
పాపం పశువులు
పార్వతీపురంటౌన్: పట్టణ రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున గూడ్స్ ఢీకొని 8 వశువులు మృతిచెందాయి. ఈ సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలంలోని పరశురాంపురం గ్రామం నుంచి పార్వతీపురం సంతకు పశువులను తరలిస్తుండగా పార్వతీపురం సమీపంలో గల రైల్వే ట్రాక్ దాటుతున్న క్రమంలో రాయపూర్ పైపు వెళ్తున్న గూడ్స్ ఢీకొనడంతో 8 వశువులు అక్కడికక్కడే మృతిచెందాయి. వెంటనే గూడ్స్‌ను డ్రైవర్ ఆపి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన రైల్వే సిబ్బంది ట్రాక్‌పై ఉన్న పశువులను పక్కకు తొలగించారు. ఈ విషయమై జీఆర్‌పీ సిబ్బందిని వివరాలు అడగ్గా ఎటువంటి ఫిర్యాదు అందక పోవడంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు.
ఏటీఎంలో ఆవు..
రాజాం: పట్టణంలోని బొబ్బిలి జంక్షన్ వద్ద హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం కేంద్రంలో ఒక ఆవు మృతిచెందింది. రెండురోజుల క్రితమే ఈ ఆవు మృతిచెంది ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఉదయం ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా తీసేందుకు వెళ్లిన బ్యాంకు ఖాతాదారులు విషయాన్ని గుర్తించి, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతిచెందిన గోవును పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఏటీఎం కేంద్రంలోంచి బయటకు తీసుకొచ్చి డంపింగ్ యార్డు వద్ద ఖననం చేయించారు. రాజాం రోడ్లపై ఇటీవల ఆవులు అధికంగా సంచరిస్తున్నాయి. వర్షానికి ఏటీఎంలోకి ఆవు చేరి ఉంటుందని, కాలుజారి పడడంతో మృతిచెంది ఉంటుందని శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు.

పాపం పశువులు