Kids
-
పిల్లలకు పాఠశాల కంటే వీడియో గేమ్స్ అంటే ఎందుకు ఇష్టం?
“మా బాబుకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వకపోతే అరుపులు, కేకలు. ఇల్లంతా రచ్చరచ్చ చేసేస్తాడు. కానీ పుస్తకాలు తీస్తే బోలెడంత బద్ధకం. చదువంటే ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే. కానీ అదే వీడియో గేమ్ ఆడేటప్పుడు ఏమీ తినకుండా, తల ఊపకుండా గంటల తరబడి కూర్చుంటాడు!”ఇలాంటి మాటల్ని మీరు రోజూ వింటూనే అంటారు.దానికి మీరేం సలహా ఇస్తారు? “ఈ తరం పిల్లలు స్క్రీన్కు బానిసలైపోయారు.” “వీడియో గేమ్స్ బ్రెయిన్‌ను వదిలిపెట్టకుండా హైపర్ యాక్టివ్ చేస్తాయి.” “ఇది డిజిటల్ డెమెజ్.”"పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదు."కానీ, అసలు మర్మం ఎక్కడ ఉంది తెలుసా?వీడియో గేమ్స్ అనేవి సైకాలజీని వాడి డిజైన్ చేసిన అద్భుత ఇంజినీరింగ్.మొబైల్ గేమ్స్ ఆడే పిల్లవాడిని ఒకసారి గమనించండి… "ఈ లెవెల్‌ను కంప్లీట్ చేయాలి", "ఈ శత్రువును ఓడించాలి", "ఈ స్కోరు సాధించాలి" అని అతనికి స్పష్టమైన లక్ష్యం ఉంటుంది.అతను ప్రయత్నం చేస్తాడు. ఓడిపోతాడు. మళ్లీ ట్రై చేస్తాడు. మళ్లీ ఓడతాడు. చివరికి గెలుస్తాడు.విజయం పొందిన వెంటనే స్క్రీన్ మీద – "Congratulations!", "You’re a winner!", "Unlocked new powers!" అంటూ మెసేజ్ వస్తుంది.ఈ ఫీడ్‌బ్యాక్ అతని మెదడులో డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ కోసమే, అది ఇచ్చే హ్యాపీనెస్ కోసమే అతను మళ్ళీ మళ్ళీ మొబైల్ గేమ్స్ ఆడుతూనే ఉంటాడు.ఇప్పుడు చదువును పరిశీలిద్దాం. ఓ ఏడో తరగతి పిల్లాడు, మొఘలుల వంశవృక్షం చదవాల్సి ఉంది. అతనికి పాఠం ఎంత పెద్దదో తెలియదు. ఎక్కడ మొదలుపెట్టాలో కూడా స్పష్టత లేదు. పుస్తకంలోని ప్రశ్నల్లో ఏది పరీక్షల్లో వస్తుందో, ఏది గుర్తుంచుకోవాలో తెలియక కంగారు.పరీక్షలో సరైన సమాధానం రాసినా – ఫలితం ఎప్పుడు వస్తుందో తెలీదు. పరీక్షలు వస్తున్నాయంటే "నువ్వేమైనా చదువుతున్నావా?" అంటూ తల్లి, తండ్రి, టీచర్లు ఒత్తిడి పెడతారు. ఆ ఒత్తిడి అతని మెదడులో కోర్టిసాల్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇదే అసలు తేడా. వీడియో గేమ్ మోటివేట్ చేస్తుంది. చదువు భయం, ఒత్తిడితో నడుస్తుంది.మా Genius Matrix వర్క్‌షాప్‌లో పాల్గొన్న 8వ తరగతి విద్యార్థిని మిహిర ఏం చెప్పిందో తెలుసా? “సర్, నేను Minecraft ఆడేటప్పుడు ఎంత creative అవుతానో తెలుసా? నా మీద నాకే ఆశ్చర్యం. కానీ అదే స్కూల్లో డ్రాయింగ్ competition ఉంటే, ఒక్కసారిగా భయమేస్తుంది. గెలవకపోతే నన్ను తక్కువగా చూస్తారని.”ఇంకొక తండ్రి తన కొడుకును గురించి ఇలా చెప్పాడు... “డాక్టర్ గారు, మా వాడి PUBG స్టాటిస్టిక్స్ మామూలుగా ఉండవు. ప్లానింగ్, లీడర్షిప్, టీమ్ వర్క్ – అన్నీ బాగా చూస్తాడు. కానీ అదే క్లాస్‌లో ప్రాజెక్ట్ వచ్చిందంటే మౌనంగా పడుకుంటాడు. ఎందుకంటే అక్కడ creativityతో పని లేదు, కేవలం marks కోసం పని చేయాలి.”వీడియో గేమ్‌లో చిన్న ప్రయత్నానికే పెద్ద గుర్తింపు వస్తుంది. చదువులో మంచి ప్రయత్నం చేసినా మార్కులు రాకపోతే ఎవరూ పట్టించుకోరు. వీడియో గేమ్‌లో స్వాతంత్య్రం ఉంటుంది. చదువులో నిబంధనలు, డెడ్లైన్లు, ఫలితాలపై భయం ఉంటుంది.ఒకసారి నేను ఓ క్లాస్‌లో పిల్లల్ని అడిగాను: “మీరు ఎక్కువ టైం ఏమి చేస్తారు?” ఒకటి: “గేమ్స్ ఆడతాను.” రెండు: “యూట్యూబ్ చూస్తాను.” మూడు: “కంప్యూటర్ మీద క్రియేట్ చేస్తాను.” చదువు ఎప్పుడూ నాల్గవ ఆప్షన్లా ఉంటుంది.మనం ఏమి చేయాలి? వీడియో గేమ్‌లు నిషేధించడం సమస్యకు పరిష్కారం కాదు. స్మార్ట్‌ఫోన్ తీసేయడం వల్ల కూడా సమస్య తీరిపోదు. “నీకు concentration లేదు” అని తిట్టడం వల్ల అస్సలు ఉపయోగం ఉండదు.మరేం చేయాలంటారా?పిల్లలు ఏది concentrationతో చేస్తారో గమనించాలి. మన పాఠశాల, మన ఇంటి వాతావరణం కూడా వీడియో గేమ్‌లా మారాలి.🔹చిన్న లక్ష్యాలు ఇవ్వండి – చిన్న విజయం పొందిన ఆనందాన్ని అనుభవించాలి.🔹ప్రయత్నాన్ని గుర్తించండి – “శబాష్, నువ్వు మంచి ట్రై చేశావు” అనే మాట ఎంతో విలువైనది.🔹విఫలమైనా మళ్లీ ప్రయత్నించేందుకు అవకాశం ఇవ్వండి – శిక్షలు కాదు, శక్తినివ్వండి.🔹విజయం చూపించండి – మార్కులు కాకపోయినా, మెరుగుదల కనబడాలి.🔹పిల్లల మనసును మెప్పించే చదువు… అలాగే వాళ్లే కోరుకునే అభ్యాసం కావాలి.🔹మనం పిల్లల మీద ఒత్తిడి పెట్టడం తగ్గించాలి. వాళ్లలో ఉత్తేజాన్ని పెంచాలి. 🔹వీడియో గేమ్‌ల మాదిరిగానే – విద్య కూడా ఒక అడ్వెంచర్ అనిపించాలి.చదువు ఒక బాధగా, భారంగా కాదు… ఒక ప్రయాణంగా మారితే – పిల్లలు కూడా చదువును “ఆటలా” ఆస్వాదిస్తారు.మొత్తానికి సమస్య స్క్రీన్ కాదు. చదువులో ఆనందాన్ని మేళవించడమే సమాధానం.-సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
సినిమాయకు మంత్రం లేదా!
‘హోమ్‌వర్క్ చేయలేదేంటి?’ టీచర్ ప్రశ్న. ‘చెయ్యలా’... అన్నాడా స్టూడెంట్ తల వంకరగా పెట్టి.‘నిర్లక్ష్యంగా బదులిస్తావేంటి... క్లాసయ్యే వరకు నిలబడు’‘తగ్గేదేలే’ అంటూ విచిత్రంగా అభినయించాడు.భుజం తిప్పుతూ వికారంగా ముఖం పెట్టాడు.ఇది ఇప్పుడు స్కూళ్లను పట్టి పీడిస్తున్న జబ్బు.ఆ జబ్బుకు విరుగుడు కూడా రోగం మొదలైన చోటే ఉంది.‘మా స్కూల్లో సగం మంది విద్యార్థులు ‘ఫలానా’ సినిమా చూసిన తర్వాత చెడిపోయారు. విద్యార్థుల భాష మారిపోయింది, జుట్టు స్టైల్, డ్రెస్సింగ్ విచిత్రంగా ఉంటోంది. టీచర్లుగా వారికి మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. ఎంత చెప్పినా మా మాట వినడం లేదు. భాష మార్చుకోవాలని చెప్పినప్పుడు నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారు. ఇలాంటి సినిమాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తోంది? ఇలాంటి సినిమాలకు సెన్సార్‌బోర్డు సర్టిఫికేట్ ఎలా ఇస్తోంది?’ ఇటీవల విద్యాశాఖ కమిషనర్ మీటింగ్‌లో ఓ టీచర్ వెలిబుచ్చిన ఆవేదన ఇది. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఆమె ఒక్కరే కాదు, బయటకు చెప్పలేక ఎందరో టీచర్లు ఇలాగే ఆవేదన చెందుతున్నారు. ఎవరూ పట్టించుకోకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జాతీయోద్యమకాలం సినిమాలు ‘‘సినిమా అనేది చాలా ప్రభావవంతమైన మాధ్యమం. అది ప్రధానంగా వినోదసాధనమే. కానీ సామాజిక బాధ్యత కూడా ఉండాలి. సామాజిక బాధ్యతతో కూడిన వినోదాన్ని అందించాలి. జాతీయోద్యమకాలంలో సినిమాలు ఈ పాత్ర పోషించాయి. జనంలో స్వాతంత్య్రపోరాట స్ఫూర్తిని రగిలించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన సినిమాలకు ఒక సామాజిక లక్ష్యం అనేది లేకుండా పోయింది. సినిమా ప్రభావం పిల్లల మీద మంచి–చెడు రెండు వైపులా ఉంటుంది. సినిమాలో ప్రధానంగా ఏం ఉందో అదే నేర్చుకుంటారు. ఏ విషయాన్ని హీరోయిక్‌గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు. సెన్సార్‌బోర్డు ఒక సినిమాకు ప్రదర్శనకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ‘ఏ’ సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలను తీసుకెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు శృంగార దృశ్యాలున్న సినిమాలకు మాత్రమే పిల్లలను మినహాయిస్తున్నారు. హింస ఉన్న సినిమాల విషయంలో పట్టింపుగా ఉండడం లేదు. పిల్లలను పక్కదారి పట్టిస్తున్న మాధ్యమాల్లో సినిమాలతోపాటు టీవీ ప్రసారాలు, సోషల్ మీడియాను కూడా ప్రస్తావించాలి. పిల్లల క్షేమం దృష్ట్యా ఆలోచించి నప్పుడు మనదేశాల్లో పటిష్టమైన నియమాలు లేవు.’’ అన్నారు విద్యావేత్త రేఖారావు. పాడైన విద్యార్థుల లెక్క తేలేదెలా? పిల్లల మీద సినిమాల ప్రభావం తీవ్రరూపం దాల్చింది. ఆ దుష్ప్రభావం పిల్లల భవిష్యత్తు మీద కూడా చూపిస్తుందని టీచర్లు ఆందోళనపడుతున్నారు. పిల్లలను సరిచేయడానికి మందలింపుగా ఒక మాట అంటే చాలా హింసాత్మకంగా స్పందిస్తున్నారని, ఇలాగే కొనసాగితే సమాజానికి మంచి పౌరులను అందించలేమని ఆవేదన చెందుతున్నారు. మరి ఇలాంటి సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్లు ఏం చేస్తున్నారు? సదరు సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే లెక్కల గొప్పలు చెప్పడానికి ముందుంటారు. కానీ తమ సినిమా చూసిన తర్వాత ఎంతమంది పిల్లలు పాడయ్యారో లెక్కచెప్పే ధైర్యం వాళ్లకుంటుందా? ఒకప్పుడు సిగరెట్ గాల్లోకి ఎగరేసి పెదవులతో పట్టుకోవడం హీరోయిజంగా ఒక ట్రెండ్ సెట్ చేసింది. కేవలం స్టయిల్ అనే భావనతో సిగరెట్ అలవాటు చేసుకున్న నాటి యువతరం ఇప్పుడు అరవైలు– డెబ్బైలకు చేరి క్రమం తప్పకుండా లంగ్స్ టెస్ట్‌లు చేసుకుంటోంది. హీరోలు తమ పిల్లలను కూడా ఈ మత్తులోనే ఉంచుతున్నారా? సమాజంలోని పిల్లల పట్ల వారికి బాధ్యత అక్కర్లేదా? లేజీ పేరెంటింగ్ పరిణామాలివన్నీ ప్రశాంతంగా ఉండాల్సిన పిల్లలు ముఖాలు ఆవేశంగా, అలసటగా, ఆందోళనగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు సినిమాలు చూసి, పగలు క్లాస్‌రూమ్‌లో కునికిపాట్లు పడుతుంటారు. దీనికి బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు కథలు చెప్పే ఓపిక లేక వీడియో గేమ్స్‌కు అలవాటు చేస్తున్నారు. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ పిల్లల తల్లిదండ్రులు స్కూల్‌కి వచ్చి పిల్లలు తమ మాట వినడం లేదని కంప్లయింట్ చేస్తుంటారు. సినిమాలు చూసి పాడయిపోతున్న మాట నిజమే. పిల్లల ఖాళీసమయాన్ని సద్వినియోగం చేస్తే కదా! పెద్దవాళ్లను, టీచర్లను గౌరవించాలనే బుద్ధి పుట్టించే కథలను వాళ్లకు చెప్పి ఉంటే తల్లిదండ్రులను, టీచర్లను ధిక్కరించే ఆలోచనే రాదు. కథలు చెప్పే ఓపిక చాలామంది పేరెంట్స్‌కు ఉండడం లేదు. క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ సొల్యూషన్స్ ఉన్న కథలు మనకెన్నో ఉన్నాయి. కాకి నీటి కోసం కుండలో రాళ్లు వేసిన కథ. నోటిమాటతో డోర్ ఓపెన్ అయ్యే కథల్లో టెక్నాలజీ దాగి ఉంది. ఎలుకలను అమ్మే కథలో స్టార్టప్ మార్గం ఉంది. పంచతంత్ర కథల్లో లేనిదేమిటి? పిల్లల్లో ఇలాంటి అవాంఛిత ధోరణికి సినిమా అనేది ప్రత్యక్ష కారణం అయితే లేజీ పేరెంటింగ్ పరోక్ష కారణం. – రేఖారావు, విద్యావేత్త – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మధ్యాహ్న భోజన పథకానికి ఆద్యుడు ఆయనే
పిల్లలూ! ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం పూట విద్యార్థులకు భోజనం పెడతారన్న విషయం మీకు తెలుసా? పిల్లలు టిఫిన్ బాక్సులు తీసుకెళ్లకుండా, అక్కడ వండి, వడ్డించే అన్నాన్నే తింటారు. ఈ పద్ధతి చాలా బాగుంది కదా? మరి ఈ విధానాన్ని ఆలోచించింది, ఆచరణలోకి తెచ్చింది ఎవరో తెలుసా? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న (Bharat Ratna) కె.కామరాజ్. ఆయన గురించి తెలుసుకుందామా?కె.కామరాజ్ (K. Kamaraj) 1903 జులై 15న అప్పటి మద్రాసు రాష్ట్రంలోని విరుదుపట్టి అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కుమారస్వామి, శివగామి అమ్మాల్. వారికి కంచి కామాక్షి అమ్మవారు ఇష్టదేవత. అందుకే పుట్టిన మగబిడ్డను ‘కామాక్షి’ అని, ‘రాజా’ అని పిలిచేవారు. చివరకు ఆ పేరు ‘కామరాజ్’గా స్థిరపడింది. ఆయనకు ఆరేళ్ల వయసు ఉండగానే ఆయన తాత, ఆ తర్వాత ఆయన తండ్రి మరణించారు. దీంతో కుటుంబం ఇబ్బందులు పడింది. అతికష్టమ్మీద చదువుకున్న కామరాజ్ 12వ ఏట చదువు మానేసి, తన మేనమామ నడిపే బట్టల దుకాణంలో పనికి వెళ్లడం మొదలుపెట్టాడు.అక్కడ ఉన్న సమయంలో స్థానికంగా ఉండే సమస్యలు, చుట్టుపక్కల జరిగే విషయాలను గమనిస్తూ తనకు తోచిన విధంగా ఇతరులకు సాయపడుతూ ఉండేవాడు. అప్పట్లో స్వాతంత్య్రోద్యమం మొదలవడంతో పలువురు ప్రముఖులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆ కార్యక్రమాలు వెళ్లే కామరాజ్ వారి ప్రసంగాలతో ఉత్తేజితుడయ్యేవాడు. బంకించంద్ర ఛటర్జీ, సుబ్రహ్మణ్య భారతి రాసిన పుస్తకాలను ఇష్టంగా చదివేవాడు. అనీ బీసెంట్ ‘స్వపరిపాలన’ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు.ఆ తర్వాత 1921లో తొలిసారి కామరాజ్ మహాత్మాగాంధీని మదురైలో కలిశారు. ఆయన భావాలు, ఆలోచనలకు ఆకర్షితుడైన కామరాజ్ తను కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత అనేక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి, జైల్లో ఉంచారు. అలా సుమారు 3 వేల రోజులు కామరాజ్ జైల్లోనే గడిపారు. అయినా ఆయన ఏమాత్రం చలించలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మద్రాసు రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా సేవలందించారు.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తమిళనాడు రాష్ట్రంలోని విద్యావిధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. పిల్లలు ఆకలితో పాఠాలు వినకుండా దేశంలోనే మొదటిసారిగా వారికి మధ్యాహ్న భోజనం (Midday Meal) అందించే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్కూళ్లల్లో యూనిఫారం వేసుకునే విధానం సైతం ఆయనే అమల్లోకి తెచ్చారు. ఆయన అమలు చేసిన విధానాలను ఆ తర్వాత దేశమంతా అమలు చేశారు.ఇలా ఎన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నా కామరాజ్ మాత్రం చాలా నిరాడంబరంగా జీవించేవారు. ఆయన మరణించేనాటికి ఆయనకున్న ఆస్తి 130 రూపాయలు, రెండు జతల చెప్పులు, నాలుగు చొక్కాలు, ధోతీలు, కొన్ని పుస్తకాలు. ఆయన మరణాంతరం కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించింది.చదవండి: నేను బాషా.. ఒక్కసారి రాస్తే 400 భాషల్లో రాసినట్టు!చూశారుగా! మామూలు స్థాయి నుంచి ఎదిగిన కామరాజ్, దేశానికి ఎన్ని సేవలందించారో! మీరు కూడా అలా అందరికీ ఉపయోగపడే పనులు చేసి పేరు తెచ్చుకోవాలి. -
చదివే చోటు సరిగ్గా ఉందా?
వంట గది చప్పుళ్లు... టీవీ సౌండు... తల్లిదండ్రుల కబుర్లు, వాదనలు,... చిన్న తమ్ముడో, చెల్లెలో మధ్యలో దూరి ఆటలు... ‘మంచి మార్కులు తేవాలి’ అంటారు గాని చదివేందుకు మంచి చోటును చూపిస్తున్నారా? సంక్రాంతి దాటితే పిల్లలందరూ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి.ఇంట్లో మీ పిల్లలు చదివే చోటును చూడండి.వారు శ్రద్ధగా చదువుకునేలా ఆ చోటును ఎలా ఏర్పాటు చేయాలో నిపుణుల మాట వినండి.ఇల్లు సర్దుకుంటే ఇల్లు ఎంత విశాలమో అర్థమవుతుంది. చిన్న ఇల్లయినా పెద్ద ఇల్లయినా సర్దుకోవడంలోనే స్థలం బయట పడుతుంది. ముంబై వాసులు అతి చిన్న ఇంటిలో కూడా అన్నీ అందంగా అమర్చుకుంటారు. కాని మనకు ఎంత విశాలమైన ఇల్లు ఉన్నా అవసరం లేని సామాను, వాడని సామాను, పారేయని సామాను ఉంచుకుని పిల్లల చదువుకు, పుస్తకాలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేనట్టుగా తయారు చేస్తాం. మళ్లీ వాళ్లు బాగా చదవాలని డిమాండ్ చేస్తాం. శుభ్రమైన చోటు చదువు తలకెక్కే చోటు అలాంటి చోటును మీ ఇంట్లో మీ పిల్లలకు చదువు కోసం కేటాయిస్తున్నారా?అబ్రహం లింకన్ వీధి దీపాల కింద చదివాడు. ఎనభైల నాటి పిల్లలు డాబాల మీద లైట్లు లాగి చదివారు. కాని ఇప్పటి పిల్లలు అలా చదవడం లేదు. ఇంటిలోనే నిశ్శబ్దంగా చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇంట్లో వాళ్లకు యోగ్యమైన చోటును ఏర్పాటు చేయాలి. కామన్ ఏరియాకు సంబంధం లేకుండా ఎవరైనా ఇంటికి వచ్చి వెళుతున్నా కన్ను పడని చోటు ఇంటిలో చదువుకునే పిల్లలకు ఇవ్వాలి. ఆ చోటును పూర్తిగా శుభ్రంగా ఉంచాలి. పిల్లలు కంప్యూటర్లో ప్రశ్నాపత్రాలు చూసి చదువుకుంటున్నారు. వారికి డెస్క్‌టాప్ లేదా లాప్టాప్ ఏర్పాటు చేయలేకపోతే కనీసం ఫోన్లో అన్నా తగినంత డేటా వేయించి ఇవ్వాలి.పిల్లలు చదివి అలసి పడుకోవాలంటే ఆ దాపునే బెడ్ ఉంటే మరీ మేలు. అది వాలగానే నిద్రపోయేలా తప్పక శుభ్రంగా సౌకర్యంగా ఉండాలి. కష్టపడి చదివి నిద్ర పట్టక ఇబ్బంది పడితే చదివింది నిద్ర లేమి వల్ల వృధా అవుతుంది.పిల్లలు చదువుతున్నప్పుడు వారి మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఇంట్లో తగాదాలు పూర్తిగా బంద్ చేయాలి. తల్లిదండ్రులు మంచి మూడ్‌లో కనిపిస్తూ పిల్లలతో స్నేహంగా మాట్లాడాలి. వారికి ఇష్టమైన పదార్థాలు అందుబాటులో ఉంచాలి. బయట తిండి కాకుండా ఇంటి తిండి ఇవ్వాలి.∙పిల్లలు చదువుకునే సమయంలో దగ్గర కూచుని అప్పుడప్పుడు పలకరిస్తూ ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ ఉంటే వాళ్లూ ఆ ప్రెజెన్స్ ఇష్టపడతారు. అయితే రోజూ నువ్వు 99 పర్సెంట్ తేవాలి... టాపర్‌గా నిలవాలి అనే మాటలు ఎత్తి స్ట్రెస్ క్రియేట్ చేయకూడదు. న్యాయంగా ఎంత కష్టపడాలో అంత కష్టపడమని మాత్రమే చెప్పాలి.∙గంటకోసారన్నా చదివే చోట నుంచి లేచి కాస్త అటూ ఇటూ నడిచేలాగా, నీరు తాగేలా, బాల్కనీలోనో కారిడార్లోనో కాస్త గాలి పీల్చేలా చూడాలి.∙ -
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..
స్క్రీన్ టైమింగ్ తగ్గాలి..చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ మొబైల్ ఫోన్ లేనిదే గడవట్లేదు. కొత్త సంవత్సరంలో అయినా స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటే మంచిది. కళ్లతో పాటు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమింగ్ కాస్త తగ్గించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలి.సైబర్ వలలో పడకుండా..సైబర్ నేరాలకు అంతులేకుండా పోతోంది. ఏ అవకాశం దొరికినా అందిపుచ్చుకునేందుకు సైబర్ నేరస్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాలో బ్యాంకు వివరాల గోప్యత పాటించడం, కొన్ని జాగ్రత్తలు వహించడం మనకే మంచిది.పొదుపు మంత్రం..ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు చేసే పొదుపే రేపు వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడేస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. దుబారా ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ పొదుపు మంత్రం పాటిస్తే ఎలాంటి ఒడిదుడుకులైనా ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. సంపాదనలో కొంత ఇన్సూరెన్స్లోనో, మ్యూచువల్ ఫండ్స్‌లోనో దాచుకోవడం మంచిది.డ్రగ్స్‌కు దూరం..ప్రస్తుతం డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు సమాజానికి చీడపురుగులా తయారయ్యాయి. డ్రగ్స్ రహిత సమాజం కోసం మన వంతు కృషి చేద్దాం. డ్రగ్స్ తీసుకోవడమే కాదు.. దానికి బానిసైన వారిని దూరంగా ఉంచేందుకు ప్రయతి్నద్దాం. దీనిపై పోలీసులకు సహకరిద్దాం.పరులకు సహాయం.. పరులకు సాయం చేస్తే మనకు తిరిగి ప్రకృతి సహాయం చేస్తుంది. అందుకే ఉన్నదాంట్లో తోచినంత పరులకు, అవసరం ఉన్న వారికి సహాయం చేయాలనే ఆలోచన చేస్తే మంచిది. మీ టు డూ లిస్ట్ లో ఇది చేర్చుకోవడం మర్చిపోవద్దు. తద్వారా ఎదో ఒక రోజు మనం ఊహించని రీతిలో తిరిగి సహాయం అందుతుందని మర్చిపోవద్దు.హెల్త్ ఈజ్ వెల్త్..ఎంత సంపాదించినా సరైన ఆరోగ్యం లేకపోతే ఉపయోగం ఉండదు. ఉద్యోగం, సంపాదన వేటలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. సో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజూ గంట సమయం కేటాయించడం ఎంతో ముఖ్యం. ఉదయం లేవగానే కొద్దిసేపు వ్యాయామం, చిన్నపాటి బరువులు ఎత్తడం, నడక వంటివి ఎంత ముఖ్యమో.. సరైన ఆహారం తీసుకోవడమూ అంతే ముఖ్యం.ప్రస్తుతం తరుణంలో ఉరుకుల, పరుగుల జీవన విధానంలో మనలో చాలా మందికి సామాజిక స్పృహ లేకుండా పోతోందని విశ్లేషకులు చెబుతున్న మాట..! ఇటీవల రోడ్ రేజ్ పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. కనీసం ఓపిక లేకుండా ప్రజలు వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై వెళ్తుండగా ఎవరితో అయిన ఘర్షణ జరిగితే కాస్త సంయమనం పాటించి.. చిన్న చిరునవ్వు చిందిస్తే ఎలాంటి సమస్యకూ తావులేకుండా ఉంటుంది. లేదంటే గొడవలు, ముష్టి యుద్ధాలకు దారితీసి తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని గ్రహించాలి. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ.. ఒత్తిడి ప్రపంచంలో మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. చిన్నవాటికే చిరాకు పడడం.. కోపం తెచ్చుకోవడం.. అసహనం వ్యక్తం చేయడం.. తగ్గించుకోవడం ఎంతో మంచిది. ఇందుకోసం యోగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ఆరోగ్యకరమైన అలవాటు. మానసిక ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం, తద్వారా సమాజం బాగుంటుంది. ఫ్యామిలీ టైం.. ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కొంత సమయం గడపడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎంత సంపాదించినా అది కుటుంబం కోసమే. ఇంతా చేసి కుటుంబానికి సమయం కేటాయించకపోతే కుటుంబ సభ్యులు మనల్ని మిస్ అవుతారనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రతిరోజు కాకపోయినా.. వారంలో ఒకసారి కలిసి కూర్చుని భోజనం చేయడం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఒకరి గురించి ఒకరు ఆరా తీసుకునే వీలు కలుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ విషయంలో.. ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంలో మిగతా నగరాల పౌరులతో పోల్చుకుంటే మనం వెనుకబడ్డట్టే. రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాల నివారణకు దోహదం చేయవచ్చు. దీనిని మన వంతు బాధ్యతగా పాటించాలని ఇప్పటి నుంచే నిర్ణయం తీసుకుందాం.. మనలో ఈ చిన్న మార్పు 10 మందికి స్ఫూర్తిగా నిలిచి, సమాజాభివృద్ధికి దోహదం చేస్తుంది. టైం సెన్స్ ముఖ్యం.. మనం చిన్నప్పటి నుంచీ వినే మాట సమయపాలన. అయినా.. ఎన్నోసార్లు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటాం. ఒక్క సెకండ్‌తో ఎన్నో మార్పులు జరగవచ్చు. ఒక్క నిమిషం వల్ల ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. సమయం పోతే తిరిగి రాదు.. అనే విషయాన్ని గుర్తిస్తే మంచిది. ఒలింపిక్స్‌లో ఎన్నో పతకాలు చేజారిపోయేదా ఆ సెకను తేడాతోనే అనే విషయం గ్రహించాలి. సమయం అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉండదు.. ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉంటుంది. అందుకే విధిగా సమయపాలన పాటించడం అనేది వచ్చే ఏడాది మన డైరీలో భాగం కావాలి. అదే మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. -
రెండుసార్లు నోబెల్ పొందిన ఏకైక మహిళ
ఆమె పుట్టింది రష్యా దేశంలోని వార్సాలో. ఐదుగురు పిల్లల్లో ఈ పాప చిన్నది. పదేళ్ల వయసులో తల్లి క్షయ వ్యాధితో మరణించింది. దీంతో తోబుట్టువులే ఆమెను పెంచారు. చిన్ననాటి నుంచి ఆమెకు విజ్ఞాన శాస్త్రమంటే చాలా ఇష్టం. ఆ విషయాల గురించి ఆ పాప తెలుసుకుంటూ ఉండేది. ఇంట్లో పేదరికం కారణంగా ఆమె ఎక్కువగా చదువుకోలేకపోయింది. తనకొచ్చిన చదువుతో ఉపాధ్యాయురాలిగా మారింది. విశ్వవిద్యాలయానికి వెళ్లాలనే ఉద్దేశంతో 1891లో ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడ సోర్బోన్ యూనివర్సిటీలో చేరింది. అక్కడ భౌతిక, గణిత శాస్త్రాలను చదివింది. 1894లో ప్యారిస్ నగరంలో శాస్త్రవేత్త పియరీ క్యూరీని కలుసుకుంది. ఏడాది తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పరిశోధనలు చేశారు. యురేనియంపై పలు ప్రయోగాలు చేసి కీలకమైన విషయాలు కనుక్కున్నారు. ఆ సమయంలోనే రేడియో ధార్మికతను కనిపెట్టారు. ఆ పరిశోధనలకుగానూ 1903లో ఆమెతోపాటు ఆమె భర్త పియర్, హెన్రీ బెక్వెరెల్లకు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇచ్చారు. 1906లో పియరీ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జీవితంలో మరోసారి ఆమెను విషాదం చుట్టుముట్టింది. అయినా కుంగిపోక పరిశోధనలు కొనసాగించింది. ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలు నేర్పింది. రేడియో ధార్మికతను కొలిచే సాధనాన్ని రూపొందించినందుకు 1911లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకుందామె. ఇలా రెండు వేర్వేరు విభాగాల్లో నోబెల్ బహుమతి అందుకున్న ఏకైక మహిళ ఆమె. ఆమె కనిపెట్టిన రేడియో ధార్మికత ఇవాళ అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో దానికి కీలకపాత్ర ఉంది. తన జీవితమంతా పరిశోధనలకే అంకితం చేసిన ఆమె పేరు ‘మేరీ క్యూరీ’. ఆమెనే ‘మేడమ్ క్యూరీ’ అని కూడా అంటారు. తన జీవితంలో ఆమె ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా ఏనాడూ వెనకడుగు వేయకుండా కష్టపడి అనుకున్నది సాధించారు. ఆమె స్ఫూర్తితో మీరూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి. -
పిల్లల కథ: విజయపురిలో విశ్వనాథుడు
విజయపురిలో విశ్వనాథుడనే పండితుండేవాడు. ఆయన వద్ద పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన అనేక తాళపత్ర గ్రంథాలుండేవి. ఆయన వాటిని చదవడమేగాక జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. అంతేగాక తను కూడా కావ్యాలను రాస్తుండేవాడు. అయితే పేదరికం ఆయన్ను బాగా పీడిస్తుండేది. అయినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఒకసారి ఆయనకు అనారోగ్యం చేసింది. పట్టణానికి వెళ్లి వైద్యం చేయించుకోమని సలహా ఇచ్చాడు నాటువైద్యుడు. పట్టణంలో వైద్యం అంటే డబ్బుతో పని. ఆయన భార్యకేమీ పాలుపోలేదు. డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియ లేదు. దిగాలుగా ఉన్న ఆమెతో పక్కింటామె ‘మీ ఇంట్లో తాళపత్ర గ్రంథాలు బోలెడున్నాయికదా! ఊళ్లో వాటినెవరికయినా అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో పట్టణంలో వైద్యం చేయించవచ్చు’ అన్నది. ‘ఈ ఊళ్లో గ్రంథాలు కొని, చదివే వాళ్లున్నారా?’ అని సందేహపడింది పండితుడి భార్య. ‘అది నిజమేకానీ ప్రయత్నిస్తే తప్పులేదు కదా!’ అంది పక్కింటామె. ఆ ఉపాయం నచ్చి, తాళపత్ర గ్రంథాలను భుజానికెత్తుకుని ఊరంతా తిరిగింది పడింతుడి భార్య. ఒక్కరూ ఒక్క గ్రంథం కొన్న పాపాన పోలేదు. నొప్పి పెడుతున్న భుజాలతో చివరకు ఆ ఊళ్లోని వడ్డీ వ్యాపారి అనంతయ్య ఇంటికి వెళ్లింది. ‘మా ఇంట్లో చదివేవారు ఎవరూలేరమ్మా! అలా అని నేను కాదంటే నీ అవసరం తీరేదెలా? నేనీ పుస్తకాలు కొనను కానీ, తాకట్టు పెట్టుకుంటాను. మీకు ధనం సర్దుబాటు కాగానే నా బాకీ తీర్చి, మీ గ్రంథాలను మీరు తీసుకుపొండి’ అన్నాడు. ఆ మాటకు పండితుడి భార్య సరేనంది. ఆమెకు కావలసిన పైకం ఇచ్చి, తాళపత్ర గ్రంథాలను జాగ్రత్తగా దాచి పెట్టాడు వడ్డీ వ్యాపారి. ఆ ధనంతో భర్తకు వైద్యం చేయించింది. త్వరలోనే ఆయనకు నయమైంది. ఇదిలా ఉండగా ఆ రాజ్యాన్నేలే ఆనందవర్ధనుడు.. కొడుకు అలోకవర్ధనుడికి పట్టాభిషేకం చేశాడు. అలోకవర్ధనుడికి గ్రంథపఠనం అంటే మహా ఇష్టం. తన పఠనానికి అనుకూలంగా అంతఃపురంలో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. రాజ్యమంతటా గ్రంథ సేకరణకు చాటింపు వేయించాడు. గ్రామాల నుంచి పాత తాళపత్ర గ్రంథాలున్నవారంతా రాజధానికి వచ్చి తమ వద్ద ఉన్న గ్రంథాలను ఇవ్వసాగారు. వడ్డీవ్యాపారి అనంతయ్య తన దగ్గరున్న గ్రంథాలను రాజుకు ఇవ్వలేదు. ఆనోటా ఈనోటా ఆ విషయం రాజుగారి చెవిన పడింది. ఆయన భటులను పంపి అనంతయ్యను సభకు రప్పించాడు. గ్రంథాల గురించి అడిగాడు.‘గ్రంథాలు నా దగ్గరున్న మాట వాస్తవమే ప్రభూ! అయితే వాటికి నేను యజమానిని కాదు. అవి ఒక పండితుడివి. అతని వైద్యానికి అవసరం అయితే వాటిని నా వద్ద తాకట్టు పెట్టుకుని ధనం ఇచ్చాను. గ్రంథాలను తాకట్టు పెట్టుకోవడం మీకు కొత్తగా ఉండవచ్చు. నేను అలా ఎందుకు చేశానంటే.. నేనిచ్చే« ధనం వల్ల పండితుడికి వైద్యం లభించడమే కాదు, అలా ఆ గ్రం«థాలను భద్రపరచడం వల్ల అవి భవిష్యత్ తరాలకూ అందుతాయని ఆలోచించాను. అందుకే వాటిని తాకట్టు పెట్టుకున్నాను’ చెప్పాడు వడ్డీవ్యాపారి. అతని పెద్ద మనసుకు రాజు ఎంతగానో సంతోషించాడు. తనకు అవసరం లేకపోయినా భవిష్యత్‌లో చదువరులకు గ్రంథాలను అందించాలన్న ఆలోచనతోపాటు, సాటి మనిషిని ఆదుకోవాలన్న మంచి మనసు కూడా వ్యాపారికుండటం అలోకవర్ధనుడిని ఆనందపరచింది. పండితుడి అప్పును రాజు తీర్చడమేకాక, ఆ వ్యాపారికి ‘గ్రంథమిత్ర’ అనే బిరుదును ఇచ్చి ఘనంగా సత్కరించాడు. తరవాత పండితుడి భార్యనూ సన్మానించి, ఆ పండితుడికి తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు రాజు. ఆ గ్రంథాలన్నింటినీ గ్రంథాలయానికి చేర్చి, జాగ్రత్త చేశాడు. -
పెద్దోడా ఎలా ఉన్నావ్? చిన్నోడా ఏం తింటావ్?
