
ధర్నా, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి
విజయనగరం క్రైమ్: ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేందుకు పోలీసుశాఖ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, ఇతర నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు తప్పనిసరిగా పోలీసుశాఖ నుంచి ముందస్తుగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. పోలీసు శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేనిదే ఎలాంటి నిరసనలైనా చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. ఇందుకోసం ముందుగా సంబంధిత డీఎస్పీ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని సూచించారు. పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, సమావేశాలు నిర్వహించడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. శాంతియుతంగా వ్యవహరించాలని, విజ్ఞతతో వ్యవహరించి ముందస్తు అనుమతులతోనే ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. అలా కాకుండా, చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తూ ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు.