సిమాంధ్రకు పూర్తిగా నిలిచిపోయిన ఆర్టీసి సర్వీసులు | Due to Telangana bandh, RTC stopped operating services | Sakshi
Sakshi News home page

Aug 5 2013 9:47 AM | Updated on Mar 22 2024 10:58 AM

సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అటువైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే నష్టాలబాటలో నడుస్తున్న ఆర్టీసీని సీమాంధ్రలో సమైక్యాంద్ర ఉద్యమ సెగ ఆర్థికంగా మరింత కుంగదీస్తోంది. ఉద్యమ నేపథ్యంలో కోస్తా, రాయలసీమ వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసుల నిలిపివేతతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ఎంజీబీఎస్ నుంచి దాదాపు లక్షన్నర మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుండగా సీమాంద్రలో ఉద్యమం కారణంగా ఈ సంఖ్య 50 వేలకు పడిపోయింది. ఎంజీబీఎస్ నుంచి రాయలసీమ జిల్లాలకు రోజూ ఆర్టీసీ 710 సర్వీసులు నడుపుతుంది. ఉద్యమం ఊపందుకోవడంతో గత ఐదు రోజులుగా రాయలసీమ జిల్లాల వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులన్నీ పూర్తిగా రద్దయ్యాయి. కాగా, శనివారం నుంచి ఒంగోలు, నెల్లూరు జిల్లాల వైపు 90 శాతం, విజయవాడ, గుంటూరు వైపు 75 శాతం ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఉభయ గోదావరి జిల్లాల వైపు 50 శాతం, విశాఖపట్నం వైపు 25శాతం సర్వీసులను అధికారులు రద్దు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా మారడంతో అనేకమంది తమ ప్రయాణాలను వాయిదాలు వేసుకుంటుండగా, అత్యవసర పనుల నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో రైలు, విమానాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. కర్నూలు జిల్లా వైపు సర్వీసుల పునరుద్ధరణకు నిర్ణయం రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, బెంగళూరు మార్గాల్లో వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు ఐదు రోజులుగా పూర్తిగా రద్దయిన విషయం విదితమే. కాగా ఆదివారం రాత్రి నుంచి రద్దీని బట్టి కర్నూలు జిల్లాకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించేందుకు అధికారులు నిర్ణయించారు. ఎంజీబీఎస్‌లోని కర్నూల్ సెక్టార్ నుంచి నిత్యం 260 బస్సులు రాకపోకలు కొనసాగిస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తే మరిన్ని సర్వీసులను నడిపించేందుకు సైతం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement