breaking news
-
క్షుద్ర పూజలు: దడపుట్టించిన నల్లకోడి, ఈకలు, జాకెట్టు
బాపట్ల: మార్టూరులో ఆదివారం ఉదయం క్షుద్ర పూజల ఆనవాళ్లు స్థానికంగా కలకలం రేకెత్తించాయి. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నేతాజీ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం ఈ క్షుద్ర పూజల ఆనవాళ్లను గమనించిన స్థానికులు విలేకరులకు సమాచారం అందించారు. అక్కడ పరిశీలించిన విలేకరులకు ప్రత్యేకంగా కుంకుమ చల్లి దానిపై మహిళకు చెందిన జాకెట్టును పెట్టి ముగ్గు వేసి అందులో నిమ్మకాయలు, సమీపంలో మల్లెపూలు ఉంచి పూజలు చేసినట్లు కనిపించింది. దీని పక్కనే చిన్న సైజు నల్లకోడి పిల్లను కాల్చి దహనం చేసినట్లుగా చిన్నచిన్న ఎముకలతోపాటు కోడి ఈకలు కనిపించటం గమనార్హం. క్షుద్ర పూజలు చేసినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లను చూసి స్థానికులు భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో నలుగురు కుటుంబ సభ్యులు కలిగిన ఓ కుటుంబానికి చెందిన ఫొటోను కుంకుమలో ఉంచి క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు ఆ సంఘటనను ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు. నేతాజీ కాలనీకి సమీపంలో జరుగుతున్న ఈ క్షుద్ర పూజల ప్రయత్నాలను అధికారులు అడ్డుకొనే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
చెరుకుపల్లి: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామానికి చెందిన మున్నం గోవర్ధనరెడ్డి, పార్వతమ్మ దంపతుల చిన్న కుమారుడు ప్రశాంత్‌రెడ్డి(18) చెరుకుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. శనివారం ఇంటర్ ఫలితాలు విడుదల కాగా, ప్రశాంత్‌రెడ్డి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. మనస్తాపానికి గురైన ప్రశాంత్ రెడ్డి... ఆదివారం ఉదయం తన తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్: ఏలూరు డీఐజీ
ఏలూరు, సాక్షి: పాస్టర్ ప్రవీణ్ పగడాల(Pastor Praveen Pagadala) మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్‌స్టాప్ పెట్టారు. మద్యం మత్తులో బైక్ నడిపి కింద పడిపోవడం వల్లే ప్రవీణ్ ప్రాణాలు పొగొట్టుకున్నారని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్(Ashok Kumar) వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాకు వివరించారు.హైదరాబాద్ నుంచి పాస్టర్ బైక్ మీద బయల్దేరారు. ఆయన ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ వివరాలు అన్నీ సేకరించాం. ఒక్క రామవరప్పాడు జంక్షన్ వద్ద సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. పాస్టర్ ఆరోజు ఎవరెవరితో మాట్లాడారో గుర్తించాం. పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా విచారించాం. ఆయన్ని హత్య చేశారని, అనుమానాస్పద మృతి అని రకరకాల ప్రచారాలు చేశారు. సోషల్ మీడియాలో అలా దుష్ర్పచారం చేసినవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం.అరోజు ప్రవీణ్ కుమార్ వస్తున్నారని కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. మార్గమధ్యలో ఆరుగురితో పాస్టర్ ప్రవీణ్ మాట్లాడారు. మూడు చోట్ల లిక్కర్ కొనుగోలు చేశారు. మద్యం, పెట్రోల్ బంకులలో యూపీఐ పేమెంట్స్ జరిపినట్లు ఆధారాలున్నాయి. మార్గం మధ్యలో ఓ పోలీస్ అధికారి ప్రవీణ్‌తో మాట్లాడారు. మద్యం సేవించడంతో డ్రైవ్ చేయొద్దని వారించారు. అయినా కూడా ఆయన వినకుండా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో మూడు చోట్ల ఆయనకు యాక్సిడెంట్లు అయ్యాయి. ప్రమాదంలో హెడ్ లైట్ డ్యామేజ్ అయ్యిది. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారు.పోస్ట్ మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో (ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్)లో ఆయన మద్యం సేవించినట్లు తేలింది. మరో వాహనంతో ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్‌పై పడింది. తలకు బలమైన గాయమై చనిపోయారని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అని ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ ప్రకటించారు.పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా, క్షుణ్ణంగా పరిశోధించామని ఆయన తెలిపారు. కంకర వల్ల బైక్ స్లిప్ అయి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరే వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టలేదని స్పష్టంగా తేలిందన్నారు. పాస్టర్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాద స్థలం వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే వివరాలు పరిశోధించి తెలుసుకున్నామని ఆయన వివరించారు. -
నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎం. రాచపల్లిలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చొక్కారాజు దేవాన్స్ (5), చొక్కారాజు విజయ్(4), రెడ్డిచెర్ల యశ్వంత్ (5) ఆడుకోవడానికి పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ అందులో ఉన్న నీటిలో పడి మృతి చెందారు. చిన్నారుల ఆచూకీ కోసం వెతుకుతుండగా కుంటలో విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ముగ్గురిని చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
బాపట్ల టౌన్ : అతడికి 64 ఏళ్లు. ఆమెకు 54. ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలున్నాయి. పెళ్లీడుకొచ్చిన సంతానం ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడినవారే. పిల్లలు ఉన్నత విద్యావంతులు. అయినా వారి వల్లమాలిన వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ పెద్దాయన తన మాట వినలేదనే ఆవేశంలో ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటన బాపట్లలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు...రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తులాబందుల లక్ష్మీనారాయణ బాపట్ల రైల్వేస్టేషన్ ఎదుట ఐఆర్సీటీసీ సెంటర్ నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన నల్లమోతు మాధవితో కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా లక్ష్మీనారాయణ భార్య అరుణాదేవి కళ్ళకు ఆపరేషన్ చేయించే నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మాధవి లక్ష్మీనారాయణను వెళ్ళటానికి వీల్లేదంటూ అడ్డగించింది. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాదేవిని పంపించాలంటూ హెచ్చరించింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో శుక్రవారం ఉదయం తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ముందు తనపై పోసుకొని ఆ తర్వాత లక్ష్మీనారాయణపై పోసి నిప్పంటించింది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఐఆర్సీటీసీ బుకింగ్ కౌంటర్ నుంచి పొగలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే మాధవి 80 శాతం, లక్ష్మీనారాయణ 60 శాతం కాలిపోయారు. వెంటనే స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాపట్ల సీనియర్ సివిల్‌జడ్జి పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇరువురినీ గుంటూరు తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/cwB2QDewFD— Kumaruuu💙 (@CalmnessSoull) April 11, 2025 -
స్నేహంతో ‘వల’.. ఆపై వేధింపుల ‘సెగ’..!
