మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట
ఖిలా వరంగల్: మైనార్టీల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. విద్యార్థులు, యువత క్రీడలపై మరింత ఆసక్తి పెంచుకోవాలని, సీనియర్ క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్లు అంతరించి పోతున్న ప్రాచీన గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ఆదేశించారు. గురువారం వరంగల్ కరీమాబాద్ రామస్వామి గుడి ప్రాంగణంలోని క్రీడామైదానంలో జరుగుతున్న క్రికెట్ కీడా పోటీలను మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఏఎస్పీ శుభం ప్రకాశ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఖిలా వరంగల్ ఈద్గా మైదానంలో రూ. కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈద్గా అభివృద్ధి పనులను ఈద్గా కమిటీ ప్రతినిధి ఎంఏ జబ్బార్, మైనార్టీ పెద్దలతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. 38వ డివిజన్ పడమర కోటలో రూ.73 లక్షల వ్యయంతో నిర్మిచిన మున్నూరు కాపు సంఘ భవనం (మహిళా కమ్యూనిటీ హాల్)ను, వరంగల్ 37వ డివిజన్ ఎంఎంనగర్‌లో లబ్ధిదారుడు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లును నగర మేయర్ గుండు సుధారాణి, బల్దియాకమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఏఎస్పీ శుభంప్రకాశ్ స్థానిక కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమతో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మంత్రి నూతన వస్త్‌త్రాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఆర్‌ఐ ప్రతిభ, ఆర్‌ఓ శ్రీనివాస్, ఏఈ తేజస్విని, కాంగ్రెస్ నేతలు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్, బోగి సురేశ్, దామోదర్‌యాదవ్, శ్రీరాం రాజేశ్, పగడాల సతీశ్, ఎండి ఉల్పాత్, ఎండి చాంద్‌పాషా, మహ్మద్ ముగ్ధుం, తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు
వరంగల్: జిల్లాలో మూడు దశలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద అన్నారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించడంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకంగా పని చేసిన పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్య శాఖ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, జోనల్, రూట్ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా హెల్త్ శాఖ, అంగన్‌వాడీ టీచర్లు, విద్యుత్ శాఖ, డీఆర్‌డీఏ అధికారులతో సహా ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన అన్ని శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా, సమగ్రంగా కవరేజ్ అందించిన ప్రింట్, ఎలక్టాన్రిక్ మీడియా ప్రతినిధులకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బాల మాయాదేవి, ఎన్నికల వ్యయ పరిశీలకురాలు సునయానా చౌహాన్‌లను పరిశీలకులకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఎన్నికల విభాగానికి చెందిన అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రామప్పలో సెంట్రల్ రైల్వే కమిషనర్
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం సెంట్రల్ రైల్వే సీనియర్ కమిషనర్ (ఆర్‌పీఎఫ్) సీహెచ్ చిత్రేష్ జోషి సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు.


