నాడు సర్పంచ్.. నేడు కూలీ
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ గ్రామానికి ఐదేళ్లు సర్పంచ్‌గా పనిచేసిన మాదగాని నాగమ్మ ప్రస్తుతం వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తోంది. తన హయాంలో గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. అయినా రూపాయి కూడా సొంతానికి వినియోగించుకోకుండా నిధులను గ్రామానికే ఖర్చు చేశారు. కాసర్లపహాడ్ సర్పంచ్ మాదగాని నాగమ్మది నిరుపేద కుటుంబం. 2014లో ఆమెను గ్రామస్తులు సర్పంచ్‌గా నిలబెట్టించి మరీ గెలిపించారు. 2019 వరకు ఐదేళ్లు సర్పంచ్‌గా పనిచేశారు. నిరక్షరాస్యురాలైనప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తూ గ్రామంలో సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్, పల్లె దవాఖాన, బోర్లు పైప్‌లైన్ నిర్మాణం చేయించారు. సర్పంచ్ కాకముందుకు ఉన్న పాత రేకుల ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం జీవనోపాధి కోసం ఉపాధి పనులతో కూలీగా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వితంతు పింఛన్‌తో కాలం వెల్లదీస్తున్నారు.


