పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఉత్తమ ప్రణాళికల ఉద్దేశాలు మంచివే అయినా వాటిని సరిగ్గా అమలుచేయకపోతే విఫలమవుతాయని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దును స్వాగతిస్తూనే.. ఈ నిర్ణయం వల్ల రైతులు, గ్రామీణ కార్మికులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు, రోజువారీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నట్టు వైఎస్ జగన్ తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో రోజురోజుకు నిరుపేదలు, చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగం, రిటైల్ రంగాలు తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. మార్కెట్ యార్డులు, మండీలలో కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయని, వందేళ్ల చరిత్ర కలిగిన అనకాపల్లి బెల్లం హోల్‌సేల్ మార్కెట్ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.