విశాఖ సిటీ: ‘నేను చేస్తున్నట్లే... నాకూ న్యూడ్ కాల్ చెయ్యాలంటే ఎంత కావాలో చెప్పు.. నమ్మకం లేకపోతే అకౌంట్ నంబర్ పెట్టు.. వెంటనే డబ్బులు పంపిస్తా’.. అంటూ ఓ గృహిణిని వేధింపులకు గురి చేసిన అనంతపురం కీచక జైలర్ సుబ్బారెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. అరెస్టుకు ప్రయత్నిస్తే, అప్పటికే నిందితుడు ముందస్తు బెయిల్ పొందాడు. ఈ ఉదంతంపై పోలీసుల వివరాల ప్రకారం, పార్వతీపురం మన్యం జిల్లాలో నివాసముంటున్న గృహిణి ఫేస్బుక్ అకౌంట్‌కు కొన్నాళ్ల క్రితం జైలర్ సుబ్బారెడ్డి నుంచి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను జైలర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్‌కు అంగీకరించడంతో, స్నేహం పేరుతో చాటింగ్ ప్రారంభించాడు. కొద్ది రోజులకు అసలు రంగును బయటపెట్టాడు. న్యూడ్ కాల్స్, అసభ్య మెసేజ్‌లతో వేధించసాగాడు. మొదట ‘సారీ’.. ఆ తరువాత ‘కుక్క’ బుద్ధి..!మహిళ భర్త, మరో బంధువు పోలీస్ శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్‌లు, వేధింపుల వ్యవహారాన్ని మహిళ బంధువైన ఏసీపీకి, ఎస్ఐగా పనిచేస్తున్న భర్తకు చెప్పింది. దీంతో వారు జైలర్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సదరు వ్యక్తి కేవలం ఫ్రెండ్షిప్ కోసమే మెస్సేజ్‌లు పంపించానని, సారీ చెప్పాడు. కొన్నాళ్లు మెస్సేజ్‌లు పంపించడం మానేశాడు. మళ్లీ గత నెల 25వ తేదీ నుంచి మెస్సేజ్‌లు, కాల్స్ చేయడం ప్రారంభించాడు. వేధింపులను భరించలేక సదరు మహిళ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సీపీ వెంటనే కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, జైలర్‌ను అరెస్టు చేయడానికి అనంతపురం వెళ్లగా.. అప్పటికే పరారయ్యాడు. విశాఖకు వచ్చి 5వ ఏడీజే (ఫ్యామిలీ) కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం విశాఖ పోలీసులను కలిసి ఆ ముందస్తు బెయిల్ పత్రాలను అందజేశాడు. శాఖాపరమైన చర్యలు..కాగా, జైలర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి నగర పోలీస్ కమిషనర్ బాగ్చి లేఖ రాశారు. అలాగే ముందస్తు బెయిల్ రద్దుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘భెల్’ ప్రశ్నాపత్రం లీక్
పెందుర్తి: విశాఖలోని పెందుర్తి సమీపంలోని జియోన్ టెక్నాలజీస్ కేంద్రంలో డబ్బులు తీసుకుని పరీక్ష జవాబు పత్రాలను లీక్ చేస్తోన్న బాగోతం శుక్రవారం వెలుగుచూసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)లో సూపర్వైజర్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల కోసం శుక్రవారం చినముషిడివాడలోని జియోన్ టెక్నాలజీస్ ఆన్లైన్ పరీక్ష నిర్వహించింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు జరిగిన ఈ పరీక్షకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 500 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో ప్రశ్నాపత్రంతోపాటు జవాబుపత్రాన్ని ముందే కొంత మంది అభ్యర్థులకు లీక్ చేశారు. ముగ్గురు (ప్రాథమికంగా తెలిసింది) అభ్యర్థులు 2 గంటలపాటు ఆన్లైన్లో రాయాల్సిన పరీక్షను 20 నిమిషాల్లో ముగించడంపై అనుమానం వచ్చిన తోటి అభ్యర్థులు వారిని నిలదీశారు. దీంతో వారి వద్ద అడ్మిట్ కార్డు వెనుక మైక్రో జెరాక్స్ ద్వారా తీసిన జవాబులు కనిపించడంతో మిగిలిన అభ్యర్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. పరీక్ష జరుగుతుండగానే నిర్వాహకులను నిలదీశారు. కాపీకి పాల్పడిన అభ్యర్థుల వద్ద జవాబు పత్రాన్ని లాక్కుని వారిని ప్రశ్నించారు. అనంతరం కేంద్రం ఎదుట నిరసనకు దిగారు. పరీక్షను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. కాగా, ఈ కేంద్రంలో జరుగుతోన్న వ్యవహారాలపై ఇది వరకే పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. మార్చి 25న ఇదే కేంద్రంలో జరిగిన ఏపీపీసీబీ ఏఈఈ పరీక్షలో నిర్వాహకులు అవినీతికి పాల్పడి కొందరు అభ్యర్థులకు పూర్తి సహకారం అందించారని రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృతం అయ్యింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థులకు బెదిరింపులు.. కాపీ వ్యవహారం బయటపడడంతో పరీక్ష నిర్వాహకులు నష్ట నివారణ చర్యలకు దిగారు. సాయంత్రం పరీక్ష ముగించుకుని బయటకు వస్తున్న అభ్యర్థులను 40 నిమిషాలు కేంద్రంలోనే నిర్బంధించారు. లోపల ఏమీ జరగలేదని చెప్పాలని బెదిరించారు. బాధిత అభ్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో తప్పనిసరి పరిస్థితిలో బయటకు పంపారు. లోపల జరిగిన విషయం బయటకు చెబితే పోలీసులతో కేసులు నమోదు చేయించి ఉద్యోగాలు రాకుండా చేస్తామని వారు బెదిరించినట్లు బాధిత అభ్యర్థులు చెబుతున్నారు. -
నరసింగాపురం పరువు హత్య కేసు.. వాట్సాప్ చాట్‌లో సంచలన విషయాలు
