
అటవీ భూమి ధారాదత్తం
బొబ్బిలి: ఆపరేషన్ కగార్ పేరుతో అంతర్జాతీయ కంపెనీ యజమానులైన అదానీ, అంబానీలకు 9 కోట్ల ఎకరాల అటవీ భూమిని ధారాదత్తం చేసేందుకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు కుట్ర చేస్తున్నారని అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ అంజమ్మ, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్‌లు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం బొబ్బిలి పట్టణంలోని మహరాణిపేటలో కామ్రేడ్ గంటి ప్రసాదం 12వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా పీకేఎస్ జెండాను ఆవిష్కరించారు. గంటిప్రసాదం స్మారక భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ మావోయిస్టుల రక్షణలో ఉన్న ఆదివాసీలను అడవుల నుంచి తరిమేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేయడం దారుణ మన్నారు. మావోయిస్టులను అంతం చేయడానికి ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటివరకూ సుమారు 550 మంది ఆదివాసీలు, మావోయిస్టులను పట్టుకుని అంతమొందించారని ఆందోళన వెలిబుచ్చారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రజలు, ప్రజాసంఘాలు ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలకు సిద్ధం అయ్యేలా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలని కోరారు. అభివృద్ధి చెందుతున్న అమెరికా, రష్యా, జపాన్ తదితర దేశాల్లో దేశంలో40 శాతం అడవులుండాలని చట్టాలుచేసి పర్యావరణాన్ని కాపాడుతుంటే మన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదులు దీనికి విరుద్ధంగా చర్యలు తీసుకోవడం దారుణ మని ధ్వజమెత్తారు. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు గంటి ప్రసాదాన్ని అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు నెల్లూరులో పొట్టన పెట్టుకుందన్నారు. ఇటీవల ఆపరేషన్ కగార్‌పేరుతో నంబాల కేశవరావు, చలపతి, సుధాకర్, గణేష్, రేణుక, అరుణ, గాజర్ల రవి తదితరులను కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ, అమిత్‌షా, చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు కామ్రేడ్ గంటి ప్రసాదం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సభలో పీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి.కొండారెడ్డి, కామ్రేడ్ అన్నపూర్ణ, ఇఫ్టూ జిల్లా కార్యదర్శి మెరిగాని గోపాలం, పిల్లా లక్ష్మణరావు, పీకేఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాయితి సత్యం, తమటాల అప్పలనాయుడు, దాసరి వెంకట రమణ, రెడ్డి కుమార్, ప్రజాకళామండలి రాష్ట్ర ప్రతినిధి తూముల సింహాచలం, నల్లి తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.