రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరామని కాంగ్రెస్ నాయకుడు, రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. తమ ప్రాంత నేతలతో పాటు సోనియాను కలిసిన తర్వాత ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేకుంటే మూడు రాష్ట్రాలు చేయాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల తమ ప్రాంతంలో తాగునీటి సమస్య వస్తుందని తెలిపామన్నారు. హైకమాండ్ ముందు రాయల తెలంగాణ ప్రతిపాదన చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాజీనామాలతో సమస్యలు పరిష్కారమైతే తాను రాజీనామాకు సిద్ధమేనని ప్రకటించారు. హైపవర్ కమిటీ ముందు తమ వాదనలు వినిపించనున్నట్టు తెలిపారు. త్రిసభ్య కమిటీ తమ సమస్యలు పరిష్కరిస్తుందని నమ్మకాన్ని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ దిశగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సోమవారం వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తమ జిల్లాను తెలంగాణలోనే కలిపేందుకు వారు మొగ్గు చూపుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే తాము సమైక్యాంధ్రకు కట్టుబడ్డామని, కలిసుండేందుకు వీలుకాకపోతే తమకు ప్రత్యేకంగా గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి స్పష్టం చేయడంతో ఈ ఊహాగానాలకు అడ్డుకట్ట పడింది.
Aug 6 2013 5:30 PM | Updated on Mar 22 2024 10:58 AM
Advertisement
Advertisement
Advertisement
