ఆంధ్రప్రదేశ్ హక్కు ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ పిల్లిమొగ్గలు వేస్తున్నారు. కేంద్రం మోసాన్ని గర్హిస్తూ వైఎస్సార్‌సీపీ పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతుపై తోకముడిచారు. హోదా పోరులో కలిసి వస్తామని, వైఎస్సార్‌సీపీ తీర్మానానికి మద్దతు ఇస్తామని రాత్రిదాకా పేర్కొన్న ఆయన.. శుక్రవారం ఉదయానికి మళ్లీ ఉల్టాపల్టా అయ్యారు. టీడీపీనే సొంతగా అవిశ్వాస తీర్మానం పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. దానితోపాటు ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలుగుతున్నదని, ఈ మేరకు బీజేపీ చీఫ్ అమిత్ షాకు బాబు లేఖరాశారని ప్రచారం జరుగుతోంది.