breaking news
-
అయేషా మీరా కేసులో కీలక మలుపు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అయేషా కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేసును మొదటి నుంచి విచారణ చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. 2007 డిసెంబర్ 26న విజయవాడ నగరం ఇబ్రహీంపట్నంలోని దుర్గ హాస్టల్లో అయేషా మీరాపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో అయేషా మీరా తల్లితో పాటు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి.సిట్ ఇన్వెస్టిగేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు ధర్మాసనం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో శిక్ష అనుభవించిన సత్యంబాబును 2017లో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెల్సిందే. అయేషా మీరా కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసం చేసిన విజయవాడ కోర్టు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని సీబీఐకి హైకోర్టులు ఆదేశాలు జారీ చేసింది. -
జగన్నాథపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, పోడూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని 108 వాహనాల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదసమయంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. మార్టేరు నుంచి పాలకొల్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పండిత విల్లూరుకు చెందిన ఆటోడ్రైవర్ డి. వెంకటేశ్వరరావు(40), కృష్ణా జిల్లా మూలలంకకు చెందిన ఈతకోట నాగరాజు మృతిచెందినట్టుగా గుర్తించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కాటేసిన ‘కునుకు’
తెల్లవారుజామున చల్లగాలి వీస్తుండడంతో బస్సు డ్రైవర్ కునుకు తీశాడు. అంతే బస్సు ఒక్కసారిగా పక్కకు దూసు కెళ్లి బోల్తా పడింది. డ్రైవర్, మరో ప్రయాణికుడు మృతిచెందారు. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు మరోసారి తిరిగి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. దేవుడే రక్షించాడని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.సాక్షి, తిరుపతి: తిరుపతి –చంద్రగిరి 150 అడుగుల బైపాస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున తమిళనాడుకు చెందిన బస్సు బోల్తా పడింది. దీంతో ఇద్దరు మృతిచెందారు. ఎమ్మార్‌పల్లి సీఐ విజయకుమార్ కథనం మేరకు.. తమిళనాడు ఆర్టీసీ బస్సు 28 మంది ప్రయాణికులతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వేలూరు నుంచి తిరుపతికి బయలుదేరింది. 5.30 గంటల ప్రాంతంలో తిరుపతి రూరల్ పరిధిలోని పాతకాల్వ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో కునుకుతీయడంతో బస్సు పిట్టగోడ పక్క నుంచి పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటాచలపతి (48), ప్రయాణికుడు పెరుమాల్ సుందరరాజన్ (29) బస్సు కింద పడి మృతి చెందారు. సుందరరాజన్ తల్లి పెరుమాల్ సరోజ, కండక్టర్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ కనకరాజు, ఎమ్మార్‌పల్లి సీఐ విజయకుమార్, ఎస్ఐలు ఈశ్వరయ్య, తిమ్మయ్య సంఘటనా స్థలం చేరుకున్నారు. మిగతా ప్రయాణికులను వేరే బస్సు ఎక్కించి తరలించారు. హుటాహుటిన క్రేన్‌ను తెప్పించి బస్సును తొలగించారు. మృతదేహాలను బయటకు తీసి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కొడుకు పెరుమాల్ సుందరరాజన్ కంటి ముందే మృతి చెందడంతో తల్లి సరోజ కన్నీరుమున్నీరయ్యారు. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.బస్సు మరోసారి తిరిగి ఉంటే..బస్సు కల్వర్టులో పడినా అదృష్టవశాత్తు పెనుప్రమాదం తప్పింది. బస్సుబోల్తా కొట్టిన ఐదు అడుగుల దూరంలోనే హైవే లైన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. బస్సు మరోసారి పొర్లి ఉంటే పెద్దప్రమాదమే చోటు చేసుకునేది. దీనికి తోడు బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి పెద్ద మొత్తంలో లీక్ అయింది. ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఉంటే పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగి ఉండేదని పోలీసులు పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తువల్లే ప్రమాదం జరిగినట్టు తెలిపారు. బస్సు బోల్తా కొట్టిన విషయాన్ని గ్రామప్రజలు గమనించినా మానవవత్వం మరచి రక్షించే ప్రయత్నం చేయలేదు. బస్సులోని వారే కొంతమంది బయటకు దిగి మరికొంత మందిని బయటకు తీశారు. -
పోలీసులు - మావోయిస్టుల ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసులకు దారిలో మావోయిస్టులు ఎదురు కావడంతో ఇరువర్గాల మధ్య చాలాసేపు ఎదురు కాల్పులు జరిగాయి. దీనిలో చివరకు పోలీసులదే పైచేయి అయ్యింది. ఐదుగురు మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు.. భారీ మొత్తంలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం ఆ ప్రాంతంలో కూంబింగ్ కార్యకలాపాలను మరింత ఉధృతం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో కూడా ఈ సంఘటనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. -
ప్రేమను నిరాకరించిందని యువతిపై దాడి
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిదనే అక్కసుతో ఓ ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న యువతిని భాష అనే యువకుడు బ్లేడ్‌తో దాడి చేశాడు. తాడేపల్లి గూడెంలోని భాగ్యలక్ష్మిపేటలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దాడిలో గాయపడిన బాధితురాలు ప్రస్తుతం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. గత కొంతకాలంగా భాష.... ఈ యువతిని వేధిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇదే విషయంపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.