ఫ్రాన్స్‌లోని కౌరాన్ అనే ఊళ్లో ఉన్న 72 ఏళ్ల ఫిలిప్ గిల్లెట్ ఇంటికి వెళితే దాదాపు 400 రకాల జంతువులు, కీటకాలు, పక్షులు, జలచరాలు ఉంటాయి. వాటన్నింటిని సాకడం ద్వారా ఆయన చాలా పాపులర్ అయ్యాడు. మనం పలకరించడానికి వెళితే ‘పెద్దోడా... ఇంటికి ఎవరొచ్చారో చూడు’ అనంటే మనం దడుచుకుని చస్తాం. ఎందుకంటే ఆయన పెద్దోడా అని పిలిచింది పెద్ద మొసలిని. మొసలి మూతి యు ఆకారంలో ఉండి సైజు భారీగా ఉంటే దానిని ఎలిగేటర్ అంటారు. అలాంటి ఎలిగేటర్లు రెండు ఉన్నాయి ఆయన ఇంట్లో. ఆడుకోవాలన్నా కష్టం సుఖం చెప్పుకోవాలన్నా అవే ఆయనకు దిక్కు. పెద్దోడు, చిన్నోడు ఇల్లంతా తిరుగుతూ ఫిలిప్‌తో గారాలు పోతుంటాయి. ఇలాంటి పెద్దాయన మన ఇంటి పక్కన లేడు లక్కీగా. లేకుంటే ‘అంకుల్... ఒక కప్పు కాఫీ పోడి ఉంటే ఇస్తారా’ అని కాలింగ్‌బెల్ నొక్కి ‘పెద్దోడు’ వచ్చాడనుకోండి. ఏం చేస్తాం. హరీమనడమే. సరదాలు ఎలా ఉన్నా సృష్టిలోని ప్రతి ్ర ణిని కాపాడుకోవడం పర్యావరణ బాధ్యత. అందరితో పాటు మనం. మనతో పాటు అన్నీ. కాలుష్యం, వేట బారిన పడి ఇవి నశించి΄ోకుండా చూసుకోవాలి. -
పెద్దలే పిల్లలై..!
ఆటలు, పాటలు.. అంటే మనకు పిల్లలే గుర్తొస్తారు. కానీ వృద్ధులు కూడా తమ బాల్యం నాటి రోజులు గుర్తు చేసుకుని ఆడిపాడితే ఎలా ఉంటుంది. అచ్చు అదే ఆలోచన చేసింది వీ ది వలంటీర్స్ అనే స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ఆదివారం బౌరంపేటలోని ఓ పాఠశాలలో ‘పెద్దల జాతర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో 30 వృద్ధాశ్రమాల నుంచి దాదాపు 400 మంది వృద్ధులు పాల్గొన్నారు. ఆడుతూ, పాడుతూ, రంగురంగుల బొమ్మలు వేసి రోజంతా సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని ఏటా జరుపుతుంటారు. అయితే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం విశేషం. -
ఆ స్కూల్లో ఫీజు తీసుకోరు
మామూలుగా అయితే స్కూల్లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్తారు. హోంవర్క్ రాసుకురమ్మని చెప్తారు. పరీక్షలు పెట్టి మార్కులు వేస్తారు. పైగా ఇవన్నీ చేసినందుకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజు తీసుకుంటారు. అయితే థాయ్‌లాండ్‌లో ఉన్న ‘మెషై పట్టానా స్కూల్’(mechai pattana school) లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ బడినే ప్రపంచవ్యాప్తంగా "Bamboo Sc-hool' అని కూడా అంటారు. ఇక్కడ పిల్లలకు పాఠాలతోపాటు సేవ చేయడం నేర్పిస్తాను. సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తారు. తోటివారిని ఎలా గౌరవించాలో, వృద్ధులతో ఎలా నడుచుకోవాలో, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పినందుకు వారు ఫీజేమీ తీసుకోరు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి 400 చెట్లు నాటితే చాలు. థాయ్‌లాండ్‌కు చెందిన మెషై విరవైద్య అనే ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది 2008లో ఈ పాఠశాలను ్రపారంభించారు. స్కూళ్లలో పెరుగుతున్న పేద, ధనిక తారతమ్యం, పాఠశాలలు కేవలం పుస్తకాలు బట్టీ వేసే ప్రదేశాలుగా మారిపోవడం వంటివి గమనించి తాను ఈ స్కూల్‌ని స్థాపించినట్లు ఆయన వివరిస్తారు. బడిలో అందరూ ఒకచోట చేరి సంస్కారాన్ని, సామాజిక సేవనీ, పౌరబాధ్యతలనూ నేర్చుకోవాలని అంటారు. దానికి తగ్గట్టే ఈ పాఠశాల విధివిధానాలను ఆయన రూపొందించారు. ఇక్కడ మామూలు తరగతులతోపాటు కూరగాయలు పండించడం, పశువుల్ని పెంచడం, కళాకృతులు తయారు చేయడం, వంటలు చేయడం వంటివి నేర్పిస్తారు. దీంతోపాటు విద్యార్థులను బృందాలుగా ఏర్పరిచి, వారికొక నాయకుణ్ని నియమిస్తారు. వారిని సమన్వయం చేసుకుంటూ, వారిలో స్ఫూర్తి నింపుతూ సాగేలా అతనికి తర్ఫీదు ఇస్తారు. ఇక్కడ బాధ్యతలన్నీ విద్యార్థులే తీసుకుంటారు. కొత్తవారిని స్కూల్లో చేర్చుకోవడం, కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకోవడం వంటి పనుల కోసం ‘స్టూడెంట్ బోర్డ్’ పని చేస్తుంది. స్కూల్‌కి కావాల్సిన వస్తువులు కొనడం, ఇచ్చిన నిధుల్ని సక్రమంగా ఖర్చుచేయడం కూడా వారి బాధ్యతే. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారు ఫీజు చెల్లించనవసరం లేదు. అయితే పాఠశాలల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రతి విద్యార్థి ఏడాదిలో 400 గంటలు సమాజ సేవ చేయాలి. అది ఇక్కడ కచ్చితమైన నిబంధన. స్త్రీలను ఎలా అర్థం చేసుకోవాలి, వారి మానసిక పరిస్థితి, శారీరక ఇబ్బందులేమిటనే అంశాలపై ఇక్కడి విద్యార్థులకు ప్రత్యేక తరగతులుంటాయి. దీనివల్ల వారిలో తోటివారి పట్ల అవగాహన, ఆత్మీయత పెరుగుతాయని మెషై విరవైద్య వివరిస్తున్నారు. -
చవితి చంద్రుడు.. పున్నమి చంద్రుడు
అక్బర్ పాదుషా ఆస్థానంలో చేరిన అనతి కాలంలోనే బీర్బల్ ఆయనకు తలలో నాలుకలా మారాడు. బీర్బల్ చమత్కారాలను అక్బర్ పాదుషా అమితంగా ఇష్టపడేవాడు. తన తెలివితేటలతో బీర్బల్ ఎన్నో చిక్కు సమస్యలను పరిష్కరించి, మొఘల్ సామ్రాజ్యంలోనే అమిత మేధావిగా గుర్తింపు పొందాడు.బీర్బల్ తెలివి తేటలను అక్బర్ పాదుషా గుర్తించి, అతడిని తన ఆంతరంగికుడిగా చేసుకున్నాడు. మిగిలిన మంత్రులు చెప్పే మాటల కంటే బీర్బల్ మాటకు అక్బర్ పాదుషావారు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. ఇదంతా ఆస్థానంలోని మిగిలిన మంత్రులకు, ఇతర ఉన్నత రాజోద్యోగులకు కంటగింపుగా ఉండేది. అదను చూసి బీర్బల్‌ను దెబ్బతీయడానికి ఎప్పటికప్పుడు విఫలయత్నాలు చేస్తుండేవారు. అసూయపరుల ప్రయత్నాలు ఎలా ఉన్నా, బీర్బల్ పేరు ప్రతిష్ఠలు మాత్రం అంతకంతకు పెరగసాగాయి. మొఘల్ సామ్రాజ్యంలోనే కాదు, బీర్బల్ ప్రఖ్యాతి పొరుగు దేశాలకూ పాకింది. బీర్బల్ ప్రఖ్యాతి ఆ నోటా ఈ నోటా పర్షియా రాజు వరకు చేరింది. బీర్బల్ తెలివితేటలను ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో ఆయన బీర్బల్‌కు తమ దేశానికి ప్రత్యేక అతిథిగా రావాలంటూ ఆహ్వానం పంపాడు. అక్బర్ పాదుషా అనుమతితో బీర్బల్ పర్షియాకు ప్రయాణమయ్యాడు. పర్షియా రాజ్యంలో అడుగుపెడుతూనే బీర్బల్‌కు ఘనస్వాగతం లభించింది. పర్షియా రాజు బీర్బల్‌కు ఘనంగా అతిథి మర్యాదలు చేశాడు. అడుగడుగునా చక్కని విడిది వసతులు, రుచికరమైన విందులు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ్యంలోకి అడుగుపెట్టినది మొదలుకొని, పర్షియా రాజభటులు, ఉద్యోగులు బీర్బల్‌ను అంటిపెట్టుకుని ఉంటూ ఆయనకు కావలసిన ఏర్పాట్లన్నీ సజావుగా జరిగేలా చూసుకున్నారు. దగ్గర ఉండి మరీ వారు బీర్బల్‌ను రాజధానికి తీసుకువచ్చారు. రాజధానికి చేరుకున్న రోజు బీర్బల్ విశ్రాంతికి విలాసవంతమైన అతిథిగృహంలో ఏర్పాట్లు చేశారు. మరునాడు బీర్బల్ రాజోద్యోగులు వెంటరాగా పర్షియా రాజు దర్బార్‌లోకి అడుగుపెట్టాడు. బీర్బల్‌ను పర్షియా రాజు తన పక్కనే ఉన్నతాసనం మీద కూర్చోబెట్టుకుని, కుశల ప్రశ్నలు వేశాడు.‘బీర్బల్గారు! మీ వంటి మేధావి మా మిత్రుడైన అక్బర్ ఆస్థానంలో మంత్రిగా ఉండటం మాకూ గర్వకారణమే! మీకు నచ్చినన్ని రోజులు మా రాజ్యంలో అతిథిగా ఉండండి. రాజ్యం నలుమూలలా మీకు నచ్చినట్లు సంచారం చేయవచ్చు. అందుకు తగిన ఏర్పాట్లు చేయిస్తాను. మా రాజ్యంలోని పరిస్థితులను గమనించి, మెరుగు పరచుకోవలసిన అంశాలేమైనా ఉంటే సలహాలు ఇవ్వండి’ అని అన్నాడు.పర్షియా రాజ్యంలో కొన్నాళ్లు గడిపాక, బీర్బల్ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తన రాజ్యానికి తిరిగి బయలుదేరాలనుకుంటున్నానని పర్షియా రాజుకు తెలియజేశాడు. బీర్బల్ తిరుగు ప్రయాణానికి ముందురోజు అతడి గౌరవార్థం పర్షియా రాజు ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ దర్బారులోని మంత్రులు, సేనానాయకులు, ఉన్నతోద్యోగులు, రాజ్యంలోని కులీనులు, పెద్ద పెద్ద వర్తకులు ఆ విందులో పాల్గొన్నారు. విందులో కబుర్లాడుకుంటుండగా, పర్షియా మంత్రుల్లో ఒకరు వచ్చి బీర్బల్తో మాటలు కలిపాడు. ‘బీర్బల్ మహాశయా! మా రాజుగారి గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగాడు.‘మీ రాజావారికేం? ఆయన పున్నమి చంద్రుడు’ అని బదులిచ్చాడు బీర్బల్.‘మరి మీ రాజావారి గురించి ఏమంటారు?’ అడిగాడా మంత్రి.‘మా రాజావారు చవితి చంద్రుడు’ అన్నాడు బీర్బల్. అక్బర్ పాదుషాను చవితి చంద్రుడితోను, తనను పున్నమి చంద్రుడితోను పోలుస్తూ బీర్బల్ అన్న మాటలకు పర్షియా రాజు పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. సాగనంపేటప్పుడు బీర్బల్‌కు అనేక విలువైన కానుకలు ఇచ్చాడు. అక్బర్ పాదుషాకు అందజేయమంటూ మరిన్ని కానుకలనిచ్చాడు. వాటిని మోసుకుపోవడానికి గుర్రబ్బగ్గీలను, సేవకులను ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికాడు.బీర్బల్ ఢిల్లీకి చేరుకున్నాడు. అక్బర్ పాదుషా దర్బారులోకి అడుగుపెట్టాడు. అక్బర్ పాదుషా చిర్రుబుర్రులాడుతూ కనిపించాడు. బీర్బల్‌కు ఏమీ అర్థంకాలేదు.పర్షియా రాజు వద్ద బీర్బల్ అన్న మాటలు వేగుల ద్వారా అప్పటికే అక్బర్ పాదుషా చెవికి చేరాయి.అక్బర్ పాదుషా ఇక ఉక్రోషాన్ని అణచుకోలేక నేరుగా విషయంలోకి వచ్చేశాడు.‘మా గురించి ఏమనుకుంటున్నావు బీర్బల్? పొరుగు రాజు వద్ద పరువు తీస్తావా?’ అన్నాడు కోపంగా.‘పొరుగు రాజు వద్ద నేను మిమ్మల్ని పొగిడాను జహాపనా!’ అన్నాడు బీర్బల్.‘చాలు, చాలు! ఇక బొంకకు. అక్కడ నువ్వన్న మాటలన్నీ నాకు తెలుసు. పర్షియా రాజు పున్నమి చంద్రుడా? నేను చవితి చంద్రుణ్ణా? ఇదేనా నన్ను పొగడటం?’ మరింత కోపంగా అన్నాడు అక్బర్ పాదుషా.‘జహాపనా! నిజమే, ఆయన పున్నమి చంద్రుడు. పున్నమి తర్వాత చంద్రుడు క్షీణించడం ప్రారంభిస్తాడు. తమరు చవితి చంద్రుడు. భవిష్యత్తులో తమరు ఇంకా వృద్ధిలోకి వస్తారు. అందుకే అలా పొగిడాను. నా అదృష్టం బాగులేదు కనుక నన్ను తమరు అపార్థం చేసుకున్నారు’ అన్నాడు బీర్బల్.బీర్బల్ వివరణతో అక్బర్ సంతోషించాడు. తన మెడలోని హారాన్ని బహూకరించి సత్కరించాడు. -
బాల్యమొక స్ఫూర్తి
బాల్యం అనేది ప్రతీ ఒక్కరి జీవితానికి భవిష్యత్ పాఠశాల. చిన్నారులు ఎదిగే క్రమంలో వారి ఆలోచనలపై చూపించే ప్రభావమే వారి జీవిత గమ్యాలను నిర్దేశిస్తాయి. పిల్లల చిన్నప్పటి అభిరుచులే వారి లక్ష్యాలుగా మార్పు చెందుతాయి. ఈ ప్రయాణంలో కొందరు చిన్నారులు చదువులపై ఆసక్తి కనబరిస్తే మరి కొందరు సంగీతం, క్రీడలు, డాన్స్, పెయింటింగ్, సాహస కృత్యాలు ఇలా తదితర అంశాలపై మక్కువ చూపుతుంటారు. ఒకవైపు వారి చదువులను కొనసాగిస్తూనే ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్‌లో రాణిస్తుంటారు. పసిప్రాయంలోనే ఇలాంటి విభిన్న రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యాలతో రాణించిన కొందరు చిన్నారులను చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. బాల్యం నుంచే తమకంటూ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని అటు చదువులను ఇటు వారి ప్రయత్నాలను కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న బాలతారల ఆలోచనలను తడిమి చూద్దామా..? చిన్న వయసులో..పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు అచ్చు గుద్దినట్టు ఈ పాప సరిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే 9 ఏళ్ల వయసులోనే తన కంటే నాలుగేళ్లు పెద్ద వాళ్లతో తలపడి, గెలుపొంది ఔరా అనిపించుకుంటోంది. బ్యాడ్మింటన్ ఆటలో అద్భుతాలు సృష్టిస్తోంది లట్టాల శాన్వి. నగరంలోని మణికొండకు చెందిన శాని్వకి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న శాని్వ.. ఆటపై పూర్తిగా ఫోకస్ పెట్టేందుకు చదువు కూడా మానేసింది. రోజులో కనీసం 8 గంటల పాటు ఆటపైనే శ్రద్ధ పెడుతూ ప్రాక్టీస్ చేస్తోంది. ఒలంపిక్స్‌లో దేశం తరఫున ఆడి బంగారు పతకాన్ని సాధించడమే తన జీవిత లక్ష్యమని చెబుతోంది. ఇటీవల అసోంలో జరిగిన జాతీయస్థాయి అండర్–13 ర్యాంకింగ్ టోర్నమెంట్లో సింగిల్స్, డబుల్స్ విభాగంలో మెయిన్ డ్రాకు అర్హత పొంది సంచలనం సృష్టించింది.హైదరాబాద్నునంబర్ వన్ స్థానంలో.. అతి సాధారణ కుటుంబం మాది. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. మేము ఏది చేసినా మా కుటుంబానికి గుర్తింపు రావాలి. మా అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నగరంలోని యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో సుహేమ్ షేక్ అందిస్తున్న సహకారంతో ఈ సెయిలింగ్‌లో రాణించాను. వైఎఐ నార్త్ ఈస్ట్ రేగట్ట 2023 ఆప్టిమిస్టిక్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. వైఎఐ సికింద్రాబాద్ యూత్ క్లబ్ రేగట్ట 2023లో సిల్వర్ పతకం సాధించాను. వైఏఐ యూత్ నేషనల్లో ఆప్టిమిస్టిక్ విభాగంలో కాంస్యం గెలుపొందాను. మా ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ను నంబర్ వన్ స్థానంలో తీసుకువచ్చారు. నాతోపాటు నా సహోదరి కూడా సేలింగ్లోనే జాతీయ స్థాయిలో పలు పతకాలను సాధించింది. – లహరి, జాతీయస్థాయి సెయిలర్టీం ఇండియాకు ఆడటమే..క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం.. ప్రస్తుతం నేను హిమాయత్‌నగర్‌లోని స్లేట్ ది స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. బాగ్‌లింగంపల్లిలోని స్పాట్ లైట్ అకాడమీలో క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నాను. ఈ మధ్యనే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అండర్–17 విభాగంలో ఎంపికయ్యాను. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ఆడటమే లక్ష్యంగా క్రికెట్లో రాణిస్తున్నాను. సిటీలో జరిగిన పలు టోర్నమెంట్లలో మంచి స్కోర్ సాధించాను. అందరిలా కాకుండా విభిన్న క్రీడల్లో రాణించడానికి నాన్న అందించే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేను. ఇటు చదువులు, అటు క్రికెట్లో సమస్వయం చేసుకుంటూ ముందుకు సాగడానికి నాన్న విశేషంగా కృషి చేస్తున్నాడు. – వరీష సలార్ సినిమాతో గుర్తింపు.. ప్రతి విషయాన్ని వినూత్నంగా ఆలోచించడం నాకిష్టం. చిన్నప్పటి నుంచి విభిన్న కళల్లో ఆసక్తి కనబర్చేవాడిని. అనంతరం సినిమాలు, నటనపై మక్కువ పెరిగింది. ఏ చిన్న ఆడిషన్స్ ఉన్నా వెళ్లేవాడిని. ఈ ప్రయత్నంలో పలు మంచి ప్రాజెక్టుల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం వచి్చంది. ప్రముఖ సినీ హీరో అజిత్, త్రిష నటించిన గుడ్, బాడ్, అగ్లీ సినిమా, ప్రభాస్ సలార్ వంటి సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి. మరికొద్ది రోజుల్లో రానున్న వరుణ్ తేజ్ సినిమా మట్కాలో మంచి రోల్ చేస్తున్నారు. అంతేగాకుండా జగపతిబాబు తదితర టాలీవుడ్ స్టార్స్‌తో మరికొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను. సినిమాలతో పాటు చదువులోనూ రాణిస్తున్నాను. సినిమాల ప్రభావం నా చదువులపై పడకుండా చూసుకుంటున్నాను. భవిష్యత్తులో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేసే మంచి హీరోగా రాణించాలని ఉంది. – కార్తికేయ దేవ్, ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్హ్యాపీగా.. సాగుతున్న కెరీర్ ఓరి దేవుడా, సలార్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో చైల్డ్ ఆరి్టస్ట్‌గా నటించాను. ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియన్ స్టార్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలతో పాటు చదువు, క్రీడల్లోనూ ముందంజలో ఉన్నాను. సినిమాలతో మొదలై కెరీర్ హ్యాపీగా ముందు సాగుతోంది. సామాజిక బాధ్యతలను ప్రతిబింబించేలా, చిన్నారుల హక్కులను తెలియజేసేలా మంచి ప్రాజెక్టులను చేసే యోచనలో ఉన్నాను. ప్రస్తుతం మరో రెండు పెద్ద ప్రాజెక్టుల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాను. మ్యాథ్స్ ఇంగ్లిష్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. అంతేగాకుండా సంగీతంపైన కూడా ఆసక్తి. నేను పాటలు చాలా బాగా పాడగలను. – ఫర్జానా, చైల్డ్ ఆర్టిస్ట్ -
Sakshi Little Stars: తారే జమీన్ పర్
‘మేం పాటలు పాడతాం. డైలాగ్స్ గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాం. పొడుపుకథలు వేస్తాం, ప్రశ్నలతో తికమక పెట్టేస్తాం. స్కూల్లో చదువుకుంటాం, సినిమాల్లో నటిస్తాం, డ్యాన్స్‌లే కాదు అల్లరి కూడా చేస్తాం ...’ అంటూ బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం ‘సాక్షి’ మీడియా హౌస్ హైదరాబాద్ ఆఫీసులో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా పలువురు బాల తారలు తమ ఆనందాలను పంచుకున్నారు. స్కూల్ విద్యార్థులు అడిగిన పొడుపు కథలకు ఈ ‘లిటిల్ స్టార్స్’ ఆన్సర్ చేయడం, లిటిల్ స్టార్స్ కోరిన పాటలను స్కూల్ విద్యార్థులు పోటీ పడుతూ పాడటంతో కార్యక్రమం సందడిగా మారింది.స్కూల్లో రన్నింగ్, ఖోఖో, కబడ్డి, క్రికెట్, బాస్కెట్ బాల్... వంటి ఆటలన్నీ ఆడతాం అంటూ మొదలు పెట్టిన పిల్లలు కరెంట్ షాక్ ఎందుకు తగులుతుంది? బాల్ని కొడితే ముందుకు ఎలా వెళుతుంది? అంటూ సైన్స్ పాఠాలనూ వినిపించారు. లెక్కలు ఇష్టం అంటూనే డాక్టర్లం అవుతాం అనే భవిష్యత్తు ప్రణాళికలనూ చెప్పారు. సోషల్ మీడియాలో తమకున్న ఫాలోవర్స్ గురించి, చేస్తున్న రీల్స్ గురించి వివరించారు. ‘సాక్షి’ మీడియా హౌస్ వారం రోజుల పాటు జరిపిన ‘లిటిల్ స్టార్స్’ కార్యక్రమంలో భాగంగా కలిసిన చిన్నారులను గుర్తుకు తెచ్చుకొని, ‘మరో ప్రపంచం తెలుసుకున్నాం’ అంటూ తమ స్పందనను తెలియజేశారు బాల తారలు. టీవీ చానల్‌కి సంబంధించిన న్యూస్‌రూమ్, పీసీఆర్ వంటి వాటిని చూసి సంభ్రమాశ్చర్యాలను వెలిబుచ్చారు.మేమిద్దరం కవలలం. కలిసే చదువుకుంటాం. సినిమాల్లోనూ కలిసే వర్క్ చేస్తాం. మేం ఇద్దరం పెద్దయ్యాక సాఫ్ట్వేర్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. ఈ ్రపోగ్రామ్ ద్వారా మా ఇద్దరి ఆలోచనలను, మా ప్రతిభను షేర్ చేసుకునే అవకాశం లభించింది. ఇక్కడ న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఈ చిల్డ్రన్స్ డే మాకు వెరీ వెరీ స్పెషల్. – అర్జున్, అర్విన్నాకు నటుడిగా గుర్తింపు వచ్చిందంటే మా అమ్మే కారణం. ఇప్పటి వరకు పది సినిమాల్లో బాల నటుడిగా నటించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన తరువాత స్కూల్లో ఫ్రెండ్స్ నీ క్యారెక్టర్ సూపర్‌గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. రెండు మూడు పేజీల డైలాగ్‌లు కూడా ఒకేసారి చెప్పగలను. ఈ కార్యక్రమం ద్వారా నేను సినిమాల్లోని డైలాగ్స్ చెప్పే అవకాశం లభించింది. అలాగే, న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకున్నాను. ఈ పోగ్రామ్ మాకు పాఠంలా కొత్తదనాన్ని పరిచయం చేసింది. థాంక్యూ సాక్షి.– కె. హర్షచదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!ఏడేళ్ల వయసు నుంచి సినిమాలలో నటిస్తున్నాను. చదువు, సినిమాలతో పాటు బాస్కెట్ బాల్, క్రికెట్, డ్యాన్స్ కూడా చాలా ఇష్టం. స్కూల్, సినిమా షూటింగే కాదు ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ‘లిటిల్‌స్టార్స్’లో భాగంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలను కలిసినప్పుడు చాలా బాధపడ్డాను. తలస్సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలను చూసి, అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను. అలాగే ఈ ఫైనల్ ఈవెంట్లో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని డైలాగ్ చెప్పినప్పుడు అందరూ గ్రేట్ అంటూ మెచ్చుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ ్రపోగ్రామ్ చాలా బాగుంది. అందరికీ థ్యాంక్స్. – మోక్షజ్ఞతలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను కలవడానికి ‘సాక్షి’ మీడియా ద్వారా వెళ్లాను. చిన్న చిన్న పిల్లలు ఆ వ్యాధితో బాధపడుతుండటం చూసి, చాలా బాధగా ఫీలయ్యాను. కాసేపు వాళ్ల బాధని మరచిపోయేలా చేయాలని వాళ్లు అడిగిన డైలాగ్స్ చెప్పాను. వాళ్లను ఎంకరేజ్ చేసేలా మాట్లాడాను. మామూలుగా నేను చదువుకుంటాను, సినిమాలు చేస్తుంటాను. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. అలాంటి నాకు ఇలాంటి పిల్లలతో కాసేపు టైమ్ స్పెండ్ చేయడం ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్లినట్లు అనిపించింది. ఇక ‘సాక్షి మీడియా’ హౌస్‌లో ఏర్పాటు చేసిన ‘‘లిటిల్‌స్టార్స్’లో నాతోటి యాక్టర్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. – అనన్య ఈగ3చేసే పనిపై ఇష్టం ఉంటుంది కాబట్టి చదువు–సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటాను. ఈ ్రపోగ్రామ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్పర్శ్’ హాస్పిస్ కేంద్రంలో సేవలు పొందుతున్న చిన్నారులను కలిశాం. వారి పరిస్థితి చూశాక చాలా బాధ అనిపించింది. వారి ముఖాల్లో నవ్వులు తెప్పించాలని డ్యాన్స్‌లు చేశాం, పాటలు పాడాం... ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిల్డ్రన్స్ డే మాకు సాక్షి ఇచ్చిన ఓ పెద్ద గిఫ్ట్. – సయ్యద్ ఫర్జానారైతు స్వరాజ్య వేదిక ద్వారా అక్కడి పిల్లలను కలిసినప్పుడు వాళ్లు ఎంత కష్టపడుతున్నారో అనిపించింది. వాళ్ల నాన్న చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ బాగా చదువుకుని, అమ్మను బాగా చూసుకుంటాం అని వారు చెప్పినప్పుడు ‘గ్రేట్’ అనిపించింది. అలాగే కలెక్టర్ అవుతామని, డాక్టర్ అవుతామని వాళ్లు తమ భవిష్యత్తు గురించి, తమ ప్లాన్స్ గురించి చెప్పినప్పుడు వారి ధైర్యం చూసి భేష్ అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని చూశాం. – హనీషఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పిల్లలను చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. తర్వాత వాళ్లను హ్యాపీగా ఉంచాలనిపించింది. అందుకే మాటలు, పాటలతో వారితో కలిసిపోయాను. ఇంటికి వెళ్లాక మా నాన్నతో ఆ విషయాలన్నీ పంచుకున్నాను. ‘సాక్షి మీడియా’ వల్ల వాళ్లను కలిసి, నా వంతుగా కాసేపు వాళ్లని సంతోషపెట్టడానికి ట్రై చేశాను. ఈ చిల్డ్రన్స్ డే నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. – సాన్వికమూడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాను. నేను కోపం, బాధ, హ్యాపీ సీన్లలో బాగా నటిస్తాను అని చెబుతారు. ఏడుపు సీన్లలో గ్లిజరిన్ లేకుండా నటించడం చూసి, అందరూ మెచ్చుకున్నారు. టీవీలో అందరి ముందు నా టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశం లభించింది. ఇప్పుడు స్వయంగా టీవీ న్యూస్‌రూమ్, స్టూడియో... ఇవన్నీ చూడటం కొత్తగా అనిపించింది. – ఖుషీ రెడ్డిమూడేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు 25 యాడ్స్, 30 సినిమాల్లో నటించాను. హిందీ మూవీలో కూడా నటించాను. డ్యాన్స్, సంగీతం నేర్చుకుంటున్నాను. బాలరత్న అవార్డు కూడా వచ్చింది. ‘సాక్షి’ మీడియాతో కలిసి రైతు స్వరాజ్య వేదికకి వెళ్లి అక్కడి పిల్లలతో మాట్లాడటం బాగా అనిపించింది. ‘మా నాన్న లేరు’ అని వాళ్లు చెప్పినప్పుడు ఏడుపొచ్చింది. ఇక ఫైనల్ ఈవెంట్లో గోగో (బొమ్మ)తో మాటలు బాగా నచ్చాయి. ఎంత టైమ్ స్పెండ్ చేశామో తెలియనే లేదు. – శ్రేష్ట కోటకేంద్రీయ విద్యాలయాలో చదువుకుంటున్నాను. సినిమాల్లో నటిస్తున్నాను. తబలా వాయిస్తాను. డ్యాన్స్, మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సీరియల్స్‌లో కూడా నటిస్తున్నాను. ‘బాలోత్సవం’లో నాకు వచ్చిన పాటలు పాడాను. అందరూ సూపర్ అని మెచ్చుకున్నారు. – శ్రేయాన్ కోటఈ కార్యక్రమం ద్వారా తలసేమియాతో బాధపడుతున్నవారిని కలిశాను. వారిని నవ్వించాను కూడా... పాటలు పాడాను, డ్యాన్సులు చేశాను. అలాగే బుధవారం జరిగిన వేడుకలో నాలా సినిమాల్లో నటిస్తున్న మిగతా అన్నయ్యలు, అక్కలను కలుసుకోవడం హ్యాపీగా అనిపించింది. మా ఇష్టాలు, చదువు, ఆటలు, పాటలు, డైలాగ్స్ మీ అందరికీ చెప్పడం.. అన్ని విషయాలను షేర్ చేసుకోవడం బాగుంది. గోగో (బొమ్మ)తో బాగా ఎంజాయ్ చేశాం. – తనస్విఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్లని చూడగానే ఫస్ట్ చాలా ఏడుపొచ్చింది. అయితే మేం వాళ్లని హ్యాపీ చేయడానికి వెళ్లాం కాబట్టి, వాళ్లతో జోక్‌గా మాట్లాడాను. వాళ్లు నవ్వడం హ్యాపీ అనిపించింది. అలాగే ‘సాక్షి’ టీవీకి వచ్చి, అందరితో మాకు క్లాసులు చెప్పినవి, మేం సినిమాల్లో చేసినవి షేర్ చేసుకోవడం హ్యాపీ. పెద్దయ్యాక మహేష్‌బాబులాగా పెద్ద హీరోని అవుతాను. ఇక్కడ గోగో (బొమ్మ)తో కలిసి చేసిన అల్లరి బాగుంది. అలాగే, మాకు అన్ని న్యూస్ రూమ్‌లు చూపించారు. చాలా కొత్తగా అనిపించింది. – స్నితిక్చిన్ని మనసులు కదిలిన వేళ...పసి హృదయాలు కదిలిపోయాయి. చిన్న మనసులే అయినప్పటికీ తోటి చిన్నారులు పడుతున్న బాధ చూసి, చలించిపోయాయి. బాలల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ‘సాక్షి’ మీడియా హౌస్ జరిపిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కేన్సర్, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను, మృత్యువుతో పోరాడుతున్న పసిబాలలకు, తండ్రిని కోల్పోయిన వారిని, అనాథ బాలలను కలిశారు పలువురు బాల తారలు. కాసేపు ఆ చిన్నారులు తమ కష్టాన్ని మరచిపోయేలా చేసి, వారితో ఆడి పాడారు... నవ్వించారు. చివరగా ‘సాక్షి’ మీడియా హౌస్‌లో జరిగిన వేడుకలో స్కూల్ విద్యార్థులతో కలిసి ఈ బాల తారలు సందడి చేశారు. ఈ ‘బాలల దినోత్సవం’ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.టీవీలో న్యూస్ చదువుతారు కదా.... ఆ రూమ్ ఎలా ఉంటుందో చూస్తారా? ఎడిటింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? అసలు టీవీ స్టూడియో ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అనడమే ఆలస్యం ‘ఓ’ అంటూ ఆసక్తి కనబరిచారు లిటిల్ స్టార్స్. ‘సాక్షి టీవీ’ న్యూస్ రూమ్, పీసీఆర్ (ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్) వంటివి చూసి, ఆశ్చర్యపోయారు. టీవీ స్టూడియోలో జరుగుతున్న పనులను నిశితంగా గమనించారు.ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి ఈ QRకోడ్‌ను స్కాన్ చెయ్యండి -
ఫుడ్ సపోర్టింగ్
చిన్నారులకు ఆర్నెల్ల వయసు వచ్చాక, వారికి ఇచ్చే తల్లిపాలతో పాటు క్రమంగా ఘనాహారాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఇలా తల్లిపాలతో పాటు చిన్నారిని ఘనహారం వైపునకు మళ్లించడానికి ఇచ్చే ఆహారాన్ని కాంప్లిమెంటరీ డైట్‌గా చెప్పవచ్చు. అయితే పిల్లలకు ఆర్నెల్లు నిండేవరకు తల్లిపాలు మినహా ఎలాంటి ఇతర ఆహారాలూ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నిజానికి ఆర్నెల్ల వయసు వరకు పిల్లలకు నీళ్లు కూడా తాగించాల్సిన అవసరమూ ఉండదు. వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా ఇలా చిన్నారులను ఘనాహారం వైపునకు మళ్లించేందుకు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆహారం గురించి మార్కెట్ ప్రకటనల హడావుడి ఇటీవలి రోజుల్లో చాలా ఎక్కువగానే ఉంటోంది. నిజానికి కాంప్లిమెంటరీ డైట్ అనేది... తల్లిపాలతో పాటు పిల్లలకు ఆర్నెల్ల వయసు నుంచి అదనంగా ఇవ్వాల్సిన అనుబంధ ఆహారం మాత్రమే. కాబట్టి కాంప్లిమెంటరీ ఆహారమంటే అదేదో మార్కెట్లో మాత్రమే లభ్యమయ్యే ఆహారం అని అపోహపడాల్సిన అవసరం లేదు.కాంప్లిమెంటరీ డైట్ ఇవ్వాల్సిందిలా... ఘనాహారంలో భాగంగా పిల్లలకు ఉడికించిన అన్నం (రైస్), ఉడికించిన పప్పు (దాల్), అరటిపండు, ఉడకబెట్టిన కూరగాయలు (ఆలూ వంటివి) చిదిమి, మెత్తగా చేసి పెట్టాలి. అలాగే ఘనాహారం మొదలుపెట్టిన నాటి నుంచి వాళ్లకు కాచి చల్లార్చిన నీళ్లు పట్టాలి. ఇది మినహా మార్కెట్లో లభించే వాణిజ్య ప్రయోజనాలతో తయారు చేసిన ఎలాంటి ఆహారమూ ఇవ్వాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన ఈ ఆహారాన్ని ఆర్నెల్ల పిల్లలకు రోజూ 150 నుంచి 200 ఎమ్ఎల్ పరిమాణంలో రెండు నుంచి మూడు సార్లు తినిపించవచ్చు. పాలు ఎక్కువగా పట్టని పిల్లలకు రోజూ 3 నుంచి 5 సార్లు తినిపించవచ్చు. ఇక ఎనిమిది/తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు పైన పేర్కొన్న ఆహారమేగాక... ఇకపై మెత్తగా చిదిమిన రోటీ, కాస్తంత గట్టిగా వండిన పప్పు, ఇడ్లీ, రవ్వతో కాస్తంత జావలా వండిన ఆహారం (పారిడ్జ్), సపోటా, బొ΄్పాయి వంటి ఆహారం ఇవ్వవచ్చు. ఇక్కడ మనం పైన పేర్కొన్న ఆహారం కూడా కాంప్లిమెంటరీ ఆహారమే.కాంప్లిమెంటరీ ఆహారానికి నిర్వచమిదీ... అసలు కాంప్లిమెంటరీ ఆహారానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే... పిల్లలకు సరైనది, మృదువుగా ఉండేది, తేలిగ్గా జీర్ణమయ్యేది, స్థానిక సంస్కృతి ఆమోదించేది, తేలిగ్గా వండగలిగేది, భరించగలిగే ఆర్థిక స్తోమతను బట్టి చూస్తే చవకగా లభించేది అని అధ్యయనాల నిర్వచనం. ఇప్పుడు దీన్ని ‘కాంప్లిమెంటరీ ఆహారం’గా అభివర్ణిస్తున్నారు గానీ... గతంలో ఘనాహారాన్ని మొదలుపెట్టే ప్రక్రియను ఇంగ్లిష్‌లో ‘వీనింగ్’ అనేవారు. కానీ ఈ ప్రక్రియను వీనింగ్ అనడం అంత సమంజసం కాదని నిపుణులు అభి్రపాయం. నిజానికి వీనింగ్ అంటే పాలు పట్టడాన్ని క్రమంగా ఆపేస్తూ / నిలిపేస్తూ ఘనాహారానికి మళ్లడం అని అర్థం. కానీ... పిల్లలకు రెండేళ్లు నిండేవరకు తల్లిపాలు పట్టడం కొనసాగిస్తూనే ఈ ఘనాహారాన్ని అనుబంధంగా ఇవ్వాలి కాబట్టి దీన్ని ఇప్పుడు అనుబంధ ఆహారం (కాంప్లిమెంటరీ ఫుడ్) అంటున్నారు. ఇక ఆరు నెలలు నిండిన పిల్లలకు ఈ వయసు నుంచి ఎదుగుదలకు దోహదం చేసే ఆహారం అవసరం కాబట్టి ఈ టైమ్‌లో దీన్ని మొదలుపెట్టాలి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 30% నుంచి 35% మంది మాత్రమే పిల్లలకు ఆర్నెల్ల వయసు నుంచి అనుబంధ ఆహారాన్ని మొదలుపెడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంటోంది.త్వరగా మొదలుపెట్టడమూ, లేట్ చేయడం ఈ రెండూ సరి కాదు... ఇక కొద్దిమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కాస్తంత త్వరగా అంటే... మూడు లేదా నాలుగు నెలల వయసు నుంచే ఘనాహారాన్ని మొదలుపెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా మొదలుపెట్టిన పిల్లల్లో కొందరికి ఆహారం గొంతులో తట్టుకోవడం (చోకింగ్), నీళ్లవిరేచనాలు (డయేరియా), అలర్జీ వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే ఆలస్యంగా మొదలుపెడితే అది వాళ్ల సాధారణ పెరుగుదలపై దుష్ప్రభావం చూవచ్చు. అందుకే సరైన సమయంలో పిల్లలకు ఘనాహారం / అనుబంధ ఆహారం మొదలుపెట్టడం అన్నది ముఖ్యం. అలాగే ఘనాహారం ఇస్తున్నప్పటికీ పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వడం మేలు. అదే ఆరోగ్యకరం కూడా. -
బెడ్ వెట్టింగ్
సాధారణంగా పిల్లల్లో 95 శాతం మంది దాదాపుగా ఐదారేళ్ల వయసు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్ కంట్రోల్) సాధిస్తారు. కానీ నాలుగు శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా కొద్దిమందిలో అంటే... ఒక శాతం (1%) మందిలో పెద్దయ్యాక కూడా నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించడం సాధ్యం కాకపోవచ్చు. దాంతో కాస్తపెద్దయ్యాక కూడా... అంటే 10 – 12 ఏళ్లు వచ్చాక కూడా కొందరు పిల్లలు రాత్రివేళ పక్క తడుపుతుంటారు. ఇలా పిల్లలు రాత్రిపూట నిద్రలో మూత్రవిసర్జన చేసే సమస్యను వైద్యపరిభాషలో ‘నాక్టర్నల్ అన్యురిసిస్’ అంటారు. ఇది అబ్బాయిల్లో ఎక్కువ. ఇది కుటుంబంలో ఎవరికైనా ఉంటే... అలాంటి కుటుంబాల్లో 50 శాతం మందిలో... వాళ్ల పిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.అన్యురిసిస్ సమస్యలోనూ రెండు రకాలు ఉంటాయి. మొదటిది ‘ప్రైమరీ అన్యురిసిస్. రెండోది సెకండరీ అన్యురిసిస్. ప్రైమరీ అన్యురిసిస్ : చిన్నారులు ఒక్క రోజు కూడా విడవకుండా ప్రతిరోజూ పక్క తడుపుతుంటే దాన్ని ‘ప్రైమరీ అన్యురిసిస్’ అంటారు. సెకండరీ అన్యురిసిస్ : ఇలా రాత్రుళ్లు పక్క తడిపే పిల్లలు కొన్నాళ్ల పాటు పక్కతడపకుండా బాగానే ఉండి, కొంతకాలానికి వాళ్లలో సమస్య మళ్లీ తిరగబెట్టడాన్ని ‘సెకండరీ అన్యురిసిస్’గా చెప్పవచ్చు. ఇలా సెకండరీ అన్యురిసిస్ సమస్య రావడానికి తల్లిదండ్రుల మధ్య సయోధ్య లేకపోవడం, ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవడం, కుటుంబంలోకి తమ్ముడో, చెల్లెలో వచ్చినప్పుడు కలిగే ఈర్ష్య (సిబ్లింగ్ జెలసీ) వంటి కారణాలతో పిల్లల్లో నెలకొన్ని మానసిక ఆందోళన వంటి అంశాలను ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.ప్రైమరీ అన్యురిసిస్కు కారణాలు... ప్రైమరీ అన్యురిసిస్కు పిల్లల్లో నాడీ సంబంధమైన వికాసం కాస్త ఆలస్యంగా జరుగుతుండటం అంటే న్యూరోనల్ మెచ్యురేషన్ డిలే, మూత్రం ఉత్పత్తి కాస్త ఎక్కువగా జరుగుతుండటం (ఇన్క్రీజ్డ్ యూరిన్ ్ర΄÷డక్షన్), బ్లాడర్ సామర్థ్యం కాస్త తక్కువగా ఉండటం (డిక్రీజ్డ్ బ్లాడర్ కెపాసిటీ)తో పాటు జన్యుపరమైన అంశాలు కూడా ఇందుకు కారణమవుతాయి.ఇతర కారణాలు...ఇలా పెద్దయ్యాక కూడా రాత్రి నిద్రలో పక్కతడిపే సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో యూరినరీ ట్రాక్ అబ్నార్మాలిటీస్, బ్లాడర్ డిస్ఫంక్షన్, నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు, మలబద్ధకం, కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే మూత్రపరీక్షలతో పాటు హార్మోనల్ స్టడీస్ చేయించడం, బ్లాడర్ అనాటమీ అండ్ ఫంక్షనల్ టెస్ట్ చేయించడం అవసరం. వాటిని బట్టి ఇది హార్మోన్లకు సంబంధించిన సమస్యా, కాదా అని తెలుసుకోవచ్చు.ఈ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙నిద్రలో మూత్రవిసర్జన చేసే పిల్లలను కించపరచడం, శిక్షించడం వంటివి అస్సలు చేయకూడదు. ∙సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వడం, నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు పూర్తిగా ఇవ్వకపోవడం అవసరం. రోజులో తీసుకునే ద్రవపదార్థానికి 20 శాతానికి మించి 5 గంటల తర్వాత ఇవ్వకూడదు. ∙పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయించడం వల్ల పక్క తడిపే అవకాశాలను తగ్గించవచ్చు.మేనేజ్మెంట్ / కేర్...ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమెప్రమిన్ వంటి కొన్ని మందులు బాగా పనిచేస్తాయి. అలాంటి పిల్లలను కొన్ని స్ప్రేల సహాయంతో సామాజిక ఉత్సవాలకు నిర్భయంగా తీసుకెళ్లవచ్చు. అలాంటి చర్యల వల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ∙ఈ సమస్యకు హార్మోన్లోపాలు కారణం అయితే 3–6 నెలలపాటు మందులు వాడటం వల్ల ఈ సమస్యను 50 శాతం మందిలో సమర్థంగా అదుపు చేయవచ్చు. ∙ -
పిల్లల కథ: మారిన కల్పకి
రాజాపురంలో రంగయ్య ఆనే వర్తకుడు ఉండేవాడు. అతను కొత్తగా ఓ పెద్ద బంగళా కట్టించాడు. కిటికీలకు ఖరీదైన అద్దాలు పెట్టించాడు. అతని ఇంటి ముందు ఓ వేపచెట్టు ఉండేది. చెట్టుపైన కల్పకి అనే కాకి గూడు కట్టుకుంది.అది ఇతర కాకులతో కలవకపోగా, ఇంకో కాకి అటుగా వస్తే ముక్కుతో పొడుస్తూ తరిమేసేది. ఒకరోజు అది ఉదయాన్నే రంగయ్య ఇంటి గోడ మీద కూర్చొంది. యథాలాపంగా కిటికీ అద్దం వైపు చూసింది. అందులోని తన ప్రతిబింబాన్ని మరో కాకిగా భావించి.. ‘కావ్..కావ్’ మని అరిచింది. తన పదునైన ముక్కుతో కిటికీ అద్దాన్ని పొడవసాగింది. అదే చెట్టు మీద ఒక కోతి ఉండేది. అది కల్పకి అద్దాన్ని పొడవటం చూసి ‘మిత్రమా! అద్దాన్ని పొడవకు. పగిలి నీ ముక్కుకు గాయం కాగలదు’ అంటూ హెచ్చరించింది. కోతి మాటలను కల్పకి పట్టించుకోలేదు. కాకి చర్యను గమనించిన రంగయ్య.. పనివాడిని పిలిచి అద్దం మీద గుడ్డ కప్పమని చెప్పాడు. పనివాడు ‘ఉష్షో.. ఉష్షో..’ అని తరుముతూ కల్పకిని వెళ్లగొట్టాడు. అద్దాన్ని గుడ్డతో కప్పేశాడు. కొంతసేపటికి మళ్లీ వచ్చి గోడపై వాలింది కల్పకి. కిటికీ వైపు చూసింది. అక్కడ కాకి కనపడలేదు. దాంతో అది చెట్టు వైపు తిరిగి కోతితో ‘మన దెబ్బకు దడుచుకొని పారిపోయింది చూడు’ అంది గర్వంగా! ‘మిత్రమా.. అది అద్దం. అందులో కనిపించేది నువ్వే! ఇతర కాకులతో ఐక్యంగా ఉండాలి కానీ, ఇలా పోట్లాడకూడదు. పైగా మీ కాకులు ఐకమత్యానికి పెట్టిన పేరు. నువ్వొక్కదానివే ఇలా ఎందుకున్నావ్?’ అంది కోతి. ‘ఈ చెట్టు చుట్టుపక్కల నేనొక్కదాన్నే ఉండాలి. ఇంకో కాకి ఇటు దిక్కే రాకూడదు’ అంటూ ఎగిరి పోయింది కల్పకి. అలా కాకి ఎగిరిపోవడంతో అద్దం మీది గుడ్డను తీసేయమని పనివాడికి చెప్పాడు రంగయ్య. మరునాడు కల్పకి తిరిగి గోడపై వాలింది. అద్దంలో కాకి కనిపించేసరికి మళ్లీ కోపంతో ఠపీ ఠపీమంటూ అద్దాన్ని పొడవసాగింది. దాంతో అద్దం పగిలింది. ఆ గాజుముక్కలు కోసుకుని కల్పకి ముక్కుకు గాయమైంది. అది చూసిన కోతి గబగబా నాలుగాకులు తెచ్చి.. కాకికి పసరు వైద్యం చేసింది. బుద్ధొచ్చిన కల్పకి కోతికి కృతజ్ఞతలు తెలిపింది. తర్వాత తన కాకుల గుంపును చేరి, క్షమించమని వేడుకుంది. తప్పు తెలుసుకున్న కల్పకిని మిగిలిన కాకులన్నీ క్షమించి తమ గుంపులో కలుపుకున్నాయి. మారిన కల్పకిని చూసి కోతి ఆనందించింది. -
నేటి బాలలే రేపటి మేధావులు!
నేటి బాలలే రేపటి పౌరులంటే అందరూ ఒప్పుకుంటారు. కానీ, నేటి బాలలే రేపటి మేధావులంటే అనుమానంగా చూస్తారు. పిల్లలందరూ జీనియస్‌లు ఎలా కాగలరు? అని ప్రశ్నిస్తారు. నాకో పదిమంది పిల్లలను ఇవ్వండి. వారు పెరిగి పెద్దయ్యాక ఏం కావాలనుకుంటే అదయ్యేలా పెంచగలనని అప్పుడెప్పుడో చెప్పాడు ప్రముఖ బిహేవియరల్ సైకాలజిస్ట్ జేబీ వాట్సన్.ఇదిగో వీరికి సాధ్యమైంది.. తల్లిదండ్రులు తలచుకుంటే, సరైన వాతావరణాన్ని సృష్టిస్తే ప్రతి బిడ్డా తానెంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరతాడనడానికి అనేక ఉదాహరణలున్నాయి. 1898లో పుట్టిన విలియమ్ జేమ్స్ సిడిస్ అనే బాలుణ్ని బాలమేధావిగా మార్చారు. రిచర్డ్స్ విలియమ్స్ అనే తండ్రి తన బిడ్డలిద్దరినీ ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణులు విలియమ్స్ సిస్టర్స్‌గా తీర్చిదిద్దాడు. లాజ్లో పోల్గార్ అనే టీచర్ తన ముగ్గురు బిడ్డలనూ చెస్ గ్రాండ్ మాస్టర్స్ పోల్గార్ సిస్టర్స్‌గా తీర్చిదిద్దాడు. పట్నాకు చెందిన నారాయణ్ తులసి అనే ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుడు తథాగత్ అవతార్ తులసిని బాల మేధావిగా తీర్చిదిద్దాడు. తాజాగా కేరళకు చెందిన ఆవిర్భావ్ అనే ఏడేళ్ల బాలుడు సూపర్ స్టార్ సింగర్–3 విజేతగా నిలిచాడు. రెండేళ్ల వయసు నుంచే అతని చుట్టూ సంగీత ప్రపంచాన్ని సృష్టి్టంచడంతో అది సాధ్యమైంది. గట్టిగా అనుకుంటే అవుతుంది..మీరు తలచుకుంటే మీ బిడ్డనూ మేధావిగా పెంచవచ్చు. అందుకు చేయాల్సిందల్లా వారి మనసులోని అనేకానేక మ్యాట్రిక్స్లను బలోపేతం చేయడమే. కాగ్నిటివ్ మ్యాట్రిక్స్: పిల్లల మేధో వికాసానికి పునాది. సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో, ప్రతికూలతలను అధిగమించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఎందుకు’, ‘ఎలా’ వంటి ప్రశ్నలతో సంభాషణలను ప్రోత్సహించడం ద్వారా ఇన్వెంటివ్ మైండ్‌సెట్‌ని ప్రోత్సహించాలి.ఎమోషనల్ మ్యాట్రిక్స్: పిల్లలకు తెలివితేటలు ఎంత ముఖ్యమో భావోద్వేగాలు కూడా అంతే ముఖ్యం. భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఇది వారిలో ధైర్యాన్ని, ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.హెరిడిటరీ మ్యాట్రిక్స్: కుటుంబ వాతావరణం, సామాజిక పరిస్థితులు జన్యు వ్యక్తీకరణను ప్రభావితం చేయగలవని ఎపిజెనెటిక్స్ పరిశోధనలు చెబుతున్నాయి. ఇంట్లో సానుకూల, ప్రేరణాత్మక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా జీన్స్ మ్యాట్రిక్స్‌ను అభివృద్ధి చేయవచ్చు. లాంగ్వేజ్ మ్యాట్రిక్స్: పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మనసులోని భావాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి భాష అవసరం. పిల్లలతో కలిసి కథలు చదవడం, చెప్పడం, చర్చించడం ద్వారా దీన్ని సుసంపన్నం చేయవచ్చు. బిహేవియర్ మ్యాట్రిక్స్: పిల్లల దీర్ఘకాల విజయంలో అలవాట్లు, సంకల్పం ప్రధానపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన రొటీన్లను సృష్టించడానికి పిల్లలకు సహాయం చేయడం ద్వారా దీన్ని బలోపేతం చేయవచ్చు. సోషల్ మ్యాట్రిక్స్: మనిషి సంఘజీవి. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో కుటుంబం, స్నేహితులు, పరిసరాల ప్రభావం ఉంటుంది. గౌరవం, దయ, సానుభూతి వంటి లక్షణాలను పిల్లలకు నేర్పడంలో ఆదర్శంగా ఉండాలి. మోరల్ మ్యాట్రిక్స్: పిల్లలు ఎదుగుతున్న కొద్దీ నైతిక భావనలు అభివృద్ధి చెందుతాయి. ఇవి వారి ప్రవర్తనను, నిజాయితీని, జీవితం పట్ల వారి ఉద్దేశాన్ని ప్రభావితం చేస్తాయి. న్యాయం, దయ, బాధ్యత గురించి పిల్లలతో చర్చించడం ద్వారా వారిలో బలమైన నైతిక చైతన్యాన్ని పెంపొందించవచ్చు.స్కూల్లో చేర్పించడంతో తల్లిదండ్రుల పాత్ర పూర్తికాదని గుర్తించాలి. వారి మనసులోని అనేకానేక మ్యాట్రిక్స్లను అభివృద్ధి చేయడం బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే బిడ్డ సంపూర్ణ సామర్థ్యంతో ఎదుగుతాడు. అతనిలోని జీనియస్ మ్యాట్రిక్స్ ఆవిష్కృతమవుతుంది. ఆ దిశగా ఈరోజే అడుగులు వేయండి. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి బిడ్డా మేధావే..పుట్టిన ప్రతి బిడ్డా జీనియస్ కాగలిగిన సామర్థ్యంతోనే పుడుతుంది. కానీ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పరిసరాలు, పాఠశాల, ఉపాధ్యాయులు, సమాజం ఆ బిడ్డ చుట్టూ కనిపించని పరిమితులను ఏర్పరుస్తారు. కనిపించని ఆ వలలో చిక్కుకున్నవారు అదే నిజమని నమ్మి, ఆ పరిమితుల్లోనే పనిచేసి, పరిమితమైన విజయాలతో సంతృప్తి చెందుతుంటారు. కొద్దిమంది మాత్రమే తమ చుట్టూ ఉన్న పరిమితులను అధిగమించి, తమలోని ప్రతిభను పూర్తిగా చాటడం ద్వారా జీవితాల్లో, సమాజంలో శాశ్వతమైన మార్పు తీసుకువస్తారు. అలాంటి వ్యక్తులనే జీనియస్ అంటారు. -
బుల్లి డిజైనర్ బ్రూక్...
స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఆ అమ్మాయి ఫ్యాషన్ షోగా భావించేది. పోటీదారులకు దుస్తుల డిజైనింగే కాదు స్టయిలింగ్ కూడా చేసేది! ఫ్యాషన్ మీద ఆమెకున్న ఇష్టాన్ని అమ్మ, అమ్మమ్మ కూడా గుర్తించి, ప్రోత్సహించడంతో అతి చిన్న వయసులోనే పలువురు మెచ్చే ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది! బ్రాండ్నీ క్రియేట్ చేసింది! ఆ లిటిల్ స్టయిలిస్టే బ్రూక్ లారెన్ సంప్టర్.బ్రూక్ లారెన్ సంప్టర్ చిన్నప్పటి నుంచి దుస్తులు, నగలు, పాదరక్షలు.. ఏవైబుల్లి డిజైనర్ బ్రూక్...నా సరే తనకిష్టమైనవే వేసుకునేది. బర్త్‌డేలు, పండుగలప్పుడే కాదు మామూలు రోజుల్లోనూ అదే తీరు! ఇంకా చెప్పాలంటే నైట్ గౌన్స్ పట్ల కూడా శ్రద్ధ చూపేది. ఈ తీరును మొదట్లో వాళ్లమ్మ ఎర్రిస్ ఆబ్రీ.. కూతురి మొండితనంగా భావించింది. కానీ రెండేళ్ల వయసు నుంచే బ్రూక్ తనకి స్టయిలింగ్‌లో సలహాలు ఇవ్వటం, ఫ్రెండ్స్ కోసం పిక్నిక్ టేబుల్, ఫ్లవర్ పాట్స్, గిఫ్ట్ బాక్స్‌ను డిజైన్ చేయడం వంటివి చూసి.. కూతురిలో ఈస్తటిక్ సెన్స్, క్రియేటివిటీ మెండు అని గ్రహించింది. బ్రూక్ చూపిస్తున్న ఆసక్తిని ఆమె అమ్మమ్మా గమనించి మనమరాలికి దుస్తులు కుట్టడం నేర్పించింది. దాంతో స్కూల్ నుంచి రాగానే ఫ్యాబ్రిక్‌ని ముందేసుకుని డిౖజñ న్ చేయడం మొదలుపెట్టేది. అలా కేవలం ఐదేళ్ల వయసులోనే బ్రూక్ తన మొదటి ఫ్యాషన్ షోను నిర్వహించింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో రెండు కుట్టుమిషన్లను కొనిపించుకుంది. అమ్మా, అమ్మమ్మను తన అసిస్టెంట్లుగా పెట్టుకుంది. వందకు పైగా డిజైన్స్‌ను క్రియేట్ చేసేసింది. అవి ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2022 చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఎమ్మీ అవార్డు వేడుక కోసం ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, నటి తబితా బ్రౌన్కి బ్రూక్ సంప్టర్ ఒక అందమైన గౌన్‌ను డిజైన్ చేసింది. దీంతో ఎమ్మీ వేడుకల కోసం దుస్తులను డిజైన్ చేసిన అతి పిన్న వయస్కురాలిగా బ్రూక్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు. బార్బీ సంస్థకు బేస్ బాల్ బార్బీ, ఫొటోగ్రాఫర్ బార్బీ అనే రెండు థీమ్ డిజైన్స్‌నూ అందించింది. ఈ మధ్యనే తన పేరు మీద ‘బ్రూక్ లారెన్’ అనే ఫ్యాషన్ బ్రాండ్‌నూ స్థాపించింది. ఇప్పుడు ఆ బ్రాండ్ టర్నోవర్ కోటి డాలర్లకు (రూ.84 కోట్లు) పైమాటే! చిన్నపిల్లల కోసం ఈ బ్రాండ్.. చక్కటి దుస్తులను డిజైన్ చేస్తోంది. ఇవి ఎంత ఫ్యాషనబుల్‌గా కనిపిస్తాయో అంతే కంఫర్ట్గానూ ఉంటాయి. అదే బ్రూక్ ‘బ్రాండ్’ వాల్యూ! కొన్ని నెలల కిందటన్ బ్రూక్ ‘టామ్రాన్ హాల్’ షోలోనూ కనిపించింది. అందులో తన డిజైన్స్, ఫ్యాషన్ పరిశ్రమలో తనకెదురైన అనుభవాలు, సాధించిన విజయాలను వివరించింది. కలను సాకారం చేసుకోవడానికి కావాలసింది పట్టుదల అని, లక్ష్య సాధనలో వయసు ఏ రకంగానూ అడ్డు కాదని నిరూపించింది బ్రూక్ లారెన్. స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో గెలవటం కంటే ఆడియన్స్ నా డిజైన్స్‌ను చూసి, కేరింతలతో ఇచ్చే ప్రశంసలే నాకు ఉత్సాహాన్నిస్తాయి. అందుకే ఆ పోటీల్లో నాతో పాటు నా ఫ్రెండ్స్‌కీ డ్రెసెస్ డిజైన్ చేసేదాన్ని.– బ్రూక్ లారెన్ సంప్టర్ -
14 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పాల్గొని....
ఒలింపిక్స్.. ప్రపంచ క్రీడల్లో అత్యుత్తమ, అతి పెద్ద మెగా ఈవెంట్. ఆటలంటే ఇష్టం ఉండే మన చిన్నారులందరూ టీవీల్లో ఒలింపిక్స్ పోటీలను చూస్తూనే ఉంటారు. ఇటీవల.. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 2024 ఒలింపిక్స్ పోటీలు జరిగాయి. స్పోర్ట్స్‌లోకి వచ్చిన వారందరికీ ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే లక్ష్యం ఉంటుంది. ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత బాగా ఆడితేనే ఒలింపిక్స్ వరకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కర్ణాటకకు చెందిన ధీనిధి డేసింగు అనే అమ్మాయి కూడా అలాగే కలలు కన్నది. స్విమ్మర్ అయిన ఈ అమ్మాయి ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు చాలా శ్రమించింది. ఎట్టకేలకు తన స్వప్నాన్ని నెరవేర్చుకుంది. అయితే ఈ క్వాలిఫికేషన్ సాధించడమే గొప్ప కాదు. దీంతో ఆమె మరో అరుదైన, ఆసక్తికరమైన ఘనతను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో ఆడే సమయానికి ధీనిధి వయసు ఎంతో తెలుసా.. కేవలం పద్నాలుగేళ్లు. బెంగళూరులో ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆ వయసు పిల్లలు అందరూ స్కూల్లో పాఠాలు చదవడంలో బిజీగా ఉంటే ధీనిధి ఏకంగా ఒలింపిక్స్‌లో పాల్గొని తన ప్రతిభను రుజువు చేసుకుంది. చిన్న వయసులోనే ఆటల్లో రాణించాలనుకునే అందరికీ ఆమె స్ఫూర్తిగా నిలిచింది. తల్లిదండ్రులు అండగా ఉండి..ఒలింపిక్స్ వరకు చేరే క్రమంలో ధీనిధి తనను తాను మలచుకున్న తీరు చిన్నారులందరికీ ప్రేరణనిస్తుంది. ఆమెకు మూడేళ్లు వయసు వచ్చిన తర్వాత కూడా మాటలు రాలేదు. ఇంజినీర్లు అయిన తల్లిదండ్రులు శ్రీనివాసన్, జెసితలకు ఇది ఆందోళన కలిగించింది. డాక్టర్లను కలిసి చికిత్స అందించిన తర్వాత పరిస్థితి మెరుగైంది. అయితే వయసు పెరుగుతున్నా కొత్తవాళ్లతో కలవడంలో, వారితో మాట్లాడటంలో ధీనిధికి భయం పోలేదు. అందుకే అందరికీ దూరంగా, ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడేది. తన చదువు తాను చదువుకోవడం మినహా ఇతర విషయాలను పట్టించుకోకపోయేది. అయితే ఆ పరిస్థితి మారాలంటే ఏం చేయాలనే ఉపాయాన్నీ వైద్యులే సూచించారు. చిన్న పిల్లలకు ఆటలంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఆటలో చేర్పిస్తే కలివిడితనం పెరిగే అవకాశం ఉంటుందని వారు చెప్పారు. తల్లిదండ్రులిద్దరికీ బ్యాడ్మింటన్ అంటే బాగా ఇష్టం. అయితే దానిని నేర్చుకునేందుకు చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆ ఆలోచన మానుకొని తమ ఇంటి పక్కనే ఉన్న స్విమింగ్ పూల్‌లో ఈత నేర్చుకునేందుకు చేర్పించారు. ఆమె కొందరు స్నేహితులను సంపాదించుకుంటే చాలనేది మాత్రమే వారి ఆలోచన. అయితే తమ అమ్మాయి ఊహించినదానికంటే వేగంగా దూసుకుపోయి ఒలింపిక్స్ స్థాయి వరకు వెళుతుందని అప్పుడు వారికి తెలీదు. తొలి గెలుపు తర్వాత...తల్లిదండ్రులు స్విమింగ్‌లో చేర్పించినా.. అక్కడా ధీనిధి అంత ఇష్టం చూపించలేదు. ముందుగా నీళ్లంటే భయంతో పూల్‌లోకి దిగడానికే వెనుకాడింది. అయితే వాళ్లిద్దరూ అక్కడే ఉండి ధైర్యం చెప్పడంతో ఎట్టకేలకు తొలి అడుగు వేసింది. ఇలాంటి పిల్లలను తీర్చిదిద్దడంలో మంచి పేరున్న అక్కడి కోచ్ నెమ్మదిగా ఆమెకు ట్రైనింగ్ ఇవ్వడంతో స్విమింగ్ అంటే భయం పోయింది. ఆ తర్వాత ఆ కోచ్ మరింత శిక్షణతో స్థానిక పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అక్కడే ఒక రేస్‌లో గెలవడంతో ఆ అమ్మాయికి కొత్త ఉత్సాహం వచ్చింది. పూల్‌లో మరిన్ని సంచలనాలకు సిద్ధమైంది. వరుస విజయాలతో..ఎనిమిదేళ్ల వయసులో ధీనిధి స్విమింగ్ నేర్చుకుని, తర్వాత ఆరేళ్లలోనే ఒలింపిక్స్ స్థాయికి ఎదగడం విశేషం. బెంగళూరులో ఎంతో పేరున్న డాల్ఫిన్ అక్వాటిక్స్లో చేరడంతో ఒక్కసారిగా ఆమె ఆటలో పదును పెరిగింది. అన్నింటికంటే ముందుగా కర్ణాటక మినీ ఒలింపిక్స్‌లో స్విమింగ్‌లో అందుబాటులో ఉన్న అన్ని పతకాలనూ గెలుచుకొని తన రాకను ఘనంగా చాటింది. ఆపై జాతీయ సబ్‌జూనియర్ చాంపియన్‌షిప్‌లో కొత్త రికార్డు నెలకొల్పి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ పోటీల్లో 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో పాల్గొన్న ఆమె ఇప్పటికీ దానినే తన ప్రధాన ఈవెంట్‌గా కొనసాగిస్తోంది. ఆ తర్వాత జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో అందరి దృష్టీ పడగా.. 12 ఏళ్ల వయసులో జాతీయ సీనియర్ స్విమింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో ధీనిధి సత్తా అందరికీ తెలిసిపోయింది. గోవా జాతీయ క్రీడల్లో ఆమె ఏకంగా 7 స్వర్ణ పతకాలు గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో జరిగిన ఏజ్ గ్రూప్ పోటీల్లో కూడా పాల్గొని వరుసగా పతకాలు గెలుచుకుని, తన ప్రతిభకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ స్థాయిని పెంచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో...జాతీయ స్థాయిలో టాప్ స్విమ్మర్‌గా ఎదిగిన ధీనిధి తర్వాత లక్ష్యం సహజంగానే అంతర్జాతీయ పోటీలకు మారింది. భారత టాప్ స్విమ్మర్‌గా 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కింది. 13 ఏళ్ల వయసులో భారత బృందంలో అతి పిన్న వయస్కురాలిగా ఆమె ఒక మెగా ఈవెంట్లో తొలిసారి అడుగు పెట్టింది. ఆ తర్వాత దోహాలో జరిగిన వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొనడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇదే క్రమంలో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించడంలో సఫలమైంది. ప్రపంచ అగ్రశ్రేణి స్విమ్మర్లతో పోలిస్తే పతకాల విషయంలో ధీనిధి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో ఈ అమ్మాయి ప్రదర్శన చూసిన తర్వాత.. ఇంత చిన్న వయసులో ఇంతటి ప్రతిభను కనబర్చడం అసాధారణమని, భవిష్యత్తులో అగ్రశ్రేణికి ఎదిగే నైపుణ్యం, తగినంత సమయం కూడా ఆమె వద్ద ఉందని అక్కడి విదేశీ కోచ్‌లు, నిపుణులు వ్యాఖ్యానించడం ధీనిధి బంగారు భవిష్యత్తు గురించి తెలియజేస్తోంది. -
Manasvi Kottachi: బేబీ మనస్వి
వారసత్వంగా పరిచయమై కొంతమంది పేరు తెచ్చుకుంటే.. మరి కొంతమంది తమ ప్రతిభతో కుటుంబానికి వన్నె తెస్తారు. అలాంటి వారిలో బాల నటి మనస్వి కొట్టాచ్చి ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంటరై, తండ్రికే పోటీ ఇచ్చి, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ లిటిల్ స్టార్ గురించి∙ కొన్ని విషయాలు..⇒ నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. రకరకాల నాన్‌వెజ్ ఐటమ్స్ తినొచ్చనే నాన్నతో కలిసి షూటింగ్స్‌కు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు నటనపై ఇష్టం, ప్రేమతో పాటు సీరియస్‌నెస్ కూడా పెరిగింది.– మనస్వి కొట్టాచ్చి.⇒∙చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.⇒ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సినీ ప్రపంచంలోనే ఉంది మనస్వి. మూడేళ్ల వయసులో ‘సూపర్ డాడీ’ టీవీ షో ద్వారా తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.⇒ చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.⇒ఈ చిన్నారి నటనకు ముచ్చటపడిన మలయాళ చిత్రపరిశ్రమా చక్కటి అవకాశాలను ఇచ్చింది. అందులో ఒకటే ‘మై శాంటా’ మూవీ. ఇందులో ఆమెది ప్రధాన పాత్ర. శ్రీమణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ చిత్రం ‘కన్మణి పాప’లోనూ ముఖ్య భూమికే! ⇒ తర్వాత ‘ఇమైక్క నొడిగళ్’ అనే చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో నయనతార కుమార్తెగా నటించింది. ఇది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆపై ‘దర్బార్’, ‘మామణిదన్’, ‘చంద్రముఖి–2’ వంటి సినిమాల్లోనూ నటించింది.⇒మనస్వి నటించిన ‘మామణిదన్’ను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దాని ఫలితంగా మనస్వికి బాలీవుడ్‌లోనూ చాన్స్ వచ్చింది. ఆమె నటించిన హిందీ సినిమా ‘బేబీ కాజల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
పిల్లలూ దేవుడూ చల్లని వారే
పాటలు హీరో, హీరోయిన్ల సొంత సొత్తు కాదు. ఒకప్పుడు సినిమాల్లో పిల్లల పాత్రలు ఉండేవి. వారికి పాటలు ఉండేవి. పిల్లలు కథను నడిపించేవారు. పాటలు పాడి కథను నిలబెట్టేవారు. పిల్లల పాటల కోసం సినిమాలు హిట్ అయిన సందర్భాలున్నాయి. పిల్లల పాటలతో స్టార్స్ అయిన బాల నటీనటులు ఉన్నారు. కాని నేటి సినిమాల్లో పిల్లల పాటలు కనుమరుగయ్యాయి. వారి గొంతును వినపడనివ్వడం లేదు.పిల్లల పాట మళ్లీ బతకాలి. పిల్లల పాత్ర మళ్లీ నిలవాలి.‘లేరు కుశలవుల సాటి...సరి వీరులు ధారుణిలో’....‘లవ కుశ’లో లవుణ్ణి, కుశుణ్ణి చూడటానికి పల్లెల నుంచి జనం బండ్లు కట్టుకుని వచ్చేవారు. వారి నోటి నుంచి రామాయణ గాథను పాటలుగా విని పరవశించి పోయేవారు. ఉద్వేగంతో ఆనందబాష్పాలు రాల్చేవారు. పెద్దలు రామాయణం చెప్తేనే ఎంతో రుచిగా ఉంటుందే, మరి పిల్లలు చెప్తే ఇంకెంత రుచి!శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా!ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా!చెప్పాలంటే మనవాళ్లు చాలా గొప్పోళ్లోయి! ఏమంటే 1934లోనే లవకుశ తీశారు. అందులోని బాలనటులను, వారి పాటలను చూసి డబ్బులు కుమ్మరించారు. దాంతో దర్శకుడు సి.పుల్లయ్య పిల్లలు ప్రధాన పాత్రలుగా అంటే పిల్లలే అన్ని పాత్రలు చేసేలా ‘సతీ అనసూయ’ (1936) సినిమా తీసి దాంతో పాటు మరో పిల్లల సినిమా ‘ధ్రువ విజయం’ తీసి ఒకే టికెట్ మీద ఈ రెండు సినిమాలు ప్రదర్శించి రికార్డు స్థాపించారు. ఇలా మరో భాషలో జరగలేదు. ఈ విషయం మనవారు ప్రచారం చేసుకోరు. అన్ని పాత్రలను బాలలే ధరించిన సినిమాను దేశంలో తొలిగా తీసింది మనమే.చిన్నప్పుడు పెద్దప్పుడు:పాఠకులు ప్రేక్షకులుగా మారుతున్న కాలం. చదివే కథ నుంచి చూసే కథకు మారాలంటే వారికి ‘సినిమా’ అనే మీడియం మెల్లగా అలవాటు చేయాలి. అందుకని దర్శకులు కథను మెల్లగా చెప్పేవారు. కథానాయిక, నాయకుల జీవితాన్ని బాల్యం నుంచి మొదలుపెట్టి వారు పెద్దయ్యాక ఏం జరుగుతుందో చూపేవారు. అందువల్ల నాటి సినిమాల్లో పిల్లల పాత్రలు తప్పనిసరిగా ఉండేవి. ‘మల్లీశ్వరి’ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్, చిన్నప్పటి భానుమతిగా నటించిన మాస్టర్ వెంకటరమణ, బేబీ మల్లిక –‘రావిచెట్టు తిన్నె చుట్టు రాతి బొమ్మలు చెక్కాలోయ్మంచి బొమ్మలు చెక్కాలోయ్ నీ మల్లి బొమ్మలు చెక్కాలోయ్’అని పాడుకుంటే చూడటం ముచ్చటగా ఉంటుంది. మరి ఇవాళ రావిచెట్టు ఎంతమంది పిల్లలకు తెలుసో, తిన్నె అనే మాట ఎంతమంది పిల్లలకు అర్థమవుతోందో!అక్కినేని ‘దేవదాసు’లో చిన్నప్పటి దేవదాసు, చిన్నప్పటి పార్వతి పాడుకుంటారు. స్కూల్ ఎగ్గొట్టి తిరిగే దేవదాసును పార్వతి ఆ పాటలో ఆట పట్టిస్తుంది.‘ఓ దేవదా.. చదువు ఇదేనాఅయ్యవారు నిదరోతే తమరు ఇలాగే దౌడుదౌడా’...ఇక నేటికీ నిలిచి వెలుగుతున్న ‘నిదురపోరా తమ్ముడా’ పాట సంతానంలో రెండు సందర్భాల్లో వస్తుంది. ఒకటి చిన్నప్పుడు, ఒకటి పెద్దప్పుడు. చిన్నప్పటి పాటలో లతా మంగేశ్కర్ మూడు చరణాలు పాడితే, పెద్దప్పటి పాటలో ఒక చరణం ఘంటసాల పాడారు. చిన్నప్పటి పాటలో లతా–‘కలలు పండే కాలమంతా కనుల ముందే కదిలిపోయేలేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే నిదురపోరా తమ్ముడా’... అని పాడుతుంటే కలత నిద్రలతో బతుకుతున్న వారంతా కన్నీరు కారుస్తారు.బొమ్మల పెళ్లి:నాటి సినిమాలు పిల్లల్నే కాదు పిల్లల ఆటపాటల్ని కూడా పట్టించుకున్నాయి. అప్పటి పిల్లలకు బొమ్మల పెళ్లి చేయడం ఒక పెద్ద సరదా. ఈ బొమ్మల పెళ్లిళ్లు పిల్లల మధ్య నిజం పెళ్లిళ్లుగా మారి కథలు మలుపు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు వీడియో గేమ్‌లు ముంచెత్తే ఈ రోజుల్లో పిల్లలు బొమ్మలు అనే మాట ఎత్తడం లేదు. పెద్దలు కూడా సెల్‌ఫోన్ నే బొమ్మగా చేతిలో పడేస్తున్నారు. బొమ్మలు పిల్లలకు నేస్తాలు. వాటినే సర్వస్వంగా భావించి ఆలనా పాలనా చూసి పెళ్లిళ్లు చేసేవారు పిల్లలు. ‘కన్యాశుల్కం (1955)’లో బొమ్మల పెళ్లి కోసం పిల్లలు పాడే పాట చాలా బాగుంటుంది.చేదాము రారే కల్యాణము... చిలకా గోరింక పెళ్లి సింగారము...‘మాంగల్యబలం’ (1959)లో పిల్లలు పాడే బొమ్మల పెళ్లి పాట వైవాహిక జీవితానికి ఒక వ్యాఖ్యానం లాంటిది. ఈ పాటను శ్రీశ్రీ రాశారంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత సంప్రదాయ భావనలను ఇంత బాగా ఎలా రాశాడా అని.హాయిగా ఆలుమగలై కాలం గడపాలివేయేళ్లు మీరనుకూలంగా ఒకటై బతకాలి...తర్వాతి రోజుల్లో అక్కినేని పక్కన హీరోయిన్ గా ‘ప్రేమాభిషేకం’ వంటి సూపర్‌హిట్‌ను సాధించిన శ్రీదేవి బాలనటిగా అదే అక్కినేని ‘శ్రీమంతుడు (1971)’ లో బొమ్మల పెళ్లి పాట పాడింది. అంత చిన్న వయసులో ఆమె ఎక్స్ప్రెషన్ ్స చూడాలి ఇప్పుడైనా. భలే ఉంటాయి. మరి పాటో?చిట్టిపొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలుబుల్లిబుల్లి రాధకు ముద్దుముద్దు రాజుకుపెళ్లండీ పెళ్లి ముచ్చటైన పెళ్లిమర్యాదలు చెప్తూ... అల్లరి చేస్తూ:పిల్లలు అల్లరి చేస్తే ముద్దు. అలాగే వారు బుద్ధిమంతులుగా ఉంటే మరీ ముద్దు. అల్లరి చేయడం పిల్లల హక్కు అనేది మర్చిపోయి, ఇవాళ వాళ్లను ఊపిరి సలపని హాస్టళ్లలో పడేసి తెగ తోమిస్తున్నారు తల్లిదండ్రులు. పరీక్షల భయం ఇవాళే కాదు ఆవాళ కూడా ఉంది. అందుకే ‘పెళ్లి చేసి చూడు’ (1952)లో స్టేజి నాటకంలో చిన్నారి బాలుడు పరీక్షలు ఎగ్గొట్టడానికి దొంగ కడుపునొప్పి తెచ్చుకుని పాడే పాట అల్లరి... చాలా వల్లరి.అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులేఫస్టుక్లాసులో పాసవుదామని పట్టుబట్టి నే పాఠాల్ చదివితేపరీక్షనాడే పట్టుకున్నదే బడికెట్లా నే వెళ్లేదే?ఇలా అల్లరి చేసే పిల్లలే సుద్దులు కూడా చెబుతారు. కె.వి.రెడ్డి తీసిన ‘దొంగరాముడు’ అల్లరి చేసే చిన్న అక్కినేనికి, చిన్న సావిత్రి సుద్దులు చెబుతుంది. ఎలా మసలుకోవాలో హితబోధ చేస్తుంది.తెలిసిందా బాబూ ఇపుడు తెలిసిందా బాబు అయవారు తెలిపే నీతులు ఆలించకపోతే వాతలే...కె.విశ్వనాథ్ తొలి సినిమా ‘ఆత్మగౌరవం’లో ఆయన ఎంత మంచి పాట పెట్టారంటే ఇంటికి వచ్చిన అతిథులను ఆ ఇంటి పిల్లలు ఎలా గౌరవించి ఆహ్వానించాలో అందులో ఉంటుంది. ఇంటి సంస్కారం పిల్లల ప్రవర్తనలోనే తెలుస్తుంది. ఇవాళ ఇంటికి బంధువులొస్తే పిల్లలు పలకరించనైనా పలకరించట్లేదు– నమస్కారం పెట్టే సంగతి తర్వాత. అంతే కాదు తమ గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. తల్లిదండ్రులు వారిని అందుకు ఎంకరేజ్ చేస్తున్నారు. కాని ఆత్మగౌరవంలో రేలంగి, గుమ్మడి అతిథులుగా వస్తే పిల్లలు ఎంత బాగా పాడతారో!మారాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారుమామంచి వారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు...భక్తి... దైవభక్తి:పిల్లలకు దేవుడు మంచి స్నేహితుడు. పిల్లలు దేవుని మీద సందేహం లేని భక్తి పెట్టుకుంటారు. పిల్లల ద్వారా భక్తిని చెప్పేందుకు ‘యశోదకృష్ణ’, ‘భక్త ప్రహ్లాద’, ‘భక్త ధ్రువ మార్కండేయ’లాంటి సినిమాలు వచ్చి ప్రజాదరణ పొందాయి. ‘యశోదకృష్ణ’తో శ్రీదేవి, ‘భక్త ప్రహ్లాద’తో రోజా రమణి పెద్ద స్టార్స్ అయ్యారు. ‘భక్త ప్రహ్లాద’లో ప్రహ్లాదుడు పాడిన పాటలు హిట్.నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనంమరోపాట–జీవము నీవే కదా...నేటికీ నిలిచి ఉన్నాయి.ఇక ‘లేత మనసులు (1966)’తో స్టార్ అయిన ‘కుట్టి పద్మిని’ పాడిన ఈ పాట 60 ఏళ్ల తర్వాత కూడా చల్లదనాన్ని కురిపిస్తూనే ఉంది.పిల్లలూ దేవుడూ చల్లని వారేకల్లకపటమెరుగని కరుణామయులే...‘మూగనోము’లో–తల్లివి నీవే తండ్రివి నీవేచల్లగ కరుణించే దైవము నీవే....సంభ్రమం... సందేహం:పిల్లలకు సందేహాలు జాస్తి. అలాగే ప్రతిదానికీ వారు వింత పడతారు. ఇప్పటి పిల్లల్లా అన్నీ గుగుల్ ద్వారా తెలుసుకొని నిమ్మళంగా ఉండిపోరు. పెద్దలను విసిగించేవారు. అలా పిల్లలకూ పెద్దలకూ ఒక సంభాషణ జరిగేది. ‘బాలరాజు కథ’లో ఈ పాట చూడండి–అడిగానని అనుకోవద్దు చెప్పకుండా దాటేయొద్దుఏమిటీ రహస్యం స్వామి ఏమిటీ విచిత్రంఆ రోజుల్లో ఫోన్ ఒక వింత. ఇంట్లో ఫోన్ ఉండటం ఒక హోదా. ఇరుగింటి పొరుగింటి వారికి అది పి.పి. నంబర్. ఇంట్లో పిల్లలకు ‘ట్రింగ్ ట్రింగ్’మన్నప్పుడల్లా సరదా. ఫోన్ రాకపోయినా రిసీవర్ చెవిన పెట్టుకుని మాట్లాడతారు. పాట పాడతారు ‘బడి పంతులు’లో బుల్లి శ్రీదేవి పాడింది.బూచాడమ్మ బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడుకళ్లకెపుడు కనపడడు కబురులెన్నో చెబుతాడు...అనుబంధాల పాట:పెద్దవాళ్ల సమస్యలు పిల్లలకూ కష్టాలు తెస్తాయి. పిల్లలు చలించిపోతారు. ఆ అనుబంధాల కోసం పరితపిస్తారు. తమ లోపలి భావాలను పాట ద్వారా చెబుతారు. తల్లిదండ్రులను కోల్పోయి చెల్లెలితో మిగిలిన అన్న పాడే ఈ జోలపాట ఎంత ఆర్ద్రమైనది... ‘చిట్టి చెల్లెలు’లో.అందాల పసిపాప అన్నయ్యకు కనుపాపబజ్జోవే... బుజ్జాయి... నేనున్నది నీ కొరకే...నీకన్నా నాకెవరే...‘భార్యాబిడ్డలు’ సినిమాలో కన్నతండ్రయిన అక్కినేనిని దూరం చేసుకుని అతణ్ణి వెతుకుతూ వీధుల్లో తిరుగుతూ అతడి పిల్లలు పాడే పాట... ఇందులో కూడా శ్రీదేవి ఉంది...చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావునీవు లేక దిక్కులేని చుక్కలయ్యాముఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లలకు జోకొడతారు. కాని ‘రాము’లో తల్లిదండ్రులకు జోకొడుతూ చిన్నారి కొడుకు పాడే పాట హిట్.పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండుపాటలు పాడి జోకొట్టాలి జోజోజో...ఇక పిల్లలకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం కదా. స్నేహంలో వారికి అంతరాలు ఉండవు, అభిమానం తప్ప! అందుకే స్నేహాన్ని నిర్వచిస్తూ ‘బాల మిత్రుల కథ’లోని ఈ పాట గొప్పగా ఉంటుంది.గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది...పాపం పసివాడు:ఒక పాట... అమ్మానాన్నల కోసం తప్పి పోయిన పిల్లవాడు పరితపిస్తూ పాడే పాట సినిమాను సూపర్‌హిట్ చేయగలదు. ‘లాస్ట్ ఇన్ ద డెజర్ట్’ అనే ఇంగ్లిష్ సినిమా ఆధారంగా తెలుగులో తీసిన ‘పాపం పసివాడు’ సినిమా చూసిన మహిళా ప్రేక్షకులు కన్నీరు మున్నీరయ్యారు. కారణం తప్పిపోయిన పిల్లాడిలో తమ పిల్లల్ని చూసి ఇలాంటి పరిస్థితి వస్తే అనుకోవడమే. మాస్టర్ రాము నటించిన ఈ పాట ఆత్రేయ రాసిన తేలిక మాటల పాట పిల్లల భావోద్వేగాన్ని గొప్పగా చూపుతుంది.అమ్మా చూడాలి... నిన్నూ నాన్నను చూడాలినాన్నకు ముద్దులు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి...అంజలి అంజలి అంజలి:ఆ తర్వాత కూడా పిల్లల పాత్రలు, వారి పాటలు కొనసాగాయి. ‘బాల భారతం’ తీశారు. టి.కృష్ణ ‘రేపటి పౌరులు’ సినిమా తీశారు. ‘మణిరత్నం ‘అంజలి’ తీసి హిట్ కొట్టారు. గుణశేఖర్ ‘బాల రామాయణం’ తీశారు. ‘లిటిల్ సోల్జర్స్’ పిల్లల కోసం తీసిన చివరి హిట్ సినిమాగా నిలిచింది. ‘స్వాతి కిరణం’లో మాస్టర్ మంజునాథ్ బాల సంగీతకారుడుగా ‘ఆనతినియ్యరా హరా’...లాంటి క్లాసిక్ ఇచ్చాడు. ‘మనసంతా నువ్వే’ సినిమాలోని ‘తూనీగా... తూనీగా’ పాట ఇంటింటి పాటైంది. ‘అమ్మ రాజీనామా’, ‘దేవుళ్లు’ తదితర చిత్రాల్లో పిల్లలు పాటలు పాడి మెప్పించారు.అయితే ఆ తర్వాత ఫ్యాక్షన్ సినిమాలు వచ్చి తొడ గొట్టే పిల్లలు, కత్తి పట్టే పిల్లలు వచ్చారు. ఇవాళ టీవీల నిండా పిల్లలు అశ్లీల నృత్యాలు చేసే పెద్దల పాటలే తప్ప పిల్లల పాటలంటూ లేకుండా పోయాయి. కనీసం పిల్లలతో పాటు పెద్దలు పాడే పాటలైనా.పిల్లల పాటలు మళ్లీ బతకాలని కోరుకుందాం.ముద్దు ముద్దు నవ్వు... బజ్జోమ్మ నువ్వుతెలుగు సినిమాల్లో పిల్లలు తాముగా పాటలు పాడితే పిల్లల కోసం పెద్దలు తమంతట తాముగా పాడిన పాటలు చాలా ఉన్నాయి. అందరూ ఇష్టపడేవి ఉన్నాయి. ఆ పాటలు ఇప్పటికీ వినపడుతూనే ఉన్నాయి. ‘బంగారు పాప’లో ఎస్వీ రంగారావు అంతటి నిలువెత్తు మనిషి ఒక చిన్నారి పాపను చూసి పాడే ‘తాధిమి తకధిమి తోల్బొమ్మ’ పాట ఎందరికో ఇష్టం. ఆర్ద్రమయం. ‘ఖైదీ కన్నయ్య’లో ‘ఈ నిజం తెలుకో తెలివిగా నడుచుకో’ ఇప్పుడు కూడా ప్రతి బాలబాలికలకు బోధ చేసే గీతం. తర్వాతి రోజుల్లో ‘మంచి మనుషులు’లో శోభన్‌బాబు పాడిన ‘ఇది నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట’ కూడా ఇదే కోవలో హిట్‌గా నిలిచింది. ‘పండంటి కాపురం’లో ‘బాబూ... వినరా అన్నాదమ్ముల కథ ఒకటి’ పాట పిల్లలకు అనుబంధాలు చెప్తే, ‘ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర’ అని బాల్యాన్ని అనుభవించాల్సిన వయసులో భవిష్యత్తు గురించి కోచింగ్‌లు తీసుకుంటున్న నేటి బాలల కోసం అన్నట్టుగా ‘అందాల రాముడు’లో అక్కినేని పాడుతారు. ఇక పిల్లల పుట్టిన రోజులకు అందరూ పాడేవారే. ‘వెలుగు నీడలు’లో ‘చిట్టిపొట్టి చిన్నారి పుట్టిన రోజు చేరి మనం ఆడిపాడే పండుగరోజు’లో సావిత్రి హుషారుగా పిల్లవాడితో పాటు గెంతడం కనిపిస్తుంది. ‘బంగారు కలలు’లో ‘పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి’, ‘తాత మనవడు’లో మనవడిని పట్టుకుని అంజలీ దేవి ఉద్వేగంగా పాడే ‘ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు’ గొప్ప ఆశీర్వాద వచనం. ఇక పిల్లలను బుజ్జగించే, ఊరడించే పాటలు సినిమాల్లో బోలెడు. గంభీరంగా ఉండే ఎన్.టి.ఆర్ కూడా పసిపిల్లాడిని చూసి ‘ఆడబ్రతుకు’లో ‘బుజ్జిబుజ్జి పాపాయి.. బుల్లిబుల్లి పాపాయి.. నీ బోసి నవ్వులలో పూచే పున్నవి వెన్నెలలోయి’ అని పాడతాడు. ఇదే పి.బి.శ్రీనివాస్ ‘ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజిమల్లె పువ్వు బజ్జొమ్మ నువ్వు’ పాట ‘సత్తెకాలపు సత్తెయ్య’లో చలం గొంతులో పాడతాడు. ఈ హీరో చలమే ‘సంబరాల రాంబాబు’లో చిన్నారి బాబుకు జోల పాడుతూ చందమామను సాయమడుగుతూ ‘మామా.. చందమామా.. వినరావా నా కథ’ అని అందుకుంటాడు. ‘జీవన తరంగాలు’లో శోభన్‌బాబు పాపకు జూ మొత్తం చూపుతూ ‘ఉడతా ఉడతా ఉచ్’ పాడటం రేడియో శ్రోతలు ఇప్పుడూ వింటారు. ‘స్వయంకృషి’లో చిరంజీవి ‘పారా హుషార్.. పారా హుషార్... తూరుపమ్మ ఉత్తరమ్మ పడమరమ్మ దక్షిణమ్మ పారా హుషార్’ అని పాడి వీపున కట్టుకున్న చిన్నారికి ఉల్లాసం కలిగిస్తాడు. ‘కలిసి పాడుదాం తెలుగు పాట కలిసి సాగుదాం వెలుగుబాట’ (బలిపీఠం), ‘భారత మాతకు జేజేలు బంగరుభూమికి జేజేలు’ (బడిపంతులు) అని పాడే ఉపాధ్యాయులు ఇప్పటి సినిమాల్లో ఎక్కడ? ఏమైనా ఆ రోజులే వేరు ఆ పాటలే వేరు. -
ఢాం... ఢాం... ఒకసారి వెనక్కి వెళదాం
పండగకు ముందే ‘ఢాం... ఢాం’లు మొదలయ్యాయి. ఎప్పుడూ శబ్దాలు వినడమేనా, ఈసారి వాటి చరిత్ర కొంచెం తెలుసుకుందాం. లాంగ్ లాంగ్ ఎగో.... అనగా క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో చైనాలో టపాసులు లేవు. అయిననూ ‘ఢాం... ఢాం’లు మాత్రం ఉండేవి. వెదురు గొట్టాలను మంటల్లోకి విసిరేవారు. వెదురు లోపల కణువుల మధ్య ఉన్న ఎయిర్ పాకెట్లు వేడెక్కి పేలి పోవడంతో పెద్ద శబ్దాలు వచ్చేవి.పదవ శతాబ్దానికి చెందిన ఒక చైనీస్ ఆల్కెమిస్ట్ ద్వారా కొత్త పటాసులు రంగంలోకి వచ్చాయి. పొటాసియం నైట్రేట్, సల్ఫర్, బొగ్గును కలిసి వెదురు గొట్టాల్లో పోసి ‘ఢాం’ అనిపించేవారు. ఆయన తయారు చేసిన మిశ్రమం ఆ తరువాత కాలంలో ‘గన్ పౌడర్’గా ప్రసిద్ధి చెందింది. ఇది మానవ నిర్మిత మొదటి బాణసంచా అంటారు. ఈ ప్రమాదకరమైన, ప్రకాశవంతమైన ఆవిష్కరణలు సిల్క్ రూట్ గుండా ఐరోపా వరకు వెళ్లాయి. ఆ తరువాత కాలంలో వాటి తయారీకి సంబంధించిన సాంకేతికత పెరగడంతో విందులు, వినోదాలు, పండగలలో బాణసంచా పేల్చడం మామూలైపోయింది. -
‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’
