బాలల హక్కుల పరిరక్షణ అధికారుల బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కుల పరిరక్షణ అధికారుల బాధ్యత

Jul 4 2025 3:31 AM | Updated on Jul 4 2025 3:31 AM

బాలల హక్కుల పరిరక్షణ అధికారుల బాధ్యత

బాలల హక్కుల పరిరక్షణ అధికారుల బాధ్యత

వనపర్తి: బాలల హక్కులు పరిరక్షించేందుకు లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు నిబద్ధతతో పని చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి కోరారు. గురువారం కమిషన్‌ సభ్యులు కంచర్ల వందనగౌడ్‌, మర్రిపల్లి చందన, అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్‌, వచన్‌ కుమార్‌తో కలిసి జిల్లాకేంద్రంలోని బాలల సంరక్షణ కేంద్రం, బాలికల ఉన్నత పాఠశాల, శ్రీరంగాపూర్‌లో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, వైద్య, ఆరోగ్యశాఖపై ఉందన్నారు. పిల్లల్లో లోపాలుంటే ముందుగానే గుర్తించి ఎన్‌ఆర్సీ కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించి సరైన పౌష్టికాహారం, వైద్యం అందించాలని సూచించారు. అదేవిధంగా ఏదైనా వైకల్యంతో ఉంటే డీఎస్‌టీ పరీక్షలు నిర్వహించి ఫిజియో, స్పీచ్‌ థెరపీ వంటివి చేయించి సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే బాలామృతం పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుందని.. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కచ్చితంగా తినిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లాలో నమోదైన పోక్సో, బాల్య వివాహాలు, బాల కార్మికుల కేసుల వివరాలు సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్‌ ముష్కాన్‌, ఆపరేషన్‌ స్మైల్‌ సమన్వయంతో నిర్వహించడమే గాకుండా యజమానులపై జరిమానాలు విధించాలని సూచించారు. బాల్య వివాహాలు జరిగితే బాధ్యులపై కేసులు చేయడమే కాకుండా పెళ్లి ఆలోచనలు చేస్తున్నప్పుడే ముందుగానే పసిగట్టి అవగాహన కల్పించి నిరోధించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలన్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. అలాగే పాఠశాలలను తనిఖీ చేసి తీసుకున్న చర్యలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు.

● జిల్లాలో వయసుకు తగిన బరువు ఎత్తు లేని పిల్లలను అంగన్‌వాడీ కార్యకర్తలు 102 వాహనంలో ఎన్‌ఆర్సీ కేంద్రానికి తీసుకొచ్చి వారం రోజులు ఉంచి వైద్యం, పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతులను చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలను జూనియర్‌ కళాశాలలో చేర్పించే బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగించామన్నారు. ప్రతి గ్రామంలో వీసీపీసీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి నెల మొదటి సోమవారం సమావేశమై బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. అనాథ పిల్లలకు మెరుగైన విద్యం అందించడమే కాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు.

● జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే కచ్చితంగా కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్‌ తెలిపారు. పోక్సో కేసులో చార్జిషీట్‌ నమోదు చేయడమే కాకుండా బాధితులకు సకాలంలో పరిహారం ఇప్పించడంతో పాటు వారికి సపోర్ట్‌ పర్సన్‌ను నియమించి తగిన ధైర్యం, సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న చర్యలు సంతప్తికరంగా ఉన్నాయని కమిషన్‌ సభ్యులు కొనియాడారు. అనంతరం జిల్లాలో ఉత్తమ మార్కులు పొందిన అనాథ పిల్లలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీసీపీఓ రాంబాబు, జిల్లా పోలీసు అధికారులు, జిల్లా సంక్షేమశాఖ సిబ్బంది, స్వచ్ఛందసంస్థ సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ

కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement