
మహిళల రక్షణకు భరోసా కల్పించాలి
వనపర్తి: షీటీమ్, భరోసా బృందాలు సమన్వయంతో విధులు నిర్వర్తిస్తూ మహిళల రక్షణకు తామున్నామన్న భరోసా కల్పించాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో షీటీమ్, భరోసా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించి 2025, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసులు, బాధితులకు అందిన న్యాయం, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేసు మొదటి నుంచి చివరి వరకు ప్రతి దశలో మెరుగుపడాల్సిన పరిస్థితి, పోలీసుశాఖ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయం, ఆరోగ్య చికిత్స తదితర వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సాయం కోరి వచ్చే మహిళలు, పిల్లల విషయాల్లో షీటీమ్ సిబ్బంది గోప్యత పాటించాలన్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రజా రక్షణకు పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీయాలని సూచించారు. విద్యార్థుల మానసిక స్థితిని అంచనా వేసి వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడి వారి బాగోగులు, ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్న తీరును అడిగి తెలుసుకోవాలన్నారు. మహిళలు, ఆడపిల్లలకు షీటీమ్ రక్షణ కల్పిస్తుందనే భరోసా ఇచ్చేలా విధులు నిర్వహించాలని కోరారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలను చూడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. యుక్త వయసులో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేస్తాయని, పోక్సో కేస్‌స్టడీలను వివరిస్తూ షీటీమ్, భరోసా సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈవ్‌టీజింగ్ జరిగే హాట్‌స్పాట్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, షీటీమ్ జిల్లా నంబర్, సిబ్బంది నంబర్లు గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల వద్ద పిల్లలకు కనిపించేలా రాయించాలన్నారు. ముఖ్యంగా ఆలయాలు, మినీ ట్యాంక్‌బండ్లు, పార్కులు, బస్టాండ్లు, పాఠశాలలు, కళాశాలల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. భరోసా కేంద్రం సిబ్బంది కూడా తరచూ షీటీమ్ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మాయిలకు అందిస్తున్న సేవలను వివరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, శివకుమార్, సెల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ అంజద్, షీటీమ్, ఏహెచ్‌టీయూ, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.