వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబ సభ్యులు తమ అనుచరులతో కలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం మోపిదేవి కుమారుడు రాజీవ్, సోదరుడు హరినాథ్‌బాబు, రేపల్లె నియోజకవర్గంలోని పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో కలిసి హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి తరలి వచ్చారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వారు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. విజయమ్మ వారికి కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు మోపిదేవి సోదరుడు హరినాధ్ బాబు మీడియాతో మాట్లాడుతూ బీసీలమైనందునే ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కక్షకట్టి తమ సోదరున్ని జైలుకు పంపారని ఆరోపించారు. 25ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం తాము సేవ చేసామని, అయితే తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదరించలేదన్నారు. న్యాయ సహాయం అందించే విషయంలో కూడా ముఖ్యమంత్రి వివక్ష చూపించారని హరినాధ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా కుంటుపడ్డాయన్నారు. తన సోదరుడికి అనారోగ్యంగా ఉన్నా మెరుగైన వైద్య సహాయం కూడా ఉందటం లేదన్నారు.