చిన్న రైతుల పేరు.. పెద్ద కంపెనీల జోరు

చిన్న, సన్నకారు రైతుల పేరిట జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సులో చర్చలు మాత్రం బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నెరవేర్చుకునే దిశగా కొనసాగుతున్నాయి. రైతులకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చకు ఇస్తున్న ప్రాధాన్యం నామమాత్రమే. వ్యవసాయ రంగంలో గణనీయంగా మార్పులు రావాలని కోరుతున్న కంపెనీలు.. ఆ మార్పులు కూడా తమ వ్యాపారాభివృద్ధికి అనుగుణంగా ఉండే వాదనలను సదస్సు ద్వారా ప్రచారంలోకి తెస్తున్నాయి. ఈ ప్రచారంలో ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ వర్సిటీల శాస్త్రవేత్తలు కూడా పాలుపంచుకుంటున్నారు. నగరంలోని హైటెక్స్‌లో జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు తీరును పరిశీలిస్తే.. ఇది రైతుల కంటే బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలకే పరిమితం అయిన విషయం ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా దేశంలో, మన రాష్ట్రంలోని చిన్న, సన్న కారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం దిశగా చర్చలు జరగడం లేదు. పెపైచ్చు ఈ బడుగు రైతుల ద్వారా కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంపొందించుకునే మార్గాన్వేషణ దిశగా చర్చలు సాగుతున్నాయి.

బుధవారం ఉదయం డిఎస్‌ఎం ఇన్నొవేషన్ డెరైక్టర్ మురళి శాస్త్రి ‘జీవ ఆధారిత ఆర్థికవ్యవస్థ అభివద్ధిలో వ్యవసాయరంగం పాత్ర’ అనే అంశంపై చేసిన ప్రసంగమే ఇందుకు ఉదాహరణ. మొక్కజొన్న, జొన్న, వరి వంటి పంటల నూర్పిళ్లు జరిగినప్పుడు వ్యవసాయోత్పత్తులతో పాటు గడ్డి, పొట్టు వంటి ఉప ఉత్పత్తులు కూడా లభిస్తాయి. వీటితో ‘బయో బేస్డ్’ ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమయ్యే యంత్రాలను ప్రభుత్వం ప్రొత్సహించాలని అభిప్రాయపడ్డారు. ఉపన్యాసంలో ఆసాంతమూ ఆయన తమ జీవ ఇంధన కంపెనీ తరఫున ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారు. జీవ ఇంధన రంగానికి ప్రభుత్వం పోత్సాహకాలిస్తే తాము పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అన్న ధోరణిలో ఆయన ప్రసంగించారు. చర్చలో పాల్గొన్న మిగతా వారు కూడా అదే విషయాన్ని ‘ఆవు కథ’ మాదిరిగా కొనసాగించారు. తమ కంపెనీల గురించి చెప్పుకోవడం, ఈ రంగంలో కషి చేయడం ద్వారా చిన్న, సన్న కారు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చివరలో ఓ మాట అనడం మినహా.. క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు అర్థవంతమైన సూచనలు చేసే దిశగా చర్చలు జరగలేదు.

అలాగే మంగళవారం జరిగిన చర్చల్లో బేయర్ కంపెనీ సీఈవో లియాం కండోన్, జై న్ ఇరిగేషన్ సీఈవో అనిల్‌జైన్ వంటి వారు కూడా తమ కంపెనీ ఉత్పత్తులకు ప్రాచుర్యం పెంచుకునేందుకు అవసరమైన చర్యలనే ప్రతిపాదించారు. మన దేశంలో ముఖ్యంగా సన్న, చిన్న కారు రైతులు పలు పంటలకు సొంత విత్తనాలనే వాడుకుంటారు లేదా తోటి రైతుల నుంచి దేశవాళీ విత్తనాలు కొంటారు. వీటి ఖర్చు తక్కువగా ఉంటుంది. అయితే, బేయర్ వంటి కంపెనీల ప్రతినిధులు మాత్రం బీటీ (జన్యుమార్పిడి) విత్తనాలను ప్రొత్సహించేలా విధానాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్చల్లో, రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటున్న ప్రతినిధులు సైతం ఇలాంటి ప్రతిపాదనలే చేస్తున్నారు. అంటే.. చర్చల్లో ఎవరు పాల్గొనాలో కూడా బడా కంపెనీలే ముందే ఎంపిక చేశాయన్నమాట. సదస్సుకు హాజరయిన ప్రతినిధుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పోగా.. మిగిలిన వారిలో ఎక్కువ మంది బడా కంపెనీల ప్రతినిధులే. 25 మంది రైతు సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం పంపినా దాదాపుగా వారందరూ సదస్సును బహిష్కరించారు.

పేలవంగా రెండోరోజు..
ప్రపంచ వ్యవసాయ సదస్సు రెండోరోజు పేలవంగా సాగింది. తొలి రోజు ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల హాజరుతో కాస్త హడావుడి కనిపించింది. వివిధ రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు పాల్గొనడంతో చర్చా గోష్టులు కాస్త అర్థవంతంగా సాగాయి. వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు, వివిధ వ్యవసాయ అనుబంధ శాఖల ఉద్యోగుల్లో చాలా మంది రెండో రోజు హాజరు కాలేదు. కర్నాటక వ్యవసాయ శాఖ మంత్రి క్రిష్ణ బైరె గౌడ కీలకోపన్యాసం అనంతరం సభ్యులు మరింత పలుచబడ్డారు. పాడి అభివద్ధిపై చర్చఓ మోస్తరుగా సాగింది. ఒకటి, రెండు చర్చాగోష్టులు రద్దయ్యాయి. సదస్సు గురువారంతో ముగుస్తుంది.

‘రైతులకు ఆదాయ భద్రత ద్వారానే ఆహార భద్రత’
రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చే పరిస్థితులు కల్పించినప్పుడే ఆహార భద్రత సాధ్యమవుతుందని బెరైగౌడ అభిప్రాయపడ్డారు. సదస్సులో రెండో రోజు ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డెరైక్టర్ డి. వెంకటేశ్వర్లు, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా కేంద్రం డెరైక్టర్ బి. వెంకటేశ్వర్లు కూడా ప్రసంగించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top