
గురుకులాల్లో వసతులు కల్పించాలి
వనపర్తి: ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని కేడీఆర్‌నగర్‌లో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల, పెద్దమందడి మండలం జగత్‌పల్లి మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్, నాగవరంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల, కొత్తకోట సమీపంలోని వీపనగండ్ల ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. వసతులు, భోజన ఏర్పాట్లు, వంటగది, తాగునీటి సౌకర్యం, మూత్రశాలలను పరిశీలించారు. సిబ్బంది సరిపడా ఉన్నారా? విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీపనగండ్ల ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో తరగతి గదులు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని.. వేరే ప్రాంతానికి మార్చాలని ప్రిన్సిపాల్ సాయిరెడ్డి అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి విద్యావిభాగం: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2025కి జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతగల ఉపాధ్యాయులు http://nationlawardsto teachers.education.go.in పోర్టల్‌లో ఈ నెల 13లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
అభ్యంతరాల స్వీకరణకు నేడు చివరి గడువు
వనపర్తి టౌన్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీసీఆర్టీ, పీఈటీ పోస్టుల భర్తీకి రూపొందించిన 1:1 జాబితాలో అభ్యంతరాల స్వీకరణకు శనివారంతో గడువు ముగుస్తుందని టీఎస్‌ఎస్‌ఏ ఎక్స్ అఫీషియో జిల్లా ప్రాజెక్ట్ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023లోనే అర్హత పరీక్ష నిర్వహించి 1:3 విధానంలో మెరిట్ కం రోస్టర్ విధానం జాబితా రూపొందించామని పేర్కొన్నారు. జాబితాలోని అభ్యర్థులకు గత నెల 23న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టి తుది జాబితాను రూపొందించి http://doewanaparthy.weebly.com వెబ్‌సైట్‌లో ఉంచామని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే శనివారం సాయంత్రం 4 గంటలలోగా జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
కళాశాలల మరమ్మతుకు నిధులు మంజూరు
వనపర్తిటౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తాత్కాలిక మరమ్మతులు, కనీస సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.1,28,60,000 మంజూరు చేసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య శుక్రవారం తెలిపారు. భవనాలకు రంగులు, చిన్న చిన్న మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం, బోర్డులు, డ్యూయల్ డెస్క్‌ల కొనుగోలుకు ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. పైన పేర్కొన్న పనులు ఏఏపీసీల ద్వారా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి టీజీఈడౠ్ల్యఐడీసీ ఈఈకి సూచించినట్లు డీఐఈఓ వివరించారు.
అరుణాచలానికిప్రత్యేక బస్సులు
వనపర్తిటౌన్: గురుపౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8న రాత్రి 8 గంటలకు జిల్లాకేంద్రంలోని బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనానంతరం రాత్రి అరుణాచలానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. 10వ తేదీన గిరి ప్రదక్షిణ, దర్శనం అనంతరం తిరిగి బయలుదేరి 11న ఉదయం 3 గంటల వరకు వనపర్తికి వస్తుందని వివరించారు. టికెట్ ధర పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400గా నిర్ణయించామని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీట్ల రిజర్వేషన్, పూర్తి వివరాలకు సెల్‌నంబర్లు 79957 01851, 73828 39379, 94906 96971 సంప్రదించాలని పేర్కొన్నారు.