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరిలో సంచలనం రేపిన పరువు హత్య ఘటనలో మిస్టరీ వీడింది. చంద్రగిరి మండలం నరసింగాపురంలో నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో తల్లే నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. కూతురు నిఖిత ప్రేమ వ్యవహారం నచ్చకే ఆమె తల్లి సుజాత నిఖితను తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిఖిత తల్లి సుజాతను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.మిట్టపాళెనికి చెందిన అజయ్ అనే వ్యక్తిని 17 ఏళ్ల నిఖిత ప్రేమించింది. ఏడాది క్రితం కూతురు నిఖిత గర్భం దాల్చడంతో కడుపులోని బిడ్డను డెలివరీ చేసి మరి తల్లి సుజాత హత్య చేసినట్లు సమాచారం. నిఖిత తల్లిదండ్రులు పిర్యాదుతో అజయ్‌పై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలుకు పంపారు. నాలుగు నెలల పాటు జైలులో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది.బెయిల్ బయటకు వచ్చిన అజయ్‌ను మళ్లీ కలిసిన నిఖితపై కోప్పడిన తల్లి సుజాత.. గత శుక్రవారం నిద్రిస్తున్న కూతురిని చంపి గంటల వ్యవధిలో మృతదేహాన్ని కాల్చివేసింది. సాధారణ మరణంగా బంధువులను సుజాత నమ్మించింది. ఈ కేసులో సుజాతకు సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో వాట్సాప్ చాట్ ద్వారా నిజాలు వెలుగు చూశాయి. తనకు విషం పెట్టి చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ప్రియుడు అజయ్‌కు నిఖిత తెలిపింది. మా అత్త, అమ్మ, తాతయ్య విషం పెట్టీ చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ నిఖిత పేర్కొంది. వాట్సాప్ చాట్.. పోలీసులకు కీలక ఆధారంగా మారింది. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి!
విడవలూరు: వరకట్నం కోసం వేధించడంతో కల్లాపిరంగు పొడిని నీటిలో కలిపి తాగి వివాహిత మృతిచెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. బోగోలు మండలం తాటిచెట్లపాళెం గ్రామానికి చెందిన బచ్చింగారి సుగుణ (23)కు విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి చెందిన హరికృష్ణతో 2021లో వివాహమైంది.వారికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన ఏడాది తర్వాత అదనపు కట్నంగా రూ.7 లక్షలు తీసుకురావాలని భర్తతోపాటు, అత్త నర్సమ్మ, మామ నాగూరు, ఆడపడుచు నాగలక్ష్మి కలిసి సుగుణను వేధించడం మొదలుపెట్టారు. ఇవి బుధవారం తారస్థాయికి చేరాయి. మనస్తాపంతో సుగుణ ఇంటి ముందు చల్లే కల్లాపిరంగు పొడిని నీళ్లలో కలిపి తాగింది. సాయంత్రం వరకు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇరుగుపొరుగున్న బంధువులు ఇది గుర్తించి ఈ సమాచారాన్ని సుగుణ తల్లి అన్నమ్మకు తెలిపారు.వారు వెంటనే పెద్దపాళెం గ్రామానికి చేరుకుని సుగుణను రాజుపాళెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన కుమార్తె మరణంపై అనుమానం ఉందంటూ హరికృష్ణతోపాటు, అత్త నర్సమ్మ, మామ నాగూరు, ఆడపడుచు నాగలక్షి్మలపై అన్నమ్మ గురువారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో గ్రామంలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో హరికృష్ణ, అతని తండ్రి నాగూరు కూడా ఉన్నారు. వీరు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నారని, కట్నం కోసం సుగుణను వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని గ్రామంలో ప్రచారం జరుగుతోంది. -
జనసేన జోగినేని మణి అరాచకం.. మహిళతో అనుచిత ప్రవర్తన
సాక్షి, వైఎస్సార్: ఏపీలో జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున ఓ మహిళను కాళ్లతో తన్ని.. తనకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, సదరు బాధితురాలు.. మణి వల్ల తమకు ప్రాణహని ఉందని పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం.. పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లి పీఎస్‌లో కేసు పెట్టిన జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున మణి.. అదే మండలం చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మహిళ రాజేశ్వరిని కాళ్లతో తన్ని దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం, పత్తి రాజేశ్వరిపై దాడి చేశాడు. ఈ సందర్భంగా మణి.. తనకు పవన్ కల్యాణ్, హోం మంత్రి అందరూ తెలుసు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ చులకన చేసి మాట్లాడాడు. దీంతో, మణి వల్ల తనకు ప్రాణహాని ఉంది బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇక, జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్‌గా జోగినేని మణి కొనసాగుతున్నాడు. అంతకుముందు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శించాడంటూ పోసాని కృష్ణమురళిపై మణి కేసు పెట్టిన విషయం తెలిసిందే. అతని ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆఘమేఘాలపై పోసానిని అరెస్టు చేశారు పోలీసులు. తాజగా మణి అరాచకాలను బాధితురాలు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
ఫైనాన్స్ దా‘రుణం’.. ఇల్లాలు బలవన్మరణం
భట్టిప్రోలు (కొల్లూరు): ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ఆగడాలు మితిమీరి ఇంటిపైకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడటంతో అవమాన భారం భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో బాణావత్ గోవింద్‌నాయక్ భార్య పార్వతిబాయ్ (44)తో కలసి నివసిస్తున్నాడు. వీరు అమాయకులు. పెద్దగా చదువు రాదు. గతేడాది వీరు 5 స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో ఇంటి పత్రాలు తనఖా పెట్టి రూ.4 లక్షలు రుణం తీసుకున్నారు. రుణం మంజూరు చేసే సమయంలో రూ.లక్ష చార్జీలంటూ వసూలు చేసి, రూ.3 లక్షలు అందజేశారు. అప్పట్నుంచి లోన్ నగదు చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొంత కాలం తర్వాత తమ ఇంటిని ఫైనాన్స్ సంస్థ వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలియడంతో నెలవారీ కిస్తీలు కట్టడం ఆపేసి.. ఆ విషయం తేల్చాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట సంస్థ ప్రతినిధులు పార్వతీబాయ్ ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యం చేయడంతోపాటు, దుర్భాషలాడారు. దీంతో వారు భట్టిప్రోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంగళవారం సాయంత్రం ప్రైవేటు పైనాన్స్ సంస్థకు చెందిన వ్యక్తులు పార్వతిబాయ్ ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. సామగ్రి బయటకు విసిరేశారు. వంట పాత్రలతో ఆమెపై దాడికి తెగబడ్డారు. కేసు వాపసు తీసుకోవాలంటూ తీవ్రంగా హెచ్చరించి వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన పార్వతీబాయ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు తలుపులు తీసి.. ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిరుద్యోగులను నిండా ముంచేసింది. ఎల్‌టీడబ్ల్యూ ఐటీ బీపీఓ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో సుమారు 150 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గత పది నెలలు నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం ముప్పు తిప్పలు పెడుతోంది. జీతాలు అడిగితే దుర్భాషలాడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిబంధనలు పాటించకుండా పీఎఫ్‌లు కూడా చెల్లించని సాప్ట్ వేర్ కంపెనీ.. ఫేక్ ఇన్వాయిస్లు ఆఫర్ లెటర్స్‌తో మోసానికి పాల్పడింది. యాజమాన్యం ఆఫీస్ వదిలి వెళ్లిపోతున్నారని తెలుసుకున్న ఉద్యోగులు కార్యాలయాన్ని ముట్టడించారు. తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. -
నాలుగు రోజుల్లో నిశ్చితార్థం.. కార్యదర్శి అనుమానాస్పద మృతి
సాక్షి, నిడదవోలు: నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వార్డు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నెల్లి కరుణ (25) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో నాలుగైదు రోజుల్లో నిశ్చితార్థం.. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా ఆమె ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ ఘటనపై నిడదవోలు రూరల్ ఎస్సై కె.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నెల్లి వెంకట రమణ, సూర్యకుమారి దంపతులకు ఏకైక కుమార్తె కరుణ. ఆమె వార్డు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులను ముగించుకుని కోరుమామిడి గ్రామంలోని ఇంటికి వెళ్లింది. అనంతరం బంధువులతో కలిసి చర్చిలో ప్రార్థన చేసింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపునొప్పి, కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో వెంటనే కారులో నిడదవోలులో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి సూర్యకుమారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అప్పటి వరకు సరదాగా ఉండి.. కరుణ ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతిచెందారన్న నిజాన్ని తోటి ఉద్యోగులు నమ్మలేక సామాజిక ఆసుపత్రి వద్ద కన్నీరు పెట్టుకున్నారు. ఆమె స్వగ్రామం కోరుమామిడిలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా ఉండేదని అధికారులు అంటున్నారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు సమీప బంధువుతో వివాహం నిశ్చయమైంది. మరో నలుగైదు రోజుల్లో నిశ్చితార్థం, మే నెలలో వివాహం జరగాల్సి ఉంది. అటువంటి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
పొలం ఆన్లైన్ చేయాలంటే పక్కలోకి రమ్మంటున్నారు
కోడుమూరు రూరల్: కోర్టులో న్యాయ పోరాటం చేసి సాధించుకున్న నాలుగెకరాల భూమిని రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం జరిగింది. కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన చాకలి పెద్ద సవారన్నకు ఇద్దరు భార్యలు. రెండో భార్య రాములమ్మ కుమార్తె హైమావతికి, మొదటి భార్య సంతానం మధ్య భూముల పంపకంలో వివాదం ఏర్పడి 2011లో కోర్ట్ ను ఆశ్రయించారు. ఏడాది కిందట ఆస్తిలో సగభాగమైన 4ఎకరాల భూమి హైమావతికి చెందుతుందంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.కోర్టు తీర్పు మేరకు తండ్రి నుంచి తనకు సంక్రమించిన 94, 95, 116 సర్వే నంబర్లలోని నాలుగెకరాల భూమిని తన పేరిట ఆన్లైన్ చేయాలంటూ హైమావతి కోడుమూరు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకుంది.రెవెన్యూ అధికారులు రూ.లక్ష లంచం అడగ్గా.. ఆ మొత్తం ఇచ్చానని.. డబ్బు తీసుకోవడంతో పాటు తమ పక్కలోకి వస్తేనే సదరు భూమిని ఆన్లైన్ చేస్తామని వీఆర్వోలు వేధిస్తున్నారని..రెవెన్యూ అధికారుల వేధింపుల వల్ల తనకు చావే శరణ్యమంటూ మంగళవారం తహసీల్దార్ వెంకటేష్ నాయక్ ఎదుట ఫినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తహసీల్దార్ ఆమె చేతిలోని ఫినాయిల్ డబ్బాను లాక్కుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: తహసీల్దార్ ఈ ఘటనపై తహసీల్దార్ వెంకటేష్ నాయక్ వివరణ ఇస్తూ.. కోర్టు తీర్పు హైమావతికి అనుకూలంగా వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అయితే సదరు భూమి ప్రభుత్వ భూములకు కేటాయించే 20001901 (రెండు కోట్ల) ఖాతాలో ఉన్నందున హైమావతి పేరును ఆన్లైన్ అడంగల్‌లో నమోదు చేయడం సాధ్యం కాదన్నారు. కోడుమూరు, పులకుర్తి వీఆర్వోలపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
క్రికెట్ బెట్టింగ్.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
కాకినాడ: క్రికెట్ బెట్టింగ్‌లో సొమ్ము కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కోలనాటి రమణబాబు (33) ఆత్మహత్య చేసుకున్నాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవా రం అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి గ్రామానికి రమణబాబు వర్క్ ఫ్రం హోంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నెలవారీ వస్తున్న జీతం ఇంటికి ఇవ్వకుండా బెట్టింగ్‌కి అలవాటు పడి సొమ్ము పోగొట్టుకున్నాడు. అప్పుల బాధతో నర్సీపట్నం– రేగు పాలెం మధ్యలో రైలు పట్టాల పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
