
కార్మికులకు అండగా ఉంటాం : టీఎఫ్‌టీయూ
వనపర్తి రూరల్: కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తూ వారికి అండగా ఉంటామని టీఎఫ్‌టీయూ రాష్ట్ర అఽధ్యక్షుడు కాచం సత్యనారాయణ అన్నారు. బుధవారం పెబ్బేరులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య (టీఎఫ్‌టీయూ) 2వ మహాసభలు రాష్ట్ర నాయకుడు కావలి గోవిందునాయుడు అధ్యక్షతన నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టీఎఫ్‌టీయూ రాజకీయ పార్టీలకు అతీతంగా కార్మికుల కోసం పనిచేస్తున్న సంస్థ అని తెలిపారు. హమాలీలు, భవన నిర్మాణ, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ తదితర సంఘటిత కార్మికుల హక్కుల సాధన, స్కూల్ స్వీపర్లుకు కనీస వేతనం, క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత కల్పనకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వాలు చొరవ చూపి కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మహ్మద్ ఖలీల్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్‌గౌడ్, హమాలీ సంఘం నాయకులు, సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.