Moral Story: చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూసి వాళ్ళమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని ఎంత చెప్పినా ఆ అమ్మాయి మట్టుకు పట్టించుకునేది కాదు. ఈ గాలి కబుర్ల వల్ల లేనిపోని తగాదాలు కూడా వచ్చేవి.ఒక రోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆయన దర్శనానికి వెళ్లిన ఆ అమ్మాయి వాళ్ల అమ్మ తన బాధ చెప్పుకుంది. ‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’ అని కోరుకుంది. సాధువు మర్నాడు అమ్మాయిని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.మర్నాడు పొద్దున్నే అమ్మ తన కూతురుని సాధువు వద్దకు తీసుకుని వెళ్ళింది. సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి ‘రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం చల్లమ్మా’ అని చెప్పాడు.ఎక్కడ తిడతాడో అని భయపడుతూ వచ్చిన అమ్మాయి ‘ఇంతేనా?’ అనుకుంటూ కోడి ఈకలతో వూరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కడో ఈక, అక్కడో ఈక విసిరేసింది. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంటే ఆ అమ్మాయిని తల్లి మళ్ళీ ఆ సాధువు దగ్గిరకు తీసుకెళ్లింది.‘ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానే రండి’ అని పంపాడు సాధువు.మర్నాడు పొద్దున్నే వాళ్లు వెళితే సాధువు అమ్మాయితో, ‘నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రామ్మా’ అన్నాడు.అమ్మాయి సరేనని ఊరంతా వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కనిపించలేదు. దిగాలుగా సాయంత్రానికి ఆ సాధువు దగ్గరకు వెళ్ళి ‘స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు’ అని చెప్పింది.చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!అప్పుడు సాధువు ‘చూశావా... మన మాటలు కూడా ఆ ఈకల లాంటివే. ఒక్క సారి నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికీ తిరిగి తీసుకోలేము’ అని చెప్పాడు. ‘నోరు అదుపులో ఉంటే సమయం వృధా కాదు. చేయవలసిన పనులు పూర్తవుతాయి. జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు’ అన్నాడు.ఆ రోజు నుంచి ఆ అమ్మాయి గాలి కబుర్లు మానేసి చక్కగా చదువుకుని వాళ్ల అమ్మను సంతోషపెట్టింది. -
భలే బావులు
నీరే మన జీవన ఆధారం. ‘ఎడ తెగక పారే ఏరు లేని ఊరు’ని వెంటనే వదిలి పెట్టమన్నాడు వేమన మహాకవి. నీరు కాపాడుకుంటే భవిష్యత్తు ఉంటుంది. నీటి జాడను కాపాడుకోవడానికి పూర్వం నుంచి మానవుడు అనేక విధాలుగా ప్రయత్నించాడు. చెరువులు, బావులు కట్టుకున్నాడు. చెరువు ఊరి వ్యవసాయానికి ఆధారం అయితే బావి మంచినీటికి ఆధారం. బోర్లు లేని కాలంలో ఊరికి, వీధికి, ఇంటికి బావి ఉండేది. ముందు బావి తవ్వి ఆ తర్వాత ఇల్లు కట్టే వారు. ఎప్పుడూ నీళ్లుండే బావి ఉన్న ఇంటికి మర్యాద ఎక్కువ ఉండేది. ఇప్పటికీ బావులు ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం, వాటిని కాపాడుకునే స్పృహ కలిగి ఉండటం అవసరం. బావికి తెలుగులో ఉన్న మరో మాట ‘నుయ్యి’.దిగుడు బావుల నగరంప్రజలకు నీటి వనరులుగా ఉపయోగపడుతున్న దిగుడు బావులు, చేదుడు బావులు ఇప్పుడు కాలగర్భంలో కలిసి పోతున్నాయి. కాని కొన్ని చోట్ల దిగుడు బావులు విస్తారంగా ఉన్నాయి. ఉదాహరణకు గుజరాత్‌లోని దిగుడుబావులు. ఈ రాష్ట్రంలో దాదాపు 120 విశిష్టమైన దిగుడుబావులు ఉన్నాయి. గాంధీనగర్ జిల్లాలోని అదాలజ్ను దిగుడుబావుల నగరం అనొచ్చు. అక్కడ ఉన్న ‘రుడాబాయి దిగుడుబావి’ ఐదంతస్తుల లోతు ఉండి ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కసారైనా చూడ దగ్గ పర్యాటక చోటు ఇది. ఇక్కడ లోతైన బావిలొకి చక్కని మెట్ల నిర్మాణము కనిపించి ఆనాటి వారి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి చిహ్నంగా నిలుస్తుంది. బావి చుట్టూ చక్కని రాతినిర్మాణము ఉంటుంది. అంచెలంచెలుగా విశాలమైన వసారాలు, గదులు, స్తంభాలు , వాటి మీద లతలు, అల్లికలు, నగిషీలు చెక్కబడి దేవాలయ నిర్మాణాన్ని తలపిస్తాయి. నాటి ప్రజలు వీటిని గంగామాతగా భావించేవారు. అందుకే ఈ జలాన్ని దేవతగా భావించి ఈ నిర్మాణం చేశారు. అష్టకోణాల నిర్మాణం ఇది. బావిలోకి ప్రవేశించేందుకు మూడువైపులనుండి ప్రవేశద్వారాలుంటాయి. వీటిలో నుండి దిగితే ఒక అంతస్తు నుండి మరో అంతస్తుకు దిగుతూ మొత్తం ఐదంతస్తుల కిందికి దిగాల్సివుంటుంది . అంత లోతునుండి నీరు పైకి చేరవేయడం చాలా శ్రమతో కూడుకున్న పనే. అందుకే ఆ శ్రమ తెలియకుండా వుండేందుకే ఇటువంటి విశాలమైన, నెమ్మదిగా ఎక్కే మెట్లు కలిగిన సుందర నిర్మాణాలు చేపట్టారు. గుజరాత్‌లోని దిగుడుబావులన్నీ 10–15 శతాబ్దాల మధ్య జరిగిన నిర్మాణాలే. దిగుడు బావులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం రాజస్థాన్. అక్కడి అభానేరి గ్రామంలోని ‘చాంద్ బౌరి’ అనే దిగుడుబావి విశేషమైన ఖ్యాతి పోందింది. ప్రపంచ పర్యాటకులందరూ దీనిని చూడటానికి వస్తారు.హైదరాబాద్‌లో..హైదరాబాద్‌లోని బన్సిలాల్‌పేట్‌లో అద్భుతమైన దిగుడుబావి ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని దిగుడుబావుల పునరుద్ధరణకు నడుము బిగించింది. అలాగే చెరువుల రక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసింది. నీటిని రక్షించుకోకపోతే భవిష్యత్తు నాశనం. ఈ అవగాహన మనందరం కలిగి ఉండాలి. నీరు వృధా చేయరాదు.బావులలో రకాలు ఊట బావి: ఈ బావులలో ప్రకృతి సిద్ధంగా నీరు ఊరుతుంది. అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు.దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటి లోనికి దిగడానికి మెట్లు ఉంటాయి.గొట్టపు బావి: ఈ బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు తవ్వించే అవకాశం ఉన్నవి. ఇవి భూగర్భ జాలాలలోని కింది పొరల లోనికి వేసి నీటిని మోటారు పంపు ద్వారా బయటకు తెస్తారు. పెద్ద పట్టణాలలోని ఎక్కువ మంది ఇండ్లలో ఈ రకం బావులు ఉంటున్నాయి. ఆధునిక వ్యవసాయంలో కూడా ఇవి ఎక్కువగా తవ్విస్తున్నారు.గిలక బావి: ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో గిలక నిర్మించబడి ఉంటుంది. ఇవి గతంలో ఇంటింటా ఉండేవి. -
సైన్సు సినిమా.. అక్టోబర్ స్కై
‘అక్టోబర్ స్కై’ 1999లో విడుదలైన హాలీవుడ్ సినిమా. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో కోల్ వుడ్ అనే ఓ చిన్న గ్రామంలో జరిగిన నిజజీవిత కథ ఆధారంగా తీశారు. ఆ గ్రామానికి చెందిన నలుగురు కుర్రాళ్ల కథ ఇది. కథ జరిగిన కాలం 1957. పెద్దగా సౌకర్యాలు లేని ఓ కుగ్రామానికి చెందిన ఆ కుర్రాళ్లకి కొన్ని కారణాల వల్ల రాకెట్ తయారు చెయ్యాలని ఆలోచన వస్తుంది. ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి ఎంతో వ్యతిరేకతని ఎదుర్కొని చివరికి చిన్న రాకెట్ తయారు చేస్తారు. ఆ రాకెట్‌ని ఓ జాతీయస్థాయి సైన్స్ ప్రాజెక్ట్ పోటీలో ప్రదర్శించి మొదటి స్థానంలో విజయం సాధిస్తారు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ కథలో ముఖ్య పాత్ర పేరు ‘హోమర్ హికమ్’. ఆ హోమర్ హికమ్ ఆ తర్వాతి కాలంలో తన రాకెట్ తయారీ అనుభవాన్ని ‘రాకెట్ బోయ్స్’ పేరుతో పుస్తకం రాశాడు. యూనివర్సల్ స్టూడియోస్ వారు పుస్తకం హక్కులు కొని ‘అక్టోబర్ స్కై’ పేరుతో సినిమాగా విడుదల చేసి హిట్ సాధించారు. పుస్తకం పేరు ‘రాకెట్ బోయ్స్’ను యథాతథంగా సినిమాకు కూడా పెడితే ‘ముప్పై ఏళ్లు నిండిన స్త్రీలు ససేమిరా చూడరు’ అని యూనివర్సల్ స్టూడియోస్ వారు అభిప్రాయపడడం చేత Rocket Boys అని మార్చవలసి వచ్చింది. ఇక్కడ తమాషా ఏంటంటే 'Rocket అన్న పదజాలంలోని అక్షరాలని తారుమారు చేస్తే అది 'October Sky' అవుతుంది. ఈ కథ పిల్లలకి ఎంత స్ఫూర్తి దాయకంగా ఉంటుందంటే ఈ పుస్తకాన్ని అమెరికాలో ఎన్నో బళ్లు పిల్లలు తప్పనిసరిగా సిలబస్‌లో పెట్టాయి. -
గాలి బుడగపై ఎలా తేలారు?
1780 కాలంఫ్రెంచ్ దేశస్తుడు జోసెఫ్ మాంట్గోల్ఫియర్, అతని తమ్ముడు ఎతియన్ ఓసారి మంటలోంచి పుట్టిన పోగ పైకిపోతూ దాంతో పాటు చిన్న తేలికైన వస్తువులని మోసుకుపోవడం గమనించారు. అంటే చల్లగాలి కన్నా వేడిగాలి తేలికైనది (తక్కువ సాంద్రత కలది) అన్నమాట. నీట్లో విపోడిచిన కర్ర పైకి తేలినట్టు చల్లగాలిలో వేడిగాలి పైకి కదులుతుంది అన్నమాట.1783లో, జూన్ 5వ నాడు ఆ అన్నదమ్ములు ఫ్రాన్స్ లో తమ స్వగ్రామం అయిన ఆనోనేల, బట్టతో చేసిన ఓ సంచిని వేడిగాలితో నింపారు. వేడిగాలి పైకి లేస్తూ దాంతో పాటు సంచినీ మోసుకుపోయింది. అలా ఆ వేడిగాలి నిండిన సంచి 10 నిముషాలలో 2.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. త్వరలోనే వేడిగాలి చల్లారి ఆ గాలిబుడగ నేలకి దిగి వచ్చింది. నవంబర్‌లో ఆ అన్నదమ్ములు తమ వేడిగాలి బుడగని పారిస్‌లో ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలో 3 లక్షల జనం గాల్లోకి లేచిన గాలిబుడగని ప్రత్యక్షంగా చూశారు. ఈసారి గాలి బుడగ 9.6 కిలోమీటర్లు గాలిలో ప్రయాణించింది.ఆ కాలంలోనే హైడ్రోజన్ అనే అతి తేలికైన వాయువు కనుక్కోబడింది. ఇది వేడిగాలి కన్నా కూడా చాలా తేలికైనది. అప్పటికి తెలిసిన వాయువులు అన్నిట్లోకి అది అతితక్కువ సాంద్రత కలది. ఫ్రెంచ్ శాస్త్రవేత్త జోక్ చార్లెస్ గాలిబుడగలని వేడిగాలితో కాక హైడ్రోజన్‌తో నింపాలని సూచించాడు. ఆ సూచన అమలు అయ్యింది. హైడ్రోజన్ నిండిన గాలిబుడగలు మనుషులని మోస్తూ గాల్లో ప్రయాణించాయి. పందొమ్మిదవ శతాబ్దపు ఆరంభంలో ఎంతోమంది అలాంటి బుడగలలో ప్రయాణించారు. మొట్టమొదటిసారిగా మనుషులు కొన్ని కిలోమీటర్ల ఎత్తువరకు గాల్లోకి పోగలిగారు. అయితే ఈ గాలిబుడగలు కేవలం గాలిలో కొట్టుకుపోగలవు అంతే. అలా కాకుండా దాని బుట్టలోప్రోపెల్లర్ని నడిపించగలిగే ఓ యంత్రాన్ని అమరిస్తే? ఓడ ప్రోపెల్లర్ దానిని ఎటు కావాలంటే అటు ఎలా తీసుకుపోతుందో అదే విధంగా ఈప్రోపెల్లర్ గాలిబుడగని కావలసిన దిశలో తీసుకుపోతుంది. అలాప్రోపెల్లర్ చేత ప్రేరేపింపబడే గాలిబుడగని డిరిజిబిల్ (dirgible) అంటారు. అంటే ఒక ప్రత్యేక దిశ (direction)లో ప్రేరేపింప శక్యమైనది అని అర్ధం. మొట్టమొదటి డిరిజిబిల్ని ఫెర్డినాండ్ ద జెప్పెలిన్ అనే జర్మన్ దేశస్థుడు నిర్మించాడు. అతడు గాలిబుడగని ఓ బారైన, పోగచుట్ట ఆకారం గల తేలిక లోహమైన అల్యూమినియంతో నిర్మించిన ఓ పై తొడుగులో అమర్చాడు. అటువంటి పోడవైన ఆకృతి గాలినీ సులభంగా ఛేదించగలడు. 1900 జులై 2 నాడు మొట్ట మొదటి డిరిజిబిల్ గాల్లోకి లేచింది. మనుషులకి వాళ్లు కావలసిన దిశలో ప్రయాణించే అవకాశం ఏర్పడింది.అప్పట్నుండి 40 ఏళ్ళుగా ఈ డిరిజిబిల్స్ ఇంకా ఇంకా పెద్దవవుతూ, మెరుగవుతూ వచ్చాయి. కాని వాటిలో నింపే హైడ్రోజన్ చాలా ప్రమాదకరమైనది. హైడ్రోజన్ మండే వాయువు. నిప్పు అంటుకుంటే పేలుతుంది. దానికి బదులుగా మరో వాయువు హీలియమ్ వాడొచ్చు. అది హైడ్రోజన్ అంత తేలికైనది కాదు గానీ ఎప్పుడూ నిప్పు అంటుకోదు. అయినా ఈ డిరిజిబిల్స్ అంత వేగంగా కదలగలిగేవి కావు. పైగా తుఫానుల్లో చిక్కుకుంటే ధ్వంసం అయిపోయేవి. అయినప్పటికీ రైట్ బ్రదర్స్ వచ్చి విమానాలపై ప్రయోగాలు చేసే వరకు గాలి బుడగలు మానవుడికి ఎగరాలనే అభిలాషను తీర్చాయి. నేటికీ పర్యాటక స్థలాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. టర్కీలో ఎయిర్ బెలూన్స్ ప్రత్యేక ఆకర్షణ. -
Devi Navaratrulu 2024: అయ్యవారికి చాలు ఐదు వరహాలు
(ఈ ఫొటోలో ఉన్నది రావణుడు. దసరాకి రావణ దహనం చేస్తారు. అందుకు తయారవుతున్న బొమ్మ ఇది. ఢిల్లీలోనిది ఈ ఫొటో) పిల్లలూ... దేవీ నవరాత్రులను దసరా పండగగా పిలుస్తారు. పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు, గహస్తులను ఆశీర్వదంచేవాళ్ళు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళే వారు. ఈ అంబులను గిలకలు అంటారు. వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. దసరా పద్యాలు చాలా సులభంగా, వీనులకు విందుగా ఉంటాయి. ఈ పద్యం చూడండి.ఏ దయా మీ దయా మా మీద లేదు,ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,దసరాకు వస్తిమనీ విసవిసలు పడకచేతిలో లేదనక అప్పివ్వరనకపావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,ముప్పావలా అయితే ముట్టేది లేదు,హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,అయ్య వారికి చాలు ఐదు వరహాలుపిల్ల వారికి చాలు పప్పు బెల్లాలుజయీభవా...దిగ్విజయీభవా -
గాంధీగారు తప్పు చేస్తే?
‘‘ప్రపంచంలో సిగరెట్ల కోసం ఇంత మోజెందుకో నాకు అర్థం కాదు. పోగ త్రాగేవాళ్లతో రైలు ప్రయాణం నేను చేయలేను. నాకు ఊపిరాడదు. అంతకంటే మరో పెద్ద తప్పు చేశాను. నాకు 13 ఏండ్ల వయసులో మొదట సిగరెట్ల కోసం డబ్బులు దొంగిలించాను. తరువాత 15వ ఏట పెద్ద దొంగతనం చేశాను. మా అన్న చేతికి ఉండే బంగారు మురుగు నుంచి కొంచెం దొంగిలించాలని అతను అంటే నేను సరే అన్నాను. దానికి కారణం మా అన్న ఇరవై రూపాయలు అప్పుబడ్డాడు. ఈ అప్పు ఎలా తీర్చడమా అని మేమిద్దరం ఆలోచించాము. అతని చేతికి బంగారు మురుగు ఉంది. దానిలో ఒక తులం ముక్క తీయించడం తేలిక అని నిర్ణయించాం. ఆ పని చేశాం. అప్పు తీర్చాం. కాని ఈ చర్యను నేను సహించలేకపోయాను. ఇక దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాను. అయితే నా మనస్సు శాంతించలేదు. తండ్రిగారికి చెప్పవలెనని అనిపించింది. కాని ఆయన ముందు నోరు విప్పి ఈ విషయం చెప్పేందుకు సాహసం కలుగలేదు. వారు కొడతారనే భయం కలుగలేదు. తన బిడ్డలనెవ్వరినీ మా తండ్రి కొట్టరు. బంగారు మురుగు విషయం చెబితే మనస్తాపంతో క్రుంగిపోతారనే భయం నన్ను పట్టుకుంది. ఏది ఏమైనా దోషం అంగీకరిస్తేనే బుద్ధి కలుగుతుందని విశ్వాసం కలిగింది. తండ్రికి మనస్తాపం కలిగించినా పరవాలేదని భావించాను.చివరికి ఒక చీటీమీద చేసిన తప్పంతా రాసి క్షమించమని ప్రార్థించాలి అను నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద జరిగినదంతా వ్రాశాను. వెళ్లి మా తండ్రిగారికి ఇచ్చాను. ఇంతటి తప్పు చేసినందుకు తగిన విధంగా శిక్షించమనీ, ఇక ముందు దొంగతనం చేయననీ శపథం చేశాను. ఇదంతా వ్రాసిన చీటీ వారి చేతికి ఇస్తున్నప్పుడు వణికిపోయాను. మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నారు. ఆయన బల్లమీద పడుకుని ఉన్నారు. చీటీ వారి చేతికి ఇచ్చి ఎదురుగా నిలబడ్డాను. వారు చీటీ అంతా చదివారు. వారి కండ్లనుండి ముత్యాలవలె కన్నీరు కారసాగింది. ఆ కన్నీటితో చీటీ తడిసిపోయింది. ఒక్క నిమిషం సేపు కండ్లు మూసుకుని ఏమో యోచించారు. తరువాత చీటీని చింపివేశారు. మొదట చీటీ చదివేందుకు ఆయన పడకమీద నుంచి లేచారు. ఆ తరువాత తిరిగి పడుకున్నారు. నాకు కూడా ఏడుపు వచ్చింది. తండ్రికి కలిగిన వేదనను గ్రహించాను. చిత్రకారుడనైతే ఈ రోజు కూడా ఆ దృశ్యాన్ని చిత్రించగలను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కండ్లకు కట్టినట్లు కనబడుతున్నది. వారి ప్రేమాశృవులు నా హృదయాన్ని కడిగివేశాయి. అనుభవించిన వారికే ఆ ప్రేమ బోధపడుతుంది.’’ -
ఓపికతో పెంచండి ఒడిలో పిడుగులు
‘పిల్లలు పైకి కనిపించేటంత సున్నితమైన వాళ్లు కాదు. వాళ్లను డీల్ చేయడం కత్తిమీద సామే. పిల్లలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నామా లేక పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పడంలో విఫలమవుతున్నామా?’ పిల్లలపెంపకంలో కొత్తతరం ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్య ఇది. తల్లిదండ్రులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలో నైపుణ్యాన్ని అలవరుచుకోవాలని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన ఫ్యామిలీ కౌన్సెలర్ చెరువు వాణీమూర్తి. ఆమె గమనించిన అనేక విషయాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు.ప్లానింగ్ ఉంటోంది... కానీ! ఈ తరం పేరెంట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచే పిల్లల పెంపకం గురించి కచ్చితంగా ఉంటున్నారు. మంచి భవిష్యత్తు అందివ్వాలని, చక్కగా పెంచి ప్రయోజకులను చేయాలని కలలు కంటారు. ఎదురు చూసిన బిడ్డ చేతుల్లోకి వస్తుంది. వేడుకలతో బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించిన పేరెంట్స్ కూడా పెంచడంతో తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేక స్ట్రెస్‌కు లోనవుతున్నారు. ఆనందం వర్సెస్ సవాల్! పిల్లల పెంపకం తల్లిదండ్రులకు గొప్ప ఆనందం. అదే సమయంలో పెద్ద సవాల్ కూడా. అవగాహన లేకపోవడం వల్ల పేరెంటింగ్‌ను మోయలేని బాధ్యతగా భావిస్తున్నారు. పిల్లల విషయంలో తాము శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని గమనించుకోలేకపోతున్నారు. పిల్లలకు చిన్నప్పుడే ఎన్నో సంగతులు చెప్పేయాలని వారి వయసుకు మించిన జ్ఞానాన్ని బుర్రలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు గ్రాహక శక్తి పిల్లలకు ఉందా లేదా అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.క్వాలిటీ టైమ్ ఇవ్వాలి! టీవీ, ఫోన్, సోషల్ మీడియాతో కాలక్షేపం చేయకుండా పిల్లలతో మాట్లాడుతూ, వారితో ఆడుకోవాలి. ప్రతి చిన్న సమస్యకీ పరిష్కారాల కోసం యూ ట్యూబ్‌లో వెతికి, అవి తమకు వర్తించకపోతే సరిగ్గా పెంచలేకపోతున్నామని ఒత్తిడికి లోనవుతుంటారు. పిల్లల పెంపకంలో కొన్ని బాధ్యతలను గ్రాండ్ పేరెంట్స్‌కి కూడా పంచాలి. కొంతమంది... పిల్లలు తమకు మాత్రమే సొంతమని, తమ పిల్లల బాధ్యత పూర్తిగా తమదేనని, ఎవరి సాయమూ తీసుకోకుండా తామే చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ ధోరణి మార్చుకోవాలి. మరికొంతమందిలో తమకు అన్నీ తెలుసని, ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదనే పెడధోరణి కూడా కనిపిస్తోంది. అది కూడా మంచిది కాదు. అన్నీ తెలిసిన వాళ్లు ఎవరూ ఉండరు. తెలుసుకుంటూ ముందుకు సాగాలి.పంచుకుంటూ పెంచాలి! చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవన్నీ సాధారణమేనని, పెంపకంలో ఇలాంటి ఒత్తిడులు ఉంటాయని ముందుగానే అవగాహన ఉండాలి. తల్లిదండ్రులిద్దరూ పిల్లల బాధ్యతను పంచుకుంటే ఇద్దరూ పెంపకాన్ని ఆస్వాదించవచ్చు. పిల్లలకు ప్రతి దశలోనూ తలిదండ్రుల సపోర్ట్, గైడెన్స్ అవసరమే. ఏ దశలో ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో పేరెంట్స్ తెలుసుకుని, తాము నేర్చుకుంటూ ముందుకు సాగుతుంటే స్ట్రెస్‌కు లోనుకాకుండా పేరెంటింగ్‌ని ఆస్వాదించగలుగుతారు. లెర్నింగ్ మైండ్ ఉంటే ఇది సాధ్యమే.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధికలిసి ప్రయాణించాలి! పేరెంటింగ్ అంటే పిల్లల పసితనం, బాల్యం, కౌమారం... ప్రతి దశల్లోనూ వారితో కలిసి సాగాల్సిన ప్రయాణం. తలితండ్రులు, పిల్లలు కలిసి చేయాల్సిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలంటే తల్లిదండ్రులు– పిల్లల మధ్య రిలేషన్ గట్టిగా ఉండాలి. పిల్లలను బేషరతుగా ప్రేమను పంచుతున్నామా, వారి పట్ల కరుణతో ఉంటున్నామా, తమ పరిధులను, అభిరుచులను వారి మీద రుద్దుతున్నామా, ఇతర పిల్లలతో పోలుస్తూ తక్కువ చేయడం లేదా ఎక్కువ చేయడం వంటి పొరపాటు చేస్తున్నామా... అనే ప్రశ్నలు వేసుకోవాలి. పిల్లలు ఏ చిన్న తప్పు చేసినా, వారికి ఏ చిన్న సమస్య ఎదురైనా తాము పెంపకంలో విఫలమవుతున్నామేమోనని అపరాధభావానికి లోనుకావాల్సిన అవసరమే లేదు. -
జనరల్ నాలెడ్జ్‌కు కేరాఫ్ అడ్రస్
ఫ్రెండ్స్, ఈరోజు మనం మయాంక్ గురించి తెలుసుకుందాం. పన్నెండేళ్ల వయసులో పాపులర్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అమితాబ్ బచ్చన్ నుంచి బహుమతిని అందుకున్నాడు. ప్రైజ్ మనీతో పాటు ఒక కారును కూడా తీసుకున్నాడు. ‘కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు సంతోషంగా ఉంది. కేబీసిలో ΄ాల్గొనే అవకాశం రావడం, అమితాబ్ సర్‌తో షోలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ బహుమతి గెలుచుకున్న రోజు తన సంతోషాన్ని ప్రకటించాడు మయాంక్.మయాంక్‌ను మెచ్చుకోవడమే కాదు అతడి తండ్రిని....‘ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించాడు?’ అని అడిగాడు అమితాబ్. హరియాణాలోని మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్‌కు పాఠ్య విషయాలే కాదు ప్రపంచంలో జరిగే పరిణామాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం. వాటి గురించి టీచర్లను అడుగుతుంటాడు. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలను చదువుతుంటాడు.అలా చదివిన జ్ఞానం వృథా పోలేదు.దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిలో పడేలా చేసింది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా మయాంక్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. క్విజ్ పోటీలు ఉన్నప్పుడే జనరల్ నాలెడ్జ్‌పై దృష్టి పెట్టడం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దాంతోబాటు చరిత్రలో ఏం జరిగిందో కూడా పుస్తకాలు చదువుతూ తెలుసుకోవాలి.న్యూస్‌పేపర్ రోజూ చదవడం మరచిపోవద్దు.‘జననరల్ నాలెడ్జ్‌కు ఆకాశమే హద్దు’ అంటున్నాడు మయాంక్. నిజమే కదా!మనం ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. మరి ఈరోజు నుంచే మీ ప్రయత్నం మొదలు పెట్టండి. ‘జనరల్ నాలెడ్జ్‌లో దిట్ట’ అనిపించుకోండి. -
శ్రేయోవి కేరాఫ్ అడవి
అందరి చేతుల్లో ఫోన్లు ఉంటాయి. ‘కాస్త ఫొటో తీయరా’ అనంటే బుడుంగుమని వచ్చి క్లిక్ చేస్తాం. అంతమాత్రం చేత మనం ఫొటోగ్రాఫర్లం అవము. ఫొటోగ్రఫీ పెద్ద ఆర్ట్. ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, ఔట్‌డోర్ ఫొటోగ్రఫీ, స్టిల్ ఫొటోగ్రఫీ... ఇలా చాలా విభాగాలున్నాయి. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ కూడా ఒకటి. అంటే వన్యజీవితాన్ని ఫొటోలు తీయడం. దీనికి అభిరుచి, ధైర్యం, నైపుణ్యం కావాలి. అడవుల్లోకి వెళ్లి రోజుల తరబడి ఎదురు చూస్తేనే ఒక మంచి ఫొటో దొరుకుతుంది. అలాంటి ఫొటో తీసి అంతర్జాతీయ గుర్తింపు పోందింది శ్రేయోవి మెహతా.ఫరిదాబాద్‌లో నాల్గవ తరగతి చదువుతున్న ఈ 9 సంవత్సరాల చిన్నారి చిన్నప్పటి నుంచి ఫొటోలు తీయడం నేర్చుకుంది. కారణం ఆమె తండ్రి శివాంగ్ మెహతా మంచి ఫొటోగ్రాఫర్. తల్లి కహాని మెహతా పర్యాటకులను అభయారణ్యాలకు తీసుకెళుతుంటుంది. శ్రేయోవి తన తల్లిదండ్రులతో రాజస్థాన్‌లోని భరత్పూర్ నేషనల్ పార్క్‌లో ఉన్నప్పుడు ఒక తెల్లవారుజామున వాకింగ్ చేస్తుంటే హటాత్తుగా దూరంగా రెండు నెమళ్లు కనిపించాయి. పక్కనే ఒక లేడి కూన. వెంటనే శ్రేయోవి తన కెమెరా తీసి మోకాళ్ల మీద కూచుని క్లిక్ చేసింది. ఆ తెల్లవారుజామున మంచుకురుస్తున్న వేళ చీకటి వెలుతురుల్లో ఆ ఫొటో అద్భుతంగా కుదిరింది.60 వేల ఎంట్రీల్లో ఒకటిలండన్లోని ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’ ప్రతి ఏటా ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్‘ అవార్డు కోసం ఎంట్రీలు పిలుస్తుంది. ఇందులో వయసును బట్టి విభాగాలుంటాయి. 10 ఏళ్ల లోపు విభాగంలో 117 దేశాల నుంచి 60 వేలమంది బాలలు తాము తీసిన వైల్డ్‌లైఫ్ ఫొటోలు పంపితే శ్రేయోవి ఈ ఫొటో పంపింది. ఇంతమందిని దాటి శ్రేయోవి ఈ ΄ోటీలో రన్నర్ అప్‌గా నిలిచింది. అంటే సెకండ్ ప్లేస్ అన్నమాట. అయినా సరే ఇది పెద్ద విజయం. ‘మా అమ్మా నాన్నా ప్రోత్సహించడం వల్ల నేను ఇలా గుర్తింపు పోందాను’ అంటోంది శ్రేయోవి. పెద్దయ్యి ఇంకా గొప్ప ఫొటోలు తీస్తానంటోంది. -
చిన్న వయసులోనే సీయీవో అయ్యారు!
ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్’. ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్ ఒకటి కాదు రెండు కాదు 150 యాప్స్ క్రియేట్ చేశారు ఈ బ్రదర్స్.ఫ్రెండ్స్ ఈరోజు మనం చెన్నైకి చెందిన శ్రావణ్, సంజయ్ బ్రదర్స్ గురించి తెలుసుకుందాం. పది, పన్నెండేళ్ల వయసులోనే ఈ బ్రదర్స్ ఒక యాప్‌ను డెవలప్ చేసి బోలెడు పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు...‘గో డైమన్షన్స్’ పేరుతో ఒక కంపెనీని మొదలుపెట్టారు. యంగెస్ట్ సీయీవోలుగా దేశం దృష్టిని ఆకర్షించారు.వారి తండ్రి కుమరన్ సురేంద్రన్ వల్ల శ్రావణ్, సంజయ్‌లకు సాంకేతిక విషయాలపై ఆసక్తి పెరిగింది.‘కంప్యూటర్లు ఎలా పని చేస్తాయి?’ నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు తండ్రి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునేవారు.టెక్నాలజీకి సంబంధించిన విషయాలను చందమామ కథల్లాగా ఆసక్తిగా వినేవారు.ఏ మాత్రం సమయం దొరికిన కంప్యూటర్లో రకరకాల కొత్త విషయాల గురించి తెలుసుకునేవారు.అలా ఎన్నో యాప్‌ల గురించి తెలుసుకున్నారు.కొత్త కొత్త యాప్‌ల గురించి తెలుసుకునేటప్పుడు తమకు కూడా యాప్ తయారు చేయాలనిపించింది.‘క్యాచ్ మీ కాప్’ పేరుతో ఈ బ్రదర్స్ రూపోందించిన యాప్‌కు మంచి పేరు వచ్చింది. ఇది పిల్లల ఆటలకు సంబంధించిన యాప్. దీంతో పాటు రూపోందించిన ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్’. ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్ ఒకటి కాదు రెండు కాదు 150 యాప్స్ క్రియేట్ చేశారు.ఫ్రెండ్స్, శ్రావణ్, సంజయ్ గురించి మీరు చదివారు కదా... మరి మీ గురించి కూడా గొప్పగా రాయాలంటే.... మీరు కూడా ఏదైనా సాధించాలి. మరి ఒకేనా! -
పర్వతారోహణ చేద్దామా?
