బడ్జెట్ సమావేశాల తొలి రోజునే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆందోళన అదుపు తప్పింది. ఏకంగా ప్లకార్డులు, కాగితాలు, హెడ్‌సెట్‌లతో కాంగ్రెస్ సభ్యులు దాడికి దిగటంతో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభం కావాల్సిన సభ అయిదు నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. జాతీయ గీతాలాపన అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభించారు.