వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేందుకు మోపిదేవి వెంకట రమణను బలిపశువును చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. 26 జీవోల కేసు రాజకీయ ప్రేరేపితమైనదని ఆమె శుక్రవారమిక్కడ అన్నారు. మోపిదేవి కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో, జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నామన్నారు. మోపిదేవిని అరెస్ట్ చేసే ముందు ....వారం రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని విజయమ్మ అన్నారు. 26 జీవోల కేసులో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. అందుకు ప్రతిఫలంగా వైఎస్ను అప్రతిష్ట చేసేందుకు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కలిపి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా అందరూ కలిసి పని చేయాలని విజయమ్మ సూచించారు.