‘పర్వతాలు పిలుస్తాయి... వెళ్లాలి’ అంటారు పర్వతారోహకులు. మనకున్న ఎన్నో హాబీల్లో పర్వతారోహణ ఒకటి. చిన్న గుట్టలతో మొదలయ్యే హాబీ కొండలకు పర్వతాలకు ఎదిగి ఆఖరకు ‘ఎవరెస్ట్’ అధిరోహించడంతో ముగుస్తుంది. పర్వతారోహణ చేసేవారు జీవితంలో ఒక్కసారైనా పర్వతారోహణ చేయాలని కోరుకుంటారు. కొంతమంది ఏడు ఖండాల్లోని ప్రతి ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాలనుకుంటారు. ఇంతకూ పర్వతారోహణ వల్ల ఏమవుతుంది?పర్వతాలు ఎక్కే క్రమంలో ప్రకృతి పెట్టే పరీక్షలను ఓర్చడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శిఖరం వరకూ చేరాక భూమ్మీద ఎదురయ్యే కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా జీవితం ఎంత విలువైనదో తెలుస్తుంది. జీవితం అంటే చిన్న చిన్న విషయాలు కాదు ఉదాత్తమైనవి ఉన్నతమైన విషయాలను సాధించడం అని తెలుస్తుంది. ‘పర్వతం వంటి వ్యక్తి’, ‘శిఖరం వంటి వ్యక్తి’ అని కొందరిని కోలుస్తారు. అంటే ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో వారు అత్యున్నత విజయాన్ని సాధించినవారన్నమాట. శాస్త్రవేత్తలలో ఐన్‌స్టీన్ శిఖరం వంటి వాడు. సినిమా నటులలో అమితాబ్ బచ్చన్ శిఖరం వంటి వాడు. మనం ఒక చిత్రకారులం కావాలనుకుంటే పికాసో అంతటి వాళ్లం కావాలని లక్ష్యం పెట్టుకోవాలి. అలాంటి స్ఫూర్తి పర్వతారోహణ వల్ల కలుగుతుంది.అబ్బాయిల కంటే మేము ఎందులోనూ తక్కువ కాదు అని ఆత్మవిశ్వాసం తెచ్చుకోవడానికి అమ్మాయిలకు పర్వతారోహణ ఒక మంచి మార్గం.పర్వతారోహణలో వీపు వెనుక బరువు వేసుకుని ఎక్కాలి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనడం పెద్ద కష్టం కాదని ఈ కష్టం పడినప్పుడు తెలుస్తుంది. పర్వతారోహణలో పోదుపుగా తెలుస్తుంది. తీసుకెళ్లిన ఆహారాన్ని పోదుపుగా వాడుకోవాలి. నీళ్లను ΄÷దుపుగా వాడుకోవాలి. జీవితంలో కూడా ఉన్న నిధులను ఎలా జాగ్రత్త చేసుకోవాలో దీని వల్ల తెలుస్తుంది. అహం (ఇగో) కొన్నిసార్లు మేలు చేస్తుంది. కొన్నిసార్లు హాని చేస్తుంది. అంత ఎత్తయిన పర్వతం మౌనంగా ఉన్నప్పుడు ఆరడుగుల మనిషి ఎందుకు మిడిసి పడాలి. ఎదిగేకొద్దీ వొదగడం పర్వతం నేర్పిస్తుంది. వినయం విజయానికి తొలి మెట్టు.ఉదయాన్నే లేచి స్కూలుకు వెళుతున్నాం, ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్నాం అనుకుంటాంగాని కొండనో పర్వతాన్నో ఎక్కితేనే మనం ఎంత ఫిట్‌గా ఉన్నామో తెలుస్తుంది. మన ఊపిరితిత్తులు, మోకాళ్లు, పిక్కలు ఎంత బలంగా ఉన్నాయో పర్వతారోహణ తెలియచేస్తుంది. ఈ హాబీని ఫాలో అయ్యేవారు ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు. మరిన్ని పర్వతాలు ఎక్కేందుకు మరింత ఫిట్‌గా ఉంటారు. కాబట్టి పర్వతారోహణ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. -
Dupe: ఏడడుగుల అశ్వత్థామ
ఏడడుగుల అశ్వత్థామ‘కల్కి’ సినిమాలో అశ్వత్థామ మనందరికీ నచ్చాడు కదా. అమితాబ్ బచ్చన్ ఆ పాత్రలో కనిపిస్తాడు. ద్వాపర యుగం నాటి పాత్ర కాబట్టి సినిమాలో మిగిలిన అన్ని పాత్రలు ఇప్పటి ఎత్తులో ఉన్నా అమితాబ్ 7 అడుగుల ఎత్తులో ఉంటాడు. కాని సినిమాల్లో అన్ని సన్నివేశాల్లో హీరోలు యాక్ట్ చేయరు. వాళ్లకు డూప్స్ ఉంటారు. ‘కల్కి’లో కూడా అమితాబ్‌కు డూప్ ఉన్నాడు. అతని పేరు సునీల్ కుమార్. ఇక్కడ ఫోటోల్లో ఉన్నాడే... అతనే. ఇతని ఎత్తు ఏడు అడుగుల ఏడంగుళాలు. జన్యుపరమైన ఇబ్బందుల వల్ల ఇంత ఎత్తు పెరిగాడు. జమ్ము– కశ్మీర్లో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈ మధ్యనే సినిమాల కోసం ఇతణ్ణి ఉపయోగిస్తున్నారు. కల్కి సినిమా మొత్తం అమితాబ్‌కు డూప్‌గా నటించాడు. అమితాబ్ సునీల్‌ని చూసి ‘అరె... నేనే లంబు అనుకుంటే ఇతను నాకంటే లంబుగా ఉన్నాడే’ అని సరదాపడ్డాడట. సునీల్ కుమార్ ఇటీవల పెద్ద హిట్ అయిన ‘స్త్రీ2’లో కూడా ఉన్నాడు. అందులో ‘సర్కటా’ అనే దెయ్యం వేషం వేశాడు. షూటింగ్‌ల కోసం లీవ్ పెట్టి ముంబై, హైదరాబాద్ తిరగాలంటే సెలవు కొంచెం కష్టమైనా సినిమాల్లో నటించడం బాగనే ఉందని సంతోషపడుతున్నా సునీల్. -
Prince World 2024: మోడల్ కార్తికేయ
మోడల్ కార్తికేయనడకతోపాటే నాట్యం కూడా నేర్చుకున్నాడు కార్తికేయ. వినాయక చవితి స్టేజ్‌తో మొదలు పెట్టి అంతర్జాతీయ వేదికపై మెరిశాడీ మోడలింగ్ ప్రిన్స్. థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ మోడలింగ్ పోటీల్లో ‘ప్రిన్స్ వరల్డ్–2024’ టైటిల్ సొంతం చేసుకుని వైజాగ్‌కు తిరిగి వచ్చిన కార్తికేయ సక్సెస్ స్టోరీ ఇది.థాయ్‌లాండ్‌లో ‘ప్రిన్స్’కిరీటం..కార్తికేయ రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టార్ కిడ్స్ సీజన్–2, ఆంధ్రా ఫ్యాషన్ వీక్ పోటీలలో విజేతగా నిలిచాడు. కోళికోడ్ నగరంలో జరిగిన జాతీయ స్థాయి మోడలింగ్ పోటీల్లో కూడా విజయం సాధించాడు. ప్రిన్స్ ఆఫ్ ఏపీ సబ్ టైటిల్‌ను గెలిచి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. దీంతో ఇటీవల థాయ్‌లాండ్‌లో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పేరుతో పోటీలు నిర్వహించారు. దీనికి 11 దేశాల నుంచి 45 మంది చిన్నారులు పోటీ పడ్డారు. ఇందులో కార్తికేయ మనదేశానికి ప్రాతినిథ్యం వహించాడు. నాలుగవ తరగతి చదువుతున్న ఈ విశాఖపట్నం కుర్రాడు మోడలింగ్‌తోపాటు వ్యాఖ్యానం, నటన, కథలు చెప్పడం, యోగా ఇలా అనేక రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కార్తికేయ తండ్రి బి.జె.శ్రీనివాసరెడ్డి ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆయన కథలు, కవితలు, వెబ్ పేజీలకు ఆర్టికల్స్ రాస్తుంటారు. వీటితోపాటు సేంద్రియ వ్యవసాయం, తేనెటీగల పెంపకం ఆయన ఆసక్తులు. కార్తికేయ తల్లి పావనీ లత భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో ఇంజినీర్. చిత్రకారిణి కూడా. తల్లిదండ్రులిద్దరిలోనూ సృజనాత్మకత మెండుగా ఉండడం పిల్లల మీద మంచి ప్రభావం చూపించింది.రెండేళ్లకు బ్రేక్కార్తికేయ రెండేళ్ల వయసులో గాజువాకలో వినాయక చవితి ఉత్సవాలలో తొలిసారిగా చేసిన డ్యాన్స్‌కు మంచి ప్రశంసలందాయి. ప్లే స్కూల్లో పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే.. కార్తికేయ డ్యాన్సులతో ఆ పిల్లలను అలరించేవాడు. దీంతో తల్లిదండ్రులు మంచి డ్యాన్సర్‌ను చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మూడో ఏట కాలికి సర్జరీ అవడంతో ఏడాదిపాటు డ్యాన్స్‌కు దూరం కావల్సి వచ్చింది. గాయం తగ్గిన వెంటనే మళ్లీ డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కాడు. పాశ్చాత్య నృత్యాన్ని అభ్యసించాడు. స్కూల్లో జరిగే కల్చరల్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు. అతడు ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం విమర్శకుల మన్ననలు పోందింది. రాగయుక్తంగా శ్లోకాలు, గీతాలు పాడి అందరి అభినందనలు అందుకున్నాడు. డ్యాన్స్‌లోనే కాకుండా తొలిసారిగా ఫ్యాషన్ షోలో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. డ్యాన్సర్‌గా, మోడల్‌గా పలు రాష్ట్రాల్లో షోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇద్దరూ ఆణిముత్యాలేతమ్ముడు కార్తికేయ రెడ్డి డ్యాన్స్, మోడలింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అక్క హరి శ్రేయసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. 34 శ్లోకాల సమాహారమైన ‘శ్యామలదండకం’ వల్లించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదైంది. అలాగే చిత్ర లేఖనం, పాటల పోటీలలో కూడా బహుమతులు గెలుచుకుంది. 2024లో ఉగాది ప్రతిభా పురస్కారం అందుకుంది.– దుక్క మురళీకృష్ణారెడ్డి, సాక్షి, విశాఖపట్నం -
బంగారం దగ్గర పాములు ఎందుకున్నాయి?
‘తంగలాన్’ సినిమాలో బంగారానికి పాములు కాపలా కాస్తున్నట్లు దర్శకుడు చూపించాడు. గుప్త నిధులు ఉన్న దగ్గర పాములు ఉంటాయని పూర్వం చందమామ కథల్లో విఠలాచార్య సినిమాల్లో చూపించేవారు. తంగలాన్‌లో బంగారం కోసం వెళ్లిన ప్రతిసారి పాములు వచ్చి కాటేస్తుంటాయి. బంగారం గునుల్లో, నిధుల దగ్గర పాములు నిజంగానే ఉంటాయా? కొందరు శాస్త్రవేత్తలు ఏమంటారంటే హెవీ మెటల్స్ ఉన్న దగ్గర పాములు ఉంటాయి అని. బంగారం, యురేనియం, మెర్క్యురీ వంటి హెవీ మెటల్స్ ఉండే ప్రదేశాల్లో పాములు సంచరిస్తాయని వారి అధ్యయనంలో కనిపించింది. పాములు తమ శరీరంలో ఉండే లుసుల్లో హెవీ మెటల్స్ను దాస్తాయట. పాములు బయో ఇండికేటర్స్‌గా పని చేస్తాయని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. యురేనియం దోరికే ప్రాంతాల్లో గాని బంగారం దొరికే కోలార్ వంటి ప్రాంతాల్లోగాని పాములు ఎక్కువగా సంచరిస్తుండేది అందుకే అని పర్యావరణవేత్తలు కూడా చెబుతున్నారు. -
లెక్కలు రాని పండితులు..!
ఒక ఊర్లో ఓ పండితుడు ఉండేవాడు. సులభశైలిలో గణితాన్ని బోధించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతడి శిష్యులు అనేకమంది గణితం బాగా నేర్చుకుని పెద్ద కొలువులు సంపాదించడం అతడిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎక్కడికి వెళ్ళినా... తన శిష్యులు కనిపిస్తే గణితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేసేవాడు. వారిచేత సరైన సమాధానాలు రప్పించేవాడు. పక్కనున్నవారితో నా శిష్యులందరూ ‘లెక్కల్లోప్పోళ్ళు’ అని చెప్పి గొప్పలు పోయేవాడు. అతడికి తెలివైన భార్య ఉండేది. వారిద్దరూ ఓ ΄పార్ణమి రోజున సత్సంగం కోసమని మారుమూల పల్లెటూరుకు వెళ్ళారు. అక్కడ పని ముగించుకుని ఇంటికి వస్తూ ఉంటే రాత్రయ్యింది. వారికి దారిలో ఓ యువతి కనిపించింది. ఆ యువతి తన చంకన చంటిబిడ్డను ఎత్తుకుని ఉంది. చందమామను చూపిస్తూ ‘చందమామ రావే, జాబిల్లి రావే...’ అని ΄ాడుతూ చంటిబిడ్డకు గోరుముద్దలు తినిపిస్తోంది.పండితుడిని చూసిన ఆ యువతి తన గ్రామంలోకి వచ్చిన వ్యక్తి తన గురువని గుర్తించింది. ‘నేను మీ శిష్యురాలను’ అని చెప్పి గౌరవపూర్వకంగా నమస్కరించింది. మీవల్ల కష్టమైన లెక్కలను ఇష్టంగా చేయగలిగామని ప్రశంసించింది. గర్వంగా భార్యవైపు చూశాడు పండితుడు.అలవాటు ప్రకారం పండితుడు తన భార్యతో ‘నా శిష్యురాలిచేత గణితశాస్త్రంలోని ప్రశ్న ఒకటి వేసి సమాధానం తెప్పించమంటావా?’’ అని అడిగాడు.చిన్న నవ్వు నవ్విన భార్య ‘‘గణిత శాస్త్ర ్రపావీణ్యత తెలియజేసే ప్రశ్నలు వద్దు. ఇప్పటివరకు మీ శిష్యురాలు తన బిడ్డకు ఎన్ని ముద్దలు పెట్టిందో లెక్క చెప్పమనండి చాలు!’’ అని అడిగింది.‘అదెంత పని?’ అని భావించిన ఆ పండితుడు తన శిష్యురాలిని సమాధానం చెప్పమన్నాడు. తెలియదన్నట్లుగా ఆమె అడ్డంగా తల ఊపింది. తల్లి తల ఊపడం చూసి ఏదో అర్థమైనవాడిలా బోసినవ్వులు నవ్వాడు చంటిబిడ్డ.వెంటనే పండితుడి భార్య ‘‘బిడ్డలకి గోరు ముద్దలు తినిపించే ఏ అమ్మకీ లెక్కలు రావండీ. ఏ తల్లీ లెక్కవేసుకుని తినిపించదు. బిడ్డ ఒక ముద్ద తింటాడంటే పది ముద్దలు పెట్టాలని చూస్తుంది తల్లి. లెక్కవేస్తే తన దిష్టే తగిలి బిడ్డ తినడం తగ్గించేస్తాడేమోనని ఆలోచిస్తుంది. ఆ తల్లి ప్రేమ ముందు ఏ లెక్కలూ పనిచేయవు, ఏ లెక్కలూ పనికిరావు’’ అని వివరించింది.ఆశ్చర్యపోయాడు పండితుడు. కొద్దిసేపటికి తేరుకుని ‘ఏ తల్లీ లెక్కలు, కొలతలు వేసి బిడ్డను ప్రేమించదు. తెలిసిన లెక్కలు సైతం తల్లి ప్రేమ ముందర మాయమైపోతాయి’ అని గుర్తించి అక్కడినుంచి కదిలాడు ఆ పండితుడు.– ఆర్. సి. కృష్ణస్వామి రాజు -
Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం
అమ్మానాన్నా మాట్లాడుతున్నా సరే, వినకుండా విసురుగా వెళ్లిపోవడం వ్యంగ్యంగా మాటలు అనేయడం నాటకీయంగా కళ్లు తిప్పడం ఉన్నట్టుండి తమ గదిలోకి వెళ్లి ‘ధఢేల్’న తలుపులు వేసుకోవడం ఇలాంటివెన్నో సంఘటనలు... టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులకు తెలియని విషయమేమీ కాదు. ఒంటరి తల్లులకు పిల్లల పెంపకం మరింత కష్టంగా ఉంటుంది. పిల్లల చంచలమైన భావాలను నియంత్రించలేక తల్లులు చాలాసార్లు మౌనంగా మారిపోతుంటారు. ఇంట్లో టీనేజర్లు సృష్టించే యుద్ధ వాతావరణంలో ఎవరు గెలుస్తారో ప్రతి పేరెంట్కు తెలుసు కాబట్టి ఆర్‌ఎమ్‌ఎఫ్ మంత్రాన్ని మననం చేసుకోండి అంటున్నారు నిపుణులు. రెస్ట్ మామ్ ఫేస్ (ఆర్‌ఎమ్‌ఎఫ్) అనే ఈ మంత్రం అమ్మ ముఖకవళికలను పిల్లల ముందు ఎలా ప్రదర్శించాలి, అందుకు తగిన సాధన ఏ విధంగా చేయాలో నిపుణులు చెబుతున్నారు. ‘టీనేజ్‌లో ఉన్న మా అమ్మాయి విషయంలో చాలాసార్లు నా ప్రవర్తన ఒత్తిడితో కూడుకున్నదై ఉంటుంది. చికాకు పరిచే సంఘటనలు ఎదురైనప్పుడు నా ఎమోషన్స్‌ని సమర్థంగా నియంత్రించలేక పోతుంటాను’ అంటుంది కార్పొరేట్ ఆఫీసులో హెడ్‌గా పనిచేసే కౌముది. ‘మా అబ్బాయితో గొడవపడటం, పదే పదే చెప్పడం, గతంలో చేసిన ్రపామిస్లను గుర్తుచేయడం అదేపనిగా జరుగుతుంటుంది. కానీ, ఆ వెంటనే తప్పనిసరై నాకు నేనే తగ్గడం, మౌనంగా ఉండటం, లేదంటే సర్దిచెప్పడం.. ఎప్పుడూ జరిగే పనే’ అంటుంది బొటిక్‌ను నడిపే వింధ్య. ‘కుటుంబ ఆకాంక్షలను పిల్లలు తీర్చాలనే లక్ష్యంగానే నేటి తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటోంది. తల్లులు టీనేజ్ పిల్లల విషయంలో తమను తాము నియంత్రించు కోవడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంటుంది’ అని తెలియజేస్తుంది హోలీ గ్రెయిల్ ఆఫ్ పేరెంటింగ్ మ్యాగజైన్. ఎలాంటి భావోద్వేగాలను ముఖంలో చూపని తటస్థ స్థితిని రెస్టింగ్ మామ్ ఫేస్ సాధన చేస్తే సరైన ప్రయోజనాలను ΄÷ందవచ్చు అని చెబుతోంది. అదెలాగో చూద్దాం. తటస్థంగా.. సాధారణంగా ఎలాంటి వ్యక్తీకరణ లేని స్త్రీ ముఖాన్ని చూసిన వాళ్లు అహంకారమనో లేదా నిరాడంబరత అనో నిర్ధారించుకుంటుంటారు. సంతోషించే సమయంలోనూ వీరు ‘తటస్థ’ ముఖాలతో ఉండటం చూస్తుంటాం. చూసేవారికి వీరి ముఖాల్లో ప్రశాంతత కూడా కనిపిస్తుంటుందని పరిశోధకులు గ్రహించారు. అందరూ ఇలా ఉండలేరు. కానీ, పిల్లల ముందు తమ భావోద్వేగాలను బయటకు చూపకుండా తమని తాము నిభాయించుకుంటూ ఉండాలంటే ్రపాక్టీస్ అవసరం. విశ్రాంతికి 30 సెకన్లు అమ్మల ముఖం పిల్లల ముందు సరైన విధంగా ఉండాలంటే...ఫేస్ యోగాను సాధన చేయాలి. కోపంగా ఉన్న పిల్లలతో మాట్లాడేముందు ముఖ కండరాలకు కూడా విశ్రాంతి అవసరం అని తమకు తాముగా చెప్పుకోవాలి. రెండు పిడికిళ్లతో ముఖాన్ని రుద్దుకుంటున్నట్టు, కోపాన్ని కూల్ చేసుకుంటున్నట్టు ఊహించుకోవాలి. గాఢంగా ఊపిరి పీల్చుకోవడం, వదలడం చేయాలి. అయితే, అది ఎదుటివారికి నిట్టూర్పులా ఉండకూడదు. మీ ముఖ కండరాలలో చికాకు, ఆశ్చర్యం, విమర్శిం చడం ... వంటివన్నీ తీసేసి, స్పష్టంగా అనుకున్న విషయాన్ని చెప్పేయాలి. చిన్నపిల్లలు యుక్తవయసులో ఉన్నా, పెద్దవారైనప్పుడైనా ఈ ఆర్‌ఎమ్‌ఎఫ్ ఉపయోగకరంగా ఉంటుంది. నిజాయితీగా ఈ వ్యూహాన్ని అమలుపరిస్తే ప్రయోజనకరమైన మార్పులు కనిపిస్తాయి. గొడవ పడే సమయాల్లో ఎలాంటి బోధలు చేయద్దు. అలాగే శిక్షించవద్దు. పిల్లలు వారి భావోద్వేగాలను స్వీయ – నియంత్రణ చేయగలిగేలా చేయడమే లక్ష్యంగా ఉండాలి. మీ బిడ్డ తన ఆందోళనను, అసంతృప్తిని మరింత ఆమోదయోగ్యమైన మార్గాల్లో వ్యక్తపరచలేకపోతే అకస్మాత్తుగా దాడికి దిగవచ్చు. లేదంటే తనని తాను బాధించుకోవచ్చు. అందుకని సమస్యను కూల్‌గా పరిష్కరించాలి. బంధాలు పదిలం.. ‘తల్లి మెరుగైన ఆలోచనతో ఉంటే పిల్లలతో స్నేహాలను, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంచుకోగలదు. కానీ, నియంత్రణతో సరైన ప్రయోజనాలను రాబట్టలేరు’ అంటారు సైకాలజిస్ట్ అండ్ పేరెంటింగ్ రైటర్ అలిజా. పిల్లల ఆకలి తీరినప్పుడు వారి కోపం చల్లబడుతుంది. అందుకని వారికి ఆరోగ్యకరమైన చిరుతిండిని అందిస్తుండాలి. దీంతో పిల్లల దృష్టి మారిపోతుంది. కానీ, అన్ని విషయాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు ఆర్ఎమ్ఎఫ్ని సాధన చేయడమే మేలు అనేది నిపుణుల మాట. -
పిల్లల్లో ఆ భయం పోగొట్టేలా..
డాక్టర్: నీ టెడ్డీబేర్‌కు ఏమైంది? చిన్నారి: కాలు నొప్పి డాక్టర్: ఎక్కడ? చిన్నారి: ఇక్కడ డాక్టర్: ఏం కాదు... తగ్గిపోతుంది... ఇలాంటి క్లినిక్‌లు ఇప్పుడు మంగళూరులోని స్కూళ్లలో నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యు.కె.జి. నుంచి 2వ తరగతిలోపు పిల్లల్లో హాస్పిటల్ భయం పోవడానికి వారి ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పడానికి ఈ క్లినిక్‌లు ఉపయోగపడుతున్నాయి. పేషెంట్లుగా సొంత టెడ్డీబేర్లను తెమ్మనడంతో పిల్లలు వాటిని తీసుకుని ధైర్యంగా వస్తున్నారు. దేశంలోని అన్ని పల్లెల్లో ‘బొమ్మల ఆస్పత్రి’ పేరుతో ఇలాంటి క్లినిక్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల లోపు చంటిపిల్లలను హాస్పిటల్లో చూపించడం తల్లులకు కష్టం కాదు. కాని ఐదారేళ్లు వచ్చాక పిల్లలకు హాస్పిటల్ అంటే భయం వస్తుంది. డాక్టర్ని చూడటం, వ్యాక్సిన్ కోసం సూది వేయించుకోవడం, జ్వరాలకు సిరప్లు తాగాల్సి రావడం వారికి హాస్పిటల్ అంటే భయం వేసేలా చేస్తుంది. 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు ఈ భయంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు– హాస్పిటల్‌కు వెళ్లాల్సి వస్తుందని. అంతేకాదు హాస్పిటల్‌కు తీసుకెళితే డాక్టర్‌కి చూపించి బయటకు వచ్చేంత వరకూ ఏడుస్తూనే మారాం చేస్తూనే ఉంటారు కొందరు పిల్లలు. దీని వల్ల తల్లిదండ్రులకే కాదు... క్లినిక్‌కు వచ్చిన ఇతర పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే వీరికి క్లినిక్లంటే భయం పోగొట్టాలి. దానికి ఏం చేయాలి? టెడ్డీ బేర్ క్లినిక్స్ యూకేలో ఇటీవల కాలంలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్‌కు టీమ్‌గా వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్లో దీనిని నిర్వహిస్తారు. క్లినిక్స్ అంటే భయం పోగొట్టడమే ముఖ్యోద్దేశం. క్లినిక్స్‌లో ఎంత చక్కగా టెడ్డీ బేర్లకు వైద్యం జరుగుతుందో చూశాక తమకు కూడా అంతే ఈజీగా వైద్యం చేస్తారు అనే భావన పిల్లల్లో కలుగుతుంది. మంగుళూరులో ట్రెండ్ గత సంవత్సరం జూలై నుంచి మంగుళూరులోని చాలా స్కూళ్లల్లో విడతల వారీగా టెడ్డీబేర్ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఇందుకు స్కూళ్ల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులు తమ ప్రచారం కోసమే కావచ్చు... లేదా పిల్లల పట్ల బాధ్యతతోనే కావచ్చు... చాలా ప్రొఫెషనల్‌గా ఈ క్లినిక్స్‌ను నిర్వహిస్తున్నారు. క్లినిక్ స్కూల్లో నడిపే రోజున పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్‌ను కాని లేదా మరేదైనా ఆటబొమ్మను (మనిషి, పెట్) తీసుకురావాలి. తమ పేషెంట్ పేరును అచ్చు హాస్పిటల్లో ఎలా రిజిస్టర్ చేయిస్తారో అలా చేయించాలి. ఆ తర్వాత ఓ.పీ.కి వెళ్లాలి. ఓ.పీ.లో డాక్టర్లు టెడ్డీబేర్‌కు ఏం ఇబ్బంది ఉందో అడుగుతారు. వైద్యం చేయాలంటే పొడవు, ఎత్తు చూడాలని చెప్పి చూస్తారు, పిల్లలు సాధారణంగా తమకున్న ఇబ్బందులే టెడ్డీబేర్‌కు ఉన్నట్టుగా చెబుతారు. టెడ్డీబేర్‌ను చూస్తున్నట్టుగా పిల్లల్ని కూడా వారి మూడ్‌ను బట్టి డాక్టర్లు చూస్తారు. పిల్లల హెల్త్ అసెస్మెంట్ను స్కూల్ సాయంతో పేరెంట్స్‌కు పంపుతారు. కంటి, పంటి పరీక్ష చిన్న పిల్లల్లో కంటి, పంటి పరీక్షలు ముఖ్యమైనవి. టెడ్డీబేర్ క్లినిక్స్ పేరుతో పిల్లలను ఉత్సాహపరిచి వారికి కంటి, పంటి పరీక్షలు కూడా డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సాధారణ చెకప్‌ల ద్వారా వారిలో తగిన పోషక విలువలు ఉన్నాయా, వారు బలహీనంగా ఉన్నారా అనేవి కూడా చూస్తారు. ఏమైనా డాక్టర్ల పరిశీలన ఆ వయసు పిల్లలకు ప్రతి మూడు నెలలకు అవసరం. మంగుళూరు స్కూళ్లలో ఇదే జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా పల్లెల్లో చిన్నారులకు ఈ ‘బొమ్మల ఆస్పత్రు’లు నడపడం చాలా బాగుంటుంది. పల్లె పిల్లలు డాక్టర్లకు చూపించుకునే వీలుండదు చాలాసార్లు. తల్లిదండ్రులు తీసుకెళ్లరు. ఆస్పత్రులంటే భయపడేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అందుకోసమే బొమ్మల ఆస్పత్రుల ఐడియాను ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటే చిన్నపిల్లల ఆరోగ్యస్థాయి, వారి సాధారణ అనారోగ్య సమస్యలు అంచనాకొస్తాయి. -
చిన్నపిల్లల్లో చుండ్రు సమస్య.. ఎలా వదిలించాలి?
చిన్నపిల్లల్లో చుండ్రు రావడం కాస్త తక్కువే అయినా చలికాలంలో అప్పుడప్పుడు కనిపిస్తుండటం మామూలే. దీని నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలివి... ►పిల్లలకు వారానికి 3–4సార్లు తలస్నానం చేయించాలి. తలకు తేమనిచ్చే ఆయిల్స్, లోషన్స్ వంటివి అప్లై చేస్తుండాలి. ఒకసారి జుట్టు రాలడం తగ్గిన తర్వాత హెయిర్ ఆయిల్స్, లోషన్స్ వాడుతూ మాటిమాటికీ మాడు పొడిబారకుండా చూసుకోవాలి. ►అన్ని విటమిన్లతో పాటు ప్రత్యేకంగా విటమిన్ బీ కాంప్లెక్స్ లభ్యమయ్యే ఆహారాలు తీసుకోవాలి. అందులో జింక్ మోతాదులు ఎక్కువ ఉండటం మరింత మేలు చేస్తుంది. ► ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని కెటకెనజోల్, సాల్సిలిక్ యాసిడ్, జింక్ ఉన్న షాంపూలను వారానికి 2–3 సార్లు... అలా 4–6 వారాల పాటు వాడాల్సి ఉంటుంది. ► అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులతో పాటు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు సీబమ్ సెక్రిషన్స్ తగ్గించే మందుల్ని కూడా వాడాల్సి రావచ్చు. -
పిల్లలు స్మార్ట్ఫోన్లు అధికంగా వాడుతున్నారా? హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్?