మాజీ ప్రియురాలిపై రౌడీ షీటర్ లడ్డూ దాడి
తెనాలి: స్థానిక అయితానగర్‌కు చెందిన రౌడీ షీటర్ లడ్డూ, గతంలో తనకు సన్నిహితంగా ఉన్న మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపెట్టగా రిమాండ్‌కు ఆదేశించారు. సముద్రాల పవన్‌కుమార్ అలియాస్ లడ్డూ.. పట్టణంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ఎన్నారైపై దాడి చేశాడు. దీంతో పోలీసులు అతడిని పట్టణ బహిష్కరణ చేశారు. తెనాలి రావొద్దని ఆదేశించారు.అయినా రహస్యంగా పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నాడు. గత అక్టోబరులో బహిరంగంగానే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆ సంబరానికి కూటమి నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత మూడురోజులకే అంటే అదే నెల 28వ తేదీ రాత్రి డెకరేషన్ పనులు చేస్తుండే నాజరుపేటకు చెందిన కాకుమాను ఇంద్రజిత్ అనే వ్యక్తిపై అయితానగర్ సెంటర్లోనే లడ్డూ దాడిచేశాడు. వర్కర్‌ను స్కూటర్‌పై ఇంటిదగ్గర దించి తిరిగి వెళుతున్న ఇంద్రజిత్‌పై అకారణంగా లడ్డూ దాడిచేశాడు. అతడి స్కూటర్ తీసుకెళ్లి తగులబెట్టాడు. కూటమి నేతలతో ఉన్న బంధం కారణంగానే లడ్డూ ఇంతకు తెగించాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు వార్తల్లొకొచ్చాడు. దూరంగా ఉంచిందని.. తెనాలి సమీపంలో ఓ గ్రామానికి చెందిన ఓ మహిళతో లడ్డూకు పాత పరిచయం ఉంది. ఆమె విజయవాడలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కొంతకాలంగా ఆమె లడ్డూను దూరంగా ఉంచింది. ఆగ్రహం చెందిన లడ్డూ శనివారం తనకోసం విజయవాడ వెళ్లి, తనతో గొడవ పెట్టుకున్నాడు. ఆమెను అనుసరించి తెనాలి వచ్చి, తర్వాత ఆమె నివసించే గ్రామానికి వెళ్లాడు. ఆమెను ఊరి వెలుపలికి రమ్మని బెదిరించాడు. తన దగ్గరకు వచ్చిన మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఫిర్యాదుతో రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తర్వాత అరెస్టుచేసి, స్థానిక ప్రైవేటు వైద్యశాలలో పరీక్షలు చేయించారు. ఆదివారం రాత్రి మేజి్రస్టేటు ముందు హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు.రూరల్ ఎస్ఐ ప్రతాప్‌కుమార్ కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): మూడేళ్ల చిన్నారిపై తల్లి పైశాచికంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విజయవాడ పరిధిలోని జక్కంపూడి కాలనీలో నివసించే వందనకు (23) అమ్ములు అనే మూడేళ్ల పాప ఉంది. కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో వందన, శ్రీరాములు హైదరాబాద్‌కు మకాం మార్చారు. తమ ఆనందానికి పాప అడ్డుగా ఉందని భావించిన వారు.. ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. వంటిపై, వీపుపై ఇష్టానుసారంగా వాతలు పెట్టడంతో ఆ చిన్నారి కేకలు వేసేది. కేకలు బయటకు రాకుండా నోరు మూసి ఈ అకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విజయవాడ వచ్చిన వందన, శ్రీరాములు పాపను రైల్వే స్టేషన్లో వదిలేశారు. విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి సుమలత రైల్వేస్టేషన్‌కు వెళ్లి అమ్ములును ఇంటికి తీసుకొచ్చింది. కాగా, ఈ అకృత్యాలు తెలుసుకున్న స్థానికులు విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
Visakha: ఎట్టకేలకు టీడీపీ మహిళా నేతపై కేసు నమోదు
విశాఖ: ఓ వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో విశాఖ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి గత నెలలో దాడి చేస్తే.. ఇప్పటికి కేసు నమోదైంది. గత నెలలో సర్వసిద్ధి అనంతలక్ష్మి.. ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టింది. అది కూడా పోలీస్ స్టేషన్ లో ఆ వ్యక్తి ఉండగా దాడికి దిగింది టీడీపీ మహిళా నేత అనంతలక్ష్మి. అనకాపల్లికి చెందిన కొత్తూరు నరేంద్రను గాజువాక పోలీస్ స్టేషన్ లో నే చెప్పుతో కొట్టింది. అంతే కాదు.. తనపై కేసు పెడితే బదిలీ చేయిస్తానని అనంతలక్ష్మి బెదిరించింది. అధికారంలో ఉన్నామనే గర్వంతో పోలీసుల్నే భయపెట్టింది. ఇది జరిగి సుమారు నెల అయ్యింది. అయితే దీనిపై ఎట్టకేలకు కేసు నమోదైంది. బీఎన్ఎస్ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు గాజువాక సీఐ పార్థసారధి. ఇంత ఆలస్యం ఎందుకో..?అయితే టీడీపీ నేత కాబట్టి కేసు నమోదు చేయడానికి పోలీసులు అలక్ష్యం ప్రదర్శించారు. కేసును ఏదో రకంగా పక్కదారి పట్టించే యత్నం చేశారు. కాకపోతే అనంతలక్ష్మిపై కేసు ఏమైందని పలువురు పదే పదే ప్రశ్నించడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదైతే చేశారు కానీ, దాన్ని ఎంతవరకూ ముందుకు తీసుకెళతారో అనేది చూడాలి. కాలయాపన చేసి కేసును మాయం చేస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. అదే ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతల విషయానికి వచ్చే సరికి కళ్లముందు తప్పుకనిపిస్తున్నా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు.. ఆ నేతలు ఏం చేస్తున్నా చూస్తూ మిన్నుకుండిపోతున్నారు. అనంతలక్ష్మిపై కేసు నమోదు చేయడానికి సుమారు నెల రోజులు సమయం తీసుకోవడమే ఇందుకు ఉదాహరణ. కేసు అయితే పెట్టాం కదా అని చెప్పుకోవడానికే ఈ తతంగం నడుపుతున్నారా.. లేక నిజంగానే ఆమెపై చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. -
షాక్ ఇచ్చిన పోలీసులు.. పెళ్లయిన ఏడాదికి భర్తపై పోక్సో కేసు
బి.కొత్తకోట: పెళ్లయి ఏడాది గడిచి, పాప పుట్టిన తర్వాత మైనర్ బాలికను వివాహం చేశారని గుర్తించి కర్ణాటక రాష్ట్రం బట్లపల్లిలో కేసు నమోదు చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ జీవన్ గంగనాథ్‌బాబు వివరాల మేరకు.. కర్ణాటకలోని బట్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబులాపురానికి చెందిన లలితకు తల్లిదండ్రులు లేరు. ఏడాది కిందట 17 ఏళ్ల వయసులో బి.కొత్తకోట మండలం గుడిపల్లికి చెందిన మల్లి కార్జున(35)ను వివాహం చేసుకుంది.లలిత గర్భం దాల్చడంతో కర్ణాటక రాష్ట్రం చింతామణి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లింది. అక్కడి వైద్యులు వయస్సు ఆరా తీసి బట్లపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బి.కొత్తకోట మండలంలో వారు ఉండడంతో ఆ స్టేషన్‌కు బదిలీ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో లలిత భర్త మల్లికార్జునపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
గుణదల(విజయవాడ తూర్పు): యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్రీస్తురాజపురం ఫిల్మ్ కాలనీకి చెందిన మచ్చా సరస్వతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. భర్త చైతన్య ఆయుర్వేద వైద్యుడు వీరికి ఒక పాప, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇంటిని, చిన్న పిల్లలను చూసుకునే నిమిత్తం సరస్వతి తన అక్క కుమార్తె బల్లం శరణ్య(19)ను ఇంట్లో ఉండాల్సిందిగా కోరి తీసుకువచ్చింది. కడప జిల్లా బద్వేలుకు చెందిన శరణ్య గత మూడు నెలలుగా విజయవాడలో పిన్ని ఇంట్లో ఉంటోంది. సరస్వతి ప్రతి రోజు విధులకు మధ్యాహ్నం రెండు గంటలకు ఆసుపత్రికి వెళ్లి రాత్రి 8 గంటలకు తిరిగి వస్తుంది. శుక్రవారం యథావిధిగా ఆసుపత్రికి వెళ్లిన సరస్వతి సాయంత్రం 5 గంటల సమయంలో శరణ్యకు ఫోన్ చేసి పిల్లల గురించి అడిగే ప్రయత్నం చేసింది. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా శరణ్య ఫోన్‌కు స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి త్వరగా ఇంటి వద్దకు చేరుకుంది. ఎంత ప్రయత్నించినా తలుపు తెరవకపోవడంతో చుట్టుపక్కల వాళ్ల సహాయం కోరింది. స్థానికులు వెనుక గుమ్మం తలుపులు తీసి లోనికి ప్రవేశించగా శరణ్య ఉరికి వేలాడుతూ కని్పంచింది. సరస్వతి 108 సహాయంతో శరణ్యను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మాచవరం పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే... శరణ్య ఉరివేసుకుని చనిపోలేదని, ఆమెను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శరణ్య కుటుంబానికి, సరస్వతి కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా ఆర్థికపరమైన గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. ఉరికి వేలాడుతున్న శరణ్య పాదాలు మంచానికి తాకుతున్నాయని, అలా చనిపోయే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. సన్నని వైర్లను గొంతుకు బిగించి ఆమెను హత్య చేశారని సరస్వతి, చైతన్యలే శరణ్య మృతికి కారణమని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. -
పట్టపగలు యువతికి కత్తిపోట్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పట్టపగలు ఇంటికెళ్లి యువతిపై ఒక దుండగుడు దాడిచేసి కత్తితో పొడిచిన ఘటన విజయనగరం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. గరివిడి మండలంలోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, 18 ఏళ్ల యువతికి నానమ్మ, తల్లిదండ్రులు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత రెండేళ్లుగా ఇంటివద్దే ఉంటోంది. ఉదయం 9:30 గంటల సమయంలో ఇంటి వద్ద వంట పాత్రలు శుభ్రం చేస్తున్న యువతిపై ఓ యువకుడు ముసుగు (మంకీ క్యాప్) ధరించి వచ్చి దాడి చేశాడు. కత్తితో కడుపు పక్క భాగంలో రెండుచోట్ల పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు పరారయ్యాడు. ఇంటికి ఎదురుగానే ఉంటున్న బూర్లె ఆదినారాయణ అనే యువకుడే ఈ దాడికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దిరోజులుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఇందుకు కారణం. పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్న నలుగురు యువకుల్లో ఆదినారాయణ కూడాఉన్నట్లు తెలిసింది. దెబ్బతిన్న కాలేయం, ఊపిరితిత్తులు తీవ్ర రక్తస్రావంతో ఘటన జరిగిన వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని స్థానికులు 108 వాహనంలో తొలుత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దాడిలో కాలేయం భాగం దెబ్బతిన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లోనూ రక్తస్రావం కావడంతో ఊపిరి తీసుకోవడానికి యువతి ఇబ్బందిపడుతోంది.బాధితురాలికి వైఎస్సార్సీపీ అండబాధితురాలికి అండగా ఉండాలన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్యలత ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైద్య ఖర్చుల నిమిత్తం పార్టీ తరఫున యువతి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అండగా ఉంటామని చెప్పారు. -
వైఎస్సార్సీపీ నాయకుడు ప్రతాపరెడ్డిపై హత్యాయత్నం
