రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టేందుకు వెళుతుండగా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారిని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన ఎమ్మెల్యేలకు మద్దతుగా విజయమ్మ .... పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయటం దారుణమన్నారు. ఎమ్మెల్యేలను పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టారని విజయమ్మ అన్నారు. అరెస్ట్లను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని అనుమానం కలుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఎటువంటి షరతులు లేకుండా తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చినందువల్లే రాష్ట్రం ప్రస్తుతం రావణకాష్టంలా మారిందని విజయమ్మ అన్నారు. ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్, టీడీపీ పార్టీలే కారణమన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుందని.... సమ్మెలో విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని... విభజనపై చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలన్నారు. విభజన ముందు ఒకలా.... తర్వాత మరోలా చంద్రబాబు మాట్లాడుతున్నారని.... కొత్త రాజధానికి రూ.4,5 లక్షల కోట్లు సరిపోతాయని విభజన ప్రకటనను బాబు సమర్థించారని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీడబ్ల్యూసీలో గంటసేపు చర్చలు జరిపి కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని.... అప్పట్లో రాష్ట్రవిభజనపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న.... కాంగ్రెస్ ఇప్పుడు కూడా వెనక్కి తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ తాను, వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేసామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రాష్ట్రపతిని కూడా కలిశామని విజయమ్మ తెలిపారు. రాష్ట్రాన్ని విడదీయ వద్దంటూ షర్మిల బస్సుయాత్ర చేశారని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని విజయమ్మ డిమాండ్ చేశారు.