ప్రస్తుత కాలంలో ఎవరింట చూసినా పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ఐపాడ్లు ఉండవలసిందే! స్మార్ట్ఫోన్లు అధికంగా వాడుతున్న పిల్లలు కదలకుండా ఒకేచోట కూర్చొని ఉంటారు. దీనివల్ల వారు చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు ఫోన్ లేదా టీవీ చూస్తూ ఉంటే కాస్త ఎక్కువే తినేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటి వాటి బారిన పడే ప్రమాదం పెరిగిపోతుంది. వీటన్నింటి నుంచి రక్షించాలంటే పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడకుండా చేయాలి. అదెలాగో చూద్దాం. పిల్లల మనసు అద్దం లాంటిది. తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న ఇతర పెద్దలు ఏం చేస్తున్నారో చూసి అదే అలవాటు చేసుకుంటారు. కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు, ఇతర పెద్దలూ స్మార్ట్‌ఫోన్, లాప్టాప్ వంటివి చూడకూడదని గుర్తుంచుకోండి. పిల్లలకు ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉంటే, వాళ్లకు ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టండి. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు అల్లరి చేయరు. మొబైల్ గురించి ఆలోచించరు. తిండిపైనే ధ్యాస పెడతారు. మొబైల్ లేకుండా ఐదు నిమిషాల పాటు వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. పేచీ పెట్టకుండా సరిగ్గా తింటే, ఈ సమయాన్ని పెంచవచ్చు. పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. వంటకాలు ఎలా ఉన్నాయో అడగండి. నవ్వుతూ... కబుర్లు చెబుతూ, జోకులేస్తూ, సరదాగా గడిపితే మొబైల్ ఫోన్ చూపించి తిండి పెట్టాల్సిన అవసరం ఉండదు. చిన్నప్పటినుంచి పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. ముందు బొమ్మల పుస్తకాలతో మొదలు పెట్టండి. ఆ తర్వాత పజిల్స్ పూర్తి చేయడం, కథల పుస్తకాలు, వార్తా పత్రికలలో పిల్లలకోసం కేటాయించే కథనాలను చదవడం అలవాటు చేయడం వల్ల వారి దృష్టి స్మార్ట్‌ఫోన్ పైకి మళ్లదు. పిల్లలకు బాల్యం నుంచి చుట్టుపక్కల పిల్లలతో ఆటలు ఆడటం అలవాటు చేయాలి. వారి వయసు పిల్లలు లేకపోతే మీరే వారితో ఆడుకోండి. కాసేపు ఔట్‌డోర్ ఆటలు, కాసేపు చెస్, క్యారమ్స్ వంటివి ఆడటం అలవాటు చేస్తే స్మార్ట్‌ఫోన్ బారిన పడకుండా స్మార్ట్‌గా తయారవుతారు. -
పిల్లలు హోంవర్క్ చేయకుండా మొండికేస్తున్నారా? ఇలా చేయండి
సాధారణంగా చాలామంది పిల్లలు ఆడుకోవడంలోనూ, ఫోన్లో వీడియోలు చూడటంలోనూ, వీడియో గేమ్‌లు లేదా ఆటలు ఆడుకోవడంలోనూ చూపినంత శ్రద్ధ చదువుకోవడంలో, హోంవర్క్ చేయడంలో చూపించరు. కొందరు సిసింద్రీలు మాత్రం హోం వర్క్ చేయడానికి మొండికేస్తుంటారు. అలాంటి గడుగ్గాయిలతో హోం వర్క్ చేయించడానికి తంటాలు పడలేక అదేదో మనమే చేసేస్తే పోలా... అనుకుని కొందరు పేరెంట్స్ పిల్లలకిచ్చిన హోమ్ వర్క్‌ను తామే చేసేస్తుంటారు. అయితే అది చాలా పొరపాటు. మీ చిన్నారి హోంవర్క్ చేయడానికి మొండికేస్తుంటే.. ఈ చిట్కాలు పాటించి చూడండి! పని వాతావరణాన్ని సృష్టించండి.. పిల్లల చదువులో హోంవర్క్ కీలకమైన అంశం. ఇది క్లాస్ రూమ్ అభ్యాసాన్ని బలోపేతం చేస్తుంది, అధ్యయన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది, బాధ్యతను అలవాటు చేస్తుంది. అందువల్ల మీ పిల్లల హోమ్‌వర్క్‌ను మీరు చేయొద్దు. దానిబదులు వాళ్లు హోంవర్క్ చేయడానికి తగిన వాతావరణాన్ని సృష్టించండి. వారికి అవసరమైన పెన్నులు, బుక్స్, పేపర్స్, రిఫరెన్స్ మెటీరియల్స్ వంటివాటిని అందుబాటులో ఉంచండి. అప్పుడు వారే హోమ్‌వర్క్ చేయడానికి ఇష్టపడతారు. దండించ వద్దు సాధారణంగా చాలామంది పేరెంట్స్ చేసే పని.. పిల్లలు హోంవర్క్ చేయనని మొండికేస్తే తిట్టడం లేదా కొట్టడం. ఇలా చేస్తే పిల్లలు దారికి రారు సరికదా, మరింత మొండిగా తయారవుతారు కాబట్టి వారిని తిట్టి లేదా నాలుగు దెబ్బలు వేసి బలవంతానా హోం వర్క్ చేయించడానికి బదులు ప్రేమగా మాట్లాడుతూనే ఇంటి పని పూర్తి చేసేలా చూడటం చాలా మేలు చేస్తుంది. అలవాటుగా మార్చేయండి! చాలామంది పిల్లలు హోం వర్క్ అనగానే ఆడుకున్న తరవాత చేస్తాం, తిన్న తర్వాత చేస్తాం, పొద్దున్నే లేచి పూర్తి చేస్తాం.. అంటూ రకరకాల సాకులు చెబుతుంటారు. హోమ్ వర్క్‌ను వాయిదా చేయకుండా.. రోజూ ఒకే పద్ధతి ఫాలో అయ్యేలా తయారు చేయడం మంచిది. కొందరు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయడానికి ఇష్టపడుతుంటారు, కొందరు ఆడుకున్న తర్వాత హోం వర్క్ చేయాలనుకుంటారు. మీ పిల్లలకు నచ్చిన సమయంలోనే వర్క్ చేసుకునేలా సెట్ చేయండి. రోజూ దీనినే అనుసరిస్తుంటే అదే అలవాటుగా మారిపోతుంది. తేలికవి ముందుగా... స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అవగానే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టి ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకోండి. ఆ మాటల్లోనే హోం వర్క్ ఏమిచ్చారో కనుక్కోండి. తేలిగ్గా లేదా తక్కువగా ఉన్న వర్క్‌ని ముందుగా చేసేయమని చెప్పండి. కాస్త ఎక్కువ టైమ్ తీసుకునే పనులను మెల్లగా చేయించండి. సాయం చేయండి కానీ... మీరు చేయద్దు! పిల్లలు హోం వర్క్ చేయకపోతే రేపు బడికెళ్లగానే టీచర్లు కొడతారని కొంతమంది తల్లులే చేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు హోం వర్క్ చేయడానికి ఆసక్తి చూపించరు. వాళ్లలో నేర్చుకునే శక్తి కూడా తగ్గుతుంది. వాళ్లకు సహాయం కావలిస్తే చేయాలి గానీ మీరు మాత్రం చేయవద్దు. ఏ రోజుది ఆ రోజే! హోమ్‌వర్క్ ఏమీ ఇవ్వకపోతే రీడింగ్ వర్క్ చేయించండి. ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుంటే కలిగే లాభాల గురించి తెలియజెప్పి ఎప్పటి పాఠం అప్పుడు చదువుకునేలా చేయండి. -
పుట్టగానే పిల్లలు ఏడవడం లేదా? ఈ సమస్య రావొచ్చు..కారణాలివే!
సుమంత్ చాలా చురుకైన పిల్లవాడు. వాడికి కొత్తా పాతా ఏమీ ఉండదు. ఎవరింటికెళ్లినా ఇల్లు పీకి పందిరేస్తాడు. కొడుకు చురుకుదనం చూసి, ఆనంద్, రేఖ మురిసిపోయేవారు. వాడేం చెప్పినా ఎదురుచెప్పేవారు కాదు. ఖరీదైన వస్తువులను పగలగొట్టినా చిన్నతనంలో అదంతా మామూలే అని సర్ది చెప్పుకునేవారు. కానీ సుమంత్‌ను స్కూల్లో చేర్పించాకే అసలు సమస్య మొదలైంది. అస్సలు కుదురుగా కూర్చోడని, కూర్చోనివ్వడని రోజూ కంప్లయింట్స్. బోర్డు మీద రాసింది రాసుకోడు, హోమ్‌వర్క్ పూర్తి చేయడు. ఎన్నిసార్లు చెప్పినా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇంటికి ఎవరొచ్చినా పట్టించుకోకుండా తనిష్టమొచ్చినట్లు తానుంటాడంతే. వాడిని కుదురుగా పది నిమిషాలు కూర్చోపెట్టడం ఆనంద్, రేఖలకు తలకు మించిన పనిగా తయారైంది. సుమంత్ లాంటి పిల్లలు మనకు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. చాలామంది పేరెంట్స్ ఆ సమస్యను పట్టించుకోరు లేదా వయసుతో పాటు అదే పోతుందని వదిలేస్తారు. కానీ అది అటెన్షన్–డెఫిషిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD).. ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ప్రపంచవ్యాప్తంగా 7.2 శాతం పిల్లల్లో కనిపించే మానసిక రుగ్మత. ఇది పాఠశాల వయసులో ఎక్కువగా ఉంటుంది. టీనేజ్‌లో తగ్గుతుంది. వయోజనుల్లో తక్కువగా కనిపిస్తుంది. కారణాలు– పర్యవసానాలు ఏడీహెచ్‌డీ ఎందుకు వస్తుందనడానికి స్పష్టంగా కారణం చెప్పలేం. కొందరిలో జన్యు సంబంధమైన కారణాలుంటాయి. మరికొందరి మెదడు ఆకృతిలోనే తేడాలుంటాయి. తల్లి గర్భంతో ఉన్నప్పుడు మద్యం, ధూమపానం, అధిక రక్తపోటు, కాన్పు కష్టమవడం కూడా కారణం కావచ్చు. అలాగే పుట్టగానే ఏడవని పిల్లలు, మరేదైనా కారణాల వల్ల మెదడు దెబ్బతిన్న పిల్లలు కూడా ఇలా అవ్వొచ్చు. ఏ కారణమూ లేకుండా కూడా ఈ సమస్య ఉత్పన్నం కావొచ్చు. ఇలాంటి పిల్లలకు సకాలంలో చికిత్స అందించకపోతే పెద్దయ్యే కొద్దీ మొండిగా తయారవుతారు. పరీక్షల్లో తక్కువ మార్కులతో సరిపెట్టుకుంటారు. స్నేహితులతో తరచూ గొడవపడుతుంటారు. ఒక దగ్గర నిలకడగా ఉద్యోగం చేయలేరు. ఎప్పుడూ ఆత్మన్యూనత భావంతో ఉంటారు. మగ పిల్లలైతే సంఘవ్యతిరేక చర్యలు చేయడం, లేకపోతే తాగుడు లాంటి దురలవాట్ల పాలవుతారు. లక్షణాలు ఇలా ఉంటాయి.. ఏడీహెచ్డీలో ప్రధానంగా మూడు లక్షణాలుంటాయి. 1. చంచలత్వం (Inattention), 2. అతి చురుకుదనం (Hyperactive), 3. ఇంపల్సివ్. వీటిల్లో ఏదో ఒక లక్షణం ఉన్నంత మాత్రాన ఈ రుగ్మత ఉందనలేం. ఈ కింద చెప్పిన లక్షణాల్లో ఆరు అంతకుమించి లక్షణాలు ఆరునెలలకు మించి ఉన్నప్పుడు మాత్రమే ఈ రుగ్మత ఉందని చెప్పవచ్చు. చంచలత్వం (attention deficit) లక్షణాలు: వివరాలపై శ్రద్ధ చూపడంలో విఫలవమవడం లేదా అజాగ్రత్తగా తప్పులు చేయడం. టాస్క్స్ లేదా ఆటల్లో శ్రద్ధ వహించడంలో ఇబ్బంది ∙నేరుగా మాట్లాడినప్పుడు వినకపోవడం, పరధ్యానం సూచనలను అర్థం చేసుకోవడంలో, పాటించడంలో ఇబ్బంది ∙క్రమపద్ధతిలో, గడువులోపు పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది ∙సమయ నిర్వహణలో ఇబ్బందులు అవసరమైన పనులను కూడా ఇష్టపడక పోవడం లేదా తరచుగా తప్పించుకోవడం పెన్సిళ్లు, పుస్తకాలు, ఇతర వస్తువులను తరచూ పోగొట్టు కోవడం ∙రోజువారీ కార్యకలాపాల్లో మతిమరపు హైపర్యాక్టివ్ అండ్ ఇంపల్సివ్ లక్షణాలు: ►తరచుగా చేతులు లేదా కాళ్లు కదిలిస్తూ ఉండటం ∙సీట్లో స్థిరంగా కూర్చోలేకపోవడం, సీటు వదిలేసి బయటకు వెళ్లడం. తరచుగా ఆడటం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, ఎక్కువగా పరుగెత్తడం లేదా గెంతడం ► ప్రశ్న పూర్తయ్యేలోపు సమాధానాలు చెప్పడం, అతిగా మాట్లాడటం ∙తన వంతు వచ్చేవరకూ వేచి ఉండకుండా ఇతరులకు అంతరాయం కలిగించడం ∙తరచుగా ఇతరుల సంభాషణల్లోకి, పనుల్లోకి చొరబడటం ► ఇతరుల వస్తువులను అనుమతి లేకుండానే తీసుకోవడం, ఉపయోగించడం ఈ లక్షణాల్లో ఆరేడు కనిపించాయంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌ను కలసి సమగ్ర మూల్యాంకనం చేయించడం అవసరం. తల్లిదండ్రులు ఏం చేయాలి? ADHD లక్షణాలున్న పిల్లలను గైడ్ చేసేందుకు తల్లిదండ్రులకు ఓపిక అవసరం. పేరెంట్స్‌గా మీరేం చేయొచ్చంటే.. ♦మీరిచ్చే సూచనలు ఒక్కొక్కటిగా స్పష్టంగా, సరళంగా, నేరుగా ఉండాలి ∙పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించే అంశాలు లేకుండా చూసుకోండి ♦ వారిలోని శక్తి ఖర్చయ్యేందుకు నిత్యం వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి ∙మీ పిల్లల సమస్యను అధిగమించడానికి తగిన వసతులు పాఠశాలలో ఉన్నాయో లేదో తెలుసుకోండి ∙ADHD ఉన్న పిల్లలను పెంచడం ఒక సవాల్. అందువల్ల ఆ అంశంపై మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి ∙సాధారణ చిట్కాలతో ADHD అదుపులోకి రాదు. అందుకు థెరపీ, మందులు అవసరమవుతాయి. ♦ పేరెంటింగ్ ట్రైనింగ్, బిహేవియర్ థెరపీ రోజువారీ పనితీరును మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి ∙సామాజిక నైపుణ్యాల శిక్షణ ఇతరులతో మరింత సమర్థంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది ∙మందులు మెదడులోని న్యూరోట్రాన్మ్సిటర్లు డోపమైన్, నోర్ ఎపినెఫ్రిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి, ఇవి అటెన్షన్ ను మెరుగుపరుస్తాయి. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం!
పూర్వం ‘విద్యానగరం’ అను పట్టణంలో కుబేర వర్మ అను గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతని వద్ద అపారమైన సంపద ఉండేది. అదంతా తన పూర్వీకుల నుండి సంక్రమించిందే. తన వద్ద ఉన్న సంపదనంతా దానధర్మాలు చేసి తాను ఒక అపర కర్ణుడిగా పేరు సంపాదించుకోవాలనే కీర్తి కాంక్ష కలిగింది అతనికి. ఆ ఉద్దేశంతోనే అడిగిన వారికి లేదనకుండా ధన, కనక, వస్తు, వాహనాలను దానం చేస్తూ వచ్చాడు. అంతేకాదు గుళ్ళు గోపురాలు కట్టించి వాటి మీద తన పేరు చెక్కించుకున్నాడు. తాను చేసిన ప్రతి దానం అందరికీ తెలియాలని తాపత్రయపడ్డాడు. అలా పూర్వీకుల ఆస్తిని దానం చేసి అతను కోరుకున్నట్టుగానే అపారమైన కీర్తిని సంపాదించుకున్నాడు. అది దేవలోకానికీ చేరింది. ఈ విషయంలో దేవలోకం కుబేర వర్మను పరీక్షించాలనుకుంది. ఒకసారి ఒక సన్యాసి కుబేర వర్మ వద్దకు వచ్చి ‘నాకు ఆకలిగా ఉంది. మూడు రోజులైంది తినక కాస్త భోజనం పెట్టించండి’ అని అడిగాడు. అందుకు కుబేర వర్మ నవ్వి ‘అన్నదానం ఏముంది.. ఎవరైనా చేస్తారు. మీకు వెండి.. బంగారం.. డబ్బు.. ఏం కావాలన్నా ఇస్తాను. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న దానాలు చేసి నా ప్రతిష్ఠ తగ్గించుకోను. అన్నమే కావాలంటే ఇంకో ఇంటికి వెళ్ళండి’ అని చెప్పాడు. సన్యాసి ‘నేను సన్యాసిని. నాకెందుకు అవన్నీ? భోజనం లేదంటే వెళ్ళిపోతాను’ అంటూ అక్కడి నుండి కదిలాడు. పక్క వీథిలోని దేవదత్తుడి ఇంటికి వెళ్లాడు ఆ సన్యాసి. దేవదత్తుడు సామాన్య కుటుంబీకుడు. గొప్ప దయా గుణం కలవాడు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టేవాడు. అంతేకాదు సాటివారికి తనకు ఉన్నంతలో సాయం చేసేవాడు. తను చేసే దానధర్మాల వల్ల తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని ఏనాడూ ఆశించలేదు. అలాంటి దేవదత్తుడి ఇంటికి వచ్చిన సన్యాసి తనకు ఆకలిగా ఉందని.. భోజనం పెట్టించమని కోరాడు. దేవదత్తుడు ఆ సన్యాసిని సాదరంగా ఆహ్వానించి కడుపునిండా భోజనం పెట్టించాడు. అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సన్యాసి. కొంతకాలం తర్వాత వయసు మీద పడి దేవదత్తుడు చనిపోయాడు. ఆ తర్వాత కుబేర వర్మ కూడా చనిపోయి స్వర్గం చేరుకున్నాడు. అక్కడ స్వర్గంలో.. చాలామందితో పాటు తనకంటే ముందుగానే చనిపోయిన దేవదత్తుడూ ఉన్నాడు. ప్రథమస్థానంలో ప్రత్యేక ఆసనంపై కూర్చొని. కుబేర వర్మకు పదకొండవ స్థానం లభించింది. అది సహించలేని కుబేర వర్మ మండిపడుతూ దేవదూతలతో వాగ్వివాదానికి దిగాడు.. ‘నా ముందు దేవదత్తుడెంత? మా పూర్వీకులు సంపాదించిన అపార సంపదనంతా ప్రజలకు పంచిపెట్టాను. ధన,కనక, వస్తు, వాహనాలు దానం చేశాను. అలాంటి నాకంటే పట్టెడన్నం పెట్టిన దేవదత్తుడు గొప్పవాడు ఎలా అవుతాడు? అసలు నాకంటే ముందున్నవాళ్లంతా ఎవరు?’ అంటూ. అందుకు దేవదూతలు ‘అందరికంటే ముందున్న దేవదత్తుడు ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాడు. అన్నిటికన్నా అన్నదానం గొప్పది. అతనిలో ఎలాంటి స్వార్థం లేదు. కేవలం జాలి,దయ, ప్రేమతోనే అన్నార్తుల ఆకలి తీర్చాడు. సాటివారికి సహాయం చేశాడు. ఇకపోతే మిగిలినవారిలో.. ఆసుపత్రులను కట్టించి ఎంతోమంది రోగులకు ఉపశమనం కలిగించినవారు కొందరు. వికలాంగులను ఆదరించి పోషించిన వారు మరికొందరు. ఇంకా కొందరు చెరువులు తవ్వించి ప్రజలకు, పశువులకు నీటి కొరత లేకుండా చేశారు. వాటన్నిటినీ ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండానే చేశారు. కాబట్టే నీకంటే ముందున్నారు. ఇక నువ్వు కీర్తి కోసం స్వార్థంతో మీ పూర్వీకుల సంపదనంతా అపాత్రదానం చేశావు. అందుకే నీకు పదకొండవ స్థానం లభించింది. ఎప్పుడైనా దానం అనేది గుప్తంగా ఉండాలి. కాని నువ్వు అలా చేయలేదు’ అని చెప్పారు. అంతా విన్నాక కుబేర వర్మకు జ్ఞానోదయం అయింది. తన పూర్వీకులు సంపాదించిన సంపదనంతా కీర్తి కాంక్షతో దుర్వినియోగం చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు. (చదవండి: ప్రపంచంలో చిట్టచివరి గ్రామం ఏదో తెలుసా! ఎక్కడుందంటే..) -
ఎగ్జామ్స్ అనేసరికి తీవ్రమైన జ్వరం వస్తుందా? ఒత్తిడి తగ్గించడం ఎలా?
కిషోర్ చాలా తెలివైన విద్యార్థి. టెన్త్ ్త క్లాస్‌లో 10జీపీఏతో పాసయ్యాడు. దాంతో ఒక కార్పొరేట్ కాలేజీవాళ్లు ఫ్రీ సీట్ ఇచ్చారు, హాస్టల్‌తో సహా. కానీ హాస్టల్‌కి వెళ్లాక కిషోర్ జీవితమే మారిపోయింది. పొద్దున్నే ఐదు గంటలకు లేస్తే బెడ్ ఎక్కేసరికి రాత్రి 11 గంటలవుతుంది. ప్రతిరోజూ ఇదే పరిస్థితి. మరోవైపు ఫ్రీ సీట్ కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోవాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి. మార్కులు తగ్గితే ఫ్రీ సీట్ కేన్సిల్ చేస్తారని, ఫీజు మొత్తం చెల్లించాల్సి వస్తుందని పేరెంట్స్ ఒత్తిడి. ఈ మధ్యకాలంలో కాలేజీలో మోటివేషన్ క్లాస్ పెట్టించారు. ఆ స్పీకర్ చెప్పినట్లు తాను సాధించలేకపోతే ఎలా? అంటూ కిషోర్‌లో ఒత్తిడి మరింత పెరిగింది. ఒకరోజు కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు. కాలేజీ యాజమాన్యం అతన్ని హుటాహుటిన హాస్పిటల్లో చేర్పించి పేరెంట్స్‌కి ఫోన్ చేసింది. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినా కిషోర్ అనారోగ్యానికి కారణం తెలియలేదు, ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గడం లేదు. ఇంటర్మీడియట్ చదువుతున్న శిరీషది మరో రకమైన సమస్య. రెగ్యులర్ స్లిప్ టెస్టులతో ఎలాంటి సమస్యా లేదు. ఫైనల్ ఎగ్జామ్ అనేసరికి తీవ్రమైన జ్వరం వచ్చేస్తుంది. హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టెన్త్ క్లాస్‌లో అలాగే హాస్పిటల్ నుంచి వెళ్లి పరీక్షలు రాసి 8జీపీఏతో గట్టెక్కింది. ఇంటర్ ఫస్టియర్‌లోనూ అదే సమస్య. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండియర్‌లోనూ అదే సమస్య ఎదురవుతుందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. నీట్ పరీక్ష సమయంలో ఇలా జ్వరం వస్తే ఏం చేయాలని కంగారు పడుతున్నారు. కిషోర్, శిరీష అంత సీరియస్ కాకపోయినా చాలామంది విద్యార్థులకు పరీక్షలంటే కొద్దిపాటి ఆందోళన లేదా భయం ఉంటుంది. దీన్నే టెస్ట్ యాంగ్జయిటీ అంటారు. తాను పరీక్షల్లో సరిగా పెర్ఫార్మ్ చేయలేనేమో, ఫెయిల్ అవుతానేమోనని స్టూడెంట్స్ ఆందోళన చెందుతుంటారు. ఒక మోతాదు వరకు టెస్ట్ యాంగ్జయిటీ ఉండటం మంచిదే. అది పరీక్షలకు సిద్ధమయ్యేలా చేస్తుంది. మోతాదు మించితేనే రకరకాల సమస్యలకు దారి తీస్తుంది. విద్యార్థుల్లో టెస్ట్ యాంగ్జయిటీకి ప్రధాన కారణం తల్లిదండ్రులు, అధ్యాపకులు లేదా కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి. పరీక్షల్లో తప్పితే లేదా మంచి మార్కులు రాకపోతే భవిష్యత్తు ఉండదని పదేపదే చెప్పడం వల్ల కొంతమంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. సరిగా ప్రిపేర్ కాకపోవడం లేదా గత పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకపోవడం వల్ల కూడా పరీక్షలంటే భయం ఏర్పడుతుంది. ఆ పరీక్షలు తప్పించుకునేందుకు మనసు రకరకాల వేషాలు వేస్తుంది. అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. టెస్ట్ యాంగ్జయిటీ లక్షణాలు: విద్యార్థుల్లో టెస్ట్ యాంగ్జయిటీ అనేది రకరకాల రూపాల్లో కనిపిస్తుంది. శారీరక, భావోద్వేగ, కాగ్నిటివ్ లక్షణాలుంటాయి. శారీరక లక్షణాలు: తలనొప్పి, కడుపునొప్పి, జ్వరం, విపరీతమైన చెమట, ఊపిరి ఆడకపోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, తలతిరగడం, స్పృహ తప్పి పడిపోవడం. భావోద్వేగ లక్షణాలు: ఒత్తిడి, భయం, నిస్సహాయత, నిరాశ, ప్రతికూల ఆలోచనలు, గతంలో పరీక్ష తప్పిన ఘటనలు పదే పదే గుర్తుకు రావడం, పరీక్ష తప్పితే తల్లిదండ్రుల ప్రవర్తన గురించిన ఆలోచనలు, ఫ్రెండ్స్ ఎలా ఎగతాళి చేస్తారోననే భయం. ప్రవర్తనా/అభిజ్ఞా లక్షణాలు: ఏకాగ్రత లోపించడం, వాయిదా వేయడం, ఇతరులతో పోల్చుకుని ఆత్మన్యూనతగా ఫీలవ్వడం. టెస్ట్ యాంగ్జయిటీని ఎలా తగ్గించాలి? ∙పరీక్షలకు ముందు.. బాగా చదవడానికి వేరే ప్రత్యామ్నాయమేదీ లేదు. చదవాల్సిన సిలబస్‌ను చిన్నచిన్న భాగాలుగా చేసుకుంటే త్వరగా నేర్చుకోవచ్చు, ఒత్తిడి తగ్గుతుంది ∙చాలామంది విద్యార్థులకు ఎలా చదివితే గుర్తుంటాయో తెలియకే బోల్తాపడుతుంటారు. అందువల్ల ముందుగా ఎఫెక్టివ్ స్టడీ స్ట్రాటజీస్ నేర్చుకుని, వాటి ప్రకారం చదువుకోవాలి. ∙కాఫీ, టీలు మానేసి సమయానికి తినడం, వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒత్తిడి నుంచి శరీరాన్ని, మనస్సును కాపాడుకునేందుకు జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ రోజూ ప్రాక్టీస్ చేయండి. పరీక్షకు ముందురోజు నైట్ అవుట్ చేయకుండా, కచ్చితంగా 7–9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. మీ ఆందోళన మరింత పెరగకుండా ఉండేందుకు పరీక్ష సెంటర్‌కి.. ముందే చేరుకుని మీ సీట్లో కూర్చోండి ∙పరీక్షకు ముందు ఐదు నిమిషాలు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఐదు నిమిషాలు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి ∙మిమ్నల్ని మీరు గ్రౌండింగ్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్నవారికన్నా మీరు మెరుగైనవారని విజువలైజ్ చేసుకోండి. గతంలో మీరు బాగా పెర్ఫార్మ్ చేసిన పరీక్షలను గుర్తు చేసుకోండి. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. హాయిగా, ప్రశాంతంగా పరీక్ష రాయండి. టెస్ట్ యాంగ్జయిటీని తగ్గించుకోవాలంటే అత్యంత ముఖ్యమైంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మద్దతు. రిజల్ట్స్ కోసం విద్యార్థిపై ఒత్తిడి పెంచకుండా, బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఇస్తే చాలని భరోసానివ్వాలి. సమస్య తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ని సంప్రదించాలి. -
ఆ భయమే మీరాను ఆత్మహత్య చేసుకునేలా చేసిందా? ఏం జరిగింది?
కూతురి ఆత్మహత్యతో విజయ్ ఆంటోని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కూతురు మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 12వ తరగతి చదువుతున్న మీరా మీరా సూసైడ్ ఘటన కోలీవుడ్‌ను షాక్‌కి గురి చేస్తోంది. ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నదానిపై పలువురు చర్చిస్తున్నారు. అయితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి మాత్రమే అని తెలుస్తోంది. చదువుల కారణంగా మీరా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో కుంగిపోతోందని, కొంతకాలంగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మీరా ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ విజయ్ ఆంటోనీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ మాట్లాడుతూ.. మీరా మృతిపై కీలక విషయాలు వెల్లడించింది. ''మీరాకు చీకటి అంటే చాలా భయమని వాళ్ల నానమ్మ(విజయ్ అంటోని తల్లి) చెప్పింది. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, చీకట్లో కాసేపు ఉండాలన్నా హడలిపోయేదని, అలాంటి అమ్మాయి ఇంతటి కఠిన నిర్ణయం ఎలా ధైర్యం చేసి తీసుకుందో అర్థం కావడం లేదు. పిల్లల్ని ఎంతగానో ప్రేమించే విజయ్‌కి ఇలా జరగడం చాలా దురదృష్టకరం'' అంటూ ఆమె వెల్లడించింది. ఈ క్రమంలో భయం, డిప్రెషన్ వంటి సున్నితమైన అంశాలపై సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది. భయం ఒక్కోక్కరికి ఒక్కో విధంగా ఉండొచ్చు. కొందరు ఇంట్లో ఇంటరిగా ఉండాలంటే భయపడతారు, మరికొందరు స్నానం చేయడానికి, చీకట్లో ఉండేందుకు విపరీతంగా భయపడుతుంటారు. నీళ్ళని చూసినా, మెట్లెక్కుతూ కిందకి చూసినా, సముద్రాన్ని చూసినా భయపడిపోతుంటారు. ఇదొక సాధారణ మానసిక సమస్య. దీనికి మందుల ద్వారా, సిస్టమాటిక్ డీ సెన్సిటైజేషన్ అనే కౌన్సిలింగ్ ద్వారా నయం చెయ్యొచ్చు. ఈ ఫోబియా నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం.. దేన్నుంచి అయితే భయపడుతున్నారో ఆ పనుల్ని నిరంతరం చేస్తూ ఉండటం. ఉదాహరణకు మీకు డ్రైవింగ్ అంటే భయమనుకోండి. అదే పనిని జాగ్రత్తగా మళ్లీమళ్లీ చేయడానికి అలవాడుపడండి. కొందరికి ఫోబియా ఉంటుంది. ఉదాహరణకు.. బొద్దింక అంటే భయం ఉన్నప్పుడు ఒక గాజు గ్లాసు దాని మీద బోర్లించి ఓ నిమిషం దాన్ని చూస్తూ గడపడం. దీని వల్ల ఆ ఫోబియా నుంచి బయట పడవచ్చునంటారు మానసిక శాస్త్రవేత్తలు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్నట్లే ప్రతీది సమస్యలా భావించొద్దు. శారీరక సౌష్టవం కోసం ఎంత శ్రద్ద పెడుతున్నామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఇందుకోసం మంచి ఆహరం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఇష్టమైన వాళ్లతో మాట్లాడటం, తమ సమస్యలను స్నేహితులతో పంచుకోవడం వంటివి చేయాలి. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ అన్నట్లు.. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడి, ఆందోళన, నిరుత్సాహం మనిషిని మానసిక రోగులుగా మార్చతాయి. దీనికి ఒక్కటే మార్గం. పాజిటివ్ థింకింగ్. భయాన్ని తక్కువ చేసి చూడటం.. ధైర్యంగా ముందుకెళ్లడం ఇవే నివారణ మార్గాలు’’. இது எல்லாமே ஒரு Teacher கவனிச்சா Students-க்கு Help பண்ணமுடியும் ! - Archana | Psychiatrist #MentalHealthAwareness #Mentalhealth #Psychiatrist #mentalwellness #VijayAntonyDaughter #VijayAntony #ssmusic pic.twitter.com/pFc2iTJ2Li — SS Music (@SSMusicTweet) September 21, 2023 இப்பவும் இவருக்கு இந்த இழப்புன்றத ஏத்துக்கவே முடியல 😭#VijayAntony pic.twitter.com/r4tg1TByzo — Monkey Cinema (@monkey_cinema) September 21, 2023 -
పిల్లలు అడిగనవన్నీ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ట్రాప్‌లో పడ్డట్లే!