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇందూరు ప్రతాపరెడ్డిపై ఆయన సొంత గ్రామం గోవిందపల్లెలో శనివారం హత్యాయత్నం జరిగింది. ప్రతి శనివారం తన ఇంటి సమీపంలోని దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించడం ప్రతాపరెడ్డికి ఆనవాయితీ. ఇది గమనించిన టీడీపీ మూకలు ఉదయం నుంచి దేవాలయం సమీపంలో కాపుకాసారు. ప్రతాపరెడ్డి దేవాలయంలో పూజ చేస్తుండగా వెనక వైపు నుంచి కత్తులు, గొడ్డళ్లతో నరికారు.అక్కడే ఉన్న ప్రతాపరెడ్డి మనువరాలుసహా సమీపంలో ఉన్న వారు భయంతో పరుగులు తీయగా ప్రతాపరెడ్డి దేవాలయంలోనే కుప్పకూలి పోయారు. దీంతో ఆయన మృతిచెందారని భావించిన దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుటుంబీకులు పరుగున అక్కడకు వచ్చి గ్రామస్థుల సహాయంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆయనను నంద్యాల వైద్యశాలకు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఘటనలో ఇద్దరు పాల్గొన్నట్లు నిర్ధారణ అవుతోందని పేర్కొన్నారు. వారిలో ఒకరు గ్రామానికి చెందిన రవిచంద్రారెడ్డి కాగా మరొకరు కొత్త వ్యక్తిగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. గతంలో జరిగిన జంట హత్యల కేసులో రవిచంద్రారెడ్డి ప్రధాన నిందితుడు కాగా.. ఈ కేసులో ప్రతాపరెడ్డి ప్రధాన సాక్షిగా ఉన్నారన్నారు. ఈ కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో ప్రతాపరెడ్డిని హతమార్చేందుకు యత్నించినట్లు కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. నాడు ప్రతాపరెడ్డి అన్న ప్రభాకర్‌రెడ్డి హత్య గత టీడీపీ ప్రభుత్వంలో అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో ఆధిపత్యం కోసం 2017 మే 6వ తేదీన వైఎస్సార్సీపీ నాయకుడు ప్రతాపరెడ్డి అన్న ఇందూరు ప్రభాకర్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. టీడీపీ నాయకులు నిందితులుగా ఉన్న ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన సాక్షి ప్రతాపరెడ్డి. రాజీకి రావాలని ప్రయత్నించినప్పటికీ ఒప్పుకోకపోవడంతో ఆయనను కూడా అంతమొందిస్తే, సాక్ష్యంతో పాటు గ్రామంలో ఆదిపత్యం చెలాయించవచ్చని భావించే హత్య చేసేందుకు యత్నించినట్లు గ్రామంలో చర్చించుకుంటున్నారు. కాగా,హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉండటంతో ప్రతాపరెడ్డికి ప్రాణహాని ఉంటుందని భావించిన గత ప్రభుత్వం, పోలీస్ శాఖ గన్‌మెన్‌ను కేటాయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గన్‌మెన్‌ను తొలగించింది. -
రాజమండ్రి నాగాంజలి కేసు.. ఎన్నో అనుమానాలు?
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బొల్లినేని కిమ్స్‌లో మృతి చెందిన ఫార్మసిస్ట్ నాగాంజలి కేసులో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకుందన్న సమయంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఏం జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు. ఈ సమయంలో నాగాంజలికి ఏం జరిగిందో వాస్తవాలు వెల్లడికాలేదు. సాయంత్రం 6:30 నుండి 8:30 మధ్యలో నాగాంజలికి ఎలాంటి చికిత్స జరిగింది?. ట్రీట్మెంట్ ఎవరిచ్చారు?. వార్డు నెంబర్ 802లో నాగాంజలికి అనస్థీషియా ఇంజెక్షన్ ఎవరు చేశారో? ఇప్పటివరకు స్పష్టం కాలేదు.బాధితురాలు తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. ఆ రూమ్‌లో సీసీ ఫుటేజ్ ఏమైనట్టు?. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే దీపక్‌తో పాటు ఎవరెవరు ఈ దారుణానికి సహకరించారో బయటపడే అవకాశం ఉంది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం 6:30కు అంజలి ఫోన్‌తో దీపక్ క్యాజువాలిటీకి ఎందుకు వచ్చాడు?. ఆసుపత్రి యాజమాన్యం సకాలంలో ట్రీట్మెంట్ చేస్తే అంజలి బతికేదా?. నాగాంజలిది ఆత్మహత్యా? లేక హత్యా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.కాగా, మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి నిన్న(శుక్రవారం) ఉదయం తుది శ్వాస విడిచింది. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది. -
మరో పదిహేను రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. అంతలోనే విషాదం
గండేపల్లి/జగ్గంపేట(కాకినాడ): మరో పదిహేను రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. ఈ నేపథ్యంలో కొత్త దుస్తులు కొనుక్కుని.. ఎంతో ఆనందంగా తిరిగి వస్తున్న ఆ యువకుడిపై మృత్యువు కన్నెర్ర చేసింది. లారీ రూపంలో దూసుకువచ్చి, అతడి ఆయువు హరించేసింది. పెళ్లి చేసుకుని, కొడుకు, కోడలు చిలకాగోరింకల్లా తమ కళ్ల ముందు తిరుగుతూంటే చూసి మురిసిపోవాలనుకున్న కలలు కల్లలు కావడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతేలేకుండా పోయింది. ఈ విషాద ఘటన వివరాలివీ.. గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన చిక్కాల కాటమస్వామి, సావిత్రి దంపతులకు కుమార్తె, కుమారుడు చిక్కాల శ్రీను (28) ఉన్నారు. కుమార్తెకు గతంలోనే వివాహం చేశారు. శ్రీను ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తండ్రి కాటమ స్వామి వ్యవసాయం చేస్తున్నారు. శ్రీనుకు గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన అమ్మాయితో ఈ నెల 20న వివాహం చేయాలని నిశ్చయించారు. శనివారం శ్రీను పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు, పెళ్లి వేడుకలకు అవసరమైన దుస్తులు కొనుగోలు చేసేందుకు స్నేహితుడితో కలిసి, శ్రీను శుక్రవారం మోటార్ సైకిల్‌పై పెద్దాపురం వెళ్లాడు. అక్కడ మిత్రులిద్దరూ కొత్త దుస్తులు కొనుకున్నారు. సాయంత్రం ఆనందంగా ఇంటికి తిరిగి వస్తూండగా, వారి బైక్‌ను జగ్గంపేట మండలం కాట్రావులపల్లి పెట్రోల్ బంకు వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీను (28) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మోటార్ సైకిల్‌పై ఉన్న స్నేహితుడు స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై జగ్గంపేట ఎస్సై రఘునాథరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లింట పెను విషాదం శ్రీను పెళ్లి సమయం సమీపిస్తూండటంతో కుంటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే పెళ్లి దుస్తుల కోసం వెళ్లిన వరుడు శ్రీను రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే సమాచారంతో కుటుంబం తల్లడిల్లిపోయింది. పుట్టిన రోజు వేడుక, పెళ్లి సంబరాలతో ఆనందం నిండాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. పరిసరాల్లో విషాదం నెలకొంది. అందరితోనూ స్నేహభావంతో ఉండే శ్రీను మృతి అందరినీ కలచి వేసింది. -
