అధికారంలోకి వస్తే అతిరాస కులానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. 186వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన సోమవారం అతిరాస కులస్తులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డే తమను బీసీల్లో చేర్చారని ఈ సందర్భంగా అతిరాస కులస్థులు గుర్తు చేసుకున్నారు. వైఎస్‌ఆర్ చేసిన మేలును ఎప్పటికీ మరవమన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే తమ కష్టాలు తీరుతాయని ఆకాంక్షించారు. దేవుడి ఆశీర్వాదంతో తాము అధికారంలోకి వస్తే అతిరాస కులానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేని కులాలను గుర్తించి వారిని ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించి చట్ట సభల్లోకి తీసుకొస్తామన్నారు.