండా వారిని గాలికి వదిలేసారుకాగా, సోమవారం ఉదయం రాజ్యసభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో కూటమి నేతల ప్రలోభాలపై ప్రశ్నల వర్షం కురిపించారు విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీ నేతలను కుట్రపూరితంగా, ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలోకి లాక్కురని టీడీపీపై విమర్శలు చేశారు.నేడు రాజ్యసభలో ఎంపీలుగా సాన సతీష్, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా నూతన ఎంపీల ప్రమాణం నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ ప్రలోభాలపై రాజ్యసభలో ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలతోనే వైఎస్సార్సీపీకి చెందిన నేతలను టీడీపీ లాక్కుందని అన్నారు. టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఈ క్రమంలో కల్పించుకున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్.. ఈ వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని చెప్పారు. -
జనసేనలోకి మంచు మనోజ్, మౌనిక?
మంచు ఫ్యామిలీ కొట్లాటలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుందా?. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఈ పొలిటికల్ అరంగేట్రానికి ఆళ్లగడ్డ వేదిక కానున్నట్టు సమాచారం.మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనోజ్, మౌనిక దంపతులకు ఆహ్వానం వెళ్లింది. అయితే వీరిద్దరూ ఏకంగా వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం, భూమా ఘాట్ నుంచి రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తారని చర్చ నడుస్తోంది. అందులో భాగంగా తమ బలం నిరూపించుకునేందుకు ఇలా ర్యాలీగా వస్తున్నారనే సమాచారం.భూమా కుటుంబంలో ప్రస్తుతం టీడీపీ నుంచి నాగిరెడ్డి పెద్ద కూతురు అఖియప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, అఖిలప్రియతో ఉన్న కొన్ని ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక.. జనసేన వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే జనసేనలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనలో ఉంటే టికెట్ కూడా దక్కే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక, మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ గతంలోనే కీలక కామెంట్స్ చేశారు. అంతకుముందు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో మనోజ్ మాట్లాడుతూ.. మౌనిక రాజకీయాల్లోకి వెళ్లితే కచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే సమయంలో తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం తనకు ఉందన్నారు.రాజకీయాల్లో భూమా ఫ్యామిలీ.. భూమా కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నేతలు.. వారి మరణం తర్వాత భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిలప్రియ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి విజయం సాధించారు. తండ్రి నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఇద్దరు టీడీపీలో చేరగా.. కొంతకాలానికి నాగిరెడ్డి మృతి చెందారు. ఇక, భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల బాధ్యతల్ని భూమా కుటుంబమే చూసుకుంటోంది. ఇప్పుడు భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. -
ప్రజల్లో వ్యతిరేకత వల్లే ఈ దౌర్జన్యాలు
రాజమహేంద్రవరం సిటీ: సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. గడిచిన ఆర్నెలల్లో ప్రభుత్వం ఏమీచేయకపోవడంవల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అందుకే ఏకగ్రీవం పేరుతో విపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా చేశారని చెల్లుబోయిన ఆరోపించారు. విపక్ష పార్టీలకు చెందిన వారికి నో డ్యూస్ సరి్టఫికెట్లు ఇవ్వకుండా చేయడానికి వీఆర్వోలను ఎమ్మార్వో ఆఫీసుల్లో ఉంచేయడం, కొన్నచోట్ల బంధించడం, వారి దగ్గరకు వెళ్లకుండా పోలీసులను ప్రయోగించి అడ్డగించడం ద్వారా నామినేషన్లు వేయకుండా చేశారన్నారు. ఇక విజయనగరం జిల్లా ఎస్.కోటలో అయితే కూటమిలో భాగస్వామి అయిన బీజేపీకి చెందిన అభ్యరి్థనే నామినేషన్ వేయకుండా చేసి అధికార పార్టీకే కొమ్ము కాశారన్నారు. ఏమాత్రం పారదర్శకత లేకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో వ్యవహరించడం దారుణమని చెల్లుబోయిన చెప్పారు. రైతులు బాగా అసంతృప్తితో ఉన్నారు : జక్కంపూడి వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత మరొకటి చెప్పడం చంద్రబాబుకి మొదటినుంచీ అలవాటేనన్నారు. సూపర్ సిక్స్ అని చెప్పి, ఈ ఆర్నెలల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు.ముఖ్యంగా రైతులు బాగా అసంతృప్తితో ఉన్నారని.. అందుకే సాగునీటి సంఘాల ఎన్నికలను అరాచక పద్ధతిలో నిర్వహిస్తున్నారని జక్కంపూడి విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా సరే, రైతులకు ఎప్పటికప్పుడు రూ.13,500ల పెట్టుబడి సాయం అందించామని.. అయితే, కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తడంలేదని ఎద్దేవా చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజలందరూ ప్రభుత్వ అరాచకాన్ని గమనిస్తున్నారని.. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు సమయం వచ్చినపుడు బుద్ధి చెబుతారన్నారు. -
విజన్ 2047.. ఓ డొల్ల డాక్యుమెంట్: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విజన్ 2047 పేరిట ప్రజలను మభ్యపుచ్చి మాయ చేసేందుకు సీఎం చంద్రబాబు మరోసారి పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం, ప్రజల అవసరాలకు చోటే లేదని ధ్వజమెత్తారు. వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు. ఆయన దృష్టి ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్లలో మేనిఫెస్టో హామీల అమలుపై ఉండదని దుయ్యబట్టారు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడం, మాయ చేయడం మీదనే ఆయన ధ్యాసంతా ఉంటుందని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో జగన్ పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే...⇒ 1998లో కూడా చంద్రబాబు విజన్–2020 పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయం. రైతుల ఆత్మహత్యలు, ఉపాధి లేక వలసలు, ఉద్యోగాలు లేక నిరుద్యోగుల అష్టకష్టాలు.. వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రైవేటీకరణ పేరుతో విలువైన ప్రభుత్వ ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు.నాడు స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా విజన్ డాక్యుమెంట్ల పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని తమ దేశంలో జైలుకో లేకపోతే ఆస్పత్రికో పంపిస్తామని కామెంట్ చేశారు. చివరకు ప్రజలు కూడా విజన్ 2020 కాదు.. 420 అంటూ చంద్రబాబు తీరును దుయ్యబట్టారు.⇒ 2014లో కూడా చంద్రబాబు విడుదల చేసిన విజన్ 2029 డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది. తన పరిపాలనలో మొత్తం విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశాడా? ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? ఒక్క పోర్టుగానీ ఫిషింగ్ హార్బర్లుగానీ కట్టాడా? ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా? స్కూళ్లు బాగు చేశారా? ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేశారా? వ్యవసాయ రంగాన్ని బాగు చేశారా? చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? మానవ వనరుల అభివృద్ధి మీద, యువత భవిష్యత్తు మీద ఒక్క పైసా అయినా ఖర్చు చేశారా? ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. మరి ఇంకెందుకు ఈ విజన్ డాక్యుమెంట్లు?⇒ ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ సహా ఇతర హామీలకు తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్ధాలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ విజన్ 2047 పేరిట డాక్యుమెంట్ విడుదల చేయడం మరో డ్రామా, స్టంట్ కాదా? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గంగలో కలిపిన పాలకుడిని చీటర్ అంటారు. అంతేగానీ విజనరీ అంటారా?⇒ చంద్రబాబు పాలనలో, ఆయన 14 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడూ రెవెన్యూ లోటే కనిపిస్తుందన్న మాట వాస్తవం కాదా? మరి ఇంకెక్కడి సంపద సృష్టి? ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా? ఆయనకుసంపద సృష్టించే శక్తి లేదు. సమగ్ర ఆర్థిక నియంత్రణ కూడా లేదు. ఇప్పుడు విజన్ 2047 ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లు చేస్తానంటూ చంద్రబాబు చెప్పడం కట్టుకథ కాదా? ⇒ సహజంగా ఏ రాష్ట్రంలోనైనా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. ఇప్పటి నుంచి వచ్చే 10 ఏళ్లు తీసుకున్నా లేక గతంలో 10 ఏళ్ల లెక్కలు తీసుకున్నా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ద్రవ్యోల్బణం వల్ల, సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని చంద్రబాబు.. ఎప్పుడూ ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపదను ఆవిరి చేసే ఈ బాబు.. ఆ పెరుగుదల తన వల్లే అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ మోసగాడిని మాత్రమే 420 అని అంటారు.మేం ఏం చేశామో చూడండి⇒ రాష్ట్రంలోని సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతూ అసమానతలు రూపుమాపి అందరికీ సమాన అవకాశాలు కల్పించి, సుస్థిర అభివృద్ధి దిశగా వైఎస్సార్సీపీ హయాంలో అనేక చర్యలు తీసుకున్నాం. విద్యారంగంలో సీబీఎస్ఈ, ఐబీ, పిల్లలకు ట్యాబ్‌లు, వ్యవసాయంలో ఆర్బీకే వ్యవస్థ, ఈ–క్రాప్, ఫామ్‌గేట్ వద్దే మద్దతు ధరకు పంటల కొనుగోళ్లు, నాడు–నేడు ద్వారా ఆస్పత్రుల బలోపేతం, కొత్తగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌లు, ఉపాధి కల్పనా రంగంలో మైక్రోసాఫ్ట్ ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఎడెక్స్‌తో ఒప్పందం ద్వారా అత్యాధునిక కోర్సుల్లో శిక్షణ లాంటి పలు విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాం. ⇒ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాలు, కార్యక్రమాలను చంద్రబాబు నీరు గారుస్తున్నారు, రద్దు చేస్తున్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి కల్పన, సుపరిపాలనలో తీసుకున్న విప్లవాత్మక సంస్కరణలు ఎన్నింటినో దెబ్బ తీశారు. ప్రభుత్వ రంగంలో సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారు. ⇒ సమాజంలో అట్టడుగు వర్గాలకు చేయూతనిచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచి పేదరికాన్ని నిర్మూలించే దిశగా గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలన్నింటినీ తీసివేసి పేదలను మరింత పేదవాళ్లుగా చంద్రబాబు తయారు చేస్తున్నారు. మరి చంద్రబాబుకు విజన్ ఉందని ఎలా అనుకుంటారు? -
శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతల దాడి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: రణస్థలం మండలం ఎన్టీఆర్‌పురంలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు.గురయ్యపేట బీచ్‌కి వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకుడు కొమరకొమర రామును అడ్డగించి టీడీపీ నేతలు ముకుమ్మడిగా దాడి చేశారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీపై సైతం రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలు దాడికి దిగారు. దాడిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ ఉప్పాడ అప్పన్న, మత్సకార సోసైటీ ప్రెసిడెంట్ కొమర అప్పన్న, కొమర రాములు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.