: అమాత్యులు, అధికార పార్టీ ముఖ్య నేతలు తమ అధికార దర్పాన్ని వినియోగించి కూడబెట్టిన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు అన్ని వర్గాలకు టార్గెట్లు విధిస్తున్నారు. కాల్‌మనీ, ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో అక్రమంగా కూడబెట్టిన సొమ్మును పెద్ద ఎత్తున తెల్లధనంగా మారుస్తున్నారు. నిత్యావసర వ్యాపారాల్లోనూ తమ ‘చిల్లర’ దందా నిర్వహించడంతో రైతులు, చిరు వ్యాపారులకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఏపీ రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు, వారి అనుచర గణం పెద్ద నోట్ల మార్పిడి ఓ వ్యాపారంలా సాగిస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు తమ చేతికి మట్టి అంటకుండా తమ వద్ద ఉన్న నల్లధనం తెల్లధనంగా మారిపోతూ ఉండటంతో వ్యాపారస్తులు కూడా బ్యాంకు మెట్లు ఎక్కకుండా వీరిద్వారా నోట్లు మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.