29న దివ్యాంగులకు క్రీడా పోటీలు
భువనగిరిటౌన్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఈనెల 29న క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి నర్సింహరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరుగుతాయన్నారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికలు, 18 నుంచి 54 ఏళ్ల వయస్సులోపు మహిళలు, పురుషులకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
చిన్న నీటి వనరుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
భువనగిరి : చిన్న నీటిపారుదల వనరుల గుర్తింపునకు జిల్లా వ్యాప్తంగా సర్వే చేయనున్నట్లు జిల్లా ప్రఽణాళిక అధికారి వెంకటరమణ తెలిపా రు. గురువారం భువనగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు చిన్న నీటి వనరుల సర్వేపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి 2 వేల హెక్టార్ల లోపు ఉన్న నీటి వనరుల గణన చేస్తారని పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో సర్వే చేసి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.
మీడియా సెంటర్ ప్రారంభం
భువనగిరిటౌన్ : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్‌ను ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారంపై తదితర వాటిపై మీడియా సెంటర్ ద్వారా నిఘా ఉంటుందన్నారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
ఆలేరురూరల్: ఎన్నికల్లో స్టేజ్–2 అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం స్టేజ్–2 అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను సమీక్షించి వారికి సూచనలు చేశారు.
నేడు పీఓలకు శిక్షణ
భువనగిరిటౌన్ : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారుల(పీఓ)కు శుక్రవారం శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 15 రైతువేదికల్లో రెండు విడుతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి విడతలో 985 మంది, రెండవ సెషన్‌లో 1,392 మంది శిక్షణలో పాల్గొంటారు.
నేత్రపర్వంగా నృసింహుడి
నిత్య తిరుకల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పర్వాల్లో భాగంగా గురువారం నిత్య తిరుకల్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి గజవాహనంపై కల్యాణ మండపంలోకి వేంచేపు చేయించి నిత్యకల్యాణం జరిపించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవతో స్వామివా రిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలను అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, వెండి జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
29న దివ్యాంగులకు క్రీడా పోటీలు


