
దరఖాస్తు గడువు పొడిగింపు
వనపర్తి: దివ్యాంగుల ఉపకరణాల దరఖాస్తు గడువును ఈ నెల 5 వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.సుధారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అర్హులైన దివ్యాంగులు http//tgobmms. cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
రామన్‌పాడులో
తగ్గుతున్న నీటమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో బుధవారం సముద్ర మట్టానికిపైన 1,019 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల్లో 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా.. రామన్‌పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 650 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45, వివిధ ఎత్తిపోతల పథకాలకు 733, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
పర్యావరణ
పరిరక్షణకు కృషి
కొత్తకోట రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సహకార సంఘం అధికారి రాణి కోరారు. బుధవారం మండలంలోని అప్పరాల సహకార సంఘం గోదాం ఆవరణలో పీఏసీఎస్ పామాపురం ఆధ్వర్యంలో స్థానిక రైతులు, గ్రామస్తులతో కలిసి ఆమె మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలు నాటి సంరక్షించినప్పుడే భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగమన్నారు. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని.. భూమిపై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమేష్‌బాబు, సెక్షన్ అసిస్టెంట్ కిరణ్, సీఈఓ రాఘవేంద్రారెడ్డి, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సమస్యల
సాధనకు ఉద్యమం
పాన్‌గల్: సమస్యల సాధనకు ప్రతి గిరిజనుడు ఉద్యమించాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో సంఘం నాయకుడు బాబునాయక్ అధ్యక్షతన జరిగిన సంఘం మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖఅతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలన్నారు. జిల్లాలో గిరిజన కార్పొరేషన్ ద్వారా రుణాలిచ్చేందుకు 185 మందిని ఎంపిక చేసినా.. నేటికీ మంజూరు చేయడం లేదని వివరించారు. తండాల అభివృద్ధికి కేటాయించే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు విడుదల చేయాలని, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఆయా సమస్యల సాధనకు సంఘం ఆధ్వర్యంలో చర్చించి పోరాటాలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు కృష్ణానాయక్, రాములు, రాజునాయక్, అనిత, చిట్టెమ్మ, శాంతమ్మ పాల్గొన్నారు.
6వ తేదీలోగా
డబ్బులు చెల్లించండి
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ వర్తింపజేస్తుండటంతో అంతకు పైబడి బ్యాంకు రుణం పొందిన కార్మికులు అదనపు డబ్బులను వెంటనే బ్యాంకులో జమ చేయాలని చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తమ కార్యాలయ పరిధిలోని చేనేత సహకార సంఘాల సభ్యులు బ్యాంకుల్లో చేనేత రుణాలు పొందిన వివరాలు పంపిస్తున్నామని వివరించారు.