వైకల్యం శరీరానికే.. మనసుకు కాదు
భువనగిరిటౌన్ : వైకల్యం శరీరానికే కానీ, మనసుకు సంబంధించింది కాదని.. ఆత్మస్థైర్యంతో చదివితే ఉన్నత స్థాయిలో ఉంటారని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఉచిత సేవలు అందజేస్తున్నాయన్నారు. ఉచిత ట్రై సైకిళ్లు, బ్యాటరీ సైకిళ్లు, ఉపకరణాలు, ఫిజియోథెరపీ తదితర సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ.. జిల్లాలో 12,626 మంది దివ్యాంగులు ఉన్నారని, వారికి ప్రతి నెలా రూ.5 కోటకు పైగా పింఛన్ 5 కోట్ల పైగా ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సామర్థ్యాన్ని బట్టి ఉపాధిహామీ పనులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం క్రీడాపోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. దివ్యాంగుల కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్. మెప్మా అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


