‘కనీస’ వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు నెల రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రతరమైంది. కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో సోమవారం ఉదయం 6 గంటల నుంచి తాము సమ్మెకు దిగుతున్నామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాలు ప్రకటించాయి. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని 67 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సిం గ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 40 వేల మంది కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. దీంతో రాష్ట్ర వ్యా ప్తంగా నగర, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు స్తంభించిపోనున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేయకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందికరంగా మారనుంది.