బలైపోయిన అంజలి
సాక్షి, రాజమహేంద్రవరం / కంబాలచెరువు /బుట్టాయగూడెం : ఆత్మహత్యా యత్నం చేసి.. మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి (22) తుది శ్వాస విడిచింది. రాజమహేంద్రవరంలోని కిమ్స్ (బొల్లినేని) ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ వేధింపులు తట్టుకోలేక 12 రోజుల క్రితం ఆమె హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితికి చేరిన ఆమె అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతోంది. ఆమెకు అదే కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రోజురోజుకూ ఆమె మెదడు పనితీరు క్షీణిస్తూ.. ఇతర అవయవాల పనితీరు సన్నగిల్లుతూ వచ్చింది. గురువారం రాత్రి పూర్తి విషమంగా మారడంతో ప్రభుత్వాస్పత్రి వైద్య బృందం కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించింది. అదే సమయంలో ఆమెకు గుండె సమస్య అధికమైంది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చి, గుండె ఆగిపోవడంతో నాగాంజలి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడేనికి తీసుకెళ్లారు. దీపక్ వేధింపుల వల్లే దారుణం ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుంది. దాని ప్రభావంతో అక్కడే స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. ఆ ఇంజక్షన్ చాలా హానికరమైనది కావడంతో కొద్ది నిమిషాలకే కోమాలోకి వెళ్లిపోయింది. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది. ఈ క్రమంలో అంజలి రాసిన సూసైడ్ నోట్ ఆ మరుసటి రోజు అంటే.. గత నెల 24న బయటకు వచ్చిoది. దీంతో ఆమె తీసుకున్న ఇంజక్షన్ ఏమిటనే విషయం బహిర్గతమైంది. తన ఆత్మహత్యాయత్నానికి కారణం ఎవరన్నది ఆ లేఖలో ఆమె స్పష్టంగా రాయడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు దీపక్‌ను అరెస్టు చేశారు. బాధితురాలికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినప్పటి నుంచి ఆమెకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఆది నుంచీ ఆ కుటుంబానికి అండగా నిలిచింది. నాగాంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పూర్తి న్యాయ సహాయం అందిస్తామని కూడా చెప్పారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆస్పత్రికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు సైతం రోడ్డెక్కారు. ఆందోళనకు తలొగ్గిన ప్రభుత్వం.. నాగాంజలి ఆరోగ్య పరిస్థితిపై 28న ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. వారు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఘటన జరిగిన తర్వాత నాగాంజలి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల పరామర్శించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. నాగాంజలిని దారుణంగా హింసించి, ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన దీపక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రౌతుగూడెంలో ప్రజల ఆందోళన నాగాంజలి మృతితో ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంబులెన్స్‌లో ఆమె మృతదేహం గ్రామానికి చేరుకునే సమయానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అంజలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘వి వాంట్ జస్టిస్’ అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగాంజలి మృతి పట్ల వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంతాపం తెలిపారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నాగాంజలిని పొట్టన పెట్టుకుందిఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపాటు నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త కావడం వల్లే ప్రభుత్వ నిర్లక్ష్యం సాక్షి, అమరావతి: రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతికి కూటమి ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అ«ధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన దీపక్ ఏజీఎంగా ఉన్న ఆస్పత్రిలోనే బాధితురాలికి చికిత్స చేయొద్దని, వేరే ఆస్పత్రికి తరలించాలని వైఎస్సార్సీపీ కోరినా, ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం కళ్యాణి మీడియాతో మాట్లాడారు. తన ఆత్మహత్యకు కిమ్స్ ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యాయత్నం చేసినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించక పోవడం దారుణం అని అన్నారు. నిందితుడు దీపక్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినందునే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ‘గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేస్తే.. ఈ 12 రోజుల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితల్లో ఏ ఒక్కరూ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఆమె కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు’ అని వరుదు కళ్యాణి విమర్శించారు. వీళ్ల వాగ్దానాలన్నీ మాటలకే పరిమితమని, చేతల్లో చేసేదేం ఉండదని అర్థం అవుతోందన్నారు.