ఎవల్ నిలబడుతుండ్రే..
మల్లయ్య తాత గజగజ వణికే చలిలో పొద్దుగాల లేచి నెత్తికి రుమాలు సుట్టుకొని, కంబళి కప్పుకొని, నోట్లో యాప పుల్లేసుకొని పండ్లు తోముకుంటూ చేతిలో కర్రతో నిమ్మలంగా నడుసుకుంటూ పోయి నడూళ్ల గుడిబండ కాడ కూకుండు. చిత్తుకాగితాలు ఏరి కుప్పగాపోసి కీస నుంచి అగ్గిపెట్టెగీరి చలిమంటకాగుతున్నడు. ఇంతలో అట్నుంచి పోతున్న నర్సయ్యను చూసి ఏమోయ్.. మనవడా గిట్రా అని పిలిచిండు. నర్సయ్య.. మల్లయ్య తాత దగ్గరికొచ్చి కూసుండు. అప్పుడు..
మల్లయ్య తాత : ఏమోయ్ మనవడా గిప్పుడు ఓట్ల పండ్గొచ్చిందిగా మనూళ్లె పెసిడెంట్‌గా ఎవలెవలు నిలబడ్తరంట
నర్సయ్య : యాద్గిరి కొడ్కు నవీన్ లేడు ఎలచ్చన్ల నిలబడ్తడంట.. గా పిల్గాడు పట్నంల బాగా సదువుకుండంట. పిల్గాడు మంచోడేనంట
మల్లయ్య : పుల్లయ్య కొడుకు సోమయ్యగూడా పోటీజేత్తడంట. గియ్యాల నామినేషన్ ఏస్తడంట. గా పిల్గాని దగ్గర పైసల్ మస్తుగున్నయంట. ఖర్చు బానే పెడ్తడంట.
ఇంతలో.. అట్నుంచి పోతున్న వెంకన్న.. గుడిబండకాడ కూకున్న మల్లయ్య, నర్సయ్యలను చూసి దగ్గరికి వచ్చి కూకుండు.
వెంకన్న : పొద్దుపొద్దుగాల ఇద్దరూ తీర్బాటంగా కూకున్నరేందే..
మల్లయ్య : ఏం లేదు మనవడా గీ ఎలచ్చన్ల గురించి ముచ్చట బెట్టుకుంటున్నం
వెంకన్న : తాతా.. పట్నంల ఉంటున్న మనూరి చంద్రయ్యసార్ గూడా పోటీజేత్తడంటగా
మల్లయ్య : సార్ గిప్పుడు కొలువు జేత్తలేడానే
వెంకన్న : జేత్తలేడే ఎన్నడో దిగిపోయిండు. గా సార్ గూడా మంచోడేనే.
ఇంతలోనే సుట్ట కాల్చుకుంటూ రామయ్య గూడా వాళ్ల దగ్గరికొచ్చి కూకొని మాటళ్లమాట గలిపిండు.
రామయ్య : గా సంజీవ గూడా నిలబడ్తడంట .
మల్లయ్య : గాయనకు ముగ్గురు పిల్లలుగా.. ఎట్ల నిలబడ్తడు
వెంకన్న : గిప్పుడు అదిలేదే ..ముగ్గురు పిల్లలున్నా నిలబడొచ్చు. ఎవలు నిలబడ్తేందే.. ఊరిని బాగుచేసేటోడు కావాలే.
మలయ్య: అవునోయ్ మనవడా..
రామయ్య: అవునవును..
వెంకన్న: ఈ ఎలచ్చన్ల ఏమైతదో సూద్దాం మరి. మల్లయ్య తాతా.. నేను ఐకేపీ కేంద్రం కాడికి బోతనే .. వడ్లు పోసి రెండ్రోజులైతంది . గియ్యాల నా సీరియల్ వత్తదే. గా వడ్లు అమ్మాలే.
మల్లయ్య : సరేపో మనవడా
నర్సయ్య : నేను గూడ పోత బర్రెకు పాలుపిండాలే
మల్లయ్య : సరే నేను గూడ ఇంటికిబోత
మల్లయ్యతాత నోట్లో ఉన్న యాపపుల్లను తీసి పక్కన బడేసి ఇంటిబాట పట్టిండు.. రామయ్య కూడా సుట్ట పీల్చుకుంటూ ఎళ్లిపోయిండు.
– నల్లగొండ డెస్క్