ఈ మధ్యకాలంలో సెల్‌ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా రెండేళ్ల లోపు చిన్నారులు కూడా ఫోన్లో బొమ్మలు చూస్తూ గంటల తరబడి గడిపేస్తున్నారు. భోజనం తినాలన్నా, నిద్ర పోవాలన్నా ఫోన్ పక్కన ఉండాల్సిందే అనేంతలా అలవాటుపడుతున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల చేతిలో ఫోన్ పెడితే అన్నం తినిపించడం సులువు అని ఈజీగా మొబైల్ అలవాటు చేస్తున్నారు. ఇది చిన్నారుల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది మానసికంగా, శారీరకంగా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 1. మీ పిల్లల స్నేహితులందరికీ సెల్ ఫోన్ ఉందని, మీ బిడ్డకు కూడా సెల్ ఫోన్ కొనిచ్చారా? 2.మీ పిల్లలు హోంవర్క్ పుస్తకం మర్చిపోతే మీరు స్కూల్ కు వెళ్లి ఇచ్చి వస్తున్నారా? 3.మీ పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కు కావాల్సిన మెటీరియల్ కోసం మీరు షాపుల చుట్టూ తిరుగుతున్నారా? 4.మీ బిడ్డను చాలా యాక్టివిటీస్ లో చేర్పించడం వల్ల అసలు ఖాళీ సమయమే ఉండటం లేదా? 5. మీరు పికప్ చేసుకోవడానికి వెళ్లేందుకు కాస్తంత లేటయితే వెంటనే మీకు మెసేజ్ వస్తుందా? వీటిలో ఏ ఒక్కటి చేస్తున్నా.. మీరు పేరెంట్ ట్రాప్‌లో చిక్కుకున్నట్లే. పిల్లలు కష్టపడకూడదని చాలామంది పేరెంట్స్ పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేస్తుంటారు. అలాగే వాళ్ల ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చేస్తుంటారు. ఫ్రెండ్స్ తో, టీచర్స్ తో వారికి ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులే పరిష్కరిస్తుంటారు. దీనివల్ల పిల్లలు తమకు సొంతంగా సమస్యలను పరిష్కరించుకొని, స్కిల్స్ సాధించుకునే అవకాశాన్ని కోల్పోతారు. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కోసం ఇతరులవైపు చూసే, ఇతరులపై ఆధారపడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యే ప్రవర్తననే parenttrap(పేరెంట్ ట్రాప్)అంటారు. కంట్రోల్ ట్రాప్(Control Trap): తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా నియంత్రించడం, వాళ్లు ఏం చేస్తున్నారో, సోషల్ మీడియా వాడకం వరకు ప్రతీది నిర్దేశించినప్పుడు ఇది జరుగుతంది. పిల్లల భద్రత, శ్రేయస్సు కోసం కొంత నియంత్రణ అవసరం. అయితే అతిగా నియంత్రించడం వల్ల పిల్లల్లో ఆందోళన, స్వీయగౌరవ సమస్యలు ఏర్పడతాయి. క్రిటిసిజమ్ ట్రాప్(Criticism Trap): కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం విమర్శిస్తుంటారు, నిరంతరం వారిలో తప్పులను వెతుకుతుంటారు. ఇది వారి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కంపారిజన్ ట్రాప్(Comparison Trap): చాలామంది పేరెంట్స్ పిల్లలను తోబుట్టువులతోనూ, తోటివారితోనూ పోల్చుతుంటారు. నిరంతరం ఇతరులతో పోల్చడం వారి ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. గివింగ్ ట్రాప్(Giving Trap): ఇతర పిల్లలకు ఉన్నవి తమకు లేవని పిల్లలు బాధపడకూడదని తల్లిదండ్రులు భావిస్తారు. అందువల్ల వారు అడగకుండానే అన్నీ తెచ్చి పెడతారు. దీనివల్ల పిల్లలకు అవసరంలేని వస్తువులను ఇచ్చే ఉచ్చులో పడతారు. గిల్ట్ ట్రాప్(Guilt Trap): పిల్లల అసంతృప్తికి తాము కారణం కాకూడదని పేరెంట్స్ భావిస్తారు. తమ బిడ్డ కలత చెందడానికి కారణం తామేనని తల్లిదండ్రులు భావించి అపరాధ భావనకు లోనవుతారు. దాన్ని అధిగమించేందుకు పిల్లలు కోరినవీ, కోరనివీ కొనిచ్చి తమ భారం దింపుకుంటారు. హర్రీడ్ ట్రాప్(Hurried Trap): తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తమ శక్తిమేరకు ప్రతిదీ చేయాలని కోరుకుంటారు. దీనివల్ల పిల్లల అవసరాలు వెంటనే తీరతాయని భావిస్తుంటారు. తక్షణ తృప్తి (#instantgratification)కి అలవాటు పడతారు. అలా తక్షణ తృప్తి దొరకనప్పుడు తీవ్రంగా నిరాశ చెందుతారు, విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. పర్మీసివ్ ట్రాప్(Permissive Trap): కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేసినా ఏమీ అనరు, ఏం చేయాలనుకున్నా అనుమతిస్తారు. పిల్లలతో సంఘర్షణ నివారించడానికి ఇది సులువైన మార్గంగా భావిస్తారు. కానీ దీనివల్ల పిల్లల్లో స్వీయ క్రమశిక్షణ లోపిస్తుంది, విచ్చలవిడితనానికి దారితీయవచ్చు. ప్రెజర్ ట్రాప్(Pressure Trap): తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను పంచుకోవడం గర్వంగా భావిస్తారు. పోటీలో పిల్లలు ముందుంటే సంతోషిస్తారు, ఏమాత్రం వెనుకంజ వేసినా ఆందోళన పడుతుంటారు. ముందుకు దూసుకుపోవాలని పిల్లలను ఒత్తిడి చేస్తారు. రెస్క్యూ ట్రాప్(Rescue Trap): తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలను చూసి బాధపడతారు. వాటినుంచి బయట పడేయడం ద్వారా వారిని ‘రక్షించాలని’ భావిస్తారు, బయటపడేస్తారు. పర్యవసానంగా కొన్ని పనులు జరగాలంటే వేచి ఉండటం ( delayed gratification) అవసరమనే విషయం పిల్లలకు ఎప్పటికీ అర్థం కాదు. అలాగే తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే అవకాశం ఉండదు. పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే... పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే ఎప్పటికప్పుడు తమ ప్రవర్తనను గమనించుకుంటూ, అంచనా వేసుకుంటూ, అవసరమైనమేరకు మార్చుకునేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. ► ప్రతి బిడ్డ ప్రత్యేకమని, ఎవరి ప్రత్యేక సామర్థ్యాలు వారికి ఉంటాయని గుర్తించాలి. ► బిడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పోల్చకూడదు. ► సరిహద్దులను నిర్ణయించి స్థిరంగా అమలు చేయాలి. వాటి పరిధిలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛనివ్వాలి. ► కష్టమైన అంశాలపై మాట్లాడటానికి, అవసరమైనప్పుడు కష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ► విమర్శించడం కంటే నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించడంపై దృష్టి పెట్టాలి. ► పిల్లల బలాలను, విజయాలను, సానుకూల ప్రవర్తనలను ప్రశంసించాలి. ► పిల్లలు తమ పనులు తాము చేసుకునేలా ప్రోత్సహించండి. ► తమకు కావాల్సినవి తాము కష్టపడి సాధించుకోవడం నేర్పించండి. ► తమ సమస్యలు తామే పరిష్కరించుకునేందుకు ప్రోత్సహించండి. -డా. మీ నవీన్ నడిమింటి(9703706660), ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
మీ బిడ్డ స్కూల్లో నోరు విప్పడంలేదా? సైలెంట్ అనుకోవద్దు.. చాలా ప్రమాదం
సునీత, సుందర్‌లకు నందిని ఒక్కతే కూతురు. హైదరాబాద్‌లోని ప్రముఖ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. ముచ్చటైన పిల్ల. తన పనులన్నీ తానే చేసుకుంటుంది. బొమ్మలు అద్భుతంగా వేస్తుంది. కానీ మాట్లాడటం తక్కువ. మేనత్త పోలికలు వచ్చాయని సరిపెట్టుకున్నారు. ఒకరోజు స్కూల్ నుంచి ఫోన్‌కాల్ వచ్చేసరికి, పాపకు ఏమైనా అయ్యుంటుందేమోనని సునీత భయపడింది. హడావుడిగా స్కూల్‌కు వెళ్లి చూసేసరికి, క్లాస్ టీచర్ సుమిత్ర దగ్గర నిల్చుని ఉంది నందిని. ఎందుకింత హడావుడిగా పిలిచారని అడిగింది. ‘ఏం చెప్పమంటారు మేడం? నందిని రెండు నెలలుగా క్లాసులో నోరు మెదపడం లేదు. ఏం అడిగినా మౌనంగానే ఉంటోంది. క్లాస్ టెస్ట్‌లలో బాగానే రాస్తోంది. కానీ క్లాసులో మాత్రం నోరు విప్పడం లేదు. ఎంత బుజ్జగించి అడిగినా నో యూజ్.’ ‘తను ఇంట్లో కూడా తక్కువే మాట్లుతుంది మేడం. వాళ్ల మేనత్త పోలిక.’‘అలా సరిపెట్టుకుంటే సరిపోదు మేడం. పాప ఏదో సమస్యతో బాధపడుతోంది. వెంటనే ఎవరైనా సైకాలజిస్ట్‌కు చూపించండి.’ ‘సైకాలజిస్ట్ దగ్గరకా? ఎందుకు మేడం? మా పాపకేమైనా పిచ్చి అనుకుంటున్నారా?’ అని కోపంగా అడిగింది సునీత. ‘సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లేవాళ్లందరూ పిచ్చివాళ్లే అనేది మీ అపోహ మేడం. మానసిక సమస్యలు పిల్లల్లో కూడా రావచ్చు. దయచేసి అర్థంచేసుకుని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లండి’ అని చెప్పింది టీచర్. తప్పదన్నట్లుగా నందినిని మా క్లినిక్‌కు తీసుకువచ్చారు. సునీత చెప్పింది విన్నాక నందిని ‘సెలెక్టివ్ మ్యూటిజం’తో బాధపడుతోందని అర్థమైంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడకపోవడమే దీని ప్రధాన లక్షణం. ఒకశాతం మంది పిల్లల్లో ఈ సమస్య ఉంటుందని అంచనా. కొన్నిచోట్ల నోరు విప్పరు.. మీ బిడ్డ సెలెక్టివ్ మ్యూటిజంతో పోరాడుతున్నట్లనిపిస్తే ఈ కింది లక్షణాల కోసం చూడండి. అయితే రెండు మూడు లక్షణాలు కనపడగానే సెలక్టివ్ మ్యూటిజం అని నిర్ధారణకు రాకండి. సైకోడయాగ్నసిస్ ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలి. ఆత్రుత, భయం లేదా ఇబ్బంది కారణంగా మాట్లాడాలనే కోరికను అణచుకోవడం ∙భయపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కదలిక లేకపోవడం, మాట్లాడకపోవడం, కళ్లల్లోకి చూడలేకపోవడం ∙ స్కూల్ లేదా ఇతర నిర్దిష్ట సామాజిక పరిస్థితులలో మాట్లాడలేకపోవడం ∙అవసరాలను వ్యక్తీకరించడానికి మాటలు కాకుండా సంజ్ఞలు ఉపయోగించడం ∙ 2–4 సంవత్సరాల వయసులో సిగ్గు, ఇతరులంటే భయం, మాట్లాడటానికి అయిష్టత ∙ ఇంట్లో లేదా తెలిసిన వ్యక్తులతో సులభంగా మాట్లాడటం, స్కూల్లో, టీచర్లతో నోరువిప్పకపోవడం.మాట్లాడమని బలవంతం చేయొద్దు..సెలెక్టివ్ మ్యూటిజంను ఎంత ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే బిడ్డ మౌనానికి అలవాటు పడే ప్రమాదం ఉంది. మీ బిడ్డ నెల అంతకంటే ఎక్కువ కాలం మౌనంగా ఉంటే, వెంటనే చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. చికిత్స కోసం సైకాలజిస్టును సంప్రదించడంతో పాటు మీరు చేయగలిగేవి కూడా ఉన్నాయి.∙మాట్లాడని పిల్లల పట్ల టీచర్లు విసుగ్గా లేదా కోపంగా ఉంటారు. పిల్లల ప్రవర్తన ఉద్దేశపూర్వకం కాదని టీచర్లకు తెలియజేయండి. సానుకూల ప్రవర్తనలకు ప్రశంసలు, బహుమతులు అందించాలి ∙మాట్లాడినప్పుడు మెచ్చుకోండి. అంతేతప్ప మాట్లాడాల్సిందేనని పిల్లలను బలవంతం చేయవద్దు. బదులుగా చదవడం, డ్రాయింగ్ లేదా పజిల్స్ చేయడం వంటివి ఎంచుకోండి ∙మీ బిడ్డ మాట్లాడటానికి భయపడితే, ఒత్తిడి లేదా పనిష్మెంట్ ద్వారా వారు ఈ భయాన్ని అధిగమించలేరు. కాబట్టి మౌనానికి శిక్షించవద్దు ∙మాట్లాడమని ఒత్తిడి చేయవద్దు. దానివల్ల ఆందోళన మరింత పెరుగుతుంది ∙సెలెక్టివ్ మ్యూటిజం కోసం దీర్ఘకాలం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) అవసరమవుతుంది ∙ఇందులో డీసెన్సిటైజేషన్, రీఇన్ఫోర్స్మెంట్, షేపింగ్ పద్ధతుల ద్వారా పిల్లల్లోని ఆందోళన తగ్గి ధైర్యంగా మాట్లాడేందుకు సహాయపడతారు ∙ఎక్స్పోజర్ థెరపీ ద్వారా సురక్షితమైన స్థలాన్ని సృష్టించి పిల్లల్లోని భయాన్ని తగ్గించవచ్చు. సమస్య తీవ్రంగా లేదా దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు, థెరపీ వల్ల మెరుగుపడనప్పుడు సైకియాట్రిస్ట్‌ను కలసి మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఆందోళనే ప్రధాన కారణం.. అన్ని మానసిక రుగ్మతల్లాగే సెలెక్టివ్ మ్యూటిజానికి కూడా ఒకే కారణం ఉండటం అసంభవం. చైల్డ్ అబ్యూజ్, ట్రామా కారణమని గతంలో నమ్మేవారు. అయితే ఇది సోషల్ యాంగ్జయిటీకి సంబంధించినదని, జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయని ప్రస్తుత పరిశోధనలు సూచిస్తున్నాయి. బాగా సిగ్గుపడే లేదా భయపడే లేదా స్వీయ నియంత్రణ సమస్యలున్న పిల్లల్లో కూడా ఇది రావచ్చు. సోషల్ యాంగ్జయిటీ ఉన్న పేరెంట్స్ ఉంటే వారి పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. డిప్రెషన్, లాంగ్వేజ్ ప్రాబ్లమ్, ఓసీడీ, పానిక్ డిజార్డర్, ఆటిజం లాంటి మానసిక సమస్యలున్న పిల్లల్లో కూడా సెలెక్టివ్ మ్యూటిజం కనిపించే అవకాశం ఉంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
పిల్లలు మాట వినకుండా బెట్టు చేస్తున్నారా?ఇలా దారికి తెచ్చుకోండి
ఈకాలం పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం కష్టమే. ఇది చేయకు, అది చేయకు, అలా, ఇలా ఉండకూడదు అని చెబితే అస్సలు వినరు. పెద్దవాళ్లు చెప్పేది తమ మంచికే అన్న స్పృహ ఉండదు వారికి. అయినా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తపన పడుతుంటారు తల్లిదండ్రులు. మాట వినకుండా పెంకిగా ప్రవర్తించే పిల్లలను ఇలా మీ దారిలోకి తెచ్చుకోండి. అప్పుడు ఇక పిల్లలతో పాటు మీరూ సంతోషంగా ఉంటారు. ►మాట వినడం లేదని పిల్లలను తిట్టకూడదు. నువ్వు చెడ్డదానివి లేదా చెడ్డవాడివి అని వారిని నిందించకూడదు. నువ్వు పెద్దదానివి లేదా పెద్దవాడివు అవుతున్నావు కదా... అందుకే ఇలా చేస్తే బాగుంటుంది... అని లాలనగా చెప్పాలి. ► కోపంలో మనం అనే కొన్ని రకాల మాటలు పిల్లల మనసుకు గాయం చేసి, వారి మనసును విరిచేస్తాయి. కొన్నిసార్లు వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతిస్తాయి. అందుకే వీలైనంత వరకు వారికి ఓపికగా అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. ►పిల్లలు ఎంత విసిగించినప్పటికీ పెద్దగా అరవకూడదు. పైన చెప్పుకున్నట్టు సున్నితంగా పదేపదే చెబుతూ బుజ్జగించాలి. ఎంత చెప్పినా వినకుండా ఉంటే ముందు వాళ్ల కోపం తగ్గించాలి. తరువాత పిల్లలు విసుక్కోకుండా జాగ్రత్తగా చెప్పాలి. ► చెప్పేది ఏదైనా ప్రేమగా చెబితే ఎంత మొండి చేసేవారైనా తప్పకుండా వింటారు. నచ్చిన డ్రెస్ వేసుకోనివ్వడం, హోం వర్క్ అయిన తరువాత టీవీ చూడనివ్వడం, డాడీతో కలిసి బయటకు వెళ్లడానికి అనుమతించడం వంటివి. ఇలా పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకం కలిగించి, తరువాత వారికి మంచి చెడులు వివరించాలి. ►ప్లీజ్, థ్యాంక్యూ, యూ ఆర్ వెల్కమ్ వంటి మర్యాదలు నేర్పించాలి. తల్లిదండ్రులు ఏం మాట్లాడతారో పిల్లలు అదే నేర్చుకుంటారు. అందుకే మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. ► పిల్లలు వారికి హాని జరిగే పనులు కొన్నిసార్లు చేస్తుంటారు. వెంటనే కేకలేసి, లెక్చర్ ఇవ్వకూడదు. కాస్త దెబ్బలు తగిలినప్పటికీ... వాళ్లు తేరుకున్నాక, మీ మాటలు వినే మూడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే దాని గురించి వివరించాలి. అప్పుడు వారు మరోసారి అటువంటి పనులు చేయరు. -
చిన్నారులు పెంపుడు జంతువులతో ఆడుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త
చిన్నారులు తీసుకున్న ఆహారం అరగకపోతే వారి తల్లిదండ్రులు హైరానా పడతారు. ఆఘమేగాల మీద ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. పిల్లల్లో వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు మూలం నులి పురుగులే అని వైద్యులు చెబుతున్నారు. పిల్లల కడుపులో నులి పురుగుల ఉన్నట్టు గుర్తిస్తే సులభ పద్ధతిలో వైద్యం చేయించవచ్చు. తగిన చికిత్స అందించకపోతే ప్రమాదకరంగా పరిగణిస్తాయని హెచ్చరిస్తున్నారు. నులి పురుగులు హెల్మెంత్ అనే పరాన్నజీవి జాతికి చెందినవి. ఇవి మూడు రకాలు. 1.రౌండ్ వారమ్స్ 2.పిన్ వారమ్స్ 3.ప్లూక్స్. వాటిలో రౌండ్ వారమ్స్ జాతికి చెందిన పురుగులు సాధారణంగా కనిపిస్తాయి. పిన్ వారమ్స్, ప్లూక్స్ వారమ్స్ జాతి పురుగులు ముఖ్యంగా పిల్లల పేగుల్లో జీవిస్తాయి. రౌండ్ వారమ్స్ జాతి పురుగులు 2 నుంచి 5 అంగుళాల పొడవుంటాయి. ఇవి పెంపుడు జంతువులు, కుక్కలు, పిల్లుల్లోనే గాకుండా మట్టిలో కూడా నివశిస్తాయి. పెంపుడు జంతువులతో చిన్నారులు సన్నిహితంగా ఉండడం, కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా చిన్నారులకు నులి పురుగుల సంక్రమిస్తాయి. వ్యాప్తి ఇలా.. హుక్ వారమ్స్, పిన్ వారమ్స్ అనే జీవులు లార్వా రూపంలో మట్టిలో ఉంటాయి. చెప్పులు లేకుండా పిల్లలు మట్టిలో తిరిగేటపుడు ఈ జీవులు వారి కాళ్ల చర్మం ద్వారా రక్తంలో ప్రవేశించి వారి ఊపిరితిత్తులలోకి చేరతాయి. అక్కడ నుంచి శ్వాస నాళంలోకి చేరి పురుగులుగా వృద్ధి చెందుతాయి. అక్కడే గుడ్లు పెట్టి వ్యాప్తి చెందుతాయి. ఆ గుడ్లు పిల్లల మలము ద్వారా బయటకు వచ్చి తిరిగి మట్టిలో లార్వాగా వ్యాప్తి చెందుతాయి. నులి పురుగుల లక్షణాలు నులి పురుగుల బారిన పడ్డ చిన్నారుల్లో ప్రాథమిక దశలో కొద్దిగా జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. లార్వా ఊపిరితిత్తులలోకి వెళ్ళడంతో కడుపులో నొప్పి, వాంతులు, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. హుక్ వార్మ్ జాతి పురుగులకు చిన్న దంతాలు వంటివి ఉంటాయి. వాటి సాయంతో అవి ఆమర నాళాల గోడలకు అతుక్కుని ఉంటూ క్రమంగా రక్తాన్ని పీల్చుకుంటాయి. చిన్నారుల జీర్ణ కోశంలో రక్త శ్రావం ఏర్పడుతుంది. దీంతో చిన్నారుల్లో రక్త హీనత, పోషకాహార లోపాల సమస్యలు తలెత్తుతాయి. రక్తహీనత కలిగిన పిల్లల్లో ఆయాసం ఉంటుంది. అలాగే శరీరం పాలిపోయినట్టుగా, నీరసంగా ఉంటారు. మట్టి తినే అలవాటు కనిపిస్తుంది. భారత్‌లో 22 కోట్ల చిన్నారులు .. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006లో జరిపిన సర్వే ప్రకారం భారత్‌లో 22 కోట్ల చిన్నారులు నులి పురుగుల బారిన పడినట్టు అంచనా. దేశంలో ప్రతి 10 మందిలో ఏడుగురు పిల్లలు నులి పురుగుల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల చిన్నారులు ఎక్కువ మంది నులి పురుగులు బారిన పడుతున్నారు. మాత్రలు ఉచితంగా వేస్తారు బయట ఆహారం తినడం, మట్టిలో ఆడడం, కలుషిత నీరు తాగడం వల్ల పిల్లలకు నులిపురుగుల సమస్యలు వస్తాయి. పిల్లలకు ఈ వ్యాధి రాకుండా తల్లిదండ్రులు ఏటా రెండుసార్లు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి. గర్భిణులు కూడా మాత్రలు తీసుకోవచ్చు. ప్రధానంగా పిల్లలకు చేతులు శుభ్రంగా కడుక్కో వడం నేర్పించాలి. పిల్లలకు తల్లి పాలు పట్టించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరు గుతోంది. మంచి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది సోమవారం పిల్లలకు ఉచితంగా ఈ మాత్రలు వేస్తారు. –డాక్టర్ హేనా, అర్బన్ హెల్త్ సెంటర్, నిడదవోలు -
ఫస్ట్ ఎయిడ్‌తో వేలకొద్దీ ప్రాణాలను కాపాడవచ్చు
ఫస్ట్ ఎయిడ్ గురించి కొద్దిపాటి అవగాహన ఉన్నా వేలకొద్దీ ప్రాణాలను కాపాడవచ్చు అంటున్నారు డాక్టర్ శివరంజని. హైదరాబాద్‌కు చెందిన ఈ పిడియాట్రీషియన్ పసిపిల్లల్లో, పెద్దల్లో వచ్చే హటాత్ అపస్మారకం, ఉక్కిరిబిక్కిరి, ఫిట్స్ సమయాల్లో ఎలా వ్యవహరిస్తే ప్రాణాలు నిలుస్తాయో గత దశాబ్దకాలంగా ఉచిత వర్క్‌షాపుల ద్వారా చైతన్యపరుస్తున్నారు. తన జీవితంలోని ఒక సంఘటన వల్లే లైఫ్ సేవింగ్ స్కిల్స్ అవసరాన్ని తెలుసుకున్నానని అంటున్నారామె. రాధిక (పేరు మార్చాం) హాల్లో టీవీ చూస్తోంటే బాత్రూమ్లోనుంచి ధబ్మని శబ్దం వచ్చింది. పరిగెత్తుకెళ్లి చూస్తే భర్త అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతనికి హార్ట్ఎటాక్ వచ్చినట్టు ఆమెకు అర్థమైంది. అదృష్టవశాత్తు నెల క్రితం ఆమె డాక్టర్ శివరంజని నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో సి.పి.ఆర్. ఎలా చేయాలో తెలుసుకుంది. వెంటనే ఛాతీ మీద నియమానుసారం నొక్కుతూ భర్తకు నోటితో ఊపిరి అందించింది. భర్తలో చలనం వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తే అతనికి వచ్చిన హార్ట్ఎటాక్ ప్రాణాంతకం కాకుండా కాపాడటంలో ఆమె చేసిన సి.పి.ఆర్ చాలా ముఖ్యపాత్ర పోషించిందని డాక్టర్లు తెలిపారు. ‘ఫస్ట్ ఎయిడ్ తెలిస్తే ఇలాగే ఎన్నోప్రాణాలు నిలుస్తాయి. ఆమె సాధారణ గృహిణి. సి.పి.ఆర్. ఎలా చేయాలో ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆమెకే కాదు.. ఆమెలాంటి గృహిణులకు స్త్రీలకు అందరికీ ఎవరో ఒకరు తెలపాలి. నా వంతుగా నేను వర్క్‌షాప్స్ ద్వారా తెలుపుతున్నాను’ అంటారు శివరంజని. పిల్లల డాక్టర్ డాక్టర్ శివరంజని పిల్లల డాక్టర్. ‘మా నాన్నగారు, తాతగారు కూడా డాక్టర్లే. నేను డాక్టర్ కావాలనుకున్నప్పుడు పిల్లలంటే ఇష్టం కనుక వారికి వైద్యం చేయడంలో ఆనందం ఉందనిపించింది. జిప్మర్ (పాండిచ్చేరి)లో పిల్లల వైద్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాను’ అన్నారు శివరంజని. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో పిల్లల డాక్టర్‌గా పని చేస్తున్నారు. అయితే కేవలం తన వృత్తిని పనిగా మాత్రమే చూడదలుచుకోలేదు. తనకు తెలిసిన జ్ఞానాన్ని సామాన్యులకు కొద్దిగానైనా అందుబాటులో తేవాలని అనుకున్నారు. ‘మన దగ్గర ప్రతి ఆరు మరణాల్లో ఒకటి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలియపోవడం వల్ల జరుగుతోంది. గుండెపోటు, మూర్ఛ, అపస్మారకం, ఊపిరాడకపోవడం ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఎలా చేయాలో అందరికీ శాస్త్రీయమైన శిక్షణ ఉంటే చాలా ప్రాణాలు కాపావచ్చు. అందుకే గత పదేళ్లుగా నేను ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ చైతన్యం తెస్తున్నారు’ అన్నారామె. మలుపు తిప్పిన ఘటన ‘నేను పాండిచ్చేరిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఒకరోజు ఉసిరి కాయలు తింటుంటే హటాత్తుగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నా పక్కనే సహ విద్యార్థిని ఉంది. ఆమెకు ఇలాంటి స్థితిలో చేయాల్సిన హైమ్లక్ మనూవా (ఉక్కిరిబిక్కిరి సమయంలో పొత్తికడుపు మీద నొక్కుతూ చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్) తెలుసు. వెంటనే చేసింది. ఆమె లేకున్నా, ఆ ఫస్ట్ ఎయిడ్ చేయకున్నా ఇవాళ మిగిలేదాన్ని కాదు. అప్పుడే నాకు ఫస్ట్ ఎయిడ్ విలువ ఏంటో తెలిసింది. కా6ఋ దురదృష్టం మన దేశంలో ఇందుకై సాధారణ ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వరు. అవగాహన కల్పించరు. కొద్దిమందికే ఈ అవగాహన ఉంటుంది. నా వంతుగా నేను వర్క్‌షాప్స్ ద్వారా అవగాహన కలిగిస్తున్నాను’ అన్నారు శివరంజని. పసిపిల్లలకు ‘చంటిపిల్లలు ఒక్కోసారి ఊపిరిపీల్చని స్థితికి వెళతారు. సి.పి.ఆర్ చేయడం తెలిసుంటే పిల్లల్ని కాపాడుకోగలుగుతారు తల్లులు. అలాగే వారు గొంతుకు అడ్డం పడేలా ఏదైనా మింగినప్పుడు కూడా ఏం చేయాలో తల్లులకు తెలియాలి. ఇవన్నీ నా వర్క్‌షాప్స్‌లో చూపిస్తాను. ఇందుకు బొమ్మలను ఉపయోగిస్తాను’ అన్నారు శివరంజని. ఇందుకోసం ఆమె నేరుగా ఆన్లైన్లో సెషన్స్ నిర్వహిస్తారు. ‘కాని చాలామంది తల్లులు సెషన్స్‌కు రారు. ఆ ఏముందిలే అనుకుంటారు. వారిని ఒప్పించి తేవడం కష్టం. అయినా నేను పట్టువిడవక ప్రయత్నిస్తాను. ఫోన్లు చేసి పిలుస్తాను. వాట్సప్ గ్రూప్ పెట్టి వెంటపడతాను’ అంటారు శివరంజని. డాక్టర్ శివరంజని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగుళూరులలో గత పదేళ్లలో 12 వేల మంది తల్లులకు, సాధారణ వ్యక్తులకు ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ నేర్పించారు. అంతేకాదు... సీజనల్‌గా అవసరమైన హెల్త్ అవేర్నెస్ కోసం వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి కృషి విలువైనది. ఇతర డాక్టర్లు అనుసరించాల్సినది. -
CJI DY Chandrachud: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గొప్పదనానికి వందనం చేయాల్సిందే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన పదవీకాలంలో అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భ విచ్ఛిత్తి వంటి ఎన్నో చరిత్రాత్మక తీర్పులతో వార్తల్లో నిలిచారు. భారత అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయిన చంద్రచూడ్ నిజజీవితంలో మాత్రం ఎటువంటి ఆడంబరాలకు పోకుండా చాలా సాదాసీదాగా గడుపుతారన్న విషయం కొద్ది మందికే తెలుసు. తాజాగా చంద్రచూడ్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. డీవై చంద్రచూడ్ మంచి న్యాయమూర్తే కాదు మంచి మనిషి కూడా అని అప్పుడే అందరికి తెలిసింది. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ గతేడాది నవంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతంలో పనిచేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడే డీవై చంద్రచూడ్. ఆయన తండ్రి వైవీ చంద్రచూడ్ సుప్రీంకోర్టులో గరిష్టంగా ఏడేళ్ల సుదీర్ఘ కాలం సీజేఐగా పనిచేసిన రికార్డు కూడా ఉంది. అంతే కాదు డీవై చంద్రచూడ్ ఇప్పటికే సుప్రీంకోర్టులో గత రెండేళ్లుగా ఎన్నో కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇందులో అయోధ్య తీర్పుతో పాటు పలు కీలక తీర్పులు ఉన్నాయి. నాణానికి ఒకవైపే.. ఈ విషయాలు తెలుసా? ఆయన తండ్రి గతంలో ఇచ్చిన రెండు తీర్పుల్ని తిరగ రాసిన చరిత్ర కూడా డీవై చంద్రచూడ్‌కు సొంతం. ఇవన్నీ నాణానికి ఒకవైపే. కానీ వ్యక్తిగతంగా చూస్తే ఆయనలో మనకి తెలియని మానవతామూర్తి ఉన్నారు. కన్నబిడ్డలు కాకపోయినా తల్లిలా లాలించే ఆయన మనసు చూస్తే ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ విషయం గురించి విశ్రాంత జస్టిస్ అమర్ గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. డీవై చంద్రచూడ్ మంచి న్యాయమూర్తే కాదు మంచి మనిషి కూడా అని వ్యాఖ్యానించారు. పిల్లలిద్దరూ వికలాంగులే, అయినా దత్తత ఇటీవలే జస్టిస్ డీవై చంద్రచూడ్ తన ఇద్దరు దత్తత కూతుళ్లను సుప్రీంకోర్టుకు తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారిలో పెద్దకుమార్తె పేరు ప్రియాంక. చిన్న కూతురి పేరు మహీ. ఇద్దరూ వికలాంగులే. వీల్ ఛైర్లకే పరిమితం. కోర్టు ప్రారంభం కావడానికి అరగంట ముందే సుప్రీంకోర్టుకు వచ్చిన చంద్రచూడ్.. తన ఇద్దరు పిల్లలు ప్రియాంక, మహీలకు చాంబర్, కోర్ట్ హాల్, ఇతర న్యాయమూర్తుల చాంబర్స్ మొదలైనవి స్వయంగా చూపించారు. కోర్టులో న్యాయమూర్తి ఎక్కడ కూర్చుంటారు? న్యాయవాదులు ఎక్కడి నుంచి వాదనలు వినిపిస్తారు? సాధారణ పౌరులు ఎక్కడ కూర్చుంటారు? మొదలైన విషయాలను వారికి వివరించారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి తను కూర్చునే కోర్టు హాల్ వరకు పిల్లలను వెంట తీసుకెళ్లారు. దీంతో పిల్లలిద్దరూ ఎంతగానో సంతోషించారు. కూతుళ్లను వారి కోరిక మేరకు సీజేఐ తీసుకువచ్చారని తెలిసి న్యాయవాదులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ ఇద్దరు కూతుళ్లు దివ్యాంగులు కావడం, వాళ్లను చంద్రచూడ్ దంపతులు దత్తత తీసుకొని మరీ కన్నబిడ్డల్లా పెంచుకుంటున్నారని చాలామందికి అప్పుడే తెలిసింది. ఆ పిల్లల సొంత తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో చంద్రచూడ్ దంపతులు వాళ్లను దత్తత తీసుకున్నారట. క్యాన్సర్‌తో మొదటి భార్య మరణం 1959లో జన్మించిన చంద్రచూడ్ 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన తండ్రి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుమారు ఏడేళ్ల ఐదు నెలల పాటు సుధీర్ఘకాలం సేవలందించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి కుమారుడు కూడా సీజేఐగా కావడం భారత చరిత్రలో ఇదే తొలిసారి. 2024 నవంబర్ 10 వరకూ చంద్రచూడ్ సీజీఐగా కొనసాగనున్నారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. చంద్రచూడ్ మొదటి భార్య రష్మీ 2007లో క్యాన్సర్‌తో మరణించింది. ఆ తర్వాత కల్పనను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. వీరు మహి, ప్రియాంక అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. అప్పటికే మొదటి భార్యతో చంద్రచూడ్‌కు అభినవ్, చింతన్ అనే కుమారులున్నారు. అయనప్పటికీ దివ్యంగులైన ఆడపిల్లలను దత్తత తీసుకొని వాళ్లను కన్నబిడ్డలా చూసుకోవడం అభినందనీయం.