
రైతు సేవలే లక్ష్యంగా..
విదేశీ విద్యకు చేయూత
రైతు కుటుంబాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి కలిగిన పిల్లలకు డీసీసీబీ తరపున ప్రత్యేకంగా విద్యా రుణాలు అందిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతుల పిల్లలకు స్వదేశీ, విదేశీ విద్యా రుణాలు అందించేందుకు పాలక మండలి ప్రత్యేకంగా రుణాల పాలసీ ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.35 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు మొత్తం 79 మంది విద్యార్థులకు రూ.3.82 కోట్ల రుణాలు అందజేశారు.
సహకార రంగాల
అభివృద్ధికి పటిష్ట చర్యలు
● త్వరలో అందుబాటులోకి మొబైల్ బ్యాంకింగ్
● విద్యా రుణాలకు పెద్దపీట.. ఆశాజనకంగా వసూళ్లు
● రుణమాఫీతో
34,731 మంది రైతులకు ఊరట
● నేడు అంతర్జాతీయ సహకార దినోత్సవం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతు సేవలే లక్ష్యంగా సహకార రంగ అభివృద్ధికి పాలక మండలి, అధికారులు కృషి చేస్తున్నారు. సింగిల్ విండో సొసైటీలు, డీసీసీబీ బ్రాంచ్‌ల ద్వారా రైతుల మేలు కోసం ఆర్థిక లావాదేవీలపై సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ రైతులను చైతన్య పరుస్తున్నారు. శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవం నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారమే ఏడాది పొడవునా సహకార దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 78 సింగిల్ విండో సొసైటీలు, 22 డీసీసీబీ బ్రాంచ్‌లు పనిచేస్తున్నాయి. వీటి కింద అనేక మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. రైతుల ఆర్థిక పరిపుష్టి కోసం ఇటు బ్యాంకులు.. అటు సొసైటీలు పరస్పర సహకారంతో కృషి చేస్తున్నాయి. సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం అంతర్జాతీయ సహకార దినోత్సవం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో రైతు చైతన్య కార్యక్రమాలు షెడ్యూల్ విడుదల చేశారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో మార్చి 22 నుంచి ఇక్కడి సింగిల్ విండో పర్సన్ ఇన్‌చార్జిలు, అధికారులు రైతు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై నివేదిక
జిల్లాలో సహకార బ్యాంకులు, సింగిల్ విండో సొసైటీలు వాటి పరిధిలో జరిగే ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై డీసీసీబీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీతోపాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలు, విద్యా రుణాలు, గ్రామీణ గృహ రుణాలు, కర్షకమిత్ర రుణాలు, రుణ వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఖాతాదారుల సౌకర్యం కోసం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతితో మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఖాతాదారుల లావాదేవీలు సులభతరం, సమయాన్ని ఆదా చేసుకోవడం, డిజిటల్ లావాదేవీలతో బ్యాంకు సమర్థత పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
34,731 మంది రైతులకుమేలు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం–2024 కింద డీసీసీబీ పరిధిలో అనేక మందికి ప్రయోజనం కలిగింది. ఈ బ్యాంకు ద్వారా రూ.2 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు అర్హత కలిగిన 68,495 మంది సభ్యులకు గాను రూ.47,684.81 లక్షల రుణం పొందారు. ఇందుకు సంబంధించి 2024 నవంబర్ నాటికి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. దీంతో రూ.2 లక్షల రుణం కలిగి ఉన్న 34,731 సభ్యులకు రూ.20,639.30 లక్షల రుణమాఫీ జరిగింది.
ఆర్‌బీఐ అనుమతితో..
వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరలో సహకార బ్యాంకుల పరిధిలో మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆర్‌బీఐ అనుమతితో వినియోగదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్‌తోపాటు యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి రూ.1,800 కోట్ల బిజినెస్ టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లు రూ.400 కోట్లకు చేరుకున్నాయి.
– మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, చైర్మన్, డీసీసీబీ

రైతు సేవలే లక్ష్యంగా..