
దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలి
వనపర్తి: జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి తహసీల్దార్లు, డీటీలు, కంప్యూటర్ ఆపరేటర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సదస్సులను బాగా నిర్వహించారని సిబ్బందిని అభినందించారు. వచ్చిన దరఖాస్తులను ఆగష్టు 15 నాటికి పరిష్కరించాలని ఏ ఒక్కటికూడా పెండింగ్ ఉండొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు అవసరమైన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించారు. చాలా దరఖాస్తులు తహసీల్దార్ లాగిన్‌లోనే పరిష్కరించవచ్చని.. మిగిలిన వాటిని ఆర్డీఓ, కలెక్టర్ లాగిన్‌కు పంపించాలని ఆదేశించారు. దరఖాస్తులను ఫార్మెట్–1, ఫార్మెట్–2గా విభజించుకోవాలని, తప్పకుండా రికార్డు నిర్వహించాలని, ఏదైనా దరఖాస్తు తిరస్కరించాల్సి ఉంటే స్పీకింగ్ ఆర్డర్ ద్వారా దరఖాస్తుదారుకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రోజువారీగా పరిష్కరించిన దరఖాస్తుల వివరాలు సాయంత్రం 5లోగా నివేదించాలని.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రేషన్ దరఖాస్తులు పరిష్కరించాలి..
ప్రజాపాలన, మీ–సేవా కేంద్రాల ద్వారా వచ్చిన రేషన్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 14న ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త కార్డులు జారీ చేయనున్నందున తహసీల్దార్ లాగిన్‌లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సర్వే చేసి త్వరగా పరిష్కరించాలని, 10వ తేదీలోగా అర్హుల దరఖాస్తులను ఆమోదించి, మిగిలిన వాటిని తిరస్కరించాలని, పెండింగ్ ఉంచుకోవద్దన్నారు.
వరదలతో అప్రమత్తం..
వరదలు వస్తే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కృష్ణానది పరీవాహక ప్రాంతాల తహసీల్దార్లకు సూచించారు. ఇప్పటి వరకు ఇచ్చిన మార్గదర్శకాలు విధిగా పాటించాలని.. అందరూ మండల కేంద్రాల్లోనే ఉండాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, పౌరసరఫరాలశాఖ అధికారి విశ్వనాథ్ పాల్గొన్నారు.