
ఐక్యంగా పోరాడితేనే ప్రభుత్వ సంస్థల మనుగడ
బొబ్బిలి: ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటుపరం కాకండా కార్మిక వర్గం, ప్రజలు ఐక్యంగా పోరాడా లని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ పిలుపునిచ్చారు. బొబ్బిలిలో శుక్రవారం జరిగిన సీఐటీయూ మహాసభలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తోందన్నారు. విశాఖఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ యత్నాలపై కూటమిగా ఉన్న టీడీపీ, జనసేనలు కనీసం ప్రశ్నించడం లేదన్నారు. రైల్వే, ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరణ చేయడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల సొమ్ముకు రక్షణగా ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని కూడా ప్రైవేటీకరించి అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్‌ల ద్వారా కార్మికులకు రోజుకు రూ.178 ఇస్తే చాలన్నట్టు పొందుపరిచారన్నారు.
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
లేబర్‌కోడ్ చట్టాలతో కార్మికుల హక్కులకు భంగం కలుగజేస్తున్న బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 9న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కె.సుబ్బారావమ్మ పిలుపునిచ్చారు. స్థానిక గ్రోత్ సెంటర్‌లో కార్మికులతో కలిసి సమ్మైపె ప్రచారం నిర్వహించారు. కార్యక్రమాల్లో యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు కె.విజయగౌరి, సీఐటీయూ, రైతు, పెన్షనర్ల సంఘాల జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, ఎస్.గోపాలం, శేషగిరి, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు కామేశ్వరి, నిర్మల, ఎండీఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