వారణాసి లోక్ సభ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ కూడా ఇక్కడ నుంచే పోటీకి దిగుతానని తెలపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఆదివారం బెంగళూర్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేజ్రీవాల్ తన నిర్ణయాన్ని సూచనప్రాయంగా తెలిపారు. ఈ అంశంపై పార్టీలో ఇప్పటికే చర్చ జరిగిందని ఆయన తెలిపారు. కాగా మార్చి 23వ తేదీన ఉత్తర ప్రదేశ్ లో చేపట్టే ఎన్నికల ర్యాలీలో తుది నిర్ణయాన్ని స్పష్టం చేస్తానని పేర్కొన్నారు. నరేంద్ర మోడీని ఓడించడమే తన లక్ష్యంగా కేజ్రీవాల్ తెలిపారు. తమ పార్టీ నేతలు వారణాసి పోటీ అంశాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన సంగతిని గుర్తు చేస్తూ ఇదొక పెద్ద సవాల్ అని ఆయన స్పష్టం చేశారు. ఈ చాలెంజ్ కి తాను సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తారని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆప్ నేతలు ఈ విధంగా చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, వారణాసిలో మోడీని ఎదుర్కొవడానికి కేజ్రీవాల్‌ను మించి అభ్యర్థి ఆప్‌లో మరొకరు లేరని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.