పాఠం, వంట ఇక్కడే!
ఫ తుర్కపల్లి మండల పాఠశాలల్లో గదుల కొరత
ఫ ఒకే గది, ఐదు తరగతులు
ఫ బోధనకు అంతరాయం
తుర్కపల్లి: ఉన్నది ఒక్క గది.. అక్కడే వంట, సరుకులు నిలువ, ఆఫీస్ నిర్వహణ, పాఠాలు వినాల్సిన దుస్థితి. తుర్కపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. దాదాపు పది పాఠశాలల్లో గదుల కొరత వెంటాడుతోంది. ఒకటి, రెండు గదులకు మించి లేకపోవడంతో బోధనకు అంతరాయం ఏర్పడుతోంది. చౌక్లతండా, బాబ్లనాయక్‌తండా, సంగ్యాతండా, జేతిరాంతండా, వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, గంధమల్ల, మోతిరాంతండా, గడ్డతండా, జగ్గారెడ్డికుంట, కోనాపూర్, బద్దుతండాలో ప్రాథమిక పాఠశాలల్లో 1నుంచి 5వరకు తరగతులు ఉన్నాయి.
వరండాలో పాఠాలు
ఆయా పాఠశాలల్లో గదుల కొరత వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల ఒక్కగానొక్క గదిలో మూడు తరగతులు, వరండాలో రెండు తరగతులకు బోధన చేస్తున్నారు. చిన్న పిల్లల అల్లరితో పెద్ద తరగతుల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. చదువుపై ఏకాగ్రత కోల్పోవాల్సి వస్తుంది. సింగిల్ తరగతి గదులు ఉన్న పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మించి సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పాఠం, వంట ఇక్కడే!


