
ఆక్రమణకు అడ్డుకట్టేది?
వనపర్తిటౌన్: పట్టణ నడిబొడ్డున పారుతున్న తాళ్ల చెరువు అలుగు అధికారుల నిర్లక్ష్యంతో ఆక్రమణకు గురవుతోంది. ఏళ్లుగా ఈ తతంగం కొనసాగుతున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. కొందరు రియల్ వ్యాపారులు అలుగు ప్రదేశాన్ని సైతం ప్లాట్లుగా చేసి విక్రయించిన ఉదంతాలు ఉన్నాయి. అలుగు కాల్వ 3 కిలోమీటర్ల పొడవు ఉండగా.. వెడల్పు మాత్రం ఒకచోట పిల్ల కాల్వలా, మరోచోట కాల్వగా, ఇంకోచోట 10 నుంచి 20 అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీంతో అధికారులు కొద్ది దూరం మినహా వెడల్పు ఒకే తరహాలో నిర్ధారించారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో దశబ్దాల తరబడి యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతోంది. ఈ కాల్వ శ్వేతనగర్ మీదుగా పట్టణ శివారులోని రాజనగరం చెరువు వరకు ఉండగా.. ఇందులో నుంచే పట్టణంలోని మురుగు, వర్షపు నీరు ప్రవహించి రాజనగరం చెరువులో కలుస్తుంది. శ్వేతానగర్, శ్వేతానగర్ కంటే ముందున్న ఖాళీ ప్రదేశం, బ్రహ్మంగారి వీధి, రాయిగడ్డలోని కొంత భాగం, బాబాజీ మఠం, కమాన్‌చౌరస్తా, శంకర్‌గంజ్ తదితర ప్రాంతాల్లో సుమారు కిలోమీటర్ మేర కబ్జాకు గురైంది. దశాబ్దాలుగా అలుగు పారే ప్రాంతాన్ని ఆక్రమించి ఇష్టారీతిన ఇళ్లు, ప్రహరీలు నిర్మించినా గత, ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదు. రామాటాకీస్ ప్రాంతంలో వరద ఉధృతిని అధిగమించేందుకు సుమారు 200 మీట్లర పొడవున పనులు పూర్తి చేశారు. ఈ ప్రాంతం మినహా మిగతా స్థలమంతా ఆక్రమణకు గురవుతూనే ఉంది. వాగు వెడల్పు అంతా ఒకేలా ఉంటే ముంపు నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. రోజురోజుకు కుంచించుకోవడంతో 2020లో వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మున్ముందు ఇలానే కొనసాగితే అలుగు కనుమరుగయ్యే ప్రమాదం ఉండటంతో పాటు వర్షాకాలంలో శ్వేతానగర్, శంకర్‌గంజ్, బ్రహ్మంగారి వీధి, రాయిగడ్డ తదితర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. అలుగు పూర్తిస్థాయిలో ఉన్నప్పుడే భారీ వర్షాలకు వాగు పరీవాహక కాలనీలు జలమయం కావడంతో పాటు దళితవాడకు చెందిన చంద్రయ్య వరదకు కొట్టుకుపోయి మృతిచెందిన ఘటనలూ ఉన్నాయి.
కుంచించుకుపోతున్న తాళ్ల చెరువు అలుగు
అధికారుల మీనమేషాలు
తొలగింపునకు ముందుకు పడని
అడుగులు
రెండు దశాబ్దాలుగా ఊగిసలాటే..
ఆక్రమణలు తొలగించాలి..
తాళ్ల చెరువు అలుగులో అధికారులు ఆక్రమణలను తొలగించడం లేదు. కబ్జాకు గురైనట్లు నేరుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. భారీ వర్షాలకు వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
– జి.ప్రకాష్, రాయిగడ్డ, వనపర్తి
చర్యలు తీసుకుంటాం..
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అలుగులో పేరుకపోయిన పూడికను పొక్లెయిన్‌తో తొలగించాం. అలుగు రికార్డులను పరిశీలించి ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకుంటాం. అలుగు అంశం రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖ పరిధిలోకి రావడంతో అవసరమైతే ఆయా శాఖల అధికారులతో చర్చించి ముందుకెళ్తాం.
– ఎన్.వెంకటేశ్వర్లు, పుర కమిషనర్, వనపర్తి

ఆక్రమణకు అడ్డుకట్టేది?

ఆక్రమణకు అడ్డుకట్టేది?

ఆక్రమణకు అడ్డుకట్టేది?

ఆక్రమణకు అడ్డుకట్టేది?