
లోతు దుక్కులతో మేలు
ముసునూరు: మెట్ట ప్రాంతాల్లో వర్షాధార పంటలు పండించే భూములకు వేసవి (లోతు) దుక్కులు ఎంతో ప్రయోజనకరం. ఈ నేపథ్యంలో జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు వర్షాలు పలకరిస్తుండడంతో వేసవి దుక్కులపై దృష్టి పెట్టారు. తొలకరి వర్షాలు కురిసినపుడు భూమిని లోతుగా దుక్కి చేసుకోవడం వల్ల భూమి పై పొరలు లోపలికి, లోపలి పొరలు బయటకు చేరి, చేనుకు మంచి చేస్తుందని రైతులు చెబుతున్నారు.
లోతు దుక్కుల ప్రాధాన్యత:
● దుక్కి లోతుగా చేయడం పండించే పంటపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి పెద్ద మరతో 30 సెం.మీ లోతు వరకు దుక్కు చేయడం మంచిది. ఏటా వర్షాలను బట్టి భూమిని 15–20 సెం.మీ లోతు వరకు దున్నుకోవాలి.
● సాధారణంగా తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ ఉన్న పంటలకు తక్కువ లోతు దుక్కి సరిపోతుంది. తేలికపాటి నేలల్లో 1–3 సార్లు దున్నాలి. కలుపు మొక్కలు, పంటల అవశేషాలు ఎక్కువగా ఉంటే కనీసం మూడు దఫాలుగా దున్నాలి.
వేసవి దుక్కులకు అనుకూల పరిస్థితులు
● భూమిలో నిల్వ ఉంచుకునే తేమ 25 నుంచి 50 శాతం ఉంటే అది దుక్కులకు పూర్తి అనుకూలం.
● భూమిలో తేమ తక్కువ ఉన్నప్పుడు దుక్కి దున్నకూడదు. దీని వల్ల భూమి గుల్ల బారదు.
● భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నాగలికి మట్టి అంటుకుంటుంది. కింద ఉన్న మట్టి గట్టిపడి, భూమిలో గట్టి పొరలు ఏర్పడతాయి.
వేసవి దుక్కులతో ప్రయోజనాలు
● వేసవి దుక్కులతో నేల గుల్ల బారుతుంది. తదుపరి వచ్చే వర్షపు నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవచ్చు.
● తగినంత తేమ ఉన్నప్పుడు నేలను లోతుగా వాలుకు అడ్డంగా దున్నడం వల్ల నేల కోతను నివారించి, భూమి పైపొర, భూసారాన్ని కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు.
● లోతు దుక్కుల వల్ల భూమిలో నీరు ఉండి, తేమ శాతం పెరగడం వల్ల సేంద్రీయ పదార్థాలు త్వరగా కుళ్ళి పోషకాల రూపంలో అందుబాటులోకి వస్తాయి.
● భూమిని అడుగు లోతు వరకు దున్నుకుంటే విత్తనం మొలకెత్తి, వేర్లు సులభంగా భూమిలోకి దిగి, భూమిలో ఉండే పోషకాలను గ్రహించి, మొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది.
● పంట పొలాల్లో లోతు దుక్కులు దున్నడం వల్ల భూమిలో దాగి ఉన్న చీడ పీడలు, కోశస్థ దశలో ఉన్న పురుగులు, బాక్టీరియా, శిలీంద్రాలు, సిద్ధబీజాలు, కలుపు మొక్కల ఎండ వేడికి నశిస్తాయి. పరుగుల్ని పక్షులు తినేయడంతో తెగుళ్ల బెడద తప్పుతుంది.
● పొలంలో మట్టి గడ్డలు తొలగిపోయి, మెత్తని మట్టి ఏర్పడి పంట త్వరగా పెరిగేందుకు దోహద పడుతుంది.
వేసవి దుక్కులు భూసారానికి మంచిది
పంటలను బట్టి వేసవి దుక్కులు చేసి, భూసారం పెంచి, రైతులు లాభం పొందాలి. తమ శాఖ ద్వారా లభించే సలహాలు, సూచనలు పాటించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత సులభతరం చేసుకోవాలి. సబ్సిడీపై లభించే వనరులు పొంది, రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి.
కె.చిన సూరిబాబు, మండల వ్యవసాయాధికారి

లోతు దుక్కులతో మేలు

లోతు దుక్కులతో మేలు