
ఉపాధి పనులపై విజిలెన్స్
ఆలేరురూరల్: గ్రామీణ ప్రాంత కూలీలకు పనులు కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీనిద్వారా జిల్లాలో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ పథకాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గ్రామీణ స్థాయిలో ఉపాధి హామీ పనులపై నిఘా పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గ్రామ స్థాయిలోనే పథకం పనుల పర్యవేక్షణకు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ (వీఎంసీ)లను ఏర్పాటు చేస్తోంది. పనుల పర్యవేక్షణతో పాటు సామాజిక తనిఖీ నివేదికలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జిల్లాలో ఇప్పటికే ఈ ప్రక్రియకు అడుగులు పడగా.. వీఎంసీలు పూర్తిస్థాఽయిలో పనిచేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో ఉపాధి పనుల వివరాలు
జిల్లాలో మొత్తం జాబ్ కార్డులు 1,43,205 కాగా, యాక్టివ్ జాబ్ కార్డులు 98,848 ఉన్నాయి. పని చేసే కూలీలు 1,37,475 మంది ఉన్నారు. మొత్తం పని దినాలు 25,49,676 కల్పించారు. రోజుకు 22,320 మంది సగటున హాజరవుతున్నారు. 2025–26కు సంబంధించి రూ.32,40,391 బడ్జెట్‌ను కేటాయించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఐదుగురు సభ్యులతో కూడిన వీఎంసీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎస్సీ, ఎస్టీకి చెందిన వారితో పాటు సగం మంది మహిళలు ఉండేలా నిర్ణయించారు. ఇక వీఎంసీ సభ్యులుగా గ్రామాల్లో పని చేసే ఉపాధ్యాయులు అంగన్‌వాడీలు, ఎస్‌హెచ్‌జీలు, రిసోర్స్ పర్సన్లు, సివిల్ క్లబ్ సంఘాల సభ్యులు ఉండేలా చూస్తున్నారు.
పనుల పరిశీలన ఇలా..
ఉపాధి పనులు పారదర్శకంగా జరిగేలా చూసేందుకు వీఎంసీ కమీటీలు నిరంతరం పర్యవేక్షణ చేయనున్నాయి. వారానికి ఒకసారి ఉపాధి హామీ పనులు పరిశీలించనున్నారు. ఇక ప్రతి నెల మూడో శుక్రవారం పంచాయతీ కార్యదర్శితో కలిసి ఉపాధి కూలీలు, సిబ్బందితో కమిటీలు సమావేశం కానున్నాయి. పనుల నిర్వహణపై కూలీలతో చర్చిస్తారు. ఉపాధి రికార్డులు, సౌకర్యాలను పరిశీలించడంతో పాటు పనుల నాణ్యత, వ్యయాన్ని అంచనా వేయడం, జరిగిన పనిపై నివేదిక ఇవ్వడం, పనుల తనిఖీ, లెక్కింపు, పనులు రిజిష్టర్‌లో నమోదు చేయడం వంటివి కమిటీలు చేయాల్సి ఉంది. ఇక సోషల్ ఆడిట్ సమయంలో కమిటీలు నివేదికలను ప్రవేశపెట్టాల్సి ఉండగా సోషల్ అడిట్ అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోవాలి. కమిటీలు ఇచ్చే నివేదికలను బట్టి అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
పనులు పారదర్శకంగా జరుగుతాయి
ఉపాధి హామీ పనులు పారదర్శకంగా జరిగేందుకు కమి టీ సభ్యులు, అధికారుల పర్యవేక్షణ పకడ్బందీగా ఉంటుంది. పనుల్లో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పంచాయతీలో పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుతో నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయడం జరుగుతుంది.
– నాగిరెడ్డి, డీఆర్‌డీఓ
ఐదుగురు సభ్యులతో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీల ఏర్పాటు
పనుల పర్యవేక్షణతో పాటు
సామాజిక తనిఖీ నివేదికలపై
ఎప్పటికప్పుడు సమీక్ష

ఉపాధి పనులపై విజిలెన్స్