
ఖాతాలు తెరవండి
విజయనగరం టౌన్: తల్లికి వందనం రెండో విడతలో ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల తల్లుల ఖాతాలకు నిధులు జమచేయనున్నట్టు సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు యు.అన్నపూర్ణమ్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌నంబర్‌తో లింక్ చేసుకోవాలని సూచించారు.
పరిశ్రమల ఏర్పాటు ఆలోచనే లేదు
● మంత్రి కొండపల్లి
శృంగవరపుకోట: పరిశ్రమలు తెస్తాం.. జిల్లా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తాం అంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలన్నీ ఉత్తుత్తివే అని తేలిపోయింది. ఎస్.కోట మండలం బొడ్డవర ప్రాంతంలోని ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదన అసలు ప్రభుత్వం చర్చించనేలేదని ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తేల్చిచెప్పారు. గత కొన్ని రోజులుగా సాగుతున్న జిందాల్ నిర్వాసితుల పోరాటం, జిందాల్ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్ ప్రతిపాదన, జిందాల్‌కు తాటిపూడి నీరు సరఫరా వంటి అంశాలను మంత్రి కొట్టిపారేశారు. ‘ఈరోజు వరకూ ప్రభుత్వంలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌పై ఎలాంటి చర్చజరగలేదు. దీనిపట్ల ప్రజల్లో ఎందుకు భయాందోళనలు సృష్టిస్తున్నారో అర్థంకావడం లేదు. అక్కడ ఎంఎస్‌ఎంఈ పార్కు ఆలోచనే లేదు. దానికి తాటిపూడి నీరు ఇస్తారా? ఎలా ఇస్తారన్న చర్చ సాగనేలేదు. అదే విషయాన్ని ఇటీవల తాటిపూడిలో వివరించాం. ఇప్పుడు ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ ఆధారంగా రైతాంగంలో భయాందోళనలు సృష్టించాల్సిన అవసరం లేదు’ అంటూ మంత్రి కుండబద్దలు కొట్టారు. దీంతో బొడ్డవర వద్ద జిందాల్ సేకరించిన భూముల్లో ఎటువంటి కంపెనీలు రావడం లేదని మంత్రి విస్పష్టంగా తేల్చారు. ఇటీవల జిల్లా కలెక్టర్ జిందాల్‌కు వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం, ఎమ్మెల్యే లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ కలెక్టర్ వాదనకు మద్దతు ఇవ్వడం, నిర్వాసితులకు పోటీగా టీడీపీకి చెందిన నాయకులు కంపెనీలు కావాలంటూ శిబిరాలు నిర్వహించడం వంటి అంశాలను పరిశీలిస్తే... జిల్లాలో ఏం జరుగుతోంది, ప్రభుత్వం మైండ్‌గేమ్ ఆడుతోందా.. ఆడిస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.