గుంటూరు నగరంలోని ఆర్కేటీ సెంటర్‌లో ఉన్న వస్త్ర దుకాణం చందన బ్రదర్స్ షోరూంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని జెంట్స్ వేర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చాయి. షోరూం సిబ్బంది రాత్రి షట్టర్‌కు తాళాలు వేసి బయలు దేరుతున్న సమయంలో పై అంతస్తుల నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఈ క్రమంలో పైకి వెళ్లి చూడగా నాలుగో అంతస్తు నుంచి మంటలు రావడం గమనించి భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలు అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నారు. అర్ధరాత్రి 11.30 గంటల వరకు మంటలు అదుపులోకి రాలేదు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.