
‘సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి’
వనపర్తి రూరల్: దేశవ్యాప్తంగా ఈ నెల 9న చేపట్టే సార్వత్రిక సమ్మెలో మహిళలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు సాయిలీల అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి మహిళా సంఘాల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. మహిళా కార్మికుల హక్కుల పరిరక్షణ, గౌరవమైన జీవితం కోసం ఐద్వా నిరంతర పోరాటం చేస్తోందన్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ విధానాలు కార్మికులకు వ్యతిరేకంగా, మహిళలకు అన్యాయంగా మారుతున్నాయని, రోజురోజుకు ప్రైవేటీకరణ పెరుగుతుందన్నారు. ఆరోగ్య, విద్య హక్కు, భద్రత మహిళలకు లభించాలంటే పోరాడాల్సిందనని.. ఇందుకు సార్వత్రిక సమ్మె మైలురాయి అవుతుందని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు తగ్గుతుంటే ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మి, కోశాధికారి కవిత, సహాయ కార్యదర్శి ఉమా, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రసాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
వనపర్తి రూరల్: పెబ్బేరు మోడల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రాజేశ్వరి, మోక్ష, ధర్మతేజ రాష్ట్రసాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డా. టి.నరేష్‌కుమార్ గురువారం తెలిపారు. ఈ నెల 9 నుంచి 12 వరకు మంచిర్యాల జిల్లాలో జరిగే అండర్–15 రాష్ట్రస్థాయి బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో రాజేశ్వరి, మోక్ష.. నిజామాబాద్ జిల్లాలో జరిగే బాలుర విభాగం పోటీల్లో ధర్మతేజ జిల్లా జట్టు తరఫున పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో పీడీ కమలాకర్, అధ్యాపకులు బుచ్చయ్య, మంగమ్మ, హేమలత, సాహిత్య. హఫీజ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
కొత్తకోట రూరల్: వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సహాయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి జె.మల్లేశం వార్డెన్లను ఆదేశించారు. గురువారం కొత్తకోట సమీపంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి రికార్డులు, వంటగది, విద్యార్థుల నివాస గదులు, స్టోర్‌రూంను పరిశీలించడంతో పాటు విద్యార్థుల ప్రవేశాల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాన్ని అధిగమించేందుకు ఇన్వర్టర్ ఏర్పాటు ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన బోధన, సౌకర్యాలు, నాణ్యమైన భోజనం అందించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఆయన వెంట వసతిగృహ సంక్షేమ అధికారి ఎస్.సంతోష్‌కుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు.

‘సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి’

‘సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి’